... జగన్ సంవత్సరం పాలన - మరింత మెరుగ్గా పని చేయాలి

వంశీ కలుగోట్ల // ... జగన్ సంవత్సరం పాలన - మరింత మెరుగ్గా పని చేయాలి //
*****************************************************************
            అష్టకష్టాలూ పడి, అనుకున్నది సాధించిన జగన్మోహన్ రెడ్డి గారు నవీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా అత్యధికశాతం ప్రజలచే ఎన్నుకోబడి సంవత్సరం ముగిసింది. ఎన్నో ఆశలు, నమ్మకాలతో ప్రజలు అధికారం అప్పగించారు. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున ఉదయాన్నే టీవీల ముందు కూచున్నాం - బహుశా ఇంత ఉత్కంఠత గతంలో ఎపుడూ లేదేమో. చంద్రబాబు ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుసు, అయినా సరే వైఎస్సార్సీపీ అభిమానులలో గెలుపు పట్ల ఏదో అనుమానం - ఎందుకంటే అవతల అపర కౌటిల్యుడుగా పేరొందిన చంద్రబాబు. ఏదో ఒకటి చేసి, మళ్ళీ అధికారంలోకి వస్తాడేమో అని భయం. ఇపుడూ రాకపోతే ఇక జగన్ పని ముగిసినట్టే అని నర్మగర్భవ్యాఖ్యలు. అవతల చంద్రబాబు శిబిరంలో ఓటమి తప్పదని అనిపించేలా ఉన్నా కూడా మేకపోతు గాంభీర్యం. నేర చరిత ఉందని ప్రచారం పొందిన జగన్ పట్ల జనాలు సానుకూలత చూపారని ఆశ. అనుభవం, దార్శనికత పేరుతో, అమరావతి ఆశతో మళ్ళీ అధికారం అప్పగిస్తారులే అని కొంత ధీమా. మరోవైపు కుదిరితే అధికారంలో భాగస్వామ్యం లేదంటే కాలం కలిసొస్తే కర్ణాటకలో కుమారస్వామిలాగా ఏకంగా సీఎం అవ్వోచ్చేమో అని కలలలోకంలో పవన్ కళ్యాణ్ శిబిరం. ఇన్నిటి మధ్య - గత సంవత్సరం మే 23 వ తారీఖు ఉదయం పది గంటలకల్లా పరిస్థితి స్పష్టమైపోయింది. సాయంత్రానికి తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇంతవరకూ లేని ఘనవిజయంతో జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారన్న వార్త పాతదైపోయింది.
            జగన్ అధికారం చేపట్టేసరికి పలు సవాళ్ళు సిద్ధంగా ఉన్నాయి. వాటిని ఎదుర్కొంటూ, తాను ఇచ్చిన హామీలను అమలు చేస్తూ గత పాలకులకు భిన్నంగా తన మార్క్ చూపాలనే తపనతో ముందుకుపోతున్నారు జగన్. అయితే పలు సందర్భాలలో అనుభవలేమి కనబడుతోంది, ... రాబోయే రోజుల్లో మరింత పరిణితితో వ్యవహరిస్తారేమో చూడాలి. ఈ కాలంలో ఆయన ఎదుర్కొన్న (కొన్ని ఎప్పటినుండో ఎదుర్కొంటున్నవే) సవాళ్ళు ఒకసారి పరిశీలిద్దాం... 

సవాలు 1 - ఆర్థికవ్యవస్థను గాడిన పెట్టడం
            అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ సరిగా నెల జీతాలు ఇచ్చేంతటి సొమ్ము కూడా ప్రభుత్వ ఖజానాలో లేదని వార్తలు. ఉద్యోగులలో ఆందోళన, ప్రజల్లో సందేహం, పార్టీ వర్గాల్లో భయం. కానీ ... ఏం చేశారో తెలియదు, ఇంతవరకూ ఉద్యోగులకు జీతాలు ఇవ్వటంలో (కరోనా ప్రభావిత రెండు నెలలు వదిలేసి) ఇబ్బంది లేదు. ఇక సంక్షేమ పథకాల అమలు విషయంలో అసలు వెనుకడుగు వేయటం లేదు. అప్పు తెస్తున్నారా లేక ప్రభుత్వ ఆస్థులు అమ్ముతున్నారా లేక వేరే ఏమైనా చేస్తున్నారా? స్పష్టత లేదు. ఎందుకంటే ఆదాయమార్గాల కల్పన లేదు, కేంద్రం నుండి పెద్దగా సహకారం లేదు - అయినా డబ్బుకు ఇబ్బంది పడటం లేదు. మరేం చేస్తున్నారు? కీలకమైన ఆదాయవనరు అయిన మద్యంపై ఆంక్షలు, అదుపు - సగం ఆదాయం అక్కడే పాయె. కరోనా దెబ్బ కొట్టింది - ఆయినా తగ్గట్లేదు. ప్రభుత్వం నిధులు ఎక్కడినుండి సమకూర్చుకుంటోందన్నదానిపై గోప్యత పాటిస్తున్నారు లేదా స్పష్టత లేదు. బహుశా వైఎస్ గారికి రోశయ్య గారి లాగా, జగన్ గారికి రాంజేంద్రనాథ్ రెడ్డి గారు అనొచ్చేమో. జగన్ ను చూసి నిధులు రావు అనుకున్నవారికి మాత్రం ఇది నిరాశ కలిగించే అంశమే. ఆర్థిక వ్యవస్థ పరంగా చెప్పాలంటే పైపైన చూస్తే ఏ పథకాలకు, పనులకూ ఇబ్బందులు లేకుండా పాలన సాగించడం అన్నది ఒకరకంగా విజయమే అని చెప్పవచ్చు. ఆదాయకల్పన జరగాలి, అది జరగకపోతే కష్టం. చూడబోతే ఇది మేడిపండు చందంగా ఉన్నట్టుంది. పొట్టవిప్పి చూడ పురుగులుండు - కానీ, పొట్టవిప్పి చూచుటకు పండు చేతికి అందాలి కదా.

సవాలు 2 - అధికారవ్యవస్థ మీద అదుపు సాధించడం
            సంవత్సరం కావస్తున్నా కూడా అధికారవ్యవస్థ మీద జగన్ ప్రభుత్వం పట్టు సాధించలేదనే చెప్పవచ్చు. సమస్య ఏంటంటే ఇన్నేళ్ళు అధికారులు చెప్పింది, చేసుకుపోయే తరహాకు అలవాటు అయ్యారు. అలాంటిది మీరు చెప్పాలి, మీరే చెయ్యాలి అనేసరికి ఒక్కసారి చేష్టలుడిగినట్టు ఐంది. పైస్థాయిలో జగన్ స్వేచ్ఛనిస్తున్నట్టు కనబడుతున్నా, క్రిందస్థాయిలో అలా లేదనే అంటున్నారు. లోకల్ గా నాయకులు ప్రభావితం చెయ్యకుండా ఉండరు. ప్రస్తుత వ్యవస్థలో అధికారులను అదుపు చేసి, పని చేయించాలి. ఆ రకమైన పట్టు సాధించకపోతే కష్టమే. ఈ విషయంలో అయితే ప్రస్తుతానికి ఇంకా విజయం సాధించలేదనే చెప్పవచ్చు.

సవాలు 3 - సంక్షేమ పథకాల అమలు
            సంక్షేమ పథకాల అమలులో ఒకనాటి అనగా మర్చిపోయిన తరహా లేదా కొత్తదనం తెచ్చారని చెప్పవచ్చు. హామీల అమలు లేదా సంక్షేమ పథకాల అమలు అంటే అదేదో ఎన్నికల నామ సంవత్సరంలో జరిగేది అనే తరహా తీరును పక్కనబెట్టారు. ఒక్కొక్కటిగా హామీల అమలుతో దూసుకుపోతున్నారు. ఏదైనా చెప్పాడంటే, చేస్తాడంతే అనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నారని చెప్పవచ్చు. ప్రతి పథకం వెనుక 'ఏదో జరుగుతోంది అనే అనుమానాలు, అవినీతి జరిగింది అనే ఆరోపణలు, ఆశ్రీతులకే అనే అపోహలు' ఉండనే ఉంటాయి - అధికారంలో ఉన్న పార్టీలేవైనా. రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో ఎలా ఉంటుందో చూడాలి.

సవాలు 4 - పార్టీ వర్గాల నియంత్రణ
            ఇది అత్యంత కీలకమైన అంశం. పార్టీ పెట్టిన తరువాత దాదాపు పది సంవత్సరాల పాటు ప్రతిపక్ష స్థానంలో ఉండటమే కాక - ఆ కాలంలో అధికారంలో ఉన్న రాష్ట్ర, కేంద్ర స్థాయి వ్యక్తులు, సంస్థలతో దాడులు, ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఎన్నో కష్టనష్టాలకోర్చి అండగా నిలబడిన నాయకులు, వ్యక్తులు, కార్యకర్తలు ఇపుడు కాస్త లాభపడాలని చూడటం సహజం. అందునా వ్యక్తిగత బలం, ప్రతిష్ట తప్పించి క్షేత్రస్థాయిలో శాశ్వతప్రాతిపదికన బలమైన కార్యకర్తల వర్గం లేకపోతే ఎలా ఉంటుందన్నది 2014 లో తెలిసొచ్చింది. అందుకే వివిధ వర్గాలను సంక్షేమ పథకాల పేరిట కార్యకర్తలుగా మార్చుకునే పథకం అమలు జరుపుతున్నారు. అదే సమయంలో పార్టీ వర్గాలు అక్కడక్కడా అదుపు తప్పుతున్నప్పటికీ, అది శృతి మించకుండా చూసుకుంటున్నారని చెప్పవచ్చు. అదే సమయంలో పార్టీలో రోజా, చెవిరెడ్డి వంటి వారి నోటిదురుసుతనాన్ని నియంత్రించగలగడం మొదటి మంచిపని. ఇపుడు పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన కార్యవర్గం నిర్మాణం సంక్షేమ పథకాల పేరున/ఆధారంగా జరుగుతోంది. దీని ప్రభావం ఎలా ఉండబోతోందన్నది 2024 ఎన్నికలలో తెలియవచ్చు.

సవాలు 5 - చంద్రబాబును ఎదుర్కోవడం  
            అందరూ ఎదురు చూసినది జగన్ vs చంద్రబాబు పోరాటం, అది కూడా జగన్ అధికారంలో ఉన్నపుడు ఎలా ఉంటుందన్నది. ఇందులో జగన్ స్పష్టంగా పైచేయి సాధించారని అనిపిస్తోంది. చంద్రబాబుకు చంద్రబాబే శతృవు అని ఎక్కడో చదివాను, నిజమే. ఆయన తాను అన్నదానికి, చేసినదానికి తేడా చూపాడు. ఆ తేడాను చంద్రబాబు మాటల వీడియోల రూపంలో చూపుతూ ఎట్టి చూపడం మొత్తం అసెంబ్లీ సమావేశాలకే హైలైట్. అయితే రాను రాను అది శృతి మించకుండా చూసుకోవాలి. అది తెలిసే అధికారం తమకు అప్పగించారని గమనించి, తాము చేసేదాన్ని చెప్పటం మొదలుపెట్టాలి. ఇప్పటికైతే చంద్రబాబు మీద పైచేయి సాధించినట్టే అనిపిస్తోంది.

సవాలు 6 - కోర్ట్స్ ను ఎదుర్కోవడం
            కోర్ట్స్ విషయంలో ఎదురు దెబ్బలు తింటూనే ఉన్నారు. అయినా సరే ఆగడం లేదు. ఇందులో నా వరకూ చూస్తే రెండు కారణాలు కనబడుతున్నాయి. ఒకటి ప్రతిపక్షాన్ని ప్రజలముందు దోషిగా నిలబెట్టటం - ప్రభుత్వం ప్రతి నిర్ణయానికి ప్రతిపక్షం లేదా ప్రతిపక్షసానుభూతిపరులు కోర్ట్స్ తలుపులు తడుతున్నారు, కోర్ట్ జోక్యం చేసుకుంటోంది. దీనితో మేం చేయాలనుకున్న ప్రతిదానికి ప్రతిపక్షం అడ్డుపడుతోంది అన్న భావనను ప్రజల్లో ఏర్పడేలా చేయడం మొదటిది. ఇక రెండవది - పాలనావ్యవహారాలలో న్యాయవ్యవస్థ జోక్యపు పరిమితిని ప్రభుత్వాలు ప్రశ్నించేలా చేయడానికి అడుగు వేయడం. అలాగే విధానపరమైన నిర్ణయాలు న్యాయస్థానంలో ప్రశ్నించబడకుండా ఉండేలా రూపొందించటానికి న్యాయనిపుణుల సలహాలతో రూపొందిస్తే బావుంటుంది. చంద్రబాబు అంటే ఒక వ్యక్తి కాదు, వ్యవస్థ - వ్యక్తిగా చంద్రబాబును ఎదుర్కోవడంలో పైచేయి సాధించినప్పటికీ, వ్యవస్థగా ఇమిడిపోయింది చంద్రబాబును ఎదుర్కోవడంలో పైచేయి సాధించలేకపోతున్నారు. కొంతకాలం వివాదాస్పద అంశాల కంటే వ్యవస్థపై పట్టు సాధించడం మీద దృష్టి పెడితే మేలేమో.

సవాలు 7 - ఎల్లో మీడియా లేదా ఆ రెండు పత్రికలు
            ఈ బంధం ఈనాటిది కాదు, ఇపుడు ఆగిపోయేది కాదు. జగన్ ఆపాలనుకుంటే ఆగిపోయేది కాదు కూడా. ఏమి చేసినా, ఏమి చేయకపోయినా ప్రతి అడుగూ, ప్రతి మాటా పరీక్షకు గురికాబడతాయి, విపరీతార్థాలతో విశ్లేషించబడతాయి. ఒకరకంగా చెప్పాలంటే ఎల్లో మీడియా జగన్ కు మంచే చేస్తోందేమో. వాళ్ళెంత అణచాలని చూస్తున్నారో, అతడంత పైకి లేస్తున్నాడు. ఎల్లో మీడియా వల్ల బాబు కంటే, జగన్ కే ఎక్కువ ప్రయోజనం జారుతున్నట్టుంది. ఎల్లో మీడియాను ఎదుర్కోవడం కంటే, వదిలేయడం మేలనే అత్యంత కీలక మరియు మంచి నిర్ణయాన్ని జగన్ అమలు చేస్తున్నట్టే ఉంది.

సవాలు 9 - సోషల్ మీడియాను సంభాళించడం  
            జగన్ అధికారంలోకి రావడంలో సాక్షి మీడియా కంటే సోషల్ మీడియా పాత్రే అధికం. అధికారంలోకి వచ్చాక సోషల్ మీడియా ప్రాధాన్యతను బహుశా గుర్తించలేదో లేక మర్చిపోయారో అనిపించేట్టుగా ఉంది వ్యవహారశైలి. అలాగే సోషల్ మీడియాలో వచ్చే వ్యతిరేక వార్తల పట్ల కేసు నమోదు, విచారణ వంటివి సమయం వృధా మరియు నెగటివ్ ఇమేజ్ తెచ్చేవి. ఎందుకంటే సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్ట్స్ చేసేవారిలో 99% మంది షేర్ చెయ్యడం తప్ప ఏమీ తెలియదు. వ్యతిరేక వార్తల పట్ల చట్టపరమైఅన్ చర్యలు అనేదానికంటే, తాము ఒక బలమైన విభాగాన్ని ఏర్పాటు చేసుకుని - తమ విధానాలు, చర్యలను, ఫలితాలను సమర్థంగా ప్రజల్లోకి సోషల్ మీడియా మాధ్యమం ద్వారా తీసుకెళ్ళేలా చూసుకోవాలి. ఇప్పటికైతే సోషల్ మీడియాను హేండిల్ చేయడంలో విఫలమైనట్టే. సోషల్ మీడియా పట్ల జాగరూకత లేకపోతే, నష్టం జరిగాక చింతించి లాభం ఉండదు.

సవాలు 10 - జగన్
            అవును, సరిగానే చదివారు జగన్ కు సమస్య జగన్ తోనే. 2019 ఎన్నికల్లో గెలిచింది జగన్, చాలాచోట్ల అభ్యర్థులెవరో పేరు కూడా తెలీదు జనాలకు. అది పూర్తిగా జగన్ విజయం - ఇది అతిశయోక్తిగా అనిపించవచ్చు, కానీ జనాల్లో తిరిగిన వారికి తెలుసు. పార్టీకి క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం నిర్మాణంతో పాటు నాయకుల పైనా దృష్టి పెట్టాలి. స్టాండర్డ్ గా జగన్ అనే బ్రాండ్ కు కొంత వోట్ బ్యాంకు ఉంటుంది, కానీ తరువాతి ఎన్నికలలో అది గెలుపు తీరాలు చేర్చాలంటే స్థానిక నాయకుడికీ బలం ఉండాలి లేదా బలపడాలి (ఆర్థికంగా అని కాదు). అది జరగకపోతే పటిష్టమైన కార్యకర్తల వ్యవస్థ, ద్వితీయ శ్రేణి నాయకత్వం ఉన్న తెదేపా చేతిలో ఎదురుదెబ్బ తినాల్సి రావచ్చు.

ముక్తాయింపు:
            సంవత్సరం కాల పరిపాలనలో ప్రధానంగా కనిపించేవి జగన్ ధైర్యం/పట్టుదల, జగన్ అనుభవలేమి. ఇపుడు సంక్షేమపథకాల అమలుకంటే అధికంగా అధికార వ్యవస్థపై పట్టు సాధించడం అన్నది కీలకం. చేయనిది కూడా తమ ఘనత క్రింద చెప్పుకునేవారున్న రోజుల్లో, కనీసం చేసిందాన్ని చెప్పుకోగలగాలి. అసలే కుదేలైన ఆర్థికవ్యవస్థకు కరోనా మరింత దారుణమైన దెబ్బ కొట్టింది. ఇపుడు సంక్షేమ పథకాల అమలు (కొత్తగా) వంటివి పక్కనబెట్టి ఆదాయ మార్గాలను అన్వేషించాలి. ఆర్థికంగా స్వావలంబన సాధించాలి. ముఖ్యంగా వ్యవసాయ రంగం, వ్యవసాయ ఆధారిత రంగాలు, కుటీర పరిశ్రమలపై దృష్టి సారించాలి. పారిశ్రామికీకరణ అంటే బహుళజాతి సంస్థలకు భూములప్పగించి, అభివృద్ధి అనుకోవడం కాదు; ఐటీ ఆధారిత పరిశ్రమలూ కాదు. వ్యవసాయ మరియు వ్యవసాయ ఆధారిత రంగాలను పరిపుష్టం చేయగలిగితే ఊహించని అభివృద్ధి మరియు స్వావలంబన సాధింపబడగలదు. నీటిపారుదల రంగం, ప్రోజెక్టుల నిర్మాణం వంటి వాటిపై దృష్టి సారించడం నిజంగా మంచి పరిణామం. 2009 ఎన్నికలు ముగిశాక వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ఒక మాటన్నారు 'మనం ఈ గెలుపుకు పొంగిపోకూడదు, ఇంకా మెరుగ్గా మరియు బాధ్యతాయుతంగా పని చేయాలి. జనాలు మనకు జస్ట్ పాస్ మార్కులు వేశారు' అని. ఈ సంవత్సర కాలంలో జగన్ కేవలం పాస్ మార్కులు సాధించారు, కష్టపడాలి, మరింత మెరుగ్గా పని చేయాలి. చూద్దాం ఇంకా నాలుగేళ్ళుంది. పాలనలో, వ్యక్తిత్వంలో తన తండ్రిని కానీ, గత పాలకుల తీరును కానీ కనబడనీయకుండా నెమ్మదిగా తన మార్క్ చూపడానికి ప్రయత్నిస్తున్నారు. 

Comments

  1. Excellent analysis vamshi Garu. You have covered all points of Jagan one year governance in an impartial manner.

    I have confidence that Jagan will work with more balanced
    approach in the coming four years and overcome the hurdles.

    Babu and yellow Media should feel ashamed of themselves. They behaved in the most disgusting distasteful manner during the past one year. A person who worked as CM for 9 years is behaving in such cheap manner to demean himself.

    No other CM has faced so much hostility and hatred from opposition and media like Jagan. Judiciary should not interfere in the administration.

    I am really happy about the revolutionary volunteers concept giving doorstep service and provided employment to 4.5 lakhs youth.

    Jagan should refrain from taking hasty decisions.

    Jagan stands for credibility and integrity. Babu is unable to raise above petty politics.

    ReplyDelete
  2. Thank you for the feedback and appreciation. I have an idea to deal with other topics you mentioned in another article, I have started putting together different points. This article I opted to deal with the challenges he is facing ...

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన