ప్రాంతాలూ ... సాంప్రదాయాలూ
ప్రాంతాలూ ... సాంప్రదాయాలూ
********************************
ఇంగ్లీష్ వాడు హెల్లో అంటాడు
స్పానిష్ వాడు ఓలా/హొలా అంటాడు
తమిళుడు వణక్కం అంటాడు
కన్నడిగుడు నమస్కారవరె అంటాడు
తెలుగువాడు నమస్కారం అంటాడు
సాంప్రదాయం అంటే ఎదుటివారిని ఎలా గౌరవించాలో నేర్పించేది. అంతే కానీ,
ఎదుటివాడిని ఎలా తిట్టాలో నేర్పించేది కాదు. మర్యాదపూర్వకంగా ఎలా ఉండాలో
చెప్పేదే కానీ అమర్యాదపూర్వకంగా ఉండమని చెప్పేది సాంప్రదాయం కాదు. మనకు
నచ్చినా, నచ్చకపోయినా కొన్ని ప్రాంతాల్లో సాంప్రదాయాలు వేరేలా ఉంటాయి.
ఉదాహరణకు కొన్ని దేశాల్లో ముక్కూ, ముక్కూ రాసుకుంటారు; కొన్ని దేశాల్లో
ఆలింగనం చేసుకున్తారు; కొన్ని ప్రాంతాల్లో కరచాలనం చేసుకుంటారు; కొన్ని
ప్రాంతాల్లో చెంప/బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటారు. మన సాంప్రదాయం అలా
చెప్పలేదు కాబట్టి అది తప్పు అనకూడదు.
కానీ, ఇప్పుడు ఎవరో ఒకరు కాస్త జనం గుర్తించగలిగే స్థాయి ఉన్న
నాయకుడు వచ్చి ఆవేశంలోనో, అవసరార్థమో, ఆపుకోలేకనో నోటికొచ్చినదంతా వాగేసి
ఎవరన్నా ఏమన్నా అంటే మా ప్రాంతంలో అంతే అంటున్నారు. ఏ ప్రాంత సంప్రదాయమూ
ఎదుటివాడిని కొట్టమని కానీ, తిట్టమని కానీ, బూతులు మాట్లాడమని కానీ
చెప్పదు. ఆవేశాన్ని నిగ్రహించుకోమని, అది అనర్థదాయకమని చెపుతుంది
సాంప్రదాయం. రాయల సీమ అయినా, తెలంగాణా అయినా, ఉత్తరాంధ్ర అయినా, కోస్తా
అయినా మరి ఏ ఇతర ప్రాంతమైనా వాడుక భాష తీరు, పదాలలో తేడా ఉంటుందేమో కానీ
మనిషిలో కాదు. మోసం చేసేవాడు, చెయ్యాలనుకునేవాడు, దుష్టుడు, దుర్మార్గుడు -
ఈ రకాలవారు అన్ని ప్రాంతాలలోనూ ఉంటారు. అంతమాత్రాన ఆయా ప్రాంతాల వారందరూ
అలాంటివారే అని తీర్మానిస్తే ఎలా? ఇదేదో సామెత చెప్పినట్టు 'ఎర్ర చీర
కట్టుకున్నదంతా నా పెళ్ళామే' అన్నట్టుంది. ఈ
దుష్ట సాంప్రదాయానికి - అదే నోటికొచ్చినదంతా వాగి ఏమన్నా అంటే మా
ప్రాంతంలో ఇంతే అనే సాంప్రదాయాన్ని మొదలు పెట్టింది ఒక నాయకమహానుభావుడే. ఏ
ప్రయోజనం ఆశించాడో లేక అది తనకు కవచంగా ఉంటుంది అనుకున్నాడో తెలియదు కానీ
ఆయన చెప్పిన ప్రాంతంలో నాకు ఉన్న లెక్కకు మిక్కిలి మిత్రులు అలా యేనాడూ
మాట్లాడలేదు, బహుశా ఇప్పుడు ఆ సాంప్రదాయాన్ని అలవర్చుకుని అలా
మాట్లాడతారేమో తెలియదు.
ఇప్పుడు మరలా ఈ దుష్ట సాంప్రదాయానికి, ఈ తరహా రీతులకు ఇప్పుడు మరొక
నాయకుడు తెర తీస్తున్నారు. శాసనసభలో కానీ, బయట కానీ ఇప్పటివరకూ
ప్రతిపక్షనేత అయిన జగన్ భాష విషయంలో మాట తూలినట్టు లేదు. భాష విషయంలోనూ,
సంయమనం పాటించడం విషయంలోనూ చాలావరకూ మెచ్చుకునే రీతిలోనే ఉన్నాడు. శాసనసభ
సమావేశాలలో అధికార పక్ష సభ్యులు ఎంతగా తూలనాడినా, రెచ్చగొట్టినా కూడా
సంయమనం పాటిస్తూ తాను చెప్పాలనుకున్నది చెప్పడమే తప్ప, ఎదురుదాడిలో కూడా
భాష విషయంలో తగు రీతిలోనే ఉండేవాడు. జగన్
మహానుభావుడనో, ఆదర్శపురుషుడనో చెప్పాలని కాదు కానీ, మన రాష్ట్ర
రాజకీయాలవరకూ చూస్తే అగ్రశ్రేణి నాయకులలో భాష విషయంలో నిన్నటివరకూ మంచి
సంయమనం పాటించిన వ్యక్తీ అని చెప్పడమే ఉద్దేశ్యం. కానీ, ఉన్నట్టుండి ఏమైందో, లేదా ఏదైనా రాజకీయ వ్యూహమో తెలియదు కానీ ఏకంగా చంద్రబాబుని
హామీలు నెరవేర్చనందుకు చెప్పుతో కొట్టండి, చీపురు చూపండి అంటూ తూలాడు.
తూలడమే కాదు, దానికి అది రాయలసీమ సాంప్రదాయం అంటూ ముసుగేసి
తప్పించుకోజూస్తున్నాడు. రాయలసీమలోనే కాదు, పలు ఇతర ప్రాంతాలలో కూడా
ఆవేశంలో 'చెప్పుతో కొడతా నా ... ' అనడం, చెప్పు చూపడం చాలామందికి అలవాటే.
కానీ, అది ఆవేశంలో. ఆవేశానికి ప్రాంతం లేదు, సాంప్రదాయం లేదు. జగన్ మాత్రమే
కాదు పార్టీ సభ్యులు కొందరు - రోజా లాంటివారు; అటు స్వయానా చంద్రబాబు ఆయన
పార్టీ లోని అధికశాతం మంది సభ్యులు అంతకంటే తీవ్ర పదజాలం ఉపయోగిస్తూ దానికి
కూడా ఏదో ఒక ముసుగేస్తున్నారు.
తమను తాము రాష్ట్రానికి ప్రతినిధులుగా చూపుకుంటూ ఉన్న ఈ ఇద్దరు కనీసం
తమ పార్టీ సభ్యులు అయినా తమను చూసి నేర్చుకునేలా ఉంటే బావుంటుంది. అలా
కాక, తమ చిత్తానికి వచ్చింది చేసి దానిని ఒకాయన రాయలసీమకు మరొకాయన ఆంద్ర
ప్రాంతానికి అంటగట్టి ఆయా ప్రాంతాల సాంప్రదాయం అంటే మంచిది కాదు. గతంలో
కాపు ఉద్యమం సమయంలో జరిగిన హింస సందర్భంగా రాయలసీమ/కడప రౌడీలు అంటూ మాట
తూలారు. ఇటువంటి దుష్ట సాంప్రదాయాలను ఇరువురు నేతలూ పాటించటం,
ప్రోత్సహించటం మానితే మంచిది.
Comments
Post a Comment