... నిర్లక్ష్యం ఖరీదు

వంశీ కలుగోట్ల // ... నిర్లక్ష్యం ఖరీదు //
*******************************
ఉపోద్ఘాతం:

ప్రదేశం: ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు
తేదీ/సమయం: మార్చ్ 17 లేదా 18, సాయంకాలం
ఒక విషయం గురించి, కొందరు వ్యక్తుల మధ్య ఒప్పందం కురిరాక - ఇక వీడుకోలు తీసుకోబోయే ముందు

అతడు: చేతులు కలపండి సార్

నేను: వద్దులే, ఇపుడు అసలే కరోనా భయం ఉంది కదా

అతడు:  ఏ అది మనకాడికి రాదు సార్. వచ్చినా యాడ బతుకుతాది? ఈ ఎండలకు మనుషులు బతకడమే కష్టంగా ఉంటే, ఇంగ ఆ కరోనా మన కాడికి యాడ వచ్చేది, వచ్చినా ఎక్కువరోజులుండదు సార్. ఏమంటావ్ అన్నా (పక్కన ఉన్నతనితో)

(షేక్ హ్యాండ్ - అంటే చెయ్యి లాక్కొని తీసుకోబడ్డది)

***

జనతా కర్ఫ్యూ ప్రకటించటానికి కొన్ని రోజులు ముందు

            ... కొన్ని వ్యక్తిగత పనుల నిమిత్తం కర్నూలు జిల్లాలోని మా ఊరు విద్వత్ ఖని (గని) కి వెళ్ళాను, అది మార్చ్ రెండవవారం బహుశా 13 లేదా 14 న అనుకుంటా వెళ్ళాను. అప్పటికే కరోనా భయం మన దేశంలో కూడా వ్యాపిస్తోంది. అప్పటికే సూపర్ మర్కెట్స్ లో, మెడికల్ షాప్స్ లో శానిటైజర్లు, మాస్క్స్ కొరత ఏర్పడింది. కానీ, నేను చూసినంతవరకూ బయట ఎవరూ మాస్క్ పెట్టుకుని మాత్రం కనబడట్లేదు - మనం వాడకపోయినా, మన దగ్గర ఉండాలి అదంతే అదో తృప్తి. ఆ సమయంలో నేను ఓర్వకల్లు మరియు కర్నూలుకు రెండు సార్లు వెళ్లాల్సి వచ్చింది. కానీ, అక్కడ ఎవరూ మాస్క్ లేదా శానిటైజర్ వాడటం మాత్రం గమనించలేదు. అంతే కాదు, ఎటువంటి ఇతర జాగ్రత్తలు కూడా అంటే ఎవరైనా దగ్గుతుంటే దూరంగా ఉండటం లేదా దగ్గేవారు చేయి/గుడ్డ అడ్డం పెట్టుకుని దగ్గటం ఇలాంటివేవీ లేవు.
            మాస్క్స్ కొరత వల్ల నేను కర్చీఫ్ కట్టుకునేవాడిని, అలానే శానిటైజర్ వాడటం - ఇవన్నీ చూసి అక్కడ నేను కలిసిన వాళ్ళు నవ్వేవారు. 'నువ్వు ఊకెనే భయపడతన్నావు సామీ, మనకాడికి ఆ కరోనా ఎప్పుడు రావాలా, వచ్చినా ఈ ఎండలకు అది బతుకుతాదా? ఇయన్నీ డబ్బులు దండగ సామీ, ఎవడో యాపారం సేయ్యనీకి పుకార్లు పుట్టించింటాడు'అనేవారు . కర్నూలుకు వెళ్ళినపుడు, ఏవో కొన్ని వస్తువులు కొనడం కోసం అక్కడ జ్యోతి సూపర్ మార్కెట్ కు వెళ్ళాను. నేను కర్నూలు వెళ్లిన ప్రతిసారి అక్కడకు వెళ్తుంటాను, కానీ ఎపుడూ చూడనంత రష్ ఉంది ఆరోజు. ఎందుకబ్బా అనుకున్నాను, అక్కడ ఎవరో మాట్లాడుకుంటున్న మాటలు వినబడ్డాయి. ఆ రోజు రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ గారు సందేశం ఇస్తారని వార్త అట. పుకార్లు ఏంటంటే - ఆరోజు రాత్రినుండి అంతా బంద్ అని, షాప్స్ అవీ ఏవీ ఉండవు అని అనుకోవడం మొదలెట్టారు. అక్కడ జ్యోతి సూపర్ మార్కెట్ లో కాష్ కౌంటర్ దగ్గర ప్యాక్ చేసే మహిళ అంటోంది 'పదకోండేండ్ల కాడ్నిండి ఈడ పని జేచ్చాన్న, పొద్దున తొమ్మిది గంటలనుండి సంత లెక్కనే ఉంది' అని. అంతా బంద్ అనే పుకారు ప్రభావంతో జనాలు సూపర్ మర్కెట్స్ మీద ఎగబడి, అవసరం ఉన్నవీ లేనివీ అన్నీ కొనేసి తీసుకుపోతున్నారు.
              నిజానికి అక్కడ కరోనా గురించి ఎవరూ భయపడటం లేదు. నూటికి 99% మందికి కరోనా తమకు రాదనే నమ్మకం, వచ్చినా ఇక్కడి వాతావరణానికి అదేమీ చేయలేదనే ధైర్యం (?). నేను కర్నూలులో కలిసిన కొంతమంది, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించినపుడు, నేను కాస్త వెనుకాడాను, కానీ వారు వదిలేవారు కాదు - చేయి లాక్కుని మరీ షేక్ హ్యాండ్ ఇవ్వడం; మరీ దగ్గరితనం ఉన్నవారు ఐతే ఆప్యాయంగా హత్తుకోవడం - ఏం చేయలేం. కర్నూలు నుండి మా ఊరికి వచ్చాను. ఆ తరువాత జనతా కర్ఫ్యూ ప్రకటించారు, జనాలందరి నమ్మకం ఏంటంటే జనతా కర్ఫ్యూ అన్నది ఒక్క రోజుతో ఆగేది కాదు అని, రకరకాల పుకార్లు ప్రచారంలో ఉండేవి. జనతా కర్ఫ్యూ కంటే రెండు రోజులు ముందు అంటే మార్చ్ 20 వ తేదీన నేను బెంగుళూరు తిరిగి వచ్చాను. తరువాత రెండుమూడు వారాలకు మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం ఉండినది, కానీ అప్పటినుండి ఎక్కడికీ పోయే పరిస్థితి లేదనుకోండి.
            ఇపుడు కర్నూలులో పరిస్థితి అందరికీ తెలిసిందే. మర్కజ్ సదస్సుకు వెళ్ళివచ్చినవారిని, వారిని క్వారంటైన్ కు తీసుకెళ్ళకుండా వైద్య, పోలీస్ సిబ్బందిని ప్రభావితం చేశాడని ఒక/కొందరు నాయకులను, కొంతవరకూ అధికార వర్గాలనూ తప్పు పడుతున్నాం. కానీ ఒక్క కర్నూలు అనే కాదు, ప్రతి చోటా అధికారవర్గాల నిర్లక్ష్యం మరియు వైఫల్యం కంటే అధికంగా ప్రజల నిర్లక్ష్యమే కరోనా వ్యాప్తికి ప్రధాన కారణం. ఇప్పటికీ జనాల తీరు అలానే ఉంది. ఇన్నాళ్ళూ వాకింగ్, జాగింగ్ లాంటివి చేయనివారు - ఈ సమయంలో వాకింగ్ చేస్తామంటూ బయటకు వస్తున్నారు; పక్కింట్లో ఉన్నవాళ్ళ గురించి పట్టించుకొనేవారు, సాయంకాలం పక్కింటోళ్ళతో ఆరుబయట ముచ్చట్లు పెడుతున్నారు - ఒకటా రెండా, జనాల నిర్లక్ష్యానికి తార్కాణాలు లెక్కలేనన్ని. మనదాకా వచ్చాక తెలుసుకునేందుకు ఏమీ ఉండదనే విషయం ఎవరికీ అర్థం కావటం లేదు; ఇది మనతో ఆగేది కాదు, మనల్ని మాత్రమే బాధించేది కాదు అనేది కూడా తెలుసుకోవట్లేదు. ఇపుడు కూడా తప్పు పట్టటానికెవరు దొరుకుతారా అనే ధోరణి తప్పించి (అంటే మర్కజ్ వెళ్ళొచ్చిన వారు, నాయకులు, అధికారులు గట్రా), మన నిర్లక్ష్య ధోరణి ప్రధాన కారణమని గుర్తించటానికి ఇష్టపడటం లేదు. మన నిర్లక్ష్యం ఖరీదు, ప్రత్యేకించి చెప్పాలా - చూస్తూనే ఉన్నాం కదా. బద్ధకాన్ని, నిర్లక్ష్యాన్ని ఇప్పటికైనా వదిలించుకోవటానికి కనీసం ప్రయత్నించండి. Our negligence is working as a carrier for Corona. Follow what medical people and experts says, that not just save you but many others including your near and dears. Be safe ...

Comments

Popular posts from this blog

... తెలుగోడి శతృవు

... మూడు బెత్తం దెబ్బలు

... 'సాహో' గురించి