... ఆరోగ్యమే మహాభాగ్యం

వంశీ కలుగోట్ల // ... ఆరోగ్యమే మహాభాగ్యం //
*****************************************
            కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేయడం మొదలుపెట్టిన తరువాత ప్రపంచం మొత్తం (అతిశయోక్తిలా అనిపిస్తే, అత్యధికశాతం అని చదువుకోండి) కరోనా రాకుండా ఏం చెయ్యాలి అని అన్వేషణ మొదలు పెట్టింది. దాంతో ప్రివెంటివ్ మెడికేషన్ వ్యాపారం ఊపందుకుంది. రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది అనే ప్రచారంతో అనేక కృత్రిమ ఉత్పత్తుల విక్రయం ఎక్కువైంది. అందులో అత్యధికం ఎటువంటి ప్రామాణికత లేనివే అయి ఉంటాయి. నిజానికి ఈ ప్రివెంటివ్ మెడికేషన్ అన్నది ఎంతవరకూ సమంజసం, అనుసరణీయం అని తెలిసిన వైద్య మిత్రులతో కూడా చర్చించాను. సరైన సలహా, నిపుణులతో సంప్రదించకుండా ఈ ప్రివెంటివ్ మెడికేషన్ వాడకం అన్నది సరికాదు, సమర్థనీయం కాదు అన్నది వారు చెప్పిన విషయం.
            ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. మనది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి, వ్యవసాయ సంబంధిత ఉదాహరణే చెప్పుకుందాం. ఒక పంట అయిపోయాక, తరువాతి పంట వేసేముందు సాధారణంగా రైతు పొలాన్ని పంటకు సిద్ధం చేస్తాడు. పొలం దున్నడం, సేంద్రియ ఎరువులు వేయడం లాంటివి అన్నమాట. కానీ పంటకు ఏ పురుగు పడుతుందో అని ముందుగానే ఊహించి, వాటికి సంబంధించిన పురుగు మందులు పొలంలో చల్లడు ఎందుకంటే అది పంట దిగుబడిని దెబ్బతీయగలదు. ప్రివెంటివ్ మెడికేషన్ విషయంలో మనం అర్థం చేసుకోవలసింది ఇదే.
            కరోనా నేపథ్యంలో ఈ ప్రివెంటివ్ మెడికేషన్ అన్నది ఊపందుకుంది. వాటి వ్యాపారం మూడుపువ్వులు, ఆరుకాయలుగా నానాటికి పెరిగిపోతోంది. అనేక రకాల రోగాల బారినుండి మనలను మనం రక్షించుకోవడానికి సిద్ధంగా ఉండటం అంటే ప్రివెంటివ్ మెడికేషన్ తీసుకోవడం మాత్రం కాదు. ఎందుకంటే ప్రివెంటివ్ మెడికేషన్ అన్నది ఒక ప్రత్యేక లేదా కొన్ని రకాల జబ్బులను ఎదుర్కొనేలా తయారు చేయగలదేమో కానీ శారీరక మరియు అంతర్గత రోగనిరోధక సామర్త్యాన్ని వృద్ధి చెందేలా తోడ్పడదు. దానికోసం నిత్యం వ్యాయామం చేయడం, నడక, తిండి విషయంలో జాగ్రత్తపడటం, పౌష్టికాహారం తినడం వంటి చెయ్యాలి. అవి వదిలేసి సప్లిమెంట్స్ తీసుకోవడం సరికాదు. ఏదైనా మెడికేషన్ తీసుకోవాలి అంటే సరైన నిపుణులను సంప్రదించి తీసుకోవాలి. వ్యాయామం, సమయపాలన, పౌష్టికాహారం వంటివి అతి ముఖ్యమైనవి. ప్రామాణికత లేని ప్రచారాలు నమ్మి మోసపోకండి.

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన