... ఖండిస్తా ఉన్నాం అధ్యక్ష్యా
వంశీ కలుగోట్ల // ... ఖండిస్తా ఉన్నాం అధ్యక్ష్యా //
*****************************************
->
ఒక సినిమా నటుడు అరవై, డెబ్బై ఏళ్ళు వచ్చినా లేదంటే చచ్చేవరకూ నటిస్తూనే
ఉండాలని అనుకుంటాడు. వందిమాగధ గణం, అభిమాన జన సందోహం ఈలలు వేస్తూ, కేకలు
పెడుతూ, కాగితాలు చించి విసిరేస్తూ సంతోషపడుతూనే ఉంటారు. అతగాడు హీరోగానో
కాకపొతే కీలక పాత్రలు పోషిస్తూనో నటిస్తూనే ఉంటాడు చచ్చేవరకూ ...
->
ఒక క్రీడాకారుడు సత్తువ ఉన్నతవరకూ ఆడాలనే అనుకుంటాడు, ఎదుటోడి బలం
పెరిగిందని అనుకుంటాడే కానీ తన సత్తువ తగ్గిందని అనుకోడు. మైదానం వదలాల్సి
వచ్చినా శిక్షకుడిగానో, వ్యాఖ్యాతగానో ఉండాలనుకుంటాడే కానీ వీక్షకుడిగా
మిగిలిపోవాలనుకోడు. ఊపిరున్నంతవరకూ ఆటతో బంధాన్ని తెంచుకోవాలనుకోడు....
->
ఒక రచయిత/కవి కళ్ళు కనబడి, చేయి పనిచేసినంత కాలం రాస్తూనే ఉండాలనుకంటాడు.
పాఠకుడి మేధస్సు పెరగాలనుకుంటాడు కానీ, తన రాతలు అర్థమయ్యేలా లేవని,
కాలానికి తగ్గట్టు తానూ మారలేదని ఒప్పుకోడు. పోయేవరకూ ఎదో ఒకటి రాస్తూనే
ఉంటాడు ...
...
కార్మికుడు, కర్షకుడు ఇలా ఒకరనేమిటి ఎవరికెవరు వారి వారి రంగాలలో లేదా
ఇష్టం/నైపుణ్యం ఉన్న రంగాలలో అవసరం కోసమో లేక ఆసక్తివల్లన లేక మరే ఇతర
కారణాల వల్లనో సత్తువ ఉన్నంతవరకూ కొనసాగాలనే ప్రయత్నిస్తారు.
... వాళ్ళ అంకిత భావాన్ని ఆదర్శంగా తీసుకుంటాం. తెలిసిన భాషలోనో, తెలియని భాషలోనో పదాలు వెతుక్కుని మరీ పొగుడుతాం. కానీ, అదే ఒక రాజకీయాల దగ్గరకి వచ్చేసరికి ఒక నాయకుడు
ముసలోడైనా రాజకీయాల్లో ఉంటే 'ఇంకా ఆశ చావలేదు వీడికి, సిగ్గులేదు ఇంత
వయసొచ్చినా అధికారం కోసం పాకులాడుతూనే ఉన్నాడు. సంపాదించుకున్నది
చాల్లేదా?' ... ... ... ఇంకా ఇంకా ఇంకా వెతుక్కుని మరీ తిడతాం. ఇంట్లో
ఒళ్ళు బలిసి కూచున్న మనం, వయసైపోయిన నాన్నను కూరగాయలు తెమ్మని పంపినప్పుడు
మనకీ వయసు గుర్తు రాదు; ఓ అరవై, డెబ్బై ఏళ్ళ అత్తనో, అమ్మనో ఇంట్లో
ఉన్నపుడు 'పనిమనిషి ఎందుకులే, డబ్బులు దండగ' అని
అనుకున్నపుడు మనకీ వయసు గుర్తురాదు; మనకు సంబంధించిన విషయాలలో గుర్తురాని
వయసు అక్కడ గుర్తు వస్తుంది. ఏమన్నా అంటే ఇంకో పెద్ద కారణం తయారుగా ఉంటుంది
'దేశాన్ని నడిపించే నాయకుడు ఎలా ఉండాలి' అని? మనదాకా వస్తే మాత్రం రోడ్డు మీద వెళుతున్న అందమైన అమ్మాయిని చూసినపుడు 'వయసు శరీరానికే మనసుకు కాదు' అని సర్ది చెప్పుకునే గొప్పోళ్ళం కదా ఆ మాత్రం రీజనింగ్ ఉండాలిలే. ఒక
ఇతర రంగాలలోనైతే అంకితభావం అయినది రాజకీయాలలో మాత్రం ఆశ అయిందా? ఇదేం
న్యాయం అని ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష్యా, దీనిని తీవ్రంగా ఖండిస్తా
ఉన్నాం అని తెలియజేసుకుంటున్నా అధ్యక్ష్యా.
---
వయసు మీదపడినా, శక్తి తగ్గినా ఆశ చావకపోవడం అన్నది ఒక్క రాజకీయ రంగానికే
పరిమితం కాదు అని వెటకారంగా చెప్పడం మాత్రమే నా ఉద్దేశం తప్పించి,
రాజకీయాలలో ముసలాళ్ళను ప్రోత్సహించడం కాదని మేధావులు గమనించగలరు; అర్థం
కాని యెడల నా మానాన నన్నిలా వదిలెయ్యగలరు అని మనవి.
Comments
Post a Comment