... అమ్మఒడి పథకం గురించి

వంశీ కలుగోట్ల // ... అమ్మఒడి పథకం గురించి // 
*********************************************
            అమ్మఒడి పథకం అమలు గురించి పలు రకాల వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు వస్తున్నవి. ముఖ్యంగా, దాదాపుగా అందరూ ఏక కంఠంతో ఖండిస్తున్నది ఈ పథకాన్ని ప్రైవేట్ పాఠశాలలకు కూడా వర్తింపజేయడం గురించి. వ్యక్తిగతంగా నేను కూడా దీనిని ప్రైవేట్ పాఠశాలలకు వర్తింపజేయటాన్ని వ్యతిరేకించాను, వ్యతిరేకిస్తున్నాను కూడా. కానీ, ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే జగన్ గారు ఇది ఎన్నికల్లో గెలిచిన తరువాత ఆలోచించి, ప్రకటించిన పథకం కాదు. ఎన్నికలకంటే దాదాపు రెండేళ్ళ ముందే సూత్రప్రాయంగా ప్రకటించారు. ఆ తరువాత పాదయాత్రలోనూ, ఎన్నికల ప్రచార సభల్లోనూ స్పష్టంగా ప్రకటించారు 'పిల్లలను బడులకు పంపే తల్లులకు సంవత్సరానికి 15000 రూపాయలు ఇస్తాను' అని. ముందుగా ఒక అంశం - ప్రత్యేకించి చెప్పకపోయినా, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత తెల్ల రేషన్ కార్డు లేదా ఆరోగ్యశ్రీ వంటివాటికి తత్సంబంధిత కార్డు కాబట్టి ఇది తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న తల్లులందరికీ వర్తిస్తుంది. ఇక నాకు తెలిసినంతవరకూ ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు బాలకార్మికులను తగ్గించటం, అక్షరాస్యతను పెంచటం, ఆడపిల్లలను బడికి పంపేలా చెయ్యటం. అదే సమయంలో జగన్ గారు అదే ఎన్నికల ప్రచార సభలలో విద్యావ్యవస్థ ప్రక్షాళనకు సంబంధించి మరికొన్ని ప్రకటనలు కూడా చేశారు - ప్రైవేట్ పాఠశాలలలో ఫీజుల క్రమబద్ధీకరణ, ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మరియు సౌకర్యాల కల్పన, మధ్యాహ్న భోజన పథకం సమీక్ష మరియు సక్రమంగా అమలయ్యేలా చూడట వంటివి. అమ్మఒడి ఆచరణ ప్రకటన తరువాతి అంకంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనపై మరియు అదే సమయంలో ప్రస్తుత పరిస్థితి సమీక్షించడంపై దృష్టి సారించారు కూడా. కాబట్టి, రాబోవు రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి మెరుగయ్యే అవకాశాలున్నాయి అనుకోవచ్చు. 
             ఇక అమ్మఒడి అమలు తీరుపై విమర్శలు పరిగణనలోకి తీసుకుంటే - అందరూ అంటున్నది ఏమిటంటే ఇది కార్పొరేట్ వ్యవస్థకు దోచి పెట్టటానికి అని, ప్రభుత్వ పాఠశాలలను మరింత దెబ్బ తీయటానికి అని. వారంతా అర్థం చేసుకోవలసింది ఏమిటంటే - ముందుగానే చెప్పినట్టు ఇది ఇవాళ పుట్టుకొచ్చిన ఆలోచన కాదు. ఎన్నికలకు చాలా కాలం ముందే ప్రకటించబడింది. ఆ పథకం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అన్న తారతమ్యం లేకుండా అమ్మఒడి పథకం క్రింద 15000 ఇస్తామని స్పష్టంగా ప్రకటించబడింది. అధికారంలోకి వచ్చాక అమలు గురించి చర్చలు మొదలయ్యాయి. ఎప్పుడైతే అమ్మఒడి పథకం జనవరి నుండి అమల్లోకి తెస్తామని ప్రకటించారో అప్పుడు వ్యాఖ్యలు మొదలయ్యాయి. ఇపుడు వస్తున్న విమర్శలకు కొంతవరకూ వారూ బాధ్యులే. ఒకరేమో అందరికీ ఇస్తామని అన్నారు, బుగ్గన గారు ఒకసారి ఇంకా అమలు తీరు పరిశీలిస్తున్నాం అన్నారు, తరువాత అదే బుగ్గన గారు ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే అన్నారు. ఇపుడు సీఎంఓ అధికారికంగా అమ్మఒడి పథకం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశలల తారతమ్యాలు లేకుండా, ఇవ్వబడిన హామీ ప్రకారంగానే అమలు చేస్తారని ధృవీకరించారు. అవును, అమల్లోకి తెచ్చేముంది మరియు అధికారికంగా ధృవీకరిస్తూ ప్రకటించే ముందు కొంత సందిగ్ధత, అయోమయం నెలకొన్నాయి. కానీ, విమర్శలకు వెరవకుండా తాను మాట ఇచ్చిన ప్రకారంగానే అమలు చేస్తానని అన్నందుకు జగన్ గారి ధైర్యానికి మెచ్చుకోవాలి. ఒకవేళ వీలయితే క్రమేపీ అంటే ఫేజ్ వైస్ గా దీన్ని ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పరిమితం చేసేలా చేస్తే బావుంటుంది. 
              విమర్శల విషయానికి వస్తే - నేను స్వయంగా కొందరి పోస్ట్స్ (నా ఫేస్ బుక్ లో ఉన్న మిత్రుల సమూహంలోనే) చూశాను - మొదట ఈ పథకం చాలా మంచిది అన్నారు; తరువాత ఇది అందరికీ అన్నపుడు ఇచ్చినమాట ఇచ్చిన రీతిన అమలు చేయగలిగే దమ్ముంది అన్నారు; తరువాత ప్రభుత్వ పాఠశాలలు మూతబడతాయి కాబట్టి దీన్ని ప్రైవేట్ పాఠశాలలకు ఇవ్వకూడదన్నారు; తరువాత ప్రభుత్వ పాఠశాలలకే అన్నపుడు బాబుగారిలాగే యు టర్న్ జగన్ అయ్యాడు నెలలోపే అన్నారు; ఇపుడు మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలు మూతపడొచ్చు అని ఆక్రోశిస్తున్నారు. వామ్మో వామ్మో ... రెండు వారాల వ్యవధిలో ఎన్ని వ్యాఖ్యలు - బాబుగారి స్ఫూర్తితోనే కావచ్చు. ఇది జగన్ గారు ఇవాళ ప్రకటించింది కాదు. ఎన్నికల  ప్రచారసభల్లో అనేకమార్లు చెప్పారు - ఏ బడికి పంపుతున్నారన్నది సంబంధం లేకుండా, పిల్లలను బడికి పంపే తెల్ల రేషన్ కార్డు హోల్డర్ తల్లులకు (అది ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్ కి మాత్రమే అని అందరికి తెలుసు) 15000 ఇస్తానని స్పష్టంగా చెప్పారు. అపుడంతా దీని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇది మీరొక్కరికే కాదు, నాకు నేను కూడా వేసుకుంటున్న ప్రశ్న ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలకు వర్తింపజేయటానికి నేనూ వ్యతిరేకమే. కానీ, అతడు తాను ఇచ్చిన హామీని, చెప్పిన రీతిన అమలు చేస్తున్నాడు కదా. మరి మనకు ఇన్ని కన్సర్న్స్ ఉన్నపుడు హామీ ఇచ్చినపుడు మనమెందుకు ప్రశ్నించలేదు? ఎలాగూ అతడు అధికారంలోకి రాడనుకున్నామా? వచ్చినా బాబుగారిలా హామీలు తుంగలో తొక్కేస్తాడనుకున్నామా? ఎపుడో ఎన్నికల నామ సంవత్సరంలో తూతూ మంత్రంలా అమలు చేస్తాడనుకున్నామా? ఇపుడు తప్పు మనవైపే ఉంది, అతడివైపు కాదు. కానీ, మనం తల దించుకోవాల్సిన పని లేదు. ప్రశ్నించాలి. అలాంటి ప్రశ్నించే గొంతుకలే, గత ప్రభుత్వ పతనానికి కొంతవరకూ కారణమయ్యాయి. అమలు తీరులో పక్షపాతం, అలుసు వంటివి చూపితే ఈ ప్రభుత్వమూ ప్రజల తిరస్కరణకు గురి కావలసిందే అనే భయం ఉండాలి. 
            ఇపుడు అమ్మఒడి పథకం అమల్లో ప్రైవేట్ పాఠశాలలకు మిహాయింపు అన్నదానికంటే ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలలో వసతులు మెరుగు పరచటం, విద్యార్థులు సంఖ్యను పెంచటం, అక్షరాస్యత పెంచటం, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల క్రమబద్ధీకరణ తదితర అంశాల మీద ప్రభుత్వం తీసుకోబోయే చర్యలను నిశితంగా పరిశీలించి, ప్రశ్నించాలి. అవసరమైతే ఉద్యమించాలి. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల క్రమబద్ధీకరణ కనుక అమల్లోకి వస్తే పుట్ట గొడుగుల్లా వచ్చిన చిన్న చిన్న ప్రైవేట్ పాఠశాలలు త్వరలో మూతపడే అవకాశం ఉంది; ముఖ్యంగా మండలస్థాయిలో ఉన్నవి. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు సంఖ్య తద్వారా ప్రభుత్వ విద్యావ్యవస్థ బాగుపడే అవకాశం ఉంటుంది. అమ్మఒడి - ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగు పరచటం, ఇంగ్లీష్ మీడియం, తెలుగు తప్పనిసరి సబ్జెక్టు - ప్రైవేట్ పాఠశాలల క్రమబద్ధీకరణ వంటివి ఒకదానికొకటి పరస్పరం ప్రభావం చూపగల అంశాలు. అన్ని అంశాలు అమల్లోకి వచ్చాక కనీసం ఒకటి లేదా రెండు విద్యాసంవత్సరాలు పడుతుంది అది ఎవరికి లాభం అని తెలుసుకోవటానికి. మంచి జరగాలని కోరుకుందాం, జరగదనుకున్నపుడు ప్రశ్నిద్దాం, జరగకపోతే పోరాడదాం, వినకపోతే ఎన్నికలున్నాయి. 

Comments

  1. పథకం మంచిదే కానీ ఫీజు రీయింబర్సుమెంట్ స్కీము దురుపయోగం అయినట్టు పునరావృత్తి కాకూడదు. ఒకటి కంటే ఎక్కువ బ్రాంచీలు లేని ప్రయివేట్ స్కూళ్లకు విస్తరించినా ఫరవాలేదు కానీ కార్పేరేటు బడులను (ఉ. చైనా ముఠా) మినహాయిస్తే మంచిది.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

      Delete

Post a Comment

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన