'సీక్రెట్ సూపర్ స్టార్' ఒక అద్భుతం
వంశీ కలుగోట్ల // 'సీక్రెట్ సూపర్ స్టార్' ఒక అద్భుతం //
****************************** *****************
కొన్నిసార్లు ఏదైనా 'ఎలా ఉంది' అని అడిగితే చెప్పటం చాలా కష్టం; ఎందుకంటే
కొన్ని అద్భుతాలను, అనుభవాలను మాటల్లో వర్ణించడం వీలుకాదు, ఎవరికీ వారు
స్వయంగా అనుభూతి చెందాల్సిందే. మన అదృష్టం కొద్దీ అప్పుడప్పుడూ అలాంటివి
అనుభూతి చెందే అవకాశం లభిస్తుంటుంది. మన భారతీయ సినిమా రంగం అటువంటి
అద్భుతాలను సృష్టించడం మానేసి దశాబ్దాలు అయినట్టుంది. ఎప్పుడో అప్పుడప్పుడు
కొన్ని చమక్కులు తప్పించి. చక్కటి కథ అన్నా, అద్భుతం తినాలన్నా, హాలీవుడ్
స్థాయి అన్నా ఇపుడు అంతా గ్రాఫిక్స్ మాయాజాలం మాత్రమే అనే భ్రమలో
కొట్టుకుపోతున్నారు 99% మంది. ఆ మిగిలిన 1% లో అధికులు అత్యంత
ప్రతిభావంతులైన అనామకులు అనగా అంతగా పేరు, ప్రఖ్యాతులు లేనివారుగా ఉండటంతో
వారి ప్రయత్నాలు కూడా ప్రాచుర్యం పొందవు, అటువంటి సినిమాలు వెలుగు చూడవేమో.
కానీ, ఆ 1% లో కొద్దిమంది స్టార్స్ కూడా ఉంటారు అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్
లాంటివాళ్ళు. ఎవరో వేరే వారు డబ్బు పెడుతున్నప్పుడు కూడా ప్రయోగాత్మక
చిత్రాల్లో (కథ మీదే ఆధారపడి రూపొందించబడే చిత్రాలంటే ప్రయోగాత్మకమే అనే
దౌర్భాగ్య మానసికస్థితిలో ఉన్నారు మరి) నటించడానికి వెనుకాడే
స్టార్స్/నటులు ఉన్న ఈ జమానాలో తానే నిర్మాతగా తారే జమీన్ పర్, సీక్రెట్
సూపర్ స్టార్ వంటి చక్కటి, చిక్కటి కథ ఉన్న చిత్రాలను ఎటువంటి వ్యాపార
గిమ్మిక్కులూ లేకుండా తెరకెక్కించడానికి ముందుకు రావడం నిజంగా చాలా గొప్ప.
సీక్రెట్ సూపర్ స్టార్ చిత్రం గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా అభిరుచి,
ధైర్యం, కౌశలం వంటివి మెండుగా ఉన్న అమీర్ ఖాన్ కు జోహార్లు చెప్పుకోవాలి. ఆ
తరువాతే వేరే ఏదైనా.
సీక్రెట్ సూపర్ స్టార్ - ఇది ఇద్దరు మహిళల పోరు చిత్రణ. కుటుంబ వ్యవస్థలో
వేళ్ళూనుకుపోయిన పితృస్వామ్య (పురుష) భావజాలాన్ని ఎదుర్కొని పోరాడే క్రమంలో
అనుబంధాల ఉచ్చుకు, కోరుకున్నది సాధించాలనే తపనకు మధ్య వారు పడిన వేదనను
తెరకెక్కించిన తీరు అద్భుతం.
భావోద్వేగాలను కూడా సినిమాటిక్ గా కాకుండా, కుటుంబంలో వ్యక్తుల మధ్య ఆ
సంఘర్షణ ఎలా ఉంటుందో అలానే చూపారు. ముఖ్యంగా మెహెర్ (తల్లి పాత్రధారిణి),
జైరా వసీం (ప్రధాన పాత్ర) లు ఇద్దరి గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఆ
ఇద్దరూ అద్భుతం అంతే. అమీర్ ఖాన్ లాంటి నటుడు కూడా వారి ముందు తేలిపోయాడు
అంటే ఇక అంతకంటే మించి చెప్పాల్సింది ఏముంది! కథగా చెప్పడానికి ఇది కథ
కాదు, మనలో చాలామందిమి ఇటువంటి సంఘర్షణను అనుభవించే ఉంటాము. అందుకే తెర మీద
జైరా వసీం పాత్రలో మనల్ని మనం చూసుకుంటాం. మరొకగొప్ప విషయం ఏంటంటే ప్రేమ
అనగానే దాన్ని కామంగా , పచ్చిగా, విశృంఖలత్వాన్ని చూపుతున్న ఈ
సినీతరంలో ఇన్సియా, చింతన్ పాత్రల మధ్య అమలిన స్నేహపూర్వక ప్రేమను
తెరకెక్కించిన విధానానికి దర్శకుడికి; అక్కడ వ్యాపారసూత్రాల పరంగా అక్కడ
'ఎంతో' జొప్పించే అవకాశం ఉన్నప్పటికీ అలా చేయనందుకు నిర్మాతకు వేనవేల
జోహార్లు.
సీక్రెట్ సూపర్ స్టార్ చిత్రం కథ గురించి, ఇందులో పాత్రలు పోషించిన వారి
గురించి చెప్పాలంటే ఇలా ప్రతి అంశాన్ని, ప్రతి ఒక్కరు పాత్రలో జీవించిన
తీరును ప్రశంసిస్తూ ఒక పుస్తకం రాయాలేమో! ఇలాంటి అద్భుతాలు అప్పుడప్పుడూ వస్తుంటాయి. నా వరకూ చెప్పాలంటే 2000 సంవత్సరం తరువాత వచ్చిన చిత్రాలలో ఇలా ప్రతి చిన్న అంశం నచ్చిన చిత్రాలు మున్నాభాయ్ సిరీస్, లగాన్, తారే జమీన్ పర్, సర్కార్ (మొదటిది), సీక్రెట్ సూపర్ స్టార్ (నేను చెప్పింది నా గురించి మాత్రమే, ఇతరులకు
చాలా ఉండొచ్చు). ఈ చిత్రంలో ప్రతి సన్నివేశాన్ని ప్రాణం పెట్టి తీశారు
అనేకంటే ప్రతి సన్నివేశానికి తమ నిబద్ధతతో ప్రాణం పోశారు అని చెప్పవచ్చేమో.
అతి తక్కువ చిత్రాల అనుభవం వున్న జైరా వసీం నటన అద్భుతం - సున్నితమైన
భావోద్వేగాలను ఎంతో అనుభవం ఉన్న వారికంటే గొప్పగా, హత్తుకునేలా పోషించింది.
ఇక ఈ చిత్రానికి అసలు సిసలు మూలం తల్లి పాత్ర. ఆ పాత్ర పోషించిన మెహర్
గురించి నటన గురించి వర్ణించడానికి పదాలు వెతుక్కోవాల్సిందే. ఆ సంఘర్షణను
ఎంత అద్భుతంగా చూపుతుందనేదానికి అప్పుడప్పుడూ చెమర్చే కళ్ళే సమాధానం
చెబుతాయి. చింతన్ పాత్ర ఆ వయసులో ఉండే సహజ ఆకర్షణకూ, అమాయకత్వానికి
ప్రతిరూపం. ఆ పాత్ర పోషించిన నటుడు కూడా ఆకట్టుకుంటాడు. ఇన్సియా పాత్రకు
స్ఫూర్తినిచ్చే పాత్రలో అమీర్ ఖాన్ ఆకట్టుకుంటాడు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది
దర్శకుడు అద్వైత్ చందన్ గురించి. కథనం రాసుకున్న తీరు, దాన్ని
తెరకెక్కించిన తీరు అతడీ కథను ఎంతగా ప్రేమించాడో తెలుపుతాయి. కథకు
కట్టుబడి, ఎటువంటి వ్యాపార గిమ్మిక్కులనూ జోడించకుండా తీయడం నిజంగా
ప్రశంసనీయం. అలాగే అమిత్ త్రివేది సంగీతం సినిమాకు ప్రాణం పోసింది.
ముఖ్యంగా పాటల విషయంలో అక్కడ ఇన్సియా పాత్ర గాత్రం ముఖ్యం కాబట్టి దానికి
తగ్గట్టుగా బాణీలు అందించాడు. నేపథ్య సంగీతం కూడా కథలో భాగమైంది. కూర్పు
(ఎడిటింగ్) కూడా సినిమా ఆకట్టుకునేలా తెరకెక్కడానికి, విజయానికి
మూలకారణమైంది. సంభాషణలు కూడా చాలా చక్కగా అమిరాయి. మచ్చుకు ఒకటి - ఒక
సన్నివేశంలో ఇన్సియా నానమ్మ పాత్ర ఒక చెప్పే మాట ఒకటి ఉంది '... ఈ
విషయాన్ని నీకు చెప్పడంలో నాకెంత ఆనందం ఉందో, నీనుండి దాచడంలో మీ అమ్మకు
అంత ఆనందం ఉందీ'. ఇలా ఒకటి అని కాకుండా ప్రతి విభాగం నుండి కథాపరంగా
ఎంతమేరకు కావాలో అంతమేరకు రాబట్టుకున్న అద్వైత్, ఇలాగే మంచి కథాబలం ఉన్న
చిత్రాలను తెరకెక్కించాలని ఆశించడం అత్యాశ కాదనే అనుకుంటున్నాను. అర్జున్
రెడ్డి చిత్రానికి చెప్పిన మాటనే మరోసారి 'ఈ సీక్రెట్ సూపర్ స్టార్ ని
సినిమాలా చూడటానికి వెళ్ళకండి, ఇది రెండు జీవితాల
పోరాటం, సంఘర్షణ'. మరోసారి ప్రస్తావించకుండా ఉండలేకపోతున్నాను - అతడి కంటే
ప్రతిభావంతులైన నటులు ఉండవచ్చు, అతడికంటే ధైర్యవంతమైన నిర్మాతలు ఉండవచ్చు,
ప్రతి విషయంలో అతడికంటే ఘనులు ఉండవచ్చు - కానీ, వారెవరూ అమీర్ ఖాన్ కారు.
ప్రతిభ, ధైర్యం, కౌశలం, నిబద్ధత, నైవుణ్యం తదితరాలు అన్నీ కలగలసిన వ్యక్తి
అమీర్ ఖాన్. పొగడ్తలను తలకెక్కించుకోకుండా ఇలానే మంచి సినిమాలకు ఊతమవ్వాలి
అతడు. అతడు నిజంగా అమీర్ ... సీక్రెట్ కసూపర్ స్టార్ తప్పకుండా చూడవలసిన
చిత్రం. ఈ చిత్రానికి రేటింగ్ ఇవ్వడం అంటే సినిమాను చిన్నబుచ్చడమే. ఇది ఒక
అద్భుతం. ఎప్పుడూ ఇలాంటివి రావు. ఇలాంటి వాటికి ప్రోత్సాహమందించాలి -
థియేటర్ లో చూసి, మంచి అభిరుచి ఉన్న ప్రేక్షకులు ఇంకా బతికే
ఉన్నారనినిరూపించుకుందాం; మంచి చిత్రాలను తీస్తే సినిమాని బతికిస్తామని
చూపుదాం.
starandhra.com/telugu లో ప్రచురితమైన నా రివ్యూ
https://www.starandhra.com/telugu/%E0%B0%B8%E0%B1%80%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B8%E0%B1%82%E0%B0%AA%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%B0%E0%B0%BF
https://www.starandhra.com/telugu/%E0%B0%B8%E0%B1%80%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B8%E0%B1%82%E0%B0%AA%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%B0%E0%B0%BF
Comments
Post a Comment