... వైఎస్సార్

వంశీ కలుగోట్ల // ... వైఎస్సార్ //
***************************
            కాంగ్రెస్ చరిత్రలో వైఎస్సార్ ది ఒక ప్రత్యేక అధ్యాయం అని చెప్పవచ్చు. మొదటినుండి కాంగ్రెస్ లో రెండే మార్గాలు - అధిష్టానంతో సర్దుకుపోవడం లేదా అధిష్టానానికి ఎదురు తిరిగి బయటకు పోవడం. ఒకానొక ఉత్తమ ఉదాహరణ సుభాష్ చంద్రబోస్; మరొక ఉదాహరణ ప్రకాశం పంతులు, రాజాజీ వంటివారు. బోస్ ఎదురు తిరిగి బయటకు వెళ్ళగా; ప్రకాశం పంతులు, రాజాజీ వంటివారు సర్దుకుపోయారు. గాంధీ మరియు నెహ్రు ఆధిపత్యం అంగీకరించకపోతే బయటకు పోవలసిందే. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఆ పార్టీలో మరొక నాయకుడు స్థానికంగా కానీ, జాతీయంగా కానీ వ్యక్తిగత ఇమేజ్ తో బలపడకూడదు అనేది ఒక బేసిక్ ప్రిన్సిపల్ - అంటే అది వారి నియోజకవర్గస్ధాయి వరకూ అయితే పర్వాలేదు. అంతకుమించితే 'కట్' చేయబడతారు. గాంధీ, నెహ్రు కాలం నుండి నేటి సోనియా,  రాహుల్ వరకూ ఇదే తీరు. పార్టీలో ఉండి, పార్టీ తీరుకు భిన్నంగా ఎదగడం, కాంగ్రెస్ చరిత్రలో గాంధీ - నెహ్రు కుటుంబాలవారు మినహాయించి మరొకరు పార్టీకి మించి వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకోవడం అన్నది జరగలేదు - నాకు తెలిసినంతవరకూ దానికి ఏకైక మినహాయింపు వైఎస్సార్ - ఆ విషయం కాంగ్రెస్ కు 2014 నాటికే స్పష్టంగా అర్థమై ఉండాలి.
            2002/03 కు ముందు వైఎస్సార్ అంటే రాయలసీమ ప్రాంతంలో బలమైన 'కాంగ్రెస్' నేత, నిత్య అసమ్మతివాది. కాంగ్రెస్  అధికారంలో ఉంది అంటే ప్రతిపక్షం కంటే ఎక్కువగా వైఎస్సార్ ని ఎలా కట్టడి చేయాలి అని ఆలోచించేవారు అంటారు. 1995 తరువాత పరిస్థితిలో మార్పు వచ్చింది. కోట్ల, నేదురుమల్లి వంటివారి ప్రాభవం తగ్గడం వంటివి కూడా వైఎస్సార్ కు ఉపకరించాయి. రాష్ట్ర స్థాయిలో వైఎస్సార్ మరింత బలపడటానికి జాతీయ స్థాయిలో ఆనాటి కాంగ్రెస్ పరిస్థితి కూడా ఉపకరించింది. రాష్ట్ర రాజకీయాలలో ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం తరువాత అంతటి ప్రభావవంతమైన అంశం వైఎస్సార్ పాదయాత్ర అని చెప్పవచ్చు. అది వైఎస్సార్ ఇమేజ్ ను, భవిష్యత్తును కూడా మార్చివేసింది. కాంగ్రెస్ పార్టీని పార్టీని మించి వైఎస్సార్ ఎదిగిపోవడానికి ముఖ్యకారణం కూడా అదే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. 2004 ఎన్నికల ఫలితాల అనంతరం అనేకమంది ఆశావహులు ముఖ్యమంత్రి స్థానం కోసం ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేయ యత్నించినప్పటికీ, అధికారంలో రావడానికి ముఖ్యకారణమైన వైఎస్సార్ వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపడం లాభించింది - ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తం కాగలదని భావించడం, అధికారం కోల్పోయిన చంద్రబాబును ఎదుర్కొనగల స్థాయి ఉన్న వ్యక్తిగా వైఎస్సార్ ముఖ్యమంత్రి పీఠమెక్కారు.
            ముఖ్యమంత్రిగా మిగతా అందరి శైలికి భిన్నం వైఎస్సార్. సంక్షేమ పథకాలు, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి గత ప్రభుత్వ హయాంలో  నిర్లక్ష్యానికి గురైన అంశాలకు పెద్ద పీట వేయడం వైఎస్సార్ కు తిరుగులేని ఇమేజ్ తెచ్చి పెట్టింది. ఎక్కడికక్కడ 'కట్' చేయాలని యత్నించినప్పటికీ, పార్టీని మించి ఎదగకుండా ఆయన్ను ఆపలేకపోయారు. అదే సమయంలో వైఎస్సార్ కూడా అధిష్టానాన్ని పెద్దగా ఎదిరించలేదు, అలాగని 'జీ హుజూర్' టైపు కూడా కాదు. కాంగ్రెస్ వరకూ అదొక సంక్లిష్టమైన శైలి. ముఖ్యంగా అందరిలో కలిసిపోతూ, అవసరమైన చోట ఆజమాయిషీ చెలాయిస్తూ, నమ్మినవారిని కాపాడుకుంటూ ... ముఖ్యంగా చెప్పాలంటే తన సమకాలీన రాజకీయ నాయకులలో ఒక భిన్న వ్యక్తిత్వం వైఎస్సార్ గారిది. అయిదేళ్ళూ ముఖ్యమంత్రిగా కొనసాగడమే కాక, రెండవసారి ఎన్నికలలో తన పట్టు నెగ్గించుకుని, పార్టీని గెలిపించి, మళ్ళీ ముఖ్యమంత్రిగా కొనసాగడం కాంగ్రెస్ లో ఎవరూ అంతకుముందు ఊహించనివి. పార్టీకి అతీతంగా ప్రజల్లో వైఎస్సార్ ఎంత బలమైన, సుస్థిరమైన ఇమేజ్ సాధించారో అన్నది 2014 మరియు 2019 ఎన్నికల్లో స్పష్టమైంది. ఆయన అనూహ్య ప్రమాదంలో మరణించకపోయి ఉంటే, కొన్ని కీలకపరిణామాలు సంభవించేవి కావు అన్నది నిజం. తెలుగు రాజకీయాలలో నాకు ఇష్టమైన రాజకీయ నాయకులలో వైఎస్సార్ ఒకరు. (తొలి స్థానం ఎప్పటికీ ప్రకాశం పంతులు గారిదే; తరువాత వైఎస్సార్; ఆ తరువాత పీవీ, ఎన్టీఆర్, నేదురుమల్లి, పీజేఆర్, మాధవరెడ్డి గార్లు - ఇది నా వ్యక్తిగత అభిప్రాయం).  ఆ చిరునవ్వు, తెలుగు సాంప్రదాయ శైలి వస్త్రధారణ, వ్యక్తిత్వం నాకు బాగా ఇష్టం.  ఎందుకు, ఏమిటి అన్న విశ్లేషణలకు అతీతంగా  'జననేత'గా, 'మహానేత'గా తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన వైఎస్సార్ గారి జయంతి సందర్భంగా గుర్తు చేసుకోవాలనే ప్రయత్నం ఇది.

డిస్క్లైమర్: ఇవి కేవలం నా వ్యక్తిగత అభిప్రాయాలు. ఒక వ్యక్తిగా వైఎస్సార్ ను ఇష్టపడే స్వేచ్ఛ నాకు ఎంత ఉందో, వ్యతిరేకించే స్వేచ్ఛ కూడా మీకు అలానే ఉంటుంది. వ్యతిరేకించే వారిపై నేను ఎటువంటి పార్టీ ముద్ర వేయాలని అనుకోవడం లేదు. అలాగే నా ఇష్టానికి పార్టీ రంగులు అద్ది, ముద్రలేసే మూర్ఖత్వం మీకు లేదని నేను అనుకుంటున్నాను.

Comments

  1. బాగా వ్రాశారు.
    The main factor which helped ysr grow as a leader was his willingness to change. He identified his shortcomings and overcame them. He grew as a person. He became a true leader and earned confidence of all sections of people.

    Whereas CBN could not overcome his pettiness and remains till today as a manipulator and untrustworthy politician.

    ReplyDelete
  2. రాజశేఖర్ రెడ్డి ఎదుగుదలకు కారణం ఒకే ఒక్కటి: పీపుల్ కనెక్ట్.

    చెవులతోనే కాక గుండెతో వినగలిగిన వాడే ప్రజానాయకుడు కాగలడు. నైపుణ్యం, సమర్థత, అధికార నిబంధనలు, సాంకేతిక అంశాలు వంటి మిగిలినవి నేర్చుకోవొచ్చు లేదా జీతగాళ్లకు అప్పచెప్పొచు. ఎంపతీ ఒక్కటే ఔట్సోర్సింగుకు అనువు కాదు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన