నేనింతేరా నాయనా ...

వంశీ కలుగోట్ల // నేనింతేరా నాయనా ... //
****************************************
 
"సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చుని మొరగదు
తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు
పర్వతం ఎవ్వడికి ఒంగి సలామ్ చెయ్యదు
నేనింకా ఒక పిడికెడు మట్టే కావచ్చు 
కాని కలమెత్తితే ఒక దేశపు జండాకున్నంత పొగరుంది."- శేషంద్ర

          ఒక రచయితగా/కవిగా లేదా రచయితను/కవిని అనుకునేవాడిగా ఇప్పటికి ఆరు వందలకు పైగా కవితలు, ముప్ఫయికి పైగా రాజకీయ వ్యంగ్య కథలు/కథానికలు; వందకు పైగా విశ్లేషణాత్మక వ్యాసాలు, ఒక బుర్రకథ, పది ప్రచురిత పుస్తకాలు (వ్యక్తిత్వ వికాసం సంబంధిత అంశాలపై), పది మాసాల పాటు 'జాగృతి' మాస పత్రికలో అసోసియేట్ సబ్ ఎడిటర్ గిరీ, ఆరు మాసాలపాటు 'శ్రీ దత్త ఉపాసన' మాస పత్రికకు సబ్ ఎడిటర్ గిరీ వెలగబెట్టటం వంటివి చేశాను. (మధ్యలో దాదాపు పన్నెండు సంవత్సరాల అస్త్రసన్యాసంతో కలుపుకుని). నేను రాసిన వాటిలో ఎక్కువగా రాజకీయ వ్యంగ్య రచనలే అయినప్పటికీ దాదాపు అన్ని అంశాలను స్పృశించాను. ప్రేమ, స్నేహం, ఆధ్యాత్మికత, అణచివేతలు, శృంగారం, రాజ్యహింస, అసహనం, నిష్క్రియాపరత్వం, బాధ్యతారాహిత్యం, సాంప్రదాయాలు, సంస్కృతి, చరిత్ర, వ్యక్తిత్వ/మానసిక వికాసం - ఇలా ఇతర అన్ని అంశాలనూ స్పృశించాను. కాకపొతే చదివినవారు తమకు నచ్చిన వారిపై విమర్శిస్తూ రాసినవాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుని నన్ను తమ వ్యతిరేక వర్గంలో కలిపితే తప్పు నాది కాదు. అధికార పక్షంలో కానీ ప్రతిపక్షంలో కానీ నెత్తికెత్తుకోవడానికి ఎవరిమీదా ప్రత్యేకమైన అభిమానం, ప్రేమ లేవు. నేను బహుశా 'నిత్య ప్రతిపక్ష వాది'ని. అధికార పక్షపు బాధ్యతా రాహిత్యాన్ని, ప్రతిపక్షపు నిష్క్రియాపరత్వాన్ని ఎత్తి చూపుతూ రాశాను. కాకపొతే ఎవడైతే బాధ్యుడో వాడినే ఎక్కువగా ప్రశ్నించాలి/విమర్శించాలి, 'పళ్ళున్న చెట్టుకే రాళ్ళెక్కువ పడతాయి' అని కదా నానుడి. అందునా బాధ్యతాయుతంగా వుండాల్సినవాడు వెర్రెత్తినట్టు ప్రవర్తిస్తుంటే విమర్శించక నెత్తినెత్తుకుని ఊరేగించాలా? ఆల్రెడీ నన్ను ప్రతిపక్షం గాటన కట్టేశారు ... తరువాత కూడా ఎలాగూ నాది అదే పక్షమే కాబట్టి అప్పుడేమైనా నా పలుకులు వారికి సంతోషాన్ని కలిగిస్తాయేమో చూద్దాం. ఇప్పటికైతే నేనింతే ... నచ్చకపోతే నా రాతలు చదవడం మానెయ్యండి. లేదా నా రచనల క్రింద సభ్యతాయుత, ఆధారపూరిత, వివరణాత్మక వ్యాఖ్యలు టపా చెయ్యండి ...అదీ వీలు కాదనుకుంటే చదవటం మానెయ్యండి లేదా మీ స్నేహితుల సంఖ్య తగ్గించుకోగలిగే అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎవరినో మెప్పించటానికి రాయట్లేదు ... నాకు తెలిసిన సమాచారాన్ని విశ్లేషించుకుని రాస్తున్నాను. నెత్తికెత్తుకుని మోసేంతటి ప్రేమ కానీ, కింద కూలదోయాలనేంత ద్వేషం కానీ వ్యక్తిగతంగా ఎవరిపైనా లేవు. నా వ్యతిరేకత అంతా సిద్ధాంతపరమైన, అభిప్రాయపరమైన వ్యతిరేకతే తప్ప కులపూరితం, మతపూరితం కాదు. ఇదంతా ఇప్పుడు అవసరమా అంటే ... ఏమో, మిగతా రాతల్లాగే ఇదీ ఒకటి అంతే. ఇంతకీ సారాంశం ఏంటంటే నేనింతేరా నాయనా ... (ఏం హీక్కుంటావో హీక్కో)
          చివరగా మరో విషయం - "నాకు ఎఫ్బి అకౌంట్ ఉంటే, నీక్కూడా ఎఫ్బిఅకౌంట్ ఉంది. నాకు నా ఎఫ్బిఅకౌంట్ లో గోడ ఉన్నట్టే నీకూ నీ ఎఫ్బిఅకౌంట్ లో గోడ ఉంది. నువ్వు కూడా నీకు నచ్చిన రంగు నీ గోడకు వేసుకోవచ్చు నిజాలతోనో, అబద్దాలతోనో, అభిప్రాయాలతోనో. అంతే కానీ, నా గోడరంగు మీద రెట్ట వేస్తానంటే ఊరుకోను."

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన