బంద్, హోదా, ప్రతిపక్షం

బంద్, హోదా, ప్రతిపక్షం
***********************
# ప్రజాస్వామ్యంలో ప్రజలు కానీ, ప్రతిపక్షాలు కానీ తమ నిరసనను తెలపటానికి బంద్, ధర్నా, రాస్తారోకో వంటివి చెయ్యటం అన్నది మామూలే. అవి హింసాత్మకంగా మారనంతవరకూ మంచిదే. ఇప్పుడు అధికారంలో ఉన్నవారు కూడా ప్రతిపక్షంలో ఉన్నపుడు రకరకాల కారణాలు చూపి లెక్కకు మిక్కిలి బంద్ లు, ధర్నాలు, రాస్తారోకోలు చేసినవారే. ఆ సమయంలో లెక్కలేనంత ప్రభుత్వ ఆస్థి నష్టం, హింస జరిగాయి కూడా. ఆ కోణంలో పోల్చి చూస్తే నిన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్త్ర బంద్ ద్వారా ప్రభుత్వం కొన్నిరంగాలలో ఒకరోజు ఆదాయం కోల్పోయిందేమో కానీ హింసాత్మక చర్యలు జరిగినట్టు కనీసం ఆ రెండు పత్రికలలో కూడా రాలేదు. (నాకు తెలిసినంతవరకూ) కానీ, అసలు బంద్ చెయ్యడం అన్నదే తప్పు అంటే అటువంటి తప్పులు గతంలో ఇప్పటి అధికార పార్టీవారు లెక్కకు మిక్కిలి చేశారు. ఒక్క విషయం ఇప్పటి ప్రతిపక్షం చేసిన బంద్ లలో హింస శాతం, ప్రభుత్వ ఆస్థుల విధ్వంసం (నిన్న ఒక్కరోజు మాత్రమే కాదు, గతంలో కూడా) గత ప్రతిపక్షంతో పోలిస్తే చాలా తక్కువ. నిన్న జరిగిన ఒక్క బంద్ ను మాత్రమే ఖండించాలి, బాధ్యతారాహిత్య చర్యగా ముద్రవేయాలి అని ప్రయత్నిస్తే అంతకంటే మూర్ఖత్వం ఉండదు.
# ప్రతిపక్షనేత నన్ను అనవసరంగా కార్నర్ చేస్తున్నారు అంటూ వాపోవడం చంద్రబాబు వంటి నాయకుడికి తగదు. ప్రతిపక్షంలో ఉన్నవారెవరైనా చేసేది అదే, గతంలో తమరు చేసింది కూడా అదే. ప్రపంచంలో ఏ మూలన మంచి జరిగినా క్రెడిట్ కొట్టేయాలనుకోవడమే కాదు వైఫల్యాలకు బాధ్యత కూడా తీసుకోవాలి, అలా తీసుకున్నవాడే నాయకడు. ఎన్నికల ప్రచారపర్వం నాటి దృశ్యాలు తెప్పించుకుని చూడండి. వాగ్దానాల లెక్క తెలుస్తుంది. అప్పుడు తమరిని తామే కార్నర్ చేసుకున్నారా లేక ఇంకొకరికి ఆ అవకాశం ఇచ్చారా అన్నది తేలుతుంది. అయినా అధికారంలో ఉండి; దార్శనికుడిగా, సమర్థుడిగా పేరుపొందిన తమరికి ఇటువంటి బేలతనం పనికిరాదు. కేంద్రంతో పోరాడాల్సింది తమరు, ప్రతిపక్షం కాదు. అలాగే, రాష్ట్రంలోని ఇతర పార్టీలను అన్నిటినీ కలుపుకుని, (ఇతర పార్టీలు అంటే కేవలం సభ్యులెవరూ లేని జనసేన పవన్ కళ్యాణ్, ఈ నిర్వాకం వెలగబెడుతున్న భాజపాకాదు) - అన్ని పక్షాలను కలుపుకుని అఖిలపక్షాన్ని తీసుకుని కేంద్రం దగ్గరకు తీసుకువెళితే మంచిది. తమరు మరిచిపోయారేమో కానీ మేమింకా మరిచిపోలేదు తెలంగాణా విషయంలో తమరు ఎన్నిసార్లు అఖిలపక్షం కోసం డిమాండ్ చేశారో. అప్పుడు న్యాయం అనిపించింది, ప్రజాస్వామ్యబద్ధం అనిపించింది ఇప్పుడు కంటికి యోచనకు రావట్లేదా లేక మరేదైనా కారణమా?
# ప్రత్యేకహోదా సంజీవని అవునో కాదో తరువాతి విషయం. ముందు కేంద్రంతో పోరాటం చెయ్యండి. ప్రత్యేక హోదా కాకపోతే మరి ఏ ఇతర సహాయం చేశారో ఒక శ్వేతపత్రం విడుదల చెయ్యండి. శ్వేతపత్రాలు తమరికి అలవాటే కదా. మోడీ గారు తానూ అండగా నిలబడతాను అని ప్రచారంలో వాగ్దానమివ్వడం, వెంకయ్య నాయుడు గారు అయిదు కాదు పది సంవత్సరాలు ప్రత్యేకహోదా కావాలి అని రాజ్యసభలో పోరాడి పేరు తెచ్చుకోవడం, నేను ప్రత్యేక హోదా సాధించి తీరతాను అని తమరు వాకృచ్చడం మాకు గుర్తున్నాయి. కానీ, అవి ఆచరణలో ఎక్కడిదాకా ఉన్నాయో శ్వేతపత్రం విడుదల చెయ్యండి. జైట్లీ గారేమో చట్టంలో ఉన్నది చేస్తాం అంటారు, తమరేమో నమ్మకం ఉంది అంటారు. రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంకెప్పుడు? ఈ గుడ్డి నమ్మకం ఇంకెంతకాలం?

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన