దేశభక్తి ఎందులో ఉంది?

వంశీ కలుగోట్ల // దేశభక్తి ఎందులో ఉంది? //
*************************************
            అరేయ్ ఎవర్రా అక్కడ, ఆ బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ ముష్రఫె మొర్తజాకు ఏసుకోండి వీరతాళ్ళు. ఒకానొక శుభోదయాన కాకపొతే శుభదినాన మొర్తజాగారికి జ్ఞానోదయం అయ్యి 'మాదేముంది డబ్బులు తీసుకుని ఆడుతున్నాం, ఇందులో దేశభక్తీ లేదు తొక్కా లేదు. నిజమైన హీరోలు అంటే కూలీలు, వైద్యులే తప్పించి వేరెవరూ కాదు. వైద్యుడు ప్రాణం నిలబెడతాడు, కూలీ ఇటుకలు మోసి భవనాలు నిర్మిస్తాడు. మేమేమన్నా ప్రాణం పొయ్యగలమా లేక కూలీపని చేయగలమా' అంటూ ఒక చిన్న గొప్ప ఉపన్యాస సందేశమిచ్చాడు. మంచిది, నిజ్జంగానే నిజం చెప్పాడు. అందులో ఎటువంటి అనుమానమూ లేదు. కానీ, మొర్తజా  భయ్యా దేశభక్తి అంటే ప్రాణం పొయ్యడం, ఇటుకలు మొయ్యడమే కాదు; హీరోలు అంటే కూలీలు, వైద్యులు మాత్రమే కాదు. అవును కూలీలు, వైద్యులు గొప్పోళ్ళే మేమేమీ కాదనట్లేదు. అలా అయితే భూమ్మీద కూలీలు, వైద్యులు తప్పించి మిగతావారెవరూ ఉండకూడదు. ఇంకెవడో వచ్చి రైతులు, సైనికులు మాత్రమే హీరోలు మిగినోళ్ళందరూ చెత్త అంటాడు. అపుడు వాడికీ వీరతాళ్ళు వేసుకుందాం. మరింకెవడో వచ్చి అధికారులు, డ్రైవర్లు మాత్రమే హీరోలు అంటాడు వాడికీ వీరతాళ్ళు వేసుకుందాం. ఆటలు ఆడొద్దు, పాటలు పాడొద్దు, కళలు మరిచిపోదాం, రాతలు ఆపేద్దాం, వ్యవసాయం మానేద్దాం, ఇతర రంగాలన్నీ సంకనాకిపోనీ అనుకుని వదిలేద్దాం.
            ఏం ఒక్క క్రికెట్ క్రీడను ఆడటం, చూడటం ఆపేస్తే ప్రపంచం అంతా స్వర్గమయమై, ప్రజలందరూ ఆరోగ్యానందాలతో వెలిగిపోతారా!? అంతేనా, ఇంకేమన్నా ఉందా? అయ్యా మోర్తజా గారూ మరియు ఇతరులూ భూమ్మీద మొర్తజా గారు చెప్పిన వైద్యులు, కూలీలు అనబడే హీరోలు మాత్రమే కాదు ఇంకా చాలామంది ఉంటారు. ఈ భూమ్మీద హీరోలే కాదు హీరోల అభిమానులు, ఆరాధకులు, సమర్థకులు, వ్యతిరేకులు, అనుసరించేవారు ఎందరో ఉంటారు. వైద్యుడైనా, కూలీ అయినా ఉచితంగా పని చెయ్యటం లేదు - డబ్బులు తీసుకునే చేస్తున్నారు. ఆ లెక్కన చూస్తే డబ్బులు తీసుకుని పనిచేసే ఎవరూ హీరోలు కారు. ఇది నేను కేవలం క్రికెట్ ను సమర్థించటానికి చెబుతున్నాననుకుంటే క్రికెట్ ప్రేమికులంతా నాకు వీరతాళ్ళు వేసుకోండి. విపరీత పైత్య ప్రదర్శన అన్నది ఒక్క క్రికెట్ ను ఇష్టపడే వారిలోనే కాదు ఇతరేతర రంగాలలో కూడా ఉంది. ఈ చెప్పే సుద్దులన్నీ ఇలా గొప్ప ప్రాచుర్యం పొందే మ్యాచ్ లు జరిగేప్పుడు మాత్రమే చెబుతారు, అదే ఇండియా ఏదో ఒక చిన్న దేశంతో ఆడుతుంటే జనాలూ అంతగా పట్టించుకోరు కాబట్టి ఈ సుద్దులన్నీ చెప్పబడవు.
            అవును మొర్తజా చెప్పినట్టు దేశభక్తి క్రికెట్ లో లేదు, అయితే మరి దేనిలో ఉంది? కూలీ పని చెయ్యడంలోనా, వైద్యం చెయ్యడంలోనా, రక్షకభటుడిగా పనిచెయ్యటంలోనా, సైనికుడిగా ఉండటంలోనా, వ్యవసాయం చెయ్యటంలోనా, రాజకీయంలోనా ... !!!? ఏదీ ఎందులో ఉంది అని అడిగితే ప్రహ్లాదుడిలా 'ఇందుగలదందులేదని సందేహము వలదు ... ఎందెందు వెదకి చూసిన అందందే కలదు దేశభక్తి' అని చెప్పాలేమో? ఒక పార్టీని అభిమానించేవాడికి ఆ పార్టీ నాయకులలో మాత్రమే దేశభక్తి కనబడుతుంది, ఒక మతాన్ని మూఢంగా అభిమానించేవాడికి ఆ మత సూత్రాలలో మాత్రమే దేశభక్తి కనబడుతుంది ... ఎట్సెట్రా. ఎవరి కోణంలో వారికి దేశభక్తి కనబడుతుంది. అటువంటప్పుడు ఒక్క క్రికెట్ మీద మాత్రం అక్కసు వెళ్లగక్కడమెందుకు? ఇపుడు భాజపా వారిపై 'ఆవు, మతం, దేశభక్తిలపై వారు నిర్ణయించడమేంటి' అంటూ తెగనాడుతూ మళ్ళీ క్రికెట్ పై నిర్ణయాలు చెయ్యటం అదే క్రికెట్ చూడటం, ఆడటం అంటే అదేదో పాపం, దానివల్ల జనాలందరూ (చూసే జనాలని వారి ఉద్దేశం) సంకనాకిపోతున్నారంటూ నిర్ణయించేయ్యటం ఏమిటి? మొర్తజా వ్యాఖ్యలు బంగ్లాదేశ్ లో ఏమన్నా ప్రభావం చూపాయో లేదో కానీ, మన దేశపు దేశభక్తులలో మాత్రం అనగా కేవలం క్రికెట్ ను ద్వేషించే దేశభక్తులలో అగ్నిని అనగా స్ఫూర్తిని రగిలించాయి. 
            నిన్నమొన్నటివరకూ పట్టించుకోని/తెలీని ముష్రఫె మొర్తజా ఇపుడు మనోళ్ళకి ఒక విప్లవ కవితలానో, చక్కటి పుస్తకంలానో, పవిత్ర గ్రంథంలానో, ఆదర్శపురుషుడిలానో కనిపిస్తున్నాడు ... శ్రీ శ్రీ శ్రీ ఆదరణీయ, గౌరవనీయ, ఆదర్శ, మహాన్ మొర్తజా గారికి ఆట మీద గౌరవం లేకపోతే ఆడటం మానెయ్యాలి. వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చెయ్యటం వేరు, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆ ఆట స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యాఖ్యానించటం వేరు. అయినా మొర్తజా ప్రస్తావించిన ఇతరేతర రంగాలవారు కూడా డబ్బులు తీసుకునే పని చేస్తున్నారు తప్పించి దేశభక్తితో చెయ్యట్లేదు. దేశభక్తికి చేసేపనికి సంబంధం లేదు, ఉండాలన్న నిబంధన కూడా ఏమీ లేదు. ఎన్ని ఇతర జట్లకు ఆడినా, అక్కడ ఎంత డబ్బు వచ్చినా ఆట (ఏ ఆటైనా) ఆడటం మొదలెట్టిన వందమందిలో 70% మంది జాతీయ (దాదాపు అన్ని దేశాలలో) జట్టులో స్థానమే లక్ష్యంగా సాగుతారు. దేశం కోసం ఆడాలన్న కోరికే నడిపిస్తుంది. ఎదవలు ఒక్క క్రికెట్ లోనే కాదు, ప్రతి చోటా ఉంటారు. అటువంటి వారిని చూపించి, మొత్తం ఆటని/విషయాన్నీ అనటం ఎటువంటి చర్య, అది ఎంతవరకూ సబబు? చూద్దాం ... దేశభక్తి ఎందులో మాత్రమే ఉందని నిర్ణయింపబడుతుందో, అపుడు దేశభక్తిని నిరూపించుకోవటానికి ఆ అంశాన్ని ఉపయోగించుకోవచ్చు.

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన