... తిరుపతి ఉప ఎన్నిక
వంశీ వ్యూ పాయింట్ // ... తిరుపతి ఉప ఎన్నిక //
******************************************
సిట్టింగ్ ఎంపీ దుర్గాప్రసాద్ గారి మరణంతో అనివార్యమైన తిరుపతి ఉప ఎన్నిక ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీనిపట్ల ప్రత్యేక ఆసక్తి ఏర్పడటానికి కారణం భాజపా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం. ముఖ్యంగా భాజపా తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలలో కనబరచిన ప్రదర్శనతో ఉరకలెత్తుతోంది. తెలంగాణాలో లాగానే ఇక్కడ కూడా మతపరమైన అంశాలను ప్రస్తావిస్తూ రెచ్చగొట్టి, మతప్రాతిపదికన ఓట్లను పోలరైజ్ చేయాలని ప్రయత్నం చేస్తోంది. బరిలో ప్రధాన పార్టీల తీరును పరిశీలిస్తే
వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేస్తున్న గురుమూర్తి గారికి పార్టీ వర్గాల నుండి సహకారం, వ్యక్తిగతంగా ఎటువంటి చేదు రిమార్క్స్ లేకపోవడం, విద్యాధికుడు, సౌమ్యుడు కావడం వంటివి సానుకూల అంశాలు. కాగా స్థానిక పార్టీ వర్గాలు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో ప్రత్యక్ష సంబంధాలు లేకపోవడం, ప్రత్యక్ష ఎన్నికలకు కొత్త కావడం వంటివి ప్రతికూల అంశాలు. అయితే జగన్ గారు వ్యక్తిగతస్థాయిలో (అంతర్గతంగా) సమీక్షిస్తూ పార్టీ వర్గాలను గురుమూర్తి గారికి అనుకూలంగా ఉండేలా దిశానిర్దేశం చేయడం లాభించే అంశం. ఇక దివంగత ఎంపీ గుర్గాప్రసాద్ గారి కుమారుడికి ఎమ్మెల్సీ ఇవ్వడంతో వారు కూడా సహకరించే అవకాశాలు అధికం. గెలుపు గురించి ఎటువంటి అనుమానాలూ లేవు, కేవలం మెజారిటీ సాధన కోసమే కష్టపడాలి.
ఈ ఉప ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన తెదేపా కంటే భాజపా - జనసేన హంగామా అధికంగా ఉంది. ప్రత్యేకించి భాజపా, తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక, హైదరాబాద్ స్థానిక ఎన్నికలలో పెర్ఫార్మన్స్ తో ఊపు మీద ఉంది. అక్కడి తరహాలోనే ఇక్కడా మతపరమైన అంశాల ఆధారంగా ప్రచారం నిర్వహిస్తూ, సున్నిత అంశాలను రెచ్చగొట్టే తీరులో వ్యవహరిస్తున్నారు. అటువంటి ప్రయత్నాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటువంటి సానుకూల ఫలితాలనివ్వలేదు, మరి ఈ ఉపఎన్నికలో ఏమయినా సానుకూల ఫలితాలనిస్తాయి లేదో చూడాలి. అభ్యర్థి ఎవరికీ పెద్దగా తెలియకపోవడం, స్థానిక కార్యవర్గంతో ప్రత్యక్ష పరిచయాలు, క్షేత్రస్థాయి కార్యవర్గంలో సంబంధాలు లేకపోవడం అతి పెద్ద ప్రతికూలాంశం. సాధించే ఓట్ల శాతం వంటివాటికంటే తెదేపా కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకుని, రెండవ స్థానంలో నిలిస్తే అదే భాజపా - జనసేన విజయం. అలాకాక మొన్నటి ఎన్నికల్లో లాగానే కనీస ధరావతు కూడా దక్కకపోతే, భాజపా తమ తీరును సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నానాటికి కుదేలవుతున్న తెదేపా ఈ ఎన్నికల్లో పోరాడాల్సినంత స్థాయిలో పోరాడుతున్నట్టు కనబడటం లేదు. చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న పోరాట స్ఫూర్తి, అధికారం పట్ల ఆసక్తి పార్టీ నాయకులలో లోపించిందేమో అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఈ ఎన్నికలో భాజపా కంటే దిగువ స్థాయిలో నిలిస్తే మాత్రం తెదేపా వర్గాలు (ప్రస్తుత నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు) భాజపా వైపు చూసే అవకాశం ఉంది. అలానే చంద్రబాబు గారి నాయకత్వం పట్ల వ్యతిరేకత అధికమవ్వవచ్చు. తెదేపా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పని చేయవలసిన ఎన్నికలు ఇవి. కాకపొతే కార్యకర్తలు పని చేయడానికి సిద్ధంగా ఉన్నా, చంద్రబాబు స్థాయిలో పోరాటానికి వెనుకాడకున్నా స్థానిక నాయకులు పెద్దగా కష్టపడకపోవడం ప్రతికూలాంశం. ఇప్పటికీ ఎంపీ అభ్యర్థి జనాల్లోకి వచ్చి, ప్రచారం చేయకపోవడం అతి పెద్ద ప్రతికూలాంశం. తెదేపా ద్వితీయ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా లేక భాజపా - జనసేన కూటమికి కోల్పోతుందా అన్నది చూడాలి.
*
... తిరుపతి ఉపఎన్నికలో ఎవరు విజయం సాధిస్తారన్న అంశం పట్ల ఎవరికీ సందేహాలు లేవనే చెప్పవచ్చు. కాకపొతే రెండు అంశాలు కీలకం - మెజారిటీ ఎంత ఉంటుంది? ద్వితీయ స్థానం ఎవరికి వస్తుంది? అన్నవి. నా అంచనాలో భాజపా 50 వేలకు కాస్త అటూ ఇటూగా ఓట్లు తెచ్చుకుని ద్వితీయ స్థానంలో నిలిచే అవకాశం ఉంది; ఇక తెదేపా 30 వేలకు మించి ఓట్లు సాధించలేకపోవచ్చు; అధికార పార్టీ గత ఎన్నికల్లో మెజారిటీని కాస్త అటూ ఇటూగా నిలబెట్టుకోగలిగే అవకాశాలు అధికం.
Comments
Post a Comment