ముసుగులేని పత్రిక ...

వంశీ కలుగోట్ల// ముసుగులేని పత్రిక ... //
****************************************
          ఇప్పుడు సాక్షి తీరుపై విమర్శలు చేస్తున్నవారు గమనించవలసిన ఒక విషయం ఏంటంటే అసలు సాక్షి పుట్టుక అనేదే మిగతా మాధ్యమాల ఒంటెద్దుపోకడలు, ఒక వర్గానికే కొమ్ముకాయడం కారణం అనేది. ఇప్పుడు సాక్షి కాకపొతే మరోటి పుట్టుకువస్తుంది. ప్రధానంగా అత్యంత ఆదరణ కలిగి ప్రజలదగ్గరకి చేరుతుండిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల ఈ ధోరణి ఒక్కప్పుడు 'వార్త' దినపత్రిక పుట్టుకకు కారణమయ్యింది. కానీ, వివిధ కారణాల వల్ల వార్త దినపత్రిక ఆరంభంలో లభించిన ఆదరణను నిలబెట్టుకోలేకపోయింది. ఆ తరువాత ఆ రెండు పత్రికల ధోరణి మరింత పెచ్చుమీరి చివరకు 'సాక్షి' పుట్టుకకు కారణమయ్యింది. ఒక విషయం మాత్రం నిజం పుట్టుకనుండీ కూడా 'సాక్షి'కి ముసుగులు లేవు. వారి గొంతుక వినిపించాలనే ధ్యేయంతోనే సాక్షి ప్రారంభించారని అందరికీ తెలుసు. అంతేకానీ, మిగతా పత్రికలలాగా ప్రజల పక్షం అని ముసుగేసుకుని ఒక వర్గానికి కొమ్ముకాయడం అనే ముసుగేసుకోలేదు. అంతేకాదు పత్రికపై ఉన్న ఫోటో వారి తీరును ఎటువంటి ముసుగూ లేకుండా చూపుతుంది. అంటే మేమిది, మా రాత తీరిది, మేం చెప్పెదిదీ అని వారు ఎటువంటి భేషజాలు, ఇజాలు, ముసుగులు లేకుండా టముకు వేస్తున్నారు. గతంలో ఒక వ్యాసంలో ఉటంకిచినట్టు జగన్ అక్రమాస్తుల లెక్క అంటూ అంతూ పంతూ లేకుండా ఆ పత్రికలు లెక్కలేసి ప్రచారం చేశాయి; కానీ అసలు లెక్కలు (విచారణకు అందినవి, తెలిసినవి) అందులో పదోవంతు కూడా కాదని దర్యాప్తు సంస్థల విచారణలో తేలినది కదా ... మరి దానికి ఏమంటారు? అంటే, సాక్షి కంటే ముందుగా చర్యలు తీసుకోవలసినది అ రెండు పత్రికల మీద కాదా? అదొక్కటే కాదు చాలా ఉన్నాయి. ఏమైనా అంటే పత్రికాస్వేచ్చ అంటారు మీడియా మీద దాడి అంటారు, మరి అదే సాక్షి మీద జరిగితే అది పత్రికా స్వేచ్చపై దాడి, మీడియా మీద దాడి కాదా? మీడియా అంటే కేవలం ఈనాడు, జ్యోతి పత్రికలు మాత్రమేనా? వారు చూపించే పచ్చకోణం మాత్రమేనా వాస్తవం, వార్త?
          సాక్షి పుట్టిన దగ్గరనుండీ నేను ప్రతిరోజూ ఈనాడు, సాక్షి దాదాపుగా మిస్సవకుండా చదువుతున్నాను. అంతకు మునుపు ఈనాడు వీలయితే జ్యోతి చదివేవాడిని. ఈనాడులో చంద్రబాబు నాయుడు పట్ల అనుసరించే వైఖరి, సాక్షిలో వైఎస్/జగన్ పట్ల అనుసరిస్తారు. కాకపొతే సొంతపత్రిక కాబట్టి అది మరికాస్త ఎక్కువ ఉంటుంది. అయినా జగన్ కు సంబంధించిన వ్యతిరేక వార్తలు తప్ప జగన్ కేసులలో అధికశాతం కొట్టివేయబడ్డాయి అనే విషయాన్ని కూడా అదేదో ఎవరితోనో లాలూచి పడి కొట్టేయించుకున్నాడు అనో లేకపోతే మేనేజ్ చేశాడు అనో ఈనాడులో రాస్తారు తప్ప తగిన సాక్ష్యాధారాలు లేక కేసు కొట్టివేయబడింది అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాయరు. అదే విధంగా సాక్షిలో చంద్రబాబు గురించీ అంతే. సరే, వీరిద్దరూ ఏమైనా మహాపురుషులా అంటే కాదు - ఇరువురి మద్దతుదారులు ఎలాగూ కాదనే అంటారు. లక్షకోట్లు అయినా కాకపోయినా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ తన పనులు చక్కబెట్టుకున్నాడని అందరికీ తెలిసినదే. కాకపొతే, మన చట్టాలకు సాక్ష్యాదారాలే ముఖ్యం. ఇక చంద్రబాబు విషయానికి వస్తే అదేమిటో కానీ దర్యాప్తు సంస్థలకు చంద్రబాబు మీద కేసులు విచారణ చెయ్యాలంటే మాత్రం తగిన సిబ్బంది ఉండదు, కానీ వేరే ఇతర నేతల విషయానికి వస్తే మాత్రం ఉన్నట్టుండి పదులు, వందల సంఖ్యలో సిబ్బంది ఊడిపడతారు. దీని వెనుక మర్మమేమిటో ఎవరికీ అర్థం కాదు. కాల్ మనీ స్కాం, ఒక మహిళా ఎమ్మార్వోను కొట్టటం, నాగార్జున వర్శిటీ ఉదంతం, ఒక ఎమ్మెల్యే/మంత్రి గారి పుత్రుడి నిర్వాకం, డ్వాక్రా మహిళలపై జరిపించిన లాఠీచార్జీ, విద్యార్థినులపై లాఠీచార్జీ, ప్రతిపాదిత రాజధాని ప్రాంతంలో భూములు ఇవ్వడానికి నిరాకరించిన గ్రామాల్లో పొలాల్లో అగ్నిప్రమాదాలు, ఒక వివాహిత మహిళను వెంటాడి వేటాడి చంపిన కేసులో కొంతమంది అధికార పెద్దలు చేరి డబ్బుతో సెటిల్ చేసిన తీరు గురించి - ఇలాంటివాటన్నింటి గురించి ఆ రెండు పత్రికలూ ఎంతమాత్రం చెప్పాయో ఎవరికి తెలియదు. అంతెందుకు, చిత్తూరు మేయర్ హత్య జరిగిన వెంటనే ముఖ్యమంత్రి వాస్తవాలేమిటో తెలియకపోయినా దాన్ని ప్రతిపక్షాల మీద నేట్టివేసాడు, అది మాత్రం మొదటి పేజీలో వేస్తారు. కానీ, విచారణలో అది స్వయానా బంధువులే అదీ తమ పార్టీ వారే చేసినది అని తెలిసిన తరువాత మాత్రం ఆ విషయం లోపలి పేజీల్లోకో లేకపోతే జిల్లా ఎడిషన్ లోకో వెళ్ళిపోతుంది. ఇదేనా ఆ రెండు పత్రికలూ పాటించే విలువలు, మీరందరూ మెచ్చే నీతిమంతపు పెద్దమనిషి తరహా పోకడలు?
          ఇక్కడ నా ఉద్దేశ్యం సాక్షికి మద్దతుగా నిలబడటం కాదు, సాక్షి తీరును అంగీకరించటం కాదు. కానీ, సాక్షి ఒక్కటి కాదు ఆ రెండు పత్రికలూ మిగతావి అదే తరహావి అయినప్పుడు ప్రభుత్వం ఇలా కక్షపూరిత చర్యలతో కేవలం తమకు బాకా ఊదటం లేదనే కారణం చేత సాక్షిపై మాత్రమే చర్యలు తీసుకోవడం అన్నది తప్పు అని. ఎందుకంటే ఇవాళ సాక్షి కావొచ్చు, అలాగే ఇవాళ చంద్రబాబు ఉండొచ్చు రేపు ఖచ్చితంగా మరొకరు అధికారంలోకి వస్తారు, చచ్చి తీరతారు అప్పుడు వారు దార్శనిక నాయకుడు చూపిన ఈ దారిని అనుసరించారంటే పరిస్థితి ఏమిటి? అత్యవర పరిస్థితి నాటి రోజులను ఇటువంటి చర్యలు గుర్తుకు తీసుకురావటం లేదా? అలాగే అటు సాక్షి తీరు కానీ, ఇటు మిగతా పత్రికల తీరు కానీ సమర్థనీయం కాదు.

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన