... నన్ను చూసి ఏడవకురా

వంశీ కలుగోట్ల // ... నన్ను చూసి ఏడవకురా // 
***************************************
          ఈ మద్దెన శకుంతలాకియా కోర్ట్ తీర్పుల గురించి, కొందరి మాటల గురించి తెగ వర్రీ అయిపోతాంది. 'ఏందే ఇది? ఇయన్నీ ఆటలో అరటిపండులెక్కటివి' అని అక్కడికీ సెప్తిని. అయినా "ఒక పార్టీ ఎమ్మెల్యేల చర్యల పట్ల తీవ్రంగా వ్యాఖ్యానిస్తూ 'ఎంక్వయిరీ ఎందుకు వేయకూడదు?' అని ప్రశ్నించినవారు, ఇపుడు అదే తరహాను వందలమందితో ఆహ్వానమందుకున్న మరొకరి పట్ల చేయగలదా? ఏమిటీ ఈ దారుణం. కనీసం ఆయనకన్నా తెలియదా? అట్టా వందలమంది వస్తే, సెప్పొద్దూ. అనుభవం యాడికి బోయింది. ఇట్టా అయితే ఎట్టా." అని శకుంతలాకియా తన ఆవేదనను వెలిబుచ్చింది.
          ఫాఫమ్ శకుంతలాకియా ఆవేదన చూస్తే జాలేసింది. తనకు కాస్త స్వాంతన చేకూర్చటానికి నేను ఇలా చెప్పాను - "ఇద్దో శకుంతలాకియా మనం ఎన్నైనా అనుకోవచ్చు. కొందరు సైన్యాన్ని నమ్ముకుంటారు, కొందరు శతృశిబిరంలోని ద్వారపాలకులను (ప్రత్యేకించి రాత్రిపూట ఉండే) వారిని నమ్ముకుంటారు. కొన్ని వందలేళ్ళ క్రితం ఒక బలమైన రాజ్యంపై అంతకంటే బలమైన మరొక రాజ్యపు రాజు దండయాత్ర చేశాడు. కొన్ని రోజులు యుద్ధం కొనసాగినా, ఆ చిన్న రాజ్యం లొంగలేదు. దాంతో 'తెలివిగా' ఆలోచించిన ఆ రాజు రాత్రిపూట ద్వారపాలకుడిగా ఉండే శతృరాజ్యపు సైనికుడిని డబ్బుతో లోబరుచుకున్నాడు. ఖేల్ ఖతం - అన్నిరోజుల యుద్ధంలో కానిది, ఒక్క రాత్రిలో ముగిసిపోయింది. 
          దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయే - అవి ఏంటంటే మొదటిది - మనకు విజయం ముఖ్యమా లేక విలువలు/యుద్ధనీతి ముఖ్యమా? అన్నదానిమీద స్పష్టత ఉండాలి. ఆ రెండవ రాజుకు విజయం ముఖ్యం, కాబట్టే సూర్యాస్తమయం తరువాత యుద్ధం చేయకూడదు వంటి యుద్ధనీతులను తోసిరాజని, విజయాన్ని సాధించాడు. విలువలను నమ్ముకున్నాడన్నంతటి గొప్పోడు కాకపోయినా,కనీసం యుద్ధంలో అడ్డదారులు తొక్కక ఆ మొదటిరాజు నాశనమైపోయాడు. ఇక రెండవది - మనం విజయం సాధించాలంటే ఏం చేయాలి అన్నది తెలియాలి. పద్మవ్యూహం, త్రిశూల వ్యూహం, గరుడ వ్యూహం ... ఇవన్నీ కాదే శకుంతలాకియా గెలుపునిచ్చే ఏ వ్యూహమైనా గొప్పదే. ఇలా గెలవాలి ఎవడైనా చెప్పాడంటే అది తప్పు. ఎలాగైనా గెలవొచ్చు అనేది మాత్రమే యుద్ధనీతి. కాబట్టి ఎదుటోడి గెలుపు మీద ఏడుపు మానెయ్యాలి" 
          అంతా విని శకుంతలాకియా మౌనంగా వెళ్ళిపోవడానికి లేచింది. 'ఏంటే శకుంతలాకియా, నేను సెప్పింది నచ్చలేదా?' అని అడిగాను. "నీకేం కడుపు నిండిన మాటలు ఎన్నైనా సెప్తావు నేను కూకుని ఉంటే. ఆడ ఆయన పెళ్ళాలను సూసుకుంటా ఉంటాడు. నేను పిల్లలను సూసుకోవాలె. లేకపోతే నాకు తిండి ఎవరు పెడతారు, ఇగ బోత" అని ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. హేవిటో ఈ శకుంతలాకియా ఎపుడూ ఇంతే. అంతలో శకుంతలకియా ఎక్కిపోతున్న ఆటో వెనకాల రాసి ఉన్నది కనబడింది - ఆ ఆటో వెనకాల 'నన్ను చూసి ఏడవకురా, నీకు చేతనైంది నువ్వు చేసుకో' అని రాసి ఉంది. ఏందో కొన్ని అలా సింక్ అవుతాయంతే.

Comments

Post a Comment

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన