ఇంతకీ నేను సెప్పోచ్చేదేమిటంటే ... 'అ ఆ' సినిమా గురించి

వంశీ కలుగోట్ల// ఇంతకీ నేను సెప్పోచ్చేదేమిటంటే ... 'అ ఆ' సినిమా గురించి //
*****************************************************************************************
       విడుదలై, విజయదుందుభి మోగిస్తున్న 'అ ఆ' సినిమాను ఇన్నాళ్ళకి చూడటం తటస్థించింది. సినిమా ఎలా వుంది అనేది ఇప్పటికే తీర్మానించేసి, ఇతర వేరే చూడదగ్గ సినేమాలేమీ కూడా లేకపోవడంతో ప్రేక్షకులు తమ అభిమానధన వర్షాన్ని 'అ ఆ' పై కురిపిస్తున్నారు. తనకు అడ్డు చెప్పే గొప్ప తారలు లేకపోవడం త్రివిక్రమ్ కి బాగా కలిసివచ్చింది. ఇక నా తరహా పోస్ట్ మార్టం చేసుకుందాం :) 

కథ: ఇప్పటికే విశ్లేషకులు, వంకలు వెతికేవారు, గతం గుర్తున్నవారు అందరూ కలిసి త్రివిక్రమ్ యధ్ధనపూడి గారి 'మీనా' నవలను, అదే పేరుతో తెరకెక్కిన సినిమాను ఫ్రీమేక్ చెసేశాడని తీర్మానించారు కాబట్టి ఆ విషయం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కానీ, ప్రస్తుతం నడుస్తున్న ఫార్ములా తరహా కుటుంబకథా చిత్రాల మధ్య ఈ సినిమా తన ప్రత్యేకతను నిలుపుకుంది. పరిస్థితులనే ప్రతినాయకులుగా మలచటంలో (సినిమాలలో) ఈతరం దర్శకులలో త్రివిక్రమ్ ను మించినవారు లేరు అని నా అభిప్రాయం. అది ఈ చిత్రం మరింత బలపరిచింది. ప్రతి ఒక్క పాత్రలో రెండు రకాల ప్రవర్తనలు (మంచి & చెడు) చూపటం చాలా బావుంది. కానీ, అనసూయ పాత్ర చిత్రణ పట్ల మరింత జాగరూకత వహించాల్సింది. చాలాసార్లు పాత్రలో అంటే అదే పాత్ర చిత్రణలో స్పష్టత లోపించినట్టు అనిపించింది. మీనా నవల చదివిన, ఆ సినిమా చూసిన వారికి ఆ విషయం అర్థం కావచ్చేమో. మిగతా అంతా ఓకే. 

దర్సకత్వం: త్రివిక్రమ్ లో దర్శకుడిగా పేరు పెట్టాల్సినదేమీ లేకపోయినా గత సినిమాల విషయంలో చాలామంది చేసే ఆరోపణ 'త్రివిక్రమ్ లోని రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు' అని. నాకు తెలిసి ఈ సినిమాలో త్రివిక్రమ్ లోని దర్శకుడు అది జారకుండా చూసుకున్నట్టు ఉంది. రచయితకంటే దర్శకుడే ఎక్కువగా కనిపించాడు. రచయితగా కూడా అప్పుడప్పుడూ మెరిసినా కూడా దర్శకుడే ఎక్కువగా కనిపించాడు. ముఖ్యంగా సున్నితమైన భావోద్వేగాలను తెరకెక్కించే సమయంలో అటు రచయితగా పదునైన, సునిశితమైన, చిన్న చిన్న మాటలతో అటు రచయితగా; తెరకెక్కించిన విధానంతో దర్శకుడిగా ఆకట్టుకుంటాడు. 

నితిన్: ఈ మధ్య నితిన్ సినిమా సినిమాకు పరిణితి కనబరుస్తూ అటు నటుడిగా ఇటు స్టార్ గా ఎదుగుతున్నాడు. ఈ సినిమాలో మరింత పరిణితి కనబరచాడు. ముఖ్యంగా నదియాతో ఉన్న సన్నివేశాలలో తాను నటుడిగా ఎంత ఎదిగాడో అర్థమవుతుంది. సంభాషణలు పలకడంలో తనకున్న సహజ బలహీనతను (వేగంగా మాట్లాడటం) కూడా చాలావరకు అధిగామించాడని చెప్పవచ్చు ఈ సినిమా వరకు. 

సమంత: 'ఏం మాయ చేశావే' సినిమా తరువాత అంత ప్రాధాన్యత ఉన్న పాత్ర బహుశా సమంతకు ఇదేనేమో. కానీ, ఆ సినిమాలో చేసినంత సమర్థవంతంగా ఈ సినిమాలో చెయ్యలేకపోయింది. ముఖ్యంగా కల్వపూడి ఊరిలో ఉన్నప్పటి సన్నివేశాలలో తన నటన పండలేదు. పాత్ర తీరు అర్థం కాలేదో లేక పాత్రనే అర్థం కాలేదో కానీ సరిగ్గా చెప్పలేకపోయింది. అలాగే, ఇరువురి పాత్రల మధ్య మొదటిసారి ప్రేమ బయటపడే సన్నివేశంలో నితిన్ నటన ముందు సమంత నటన తేలిపోయింది. అందరూ ఇది 'సమంత సినిమా' అని ప్రమోట్ చేసిన తీరులో తన నటన లేదు. 

నదియా: ఒక రకంగా సినిమాకు విలన్ లాంటి పాత్ర. పరవాలేదు బానే చేసింది. కానీ, అన్నీ ఇలాంటి పాత్రలే చేసూ పొతే అత్ త్వరలోనే మొహం మొత్తవచ్చు. అసలే మన జనాలకు కొత్త ముఖాలపై ఆసక్తి ఎక్కువ. 

మిగతావారందరూ సందర్భానుసారం వచ్చి, తమవంతు పాత్రను వేలు పెట్టాల్సిన పనిలేకుండా చేసుకుపోయారు. 

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే 

సంగీతం: మిక్కీ జె మేయర్ మరోసారి పాటల పరంగా మరిచిపోదగ్గ ఆల్బం ఇది. బాలేని మిగతా వాటితో పోల్చుకుని ఒకటో రెండో బావున్నాయనుకోవచ్చు. బిసిజి పరవాలేదు కానీ ఇంకా బాగా పండాల్సింది. మిక్కీ జె మేయర్ కాస్త విరామం తీసుకుంటే మేలేమో. 

కెమెరా: నటరాజన్ సుబ్రమణియన్ కెమెరా పనితనం చాలా బావుంది. పల్లె అందాలను, పట్నపు సొగసులను రెండింటినీ చక్కగా చూపించాడు. 

మిగతావన్నీ సరైన మొతాదులోనే వడ్డించారు. 

సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది. సమంత పట్నంలోని తమ ఇంట్లో, పల్లెలోని నితిన్ ఇంట్లో షాంపూ బాటిల్ ఉండే పద్ధతిని పోల్చుకునే సన్నివేశం. సినిమా మొత్తానికి అద్భుతః అనిపించింది నాకైతే. బొమ్మరిల్లు సినిమాలో సిద్దార్థ్ పాత్రలోని సంఘర్షణ మొత్తాన్ని ఈ సినిమాలో ఆ ఒక్క సన్నివేశంలో చూపించారు. 

నిర్మాణ విలువలు చాలా బావున్నాయి. విడుదలకు ముందు ఈ సినిమా కేవలం సమంతా పాత్ర చుట్టూనే తిరుగుతుంది, మిగతా పాత్రలన్నీ సమంతా పాత్రకి కేవలం సపోర్ట్ మాత్రమే అనే తరహాలో చెప్పారు. బహుశా పేపర్ మీద రాసుకున్నప్పుడు అలానే అనిపించిందేమో కానీ సినిమా విషయానికి వస్తే నాకైతే అలా అనిపించలేదు. కానీ, 'మీనా' నవల (నేను చదివిన అతికొద్ది యద్దనపూడి నవలలో అది ఒకటి. నాకంతా మధుబాబు, పానుగంటి, యండమూరి, కొమ్మనాపల్లి తదితరుల రచనలంటేనే ఎక్కువ ఆసక్తి - మరీ ముఖ్యంగా అపరాధ పరిశోధన నవలలు) గుర్తుకు వస్తూనే ఉంది. కానీ, అందులో ఉన్నంతటి బలమైన పాత్రలు ఇందులో నాకైతే కనిపించలేదు. ముఖ్యంగా మీనా పాత్రలో ఆ ఆ అదే అనసూయ రామలింగం పాత్రలో అని నా ఉద్దేశం. కానీ, విసుగనిపించకుండా మలచటంలో మాత్రం విజయం సాధించారు. ముఖ్యంగా ప్రథమార్థంలో కాస్త సాగదీసినట్టు అనిపించింది. గొప్పగా లేదు, 'మీనా' నవల/సినిమా స్థాయికి ఇంచుమించు దగ్గరగా వచ్చారు. కానీ, ఒక మంచి ప్రయత్నం. పాత్రలు ప్రధానంగా నడిచే ఇలాంటి కథలు రావాలి అవి సినిమాలుగా తియ్యాలి. అలాంటివి చెయ్యటానికి కనీసం 'అ ఆ' సినేమాతోనైనా అ ఆ లు దిద్దటం మొదలెట్టారేమోలే. 

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన