జై లవకుశ - దర్శకుడి/కథకుడి వైఫల్యం

జై లవకుశ - దర్శకుడి/కథకుడి వైఫల్యం
*********************************
           జై లవకుశ చిత్రంలో చూపిన నీతి ఏంటంటే, కొన్ని అవలక్షణాలో లేక వైకల్యాలో ఉన్నాయని పిల్లలలో ఒకరిని సరిగా చూసుకోకపోతేనో/గుర్తించకపోతేనో ఎటువంటి అనర్థాలు జరిగే అవకాశం ఉంది అని. సరిగ్గా సినెమా తీతలో అదే జరిగింది. సినిమా కథలో ఒక పాత్రను మాత్రమే ప్రేమించి, దాని మీదే దృష్టి పెట్టి, దాని చుట్టూతానే కథ అనే వస్తువును అల్లుకుంటే ఎలా తయారవుతుంది అని చూపటానికి జై లవకుశ ఒక ఉదాహరణ. ఇక ఇపుడు మిగతా అంశాల విషయానికి వద్దాం. ఈ కాలపు కథానాయకులలో నటనా సామర్థ్యం పరంగా ఉన్నత స్థాయిలో చెప్పుకోదగ్గ వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు, అందులో అనుమానం లేదు. కానీ, తన సామర్త్యానికి తగ్గట్టుగా కాక, కమర్షియల్ చట్రంలో ఇమిడే కథలు ఎన్నుకుంటూ వస్తోన్న ఎన్టీఆర్ జూనియర్ కొద్ది కాలంగా కాస్త కథ మీద కూడా దృష్టి పెట్టినట్టే ఉంది. మరీ ప్రయోగాత్మకాలు కాకపోయినా పర్లేదు అనే తరహా చిత్రాలు చెయ్యటానికి ముందుకు వస్తున్నాడు. అందులో భాగంగానే జై లవకుశ చిత్రం ఒప్పుకున్నాడు.
           జై లవకుశ కథ విషయానికి వస్తే అందులో ప్రధానాంశం ముందుగానే చెప్పుకున్నాం. నత్తి ఉందన్న కారణంగా ముగ్గురు పిల్లల్లో ఒకడైన జై నిర్లక్ష్యానికి గురవుతాడు. అది జైలో కసిని పెంచి, చివరకు తన తమ్ముళ్ళను చంపెయ్యాలనుకునేదాకా (చిన్నతనంలోనే) వెళ్తుంది. కానీ, ఆ ప్రమాదం నుండి అందరూ బయటపడి, పెద్దయ్యాక అనుకోకుండా కలిసి ఆ తరువాత ఎలా కలిసిపోతారు అన్నది కథ. ఇందులో బలమైన సన్నివేశాలు సృష్టించుకునే అవకాశం ఉన్న కథే అయినప్పటికీ, బాబీలోని కథకుడు ఆ దిశగా ఆలోచించినట్టు లేదు. పేలవమైన సన్నివేశాలు సాగదీస్తూ ఇబ్బంది పెడతాయి. కథ గురించి కొత్తగా చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. కానీ, కథనంలో వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతూనే ఉంటుంది అడుగడుగునా. కథకుడిగా, దర్శకుడిగా బాబీ లొసుగులు మూడవ సినిమాలో కూడా కనబడుతున్నాయంటే అది బాబీ తప్పే. బాబీ తరువాతి సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి ముందు కాస్త ఈ విషయాలపై దృష్టి పెడితే మేలేమో. కేవలం ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్, ఎన్టీఆర్ మూడు పాత్రల పోషణ, జై పాత్ర అన్నవి మాత్రమే ఈ సినిమాకు ఉన్న ఆకర్షణలు - వచ్చిన వసూళ్ళు కూడా వాటి వల్లనే.
           పాత్రధారుల విషయానికి వస్తే మూడు పాత్రలు పోషించిన ఎన్టీఆర్ అత్యద్భుతం అనేలా కాకపోయినా, మూడు పాత్రలను చక్కగా పోషించాడు. లవ, కుశ పాత్రలు గతంలో పోషించిన తరహాలోనే (ముఖ్యంగా అదుర్స్, బృందావనం) అనిపిస్తాయి. ప్రధాన ఆకర్షణగా నిలిచిన జై పాత్ర ఎన్టీఆర్ కు విభిన్నమైనది. ఈ పాత్రను కేవలం నెగటివ్ కోణంలో మాత్రమే చూపించాలని అనుకోవడం వల్లనో లేక వేరే కారణాల వల్లనో కానీ పాత్రలోని సంఘర్షణ సరిగా ఎలేవేట్ కాలేదు. ఆ సంఘర్షణ సంభాషణల్లో ఎలేవేట్ అయినంతగా సన్నివేశాల్లో కనబడలేదు. జై పాత్ర పగ/ప్రేమ అన్నవి సరిగా తీర్చిదిద్దలేదు. ఇక నివేద థామస్ పాత్ర పట్ల ప్రేమ కలగటం అన్నది కూడా సంభాషణల్లో చూపించారు తప్పించి మనకు/చూసేవారికి ఎక్కడా అనిపించదు. సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచినప్పటికీ, ఎన్టీఆర్ కెరీర్ లో ఉన్నత స్థాయిలో నిలిచే పాత్రగా అవకాశం ఉన్న జైని బాబీ ఆ స్థాయిలో మలచడంలో విఫలమయ్యాడు. లవ, కుశ పాత్రల కంటే జై పాత్ర డాన్ గా ఎదుగుగల అన్నదాన్ని చూపించి ఉంటే ఆ పాత్ర సంఘర్షణ చూపటానికి మంచి అవకాశం మాత్రమే కాక, వాణిజ్యపరంగా కూడా ప్లస్ అయ్యేది. కుశ పాత్ర పండించే కామెడీ కాస్త మేలనిపిస్తుంది. మిగతా పాత్రలను కనీసం చెప్పుకోవడానికి కూడా పెద్దగా లేని తరహాలో తీర్చి దిద్ది కథకుడిగా బాబీ విఫలమయ్యాడు అనిపిస్తుంది. హీరోయిన్స్ లో అంతో ఇంతో చెప్పుకోదగ్గ పాత్ర రాశి ఖన్నాకు దక్కింది. ఉన్నంతలో పర్లేదు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న ప్రియదర్శి లాంటి కమెడియన్ ను కూడా సరిగా వాడుకోలేదు. ఎవరికీ చెప్పుకోదగ్గ పాత్రలు లేవు, కాబట్టి చెప్పుకోవాల్సిన అవసరమూ లేదు.
           ఇక సాంకేతిక విభాగాల పరంగా చెప్పుకోవాలంటే ముందుగా సంగీతం. దేవిశ్రీ ప్రసాద్ తన స్థాయికి తగ్గ సంగీతం ఇవ్వలేకపోయినా, పర్వాలేదనిపించారు. జై (రావణ్) పాత్ర ఎలేవేషన్ కు దేవిశ్రీ సంగీతమే వెన్నెముకగా నిలిచింది. పాటలు పర్వాలేదు. మిగతా సన్నివేశాల్లో నేపథ్య సంగీతం సన్నివేశాలు దెబ్బ తినకుండా ఇచ్చాడు కానీ ఎలేవేట్ అయ్యేలా అయితే లేదు. కెమెరా వర్క్ కూడా పర్వాలేదు. రెండు/మూడు పాత్రలు ఒకేసారి కనబడ్డప్పుడు కొన్నిసార్లు కెమెరా వర్క్ తడబడినట్టు అనిపిస్తుంది. ఎడిటింగ్ లో కాస్త దృష్టి పెట్టి ఉండాల్సింది. మిగతా విభాగాల పనితీరు కూడా ఓకే. నటులతో సహా అన్ని విభాగాలకు సమర్థులైన వారిని ఎన్నుకోవడంలోనూ, రాజీ పడకుండా అవసరమైన ఖర్చు పెట్టటంలోనూ నిర్మాత కళ్యాణ్ రామ్ అండగా నిలబడ్డప్పటికీ దర్శకుడిగా/కథకుడిగా బాబీ విఫలమయ్యాడు. ఇదే కథను మరెవరైనా సమర్ధుడైన దర్శకుడి చేతిలో పెట్టి ఉంటే; అదే విధంగా జై పాత్రచిత్రణపై మరింత దృష్టి పెట్టి ఉంటే సినిమా నిజంగానే అద్భుతంతా తయారయ్యేది. అలాగని ఇపుడు చెత్తగా లేదు, కానీ చాలా సన్నివేశాలలో విసిగిస్తుంది. ఎన్టీఆర్, దేవిశ్రీ (పర్వాలేదనిపించినా కూడా) నిలబెట్టారు తప్పించి చెప్పుకోవడానికేమీ లేని విధంగా తయారయింది అంటే అది బాబీ వైఫల్యమే. తరువాతి సినెమాలకైనా తగిన గౌండ్ వర్క్ మరియు హోమ్ వర్క్ చేసి సెట్స్ పైకి వెళితే మేలు.

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన