... పతనమా? వ్యూహమా?

వంశీ కలుగోట్ల // ... పతనమా? వ్యూహమా? //
********************************************
            తెదేపా నుండి భాజపాలోకి లెక్కకు మిక్కిలిగా వలసలు జరగవచ్చు, తద్వారా రాష్ట్రంలో భాజపా బలమైన ప్రత్యామ్న్యాయంగా ఎదగటానికి ప్రయత్నిస్తోంది అని కథనాలు వస్తున్నవి (ఆ కథనాలకు గతంలో నేనూ ఒక సమిధను వేశాననుకోండి). ఆ విధంగా జరగటంలో గల సాధ్యాసాధ్యాలను ఒకసారి పరిశీలించి చూద్దాం. ఈ అంశాన్ని ఒక్క కోణంలోంచి విశ్లేషిస్తే న్యాయం జరగదు, ఎందుకంటే అక్కడ ఉన్నది అభినవ రాజకీయ చాణక్యుడిగా పేరొందిన వ్యక్తి, బూడిదనుండి కూడా పునరుజ్జీవనం పొందగలిగే ఫీనిక్స్ పక్షి లాంటివాడు అని అభిమానులు భావించే వ్యక్తి అయిన చంద్రబాబు నాయుడు గారు ఉరఫ్ బాబుగారు ఉరఫ్ దార్శనిక మేధావి కాబట్టి ఏదీ అంత వీజీ కాదు మరీ ముఖ్యంగా తెదేపా దుకాణం సర్దేయడం అన్నది అంత వీజీ అయిన పని కాదు. ముందుగా ఈ వలసల వల్ల ఏం జరగవచ్చు అనేది రెండు కోణాల్లోంచి పరిశీలించి చూద్దాం. 
*            *            *  
             ముందుగా తాజా ఎన్నికల్లో ఘోర ఓటమిని ఎదుర్కున్న తెదేపా బలహీనపడింది అన్న కోణంలోంచి పరిశీలించి చూద్దాం. గతంలో ఎన్నడూ ఎదుర్కొనంత ఘోరమైన ఓటమిని ఎదుర్కున్న తెదేపా శ్రేణులు ఖచ్చితంగా కొంత నైరాశ్యంలోకి వెళ్ళాయి. ముఖ్యంగా తెదేపా నాయకులు చాలామంది అయోమయంతో కూడిన సందిగ్ధం వల్ల వచ్చిన నిరాశలో కూరుకుపోయారు. ఆవిర్భావకాలం నుండి తెదేపాతో ఉండిన కార్యకర్తలు తెదేపాతోనే ఉంటారు అన్నదాంట్లో అనుమానమేమీ లేదు. సీట్ల సంఖ్యాపరంగా దారుణమైన ఓటమిని మూటగట్టుకున్నప్పటికీ, సాధించిన వోట్ల శాతం మాత్రం ఊరటనిచ్చేదిగానే ఉంది. అయినప్పటికీ నాయకులు ఐదేళ్ళపాటు తెదేపాలో కొనసాగడం కాసింత కష్టమే. రాజకీయాలు 90 వ దశకం ద్వితీయార్ధం నుండి అనగా మరీ ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి వైభవం లేదా అధికారం మొదలైననాటి నుండి అత్యంత ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారాయి. ఎవరికైనా అనుమానాలుంటే 94 వరకూ మరియు ఆ తరువాత కూడా ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్న నాయకులను ప్రైవేట్ గా మాట్లాడించి చూడండి (పరిచయం ఉంటే) మీకే తెలుస్తుంది. దాదాపు ప్రతి నెలా ఏదో ఒక కార్యక్రమం పేరుతోనో, మరోటో ఏదైతేనేం కార్యకర్తలను కలుస్తూ ఉండాల్సిందే, వారికి అంతో ఇంతో ఖర్చు పెడుతూ ఉండాల్సిందే. అదే సమయంలో అధికార పార్టీ సభ్యుల నుండి వచ్చే అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కుంటూ అయిదేళ్లపాటు మనుగడ సాగించడం ఇవ్వాల్టి రోజుల్లో అత్యంత కష్టం. కావాలంటే ఎన్నికలప్పుడు లేదా ఎన్నికలు ముగిశాక పరిస్థితి చూసుకుని మళ్ళీ పార్టీ మారవచ్చు. కాబట్టి అందరు నాయకులు కాకపోయినా కొందరైనా ఖచ్చితంగా పార్టీ మారతారు. 
               తెదేపా నాయకులలో నెలకొన్న ఈ సందిగ్ధావస్థను ఉపయోగించుకుని, వారిని తమలో చేర్చుకోవటం ద్వారా, రాష్ట్రస్థాయిలో తాము బలపడాలని భాజపా వ్యూహం పన్నుతోంది. ఓడిపోయినప్పటికీ తెదేపా నాయకులు అనామకులేమీ కాదు, తమ తమ నియోజకవర్గాలలో పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగత వోట్ బ్యాంకు కలిగిన వారే. అటువంటి వారు తమకు తోడైతే, బలం పుంజుకోవచ్చన్న భాజపా ఆలోచన ఒకరకంగా సరైనదే. ఇన్ని దశాబ్దాల ప్రస్థానంలో రకరకాల కారణాల వల్ల రాష్ట్రంలో భాజపా ఎదగలేకపోయింది. వెంకయ్య నాయుడు గారు దానికి ప్రధాన కారణంగా చెబుతారు, అంతేకాక చంద్రబాబుతో పొత్తు వారికి బంధనాలు వేసి, చంద్రవ్యూహంలో చిక్కుకుని క్షీణించిపోయారు. వయసు మీదపడిన చంద్రబాబు గారు ఇంకా ఎన్నిరోజులు సమర్థంగా పార్టీని నడిపిస్తారో అనే అనుమానం, తదుపరి లోకేష్ వంటి నేత నేతృత్వంలో ముందుకు వెళ్ళాల్సి రావచ్చన్న భయం వెంటాడుతున్న తెదేపా నేతలకు జగన్ గేట్లు తెరవకపోవడంతో భాజపా మినహా ప్రత్యామ్న్యాయం లేదు. ఓడిపోయిన బ్యాచ్ లో సింహ భాగం మరియు ప్రస్తుత సభలోని సభ్యులలో కొందరు భాజపాలో చేరవచ్చు. తద్వారా తెదేపాను మరింత బలహీనం చేసి, భాజపా రాష్ట్రస్థాయిలో బలపడగలిగే అవకాశాలు అధికంగానే కనబడుతున్నాయి. ఇప్పటికే తెదేపా పార్లమెంటరీ పార్టీని భాజపాలో విలీనం చేయాల్సిందిగా ఉన్న ఆరుగురు సభ్యులలో నలుగురు విజ్ఞప్తి చేశారు కాబట్టి, అది ఇంక లాంఛనప్రాయమే. ఒకప్పుడు కాంగ్రెస్ తరువాత అధిక సభ్యులను కలిగి ఉండి (లోక్ సభలో) ప్రతిపక్ష హోదా దక్కించుకున్న స్థాయి నుండి తెదేపా ఈ స్థాయికి దిగజారడం స్వయంకృతమే. 
*            *            *
              ఇక ఈ విషయంలో రెండవ కోణం గురించి చెప్పాలి. ముందుగానే చెప్పుకున్నాం తెదేపాకు అభినవ చాణక్యుడుగా పేరొందిన చంద్రబాబు గారు నేతృత్వం వహిస్తున్నారు. తెరవెనుక వ్యూహాలు రచించడంలో ఆయన్ను మించినవారు లేరన్నది అందరికీ తెలిసినదే మరియు దాదాపు అందరూ ఒప్పుకునేది. కానీ, ప్రజలలో వ్యక్తమైన అతి తీవ్ర వ్యతిరేకత అతడిని మొత్తం రాజకీయ జీవితంలోనే దారుణమైన  ఓటమి చవిచూసేలా చేసింది. కానీ, అతడిలోని వ్యూహకర్త ఇంకా విశ్రమించలేదు. అత్యంత క్లిష్టపరిస్థితుల్లో ఉన్నపుడే అతడి వ్యూహాలు మరింత పదునెక్కుతాయి. ఇపుడు తెదేపా నుండి భాజపాకు వలసలు అందునా సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటివారు కూడా భాజపాలో చేరడం చూస్తుంటే, ఇది చంద్రబాబు గారి వ్యూహంలాగానే అగుపిస్తోంది. తెదేపాను బలహీనపరచేదిగా అగుపిస్తోన్న ఈ వ్యూహం ద్వారా చంద్రబాబు గారు సాధించదలచుకున్నదేమిటి (ఒకవేళ వ్యూహం అన్నది నిజమే అయితే) అని ఆలోచిస్తే రెండు అంశాలు తోచుతాయి. ఒకటి తన మీద, తన పార్టీ సభ్యుల మీద గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి పరంగా ఎదుర్కోబోయే న్యాయపరమైన అంశాల నుండి కాస్త ఊరట సాధించగలగవచ్చు; రెండోది కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా పార్టీలో తన నమ్మకస్థులను కొన్ని కీలకస్థానాల్లో ఉంచడం ద్వారానో, లేదా మరే విధంగానో వారి ద్వారా కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనేలా చేసి, జగన్ ని కట్టడి చేయడం. 
               మొదటి అంశం పరిశీలిస్తే - గత ప్రభుత్వంలో అంటే 2014 - 19 మధ్యకాలంలో గతంలో ఎన్నడూ జరగనంత తీవ్రమైన అవినీతి జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా పోలవరం మరియు రాజధాని అంశాలలో. ఈ రెండు విషయాలలో ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సి రావచ్చు, కేసులు నమోదు అయినా కావచ్చు. అందులో చంద్రబాబు గారి పేరు ఉన్నా ఆశ్చర్యపోనక్కరలేదు. అంతేకాక వోట్ ఫర్ నోట్ తో పాటు, గతంలో స్టేలు తెచ్చుకున్న పద్దెనిమిది కేసులు తిరగదోడబడవచ్చు. అటువంటి సమయంలో భాజపాలో తనవారుంటే, సహాయకారిగా ఉండవచ్చు. ఎందుకంటే చంద్రబాబుగారికి ఎపుడైనా సరే 'తను' ముఖ్యం, ఒకవేళ తన అస్థిత్వమే చేరిపోగలదు అనుకుంటే, ఎంతలోతుకైనా దిగజారగలడు - అది ఎటువంటి చర్య అయినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఇక రెండవది భాజపాలో తన వారిని ఉంచి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనేలా చెయ్యటం. తద్వారా కేంద్రం నుండి రావలసిన నిధులు గట్రాలకు అడ్డుపుల్లలు వేయించి, జగన్ ను కట్టడి చేసి అతడు ఏమీ చేయలేని అయోమయ స్థితిలోకి నెట్టివేయడం. తద్వారా ప్రజలలో వ్యతిరేకత రేకెత్తించి, దానిని 2024 నాటికి తనకు అనుకూలంగా మలచుకోగలగటం. వేరే ఎవరి విషయంలోనైనా అయితే ఇటువంటివి సాధ్యమా అని ఆలోచించవచ్చు, అంతకు దిగజారతారా అనుకోవచ్చు కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది చంద్రబాబు గారి గురించి. ఆయన విషయంలో ఏదైనా సాధ్యమే. ఆయనకు ఆయన స్వప్రయోజనాలు, తన రాజకీయ (ఇపుడు లోకేష్ కూడా) అస్తిత్వం తప్ప మరేదైనా ద్వితీయ ప్రాధ్యాన్యమే. ఆయన రాజకీయ ప్రస్తానం గమనించిన ఎవరికైనా సులువుగా అర్ధమయ్యే విషయం అది. 
*            *            *
           ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న ఘటనలను గమనిస్తూంటే తెదేపా వర్గాలు ఓటమి పట్ల సరియైన విశ్లేషణ చేసుకోవడం లేదేమో అనిపిస్తోంది. ఏదేమైనా ఇది తెదేపాకు అత్యంత క్లిష్టమైన పరిస్థితి, గతంలో ఎపుడూ ఎదుర్కొనటువంటిది. ఇది తెదేపాకు దాదాపుగా అంత్యదశగా కనబడుతోంది అని చెప్పడం సరికాకపోవచ్చు, కానీ పరిస్థితి అలానే ఉంది. ఇటువంటి పరిస్థితులలో తెదేపాకు చంద్రబాబు కాకుండా పార్టీ శ్రేణులతో పాటు ప్రజలలో నమ్మకం కలిగించగల ప్రత్యామ్న్యాయ నేత అవసరం ఉంది. అది జూనియర్ ఎన్టీఆర్ ఆ లేక మరొకరా అన్నదానికి రాబోవు రోజులు సమాధానం చెప్పగలవేమో చూడాలి. ఇపుడు జరగబోయే వలసలు తెదేపాను పతనం వైపు తీసుకెళ్ళేవా లేక అధినేత వ్యూహమా అన్నదానికి సమాధానం కోసం మరికొద్ది కాలం వేచి చూద్దాం. 

Comments

  1. ఆయనగారి ప్రస్థానంలో నుంచి స్ఫూర్తి పొంది సినిమాల్లో ఒక గొప్ప కారెక్టర్ ని రాసుకోవచ్చు...

    ReplyDelete
  2. పచ్చ మూకలు, అనుకుల మీడియా, జీ తాత, ష్ణ అబ్బి, మీరు ఓడిపోవటమేమిటయ్యా బాబు కలిసి ఆడుతున్న కమ్మని పచ్చ నాటకం ఇది.

    ReplyDelete
  3. బాబుగారు చాణుక్యుడేగాని టైమ్ కలిసిరాలేదు. భాజపాకి బాబుగారి అవసరం లేదు. భాజపాకి రాజ్య సభలో నంబర్లు పెంచుకోవడం అవసరం. అందుకు నలుగురికి గాలం వేసింది,చేపలు పడ్డాయి. వాళ్ళమీద కేసులు కోసమో మరో అవసరానికో భాజపాలో చేరిపోయారు. లాంగ్ పెండింగ్ స్టే లను సుప్రీం కోర్ట్ ఎలక్షన్ల ముందే ఎత్తేసింది. బాబుగారే వాళ్ళని పంపించారన్న మాటా కాదనలేనిదే


    ఇంతా జరిగాకా కూడా బాబుగారు మోడీ ని కలుస్తున్నారట.

    2020 ల్లో జరిగే రాజ్య సభ ఎలక్ష్నలకోసం భాజపా వైఎసార్ సిపి తో ఇప్పటినుంచే దోస్తీ చేస్తోందని వార్త. అందుకోసం లోక్సభ డిప్యూటీ ఇస్తామని ఫీలర్లు ఇస్తున్నారట.

    పదవిలో లేనప్పుడు పార్టీని భరించడం కష్టమే, అందుకుగాను, అసెంబ్లీలో బాబుగారిని బాలయ్యని వదిలేసి మిగిలిన తెలుగుదేశం వారంతా భాజపాలో మూకుమ్మడిగా ఫిరాయిస్తారట. భాజపాకి పట్టూ దొరుకుతుంది,తెలుగు దేశానికి విక్టిం కార్డ్ దొరుకుతుంది, వీళ్ళని మేపే బాధ తప్పుతుంది, జగన్ కి తియ్యటి ప్రతీకారం తీర్చుకున్నట్టవుతుంది.రాజ్య సభకి నంబర్లు పెంచుకున్నట్టవుతుంది.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన