... చైనా వస్తుబహిష్కరణ సాధ్యమయ్యేదేనా?

వంశీ కలుగోట్ల // ... చైనా వస్తుబహిష్కరణ సాధ్యమయ్యేదేనా? //
******************************************************
            కరోనా వైరస్ ను ల్యాబ్ లో పుట్టించారో లేక అది జంతువుల నుండి వ్యాపించిందో అన్నదాని మీద పలురకాల కథనాలు ఉన్నాయి, కానీ ఆ వైరస్ చైనా నుండి ప్రపంచానికి వ్యాపించింది అనడంలో మాత్రం ఎటువంటి సందేహమూ లేదు. దానితో పాటు, ఈ సమయంలో సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలకు పాలపడటం జరుగుతోంది. ప్రత్యేకించి ఈ రెండు ఘటనలూ 'చైనా వస్తు బహిష్కరణ' అన్న అంశాన్ని మరొకసారి దేశభక్తుల మదిలోనుండి మాటల్లోకి వెలిగక్కాయి. చైనా తయారీ వస్తువులను బహిష్కరించడం ద్వారా చైనా ఆర్థికమూలాల మీద దెబ్బకొట్టడం, తద్వారా చైనాను భయపెట్టటం అన్నది ఈ చర్యల పరమోద్దేశం. అయితే అది సాధ్యమా? చైనా వస్తువులు కొనడం మానితేనే దేశభక్తి ఉన్నట్టు అనే భావాన్ని వ్యాప్తి చెయ్యటం ఒక అంటువ్యాధిలా వ్యాపిస్తోంది. ఈ తీరు ఎలా ఉందంటే, రోగం ఉన్నది తలలో అయితే మందు మోకాలికి వేస్తున్న చందాన ఉంది.
            కొన్ని వాస్తవాలు పరిశీలిస్తే ... ఒక అంచనా ప్రకారం మన దేశపు కంపెనీల పేర్లతో అమ్ముడయ్యే వస్తువుల్లో దాదాపు 75% పైగా చైనా తయారీవే. అంటే ఆ చైనా కంపెనీల నుండి, మన కంపెనీలు కొని వాటి బ్రాండింగ్ తో అమ్ముతున్నాయి అన్నమాట. కొన్నేళ్ళ క్రితం చదివాను, ఎవరో చైనా వస్తువులు వద్దు మన దేశీయ కంపెనీ వస్తువులు కొనండి అని చెబితే, ఒక వ్యక్తి ప్రముఖ దేశీయ కంపెనీ ఎలక్ట్రికల్ వస్తువులు కొన్నారట. తీరా కొన్నాక చూస్తే 'మేడ్ ఇన్ చైనా' అని ఉందట. కంపెనీ మాత్రం మనదే. మరొక విషయం గమనిస్తే - చైనా కంపెనీ వస్తువులు ఒక పది రూపాయలకు కొన్నామనుకుందాం; దాని తయారీకి ఒకటిన్నర రూపాయి అవుతుందనుకుంటే అన్ని రకాల ఖర్చులు పోగా ఆ కంపెనీకి మన దేశం నుండి వెళ్ళేది ఒక్కో వస్తువుపై మూడున్నర రూపాయలు అనుకుందాం. అదే వస్తువును చైనా కంపనీ నుండి ఒక దేశీయ కంపెనీ కొని ఇక్కడ పదిహేను రూపాయలకు అమ్ముతుంది, వస్తువు తయారు చేసి ఇచ్చినందుకు చైనా కంపెనీకి నాలుగున్నర రూపాయలో లేక అయిదు రూపాయలో ఇస్తాయి. (ఇవి జస్ట్ ఉదాహరణగా చెప్పటానికి ఉటంకించిన రఫ్ లెక్కలు, దయచేసి ఆ అయిదు రూపాయలకు లేదా నాలుగున్నర రూపాయలకు గూగుల్ లింక్ సాక్ష్యంగా చూపమని అడగవద్దు) యే మార్గం ద్వారా చైనా కంపెనీలు ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయో అర్థమవుతుందా?
            ఇక మన దేశం పట్ల చైనా శతృత్వధోరణి అన్నది ఈనాటిది కాదు, మన గత ప్రభుత్వాలు మరియు ప్రస్తుత ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినప్పటికీ చైనా ధోరణిలో మార్పు లేకపోవడం బాధాకరమైన విషయమే అయినప్పటికీ వాస్తవం. అసలు ఈనాడు మనం 'పాక్ ఆక్రమిత కాశ్మీర్' అనే ప్రాంతం చైనా ఆక్రమించి పాక్ కు ధారాదత్తం చేసినది కాదా? అంతెందుకు, సరిహద్దులో కవ్వింపు చర్యలు చైనాకు కొత్తనా? ఇవన్నీ తెలిసీ, ఈ మార్కెటింగ్ ద్వారా డబ్బు యే దేశానికి ఎలా ఎంత స్థాయిలో వెళుతోందా మన దేశాధినేతలకు తెలియదా? ఈవేళ కొన్ని నెలల పాటు చైనా వస్తువుల విక్రయం ఆపేస్తే ఇది ఆగిపోతుందా? అమెరికా నుండో,యూరోప్ దేశాల నుండో మనం దిగుమతి చేసుకునే వస్తువులు ఆయా దేశాలలో తయారవుతున్నాయా లేక చైనాలోనా? ఇలాంటి అంశాలన్నిటినీ విస్మరించి కేవలం చైనా వస్తువుల బహిష్కరణ అంటే, మన కంపెనీలు చైనా వస్తువులు కొని, తమ బ్రాండింగ్ తో అమ్మడం ద్వారా చైనాకు మరింత లాభకారి కాగల చర్య అది. విదేశీ వస్తుబహిష్కరణ చేస్తే వెంటనే మన దేశంలో ఉత్పాదకత పెరిగిపోదు. గతంలో అంటే స్వాతంత్ర్యోద్యమ సమయంలో ఈ విదేశీ వస్తుబహిష్కరణ అన్నది  చాలా రకాలుగా ఉపయోగపడింది. దేశీయ వస్తువుల వినియోగం వల్ల ద్రవ్య వినిమయం, పంపిణీ అన్నది దేశంలోపలే జరిగింది. ఈనాడు అలా జరుగగలదా? ఎందుకంటే దేశీయ ఉత్పత్తి రంగాన్ని దార్శనిక నేతలు ఎప్పుడో నేల నాకించేశారు. ఒకానొక ఉదాహరణ చేనేత రంగం. అలాగే వ్యవసాయ భూములన్నిటినీ నగరాల నిర్మాణానికి ఆక్రమిస్తూ పోతుంటే వ్యవసాయ ఉత్పత్తులు తగ్గి దిగుమతుల మీద ఆధారపడవలసి వస్తోంది. వాస్తవాలు ఇలా ఉంటే, మాటలు మాత్రం మరో రకంగా ఉన్నాయి. చైనా వస్తువులను బహిష్కరించడం అన్నది ఈ క్షణాన జరిగితే మన దేశంలో దాదాపు 80% మంది మొబైల్స్ వాడలేరు, తద్వారా మొబైల్ కంపెనీలు దెబ్బతింటాయి, నిజానికి వాటి కేబుల్ వ్యవస్థ పరికరాలు కూడా చైనా తయారీవే. అంతెందుకు - మన సైన్యం వాడే బులెట్ ప్రూఫ్ జాకెట్స్ కూడా కొంతవరకూ చైనా నుండే దిగుమతి చేసుకుంటారు. ఆపేస్తే ఇంతా బయటా అల్లర్ల వాతావరణంలో సైన్యం, తత్సంబంధిత శాఖలకు తీవ్రంగా ప్రాణనష్టం  జరిగే అవకాశాలు ఉన్నాయి.
            చివరగా ఒక చిన్న విషయం - గతంలో వాజ్పాయ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అణుపరీక్షలు జరిపినపుడు అమెరికా తదితర దేశాల ఆంక్షలకు మన దేశం వెరవలేదు, మోకాళ్ళమీద నిలబడి క్షమాపణ అడగలేదు. భారతదేశం ప్రముఖ వినియోగదారు, భారతదేశంలో వస్తువులు అమ్మం అంటే, అది వారికే ఎక్కువ నష్టం - అందుకే కొన్నేళ్ళకు నెమ్మదిగా ఆంక్షల సడలింపు జరిగింది. మన 'చైనా వస్తు బహిష్కరణ' కూడా అలాంటిదే కాగలదు. ఇపుడు ప్రపంచంలో అత్యధిక భాగం చైనా తయారీ వస్తువుల మీదే ఆధారపడింది. ఇప్పటికిప్పుడు ఉన్నట్టుండి చైనా తయారీ వస్తువుల నిషేధం అంటే, చైనా కంటే ఎక్కువగా ఆయా దేశాలే ఇబ్బంది పడతాయి. చైనా పట్ల ద్వేషాన్ని పెంచేకంటే ఎక్కువగా, మన దేశంలో కుటీర పరిశ్రమలను ప్రోత్సహిస్తూ స్వయం సమృద్ధి సాధించేలా చర్యలు చేపట్టాలి. అది జరగనపుడు ఈ చైనా లేదా విదేశీ వస్తు బహిష్కరణ అన్నది అసాధ్యం. ఇవన్నీ పక్కనపెడితే, అవును ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు ఒక అడుగు వేయాలి. కానీ, ఆ మొదటి అడుగు ప్రభుత్వం/అధికార వ్యవస్థది కావాలి.

కొన్ని సూచనలు
-> ఏదైనా కంపెనీ విదేశీ/చైనా పరిజ్ఞానం మరియు ఉత్పత్తులు ఉపయోగించుకుంటే అధికపన్నులు విధించేలా వ్యవహరించాలి. అదే సమయంలో స్వదేశీ పరిజ్ఞానం, ఉత్పత్తులు ఉపయోగించుకుంటే ఏవైనా అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలి
-> దేశీయ ఉత్పత్తి పరిశ్రమలకు అండగా నిలవాలి అలాగే వాటి ఉత్పత్తుల నాణ్యత విషయంలో పటిష్ట చర్యలు తీసుకోవాలి
-> దేశీయ ఉత్పత్తులు నాణ్యతతో మరియు అందుబాటు  ప్రభుత్వం విధానాలు రూపొందించాలి
-> ముఖ్యంగా కుటీర పరిశ్రమల ఏర్పాటు మరియు నిర్వహణకు ప్రభుత్వం తగు రీతిన చర్యలు తీసుకొని, అండగా నిలబడాలి. 
-> ముఖ్యంగా పాఠశాల సిలబస్ లో వివిధ ఉత్పత్తుల తయారీ విధానాలు కూడా బోధించేలా మరియు అవకాశం ఉన్నవాటిపై ప్రాక్టీకల్స్ ఉండేలా చూడాలి.

... ఇలాంటి కొన్ని చర్యలై చేపడితే, మన దెస జనాభా మరియు నైపుణ్యతను సాధించే తీరు వల్ల భవిష్యత్తులో చైనా వస్తుబహిష్కరణ మాత్రమే కాదు; చైనాలో కూడా మన దేశ ఉత్పత్తులు అమ్మగలిగే స్థాయికి చేరవచ్చు. చిత్తశుద్ధితో ప్రభుత్వాలు ఆ దిశగా ఆచరణాత్మక విధానాలతో ప్రయత్నించినపుడు మాత్రమే అది సాధ్యపడగలదు.

Comments

Post a Comment

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన