పత్రికలూ ... స్వేచ్చ: పత్రికాస్వేచ్చ
వంశీ కలుగోట్ల// పత్రికలూ ... స్వేచ్చ: పత్రికాస్వేచ్చ //
*************************************************************
గతంలో అంటే కొద్ది సంవత్సరాల క్రితం ఆ ఆ అదే 2014 ఎన్నికలకంటే ముందు అన్నమాట ఆ కాలానికి వెళితే అప్పట్లో పేర్లెందుకు గాని ఆ రెండు పత్రికలలో ఇప్పటి ప్రతిపక్ష నేత జగన్ గురించి 'లక్ష కోట్లు, అంతకు రెండు రెట్లు మూడు కాదు కాదు పది రెట్లు అంటూ పదారు లక్షల కోట్లు అంటూ పరిశోధనాత్మక వ్యాసాలు రాసి పడేశాయి. ఆపైన లెక్కలు తెలియక ఆగిపోయారేమో మరి. కానీ, అధికారికంగా సిబిఐ వారు దాఖలు చేసిన పదికి మించిన ఛార్జ్ షీట్ లలో ఇంచుమించి పదహారు వేల కోట్లు అంటూ తేల్చారు. అందులో సగానికి పైగా కొట్టివేయబడ్డవి. మరి ఆ లెక్క ప్రకారం చూస్తే ఆ రెండు పత్రికలూ అసత్యాలను బల్లగుద్ది మరీ నిజాలు అన్నట్టు విపరీత ప్రచారం చేశారు, పేజీలకొద్దీ పరిశోధనాత్మక వ్యాసాల పేరుతో రోజుల/వారాల/నెలల తరబడి అసత్యాలను ప్రచారం చేశారని అనవచ్చు. ఆ కారణాలు చూపి ప్రభుత్వం ఆ పత్రికలను స్వాధీనం ఎందుకు స్వాధీనం చేసుకోకూడదు. అయినా ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే ఏదో జగన్ పుణ్యాత్ముడు, అవినీతి మకిలి అంటని మహానుభావుడు అని చెప్పాలని కాదు. విచారణలో లభించిన సాక్ష్యాధారాలను బట్టి తప్పు చేశాడో లేదో న్యాయస్థానాలు తేలుస్తాయి, తేల్చుతున్నాయి. చాలా సందర్భాలలో నిజాలని నిక్కంగా తెలిసినప్పటికీ 'తగిన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల' అనే కారణంతో తెలివైన నేరస్థులు తప్పించుకుంటున్నారు. కానీ, చట్టం ప్రకారం తగిన సాక్ష్యాధారాలు ఉంటే కానీ నేరస్థుడు నేరస్థుడు కాదు. వందమంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనే అతి గొప్ప ఆశయంతో ఆ చట్టాలు ఏర్పరచబడ్డాయి. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక కథనాలు, అసత్యాలు రాస్తున్నారన్న ఆరోపణలతో ఒక పత్రికను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తే, దాని అర్థం ప్రభుత్వం ఏమి చేసినా మాధ్యమాలు ఆహా ఓహో అనాలి తప్ప వ్యతిరేక కథనాలు వ్రాయకూడదు అనా? వెంటనే ఇది సాక్షినో, జగన్ నో సమర్థిస్తూ వారికి మద్దతుగా రాసినదే అనుకుంటే పచ్చ మద్దతుదారులు రేపటి రోజున ఏదో ఒకనాడు జగన్ లేదా మరో నేత అధికారంలోకి వచ్చిన నాడు తమ మనోభావాలకు విలువిచ్చి, తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన పత్రికలను ఇవే కారణాలు చూపి స్వాధీనం చేసుకుంటే ఏమంటారు? అటువంటి చర్యలు ఎవరు చేసినా ఖండించాలి. ఇది ఒకటో విషయం.
ఇక రెండో విషయం - పత్రికా స్వేచ్చ గురించి. తోచిందంతా రాసి పడేసి అదే పత్రికా స్వేచ్చ అంటే ఎలా? నిజంగా తగిన సాక్ష్యాధారాలు ఉంటే (పత్రికలలో పరిశోధనాత్మక వ్యాసాలు వ్రాయడంతో పాటు) ఎందుకు న్యాయస్థానాల ముందుకు కేసుల ద్వారా తీసుకు వచ్చే ప్రయత్నం చెయ్యటం లేదు - అది ఆనాడు ఆ రెండు పత్రికలైనా ఈ దినాన ఈ ఒక్క పత్రిక అయినా? ఆనాడు ఆ రెండు పత్రికలూ నోటికొచ్చిన లేక్కలేసి లక్షల కోట్లకు పెంచివేసిన లెక్కలను ఎందుకు న్యాయస్థానాల ముందుకు తీసుకు వెళ్ళలేదు? అలాగే ఈరోజున సాక్షి కూడా - ప్రతిపాదిత రాజధాని విషయంలో కానీ, లెక్కకు మిక్కిలిగా పరిశోధనాత్మక వ్యాసాల పేరుతో రాసి పడేస్తున్న ఇతర కుంభకోణాల గురించి కానీ - తమ వద్ద వున్న ఆధారాలను న్యాయస్థానాల ముందుకు ఎందుకు తీసుకువెళ్లటం లేదు? అంటే అప్పుడు వారు చెప్పినవి ఇప్పుడు వీరు చెపుతున్నవి అన్నీ పుక్కిటి పురాణాలేనా? ఉబుసుపోక చెప్పుకునే సొల్లు కబుర్లేనా? ఈ పత్రికలే అనుకుంటే రెండు పక్షాల నాయకులూ అలానే తయారయ్యారు. స్వయానా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చట్టప్రకారం కేవలం ఆరోపితుడు అయిన వ్యక్తిని పట్టుకుని నేరస్థుడు అంటూ ఉంటే ఇక మిగతావారిని పట్టటం ఎవరికి సాధ్యం. పత్రికలు ప్రజల పక్షాన నిలబడాలి - ప్రభుత్వాన్ని విమర్శించటం మాత్రమే పత్రికల ధ్యేయం కాకూడదు. ఏ ప్రభుత్వం అయినా అవి చేపట్టే పథకాలలో, చర్యలలో మంచీ చెడూ రెండూ ఉంటాయి. చెడును విమర్శించాలి అది ప్రభుత్వానికి జరుగుతున్న లోపాలు అర్థం అయ్యేలా ఉండాలి. పత్రికా స్వేచ్చ పేరుతో చిత్తానికి తోచిన విధంగా నిరాధారపూరితమైన కథనాలను ప్రాచుర్యంలోనికి తీసుకురాకూడదు. ఇప్పుడు జరుగుతున్నది అంటే పత్రికల తీరు ప్రతిచర్యాత్మక ధోరణులే.
ప్రభుత్వాలకు, పార్టీలకు మద్దతుగా నిలిచే ధోరణులను పత్రికలు మానకపోతే పతనం దిశగా ప్రజాస్వామ్యపు పయనం తప్పదు. పత్రికా నియంత్రణ అన్నది ప్రభుత్వాల అధీనంలో ఉండదగ్గది కూడా కాదు, అది న్యాయస్థానాల ఆధ్వర్యంలో ఉండవలసినది. అసలు ఇప్పుడు వార్తను వార్తగా ఎవరు రాస్తున్నారు - తెలుగుదేశం కోణంలోనో, వై.యెస్.ఆర్.సి.పి కోణంలోనో, కాకపొతే కమ్యునిస్ట్ ల కోణంలోనో తప్ప వార్త వార్తగా ఎక్కడ ప్రచురితం/ప్రసారం అవుతోంది? ఈ ధోరణుల నుండి పత్రికలు బయటకి రావాలి. ప్రజలు అంటే తాము కొమ్ము కాసే, భుజాన మోసే, బాకా ఊదే పార్టీకి మద్దతిచ్చే వారు మాత్రమే కాదు అని గుర్తెరగాలి. అది కానినాడు వారు గుర్తించాల్సిన నిజమేమిటంటే ఇవ్వాళ ఆ పత్రిక అని తము చంకలు గుద్దుకుంటే రేపటిరోజున తమ పరిస్థితి కూడా అదే కాగలదు.
Comments
Post a Comment