... పయనం ఎటువైపో
వంశీ కలుగోట్ల // ... పయనం ఎటువైపో //
**************************************
'అవునవును నారాయణ, చైతన్య వంటి విద్యా కర్మాగారాలను అదుపు చేయాలి',
'విద్యావ్యవస్థలో మార్పు రావాలి', 'ప్రభుత్వాల అలసత్వాన్ని నిరసించాలి' ...
చాలా. కానీ, అది సాధ్యమా!!!? ఇటీవల పలు ప్రైవేట్ విద్యాసంస్థల్లో
చదువుతున్న విద్యార్థులలో రకరకాల కారణాల వల్ల బలవన్మరణం పొందుతున్నవారి
సంఖ్య పెరుగుతోంది. ఒక్కో బలవన్మరణానికి ఒక్కో కారణం ఉంటోంది. కొన్నింటికి
ప్రేమ, కొన్నింటికి ర్యాగింగ్, కొన్నింటికి ఒత్తిడి తట్టుకోలేకపోవడం,
కొన్నింటికి వేధింపులు భరించలేకపోవడం ... ఇలా. ఇవేమీ కొత్తగా జరుగుతున్నవీ
కావు. ర్యాగింగ్ వంటి వికృత చర్యకు బలై/గురై విపరీత మానసిక ఒత్తిడికి లోనై
డిప్రెషన్ లో ఉండి, ఇప్పటికీ ఆ ఘటనలు బాధిస్తున్న వ్యక్తి ఒకతన్ని
బంధువుల్లో చూశాను కూడా. కానీ, పరిస్థితిని మార్చడం మాత్రం జరిగేపని
కాదనిపిస్తోంది. ఎందుకు కాదనిపిస్తోందో నా అనుభవం ఒకటి వివరించి చెబుతాను.
మాది కర్నూలు జిల్లాకు దాదాపు యాభై కిలోమీటర్ల దూరంలో ఉండే గని అనే పేరు గల
గ్రామం (నా కార్యక్షేత్రం కూడానూ). గత కొద్ది సంవత్సరాలుగా మా ఊరి
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చక్కటి ఫలితాలను సాధిస్తున్నారు. ఈ సంవత్సరం
(2016 - 17 విద్యా సంవత్సరం) ప్రభుత్వ/ప్రైవేట్ పాఠశాలలన్నింటికీ కలిపి
మండల స్థాయిలో అత్యున్నత ఫలితాలు (98% ఉత్తీర్ణత) సాధించి మిగతా
అన్నిటికంటే మెరుగైన ఫలితాలు సాధించింది. పాఠశాలలో మంచి అనుభవం ఉన్న
ఉపాధ్యాయులు చక్కటి నిబద్ధతతో పని చేస్తూ, విద్యార్థులకు తగిన శిక్షణ
ఇస్తున్నారు. మా ఊరినుండి చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను మండల
కేంద్రమైన గడివేములలోని ప్రైవేట్ పాఠశాలకు పంపుతున్నారు. కొందరితో
మాట్లాడాను 'మన ఊరి ప్రభుత్వ పాఠశాల ప్రతి సంవత్సరం ఆ ప్రైవేట్ పాఠశాల కంటే
మెరుగైన ఫలితాలు సాధిస్తోంది కదా, మరి ఇంకా అక్కడికెందుకు పంపడం?' అని.
మరో విషయం ఏంటంటే నేను సేకరించిన సమాచారం మేరకు ఇంటర్/డిగ్రీ చదువుతున్న
వారిలో మా ఊరిలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు, మండల
కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలో చదివిన వారికంటే మెరుగ్గా ఉన్నారు.
తల్లిదండ్రుల సమాధానం ఒకటే 'ప్రైవేట్ బడి మేలు అయ్యా, వీళ్ళు సదువుతన్నారో
లేదో మాకు ఎరుక లేదు, ఆడ అయితే ఆళ్ళే అన్నీ సూసుకుంటారు' అని.
మా ఊరి వారి వరకూ అయితే ప్రైవేట్ బడి మేలు అన్న భావన ఉంది. బహుశా నంద్యాల,
కర్నూలు లేదా మరో పట్టణ ప్రాంతానికి వెళితే నారాయణ, చైతన్య వంటి బడా
విద్యా సంస్థలు మేలు అనే భావన ఏర్పడి ఉండవచ్చు. ఎందుకంటే వారు వారి వద్ద
చదివే వేలాది మందిలో బాగా పైకెదిగిన పదుల మంది ఫోటోలు వేసి విపరీత ప్రచారం
నిర్వహిస్తారు. ఇపుడు కొంతమంది పిల్లలు స్వీయమరణాలు పొందగానే ఆ
విద్యాసంస్థలు చెడ్డవైపోయాయా? వాటి తీరు ఎలా ఉంటుందో మనకు ఇపుడు కొత్తగా
తెలిసిందా? అంతెందుకు - తరువాతి విద్యా సంవత్సరం ఆ విద్యా సంస్థల్లో
చేరికలు ఏమన్నా తగ్గుతాయా!? అవేవీ జరగవు, జరిగే అవకాశాలూ లేవు. అసలు ఈ
విద్యాసంస్థలే కాదు, ఇంట్లో వారైనా పిల్లలకు పోరాడే తత్వాన్ని
నేర్పగలుగుతున్నారా అని అనుమానం. బానిసత్వాన్ని నరనరాన నింపుతూ ఇటు ఇంట్లో,
అటు విద్యా సంస్థల్లో యంత్రాలుగా తయారు చేసే పనిలో ఉన్నారు తప్పించి వారి
మనస్తత్వాలను అర్థం చేసుకునే ప్రయత్నం లేశమాత్రం చెయ్యట్లేదు.
ఇలా రెండువైపులా జరిగే నిర్బంధపు ఒత్తిడిని తట్టుకోలేని నిర్బలమనస్కులు
ఎవరైనా బలవన్మరణానికి పాల్పడినప్పుడు నారాయణ, చైతన్యలను (అటువంటి
విద్యాసంస్థలను) తిట్టుకోవడం, ప్రస్తుత విద్యా విధానాన్ని తిట్టుకోవడం
తప్పించి ఏమీ జరగట్లేదు. ఇక జీవితంలో ఎదుగుదల అనేది ప్రైవేట్ చదువులతోనే
అని ఇంకా భావిస్తున్న వారు గుర్తించడానికి ఇష్టపడని విషయం ఏమిటంటే, ఇవ్వాళ
వారు వారి పిల్లలకు ఉదాహరణగా లేదా ఆదర్శంగా చూపుతున్న అనేకమంది గొప్పవారిలో
90% మందికి పైగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించినవారే. వారి
నిబద్ధతను, వారు ఎదిగిన తీరును, సమస్యలకు ఎదురొడ్డి నిలిచిన ధైర్యాన్ని -
ఇటువంటి వాటిని ఆదర్శంగా చూపరు. వారికి ఆదర్శంగా లేదా అందంగా కనిపించేది,
పిల్లలకు చెప్పేది కేవలం ఆ గొప్పవారు చివరాఖరుకు చేరిన 'స్థాయి'ని మాత్రమే.
మార్గాన్ని వదిలేసి, గమ్యాన్ని మాత్రమే చూసే వారికి ఇపుడు జరుగుతున్న ఘటనల
వెనుక కేవలం విద్యాసంస్థల తప్పు, విద్యావ్యవస్థ లోపభూయిష్టత మాత్రమే
కనబడతాయి గురువిందగింజలాగా. ప్రైవేట్ పాఠశాలల్లో చదువు మాన్పించి ప్రభుత్వ
పాఠశాలల్లో చదివితే చాలు అని నేను చెబుతున్నానని అనుకుంటే 'థూ ... దీనమ్మ
జీవితం' అనుకోవడం తప్పించి చేసేదేమీ లేదు.
ఎటువైపీ పయనం అంటూ వగచడం వృధా. ఇంటికొచ్చిన బంధువులకు మన పిల్లలు నారాయణ,
చైతన్య లాంటి 'పెద్ద' కర్మాగారాల్లో తయారు చేయబడుతున్నారు అని
చెప్పుకోవడాన్ని గొప్పగా భావించే భావజాలం పోనంతవరకూ ప్రాణాలు పోతూనే ఉంటాయి
తప్పించి పరిస్థితుల్లో మార్పేమీ రాదు, పిల్లల తల్లిదండ్రులు మారనివ్వరు
కూడా.
Comments
Post a Comment