... కరోనా గురించి కొన్నిమాటలు

వంశీ కలుగోట్ల // ... కరోనా గురించి కొన్నిమాటలు //
*******************************************
            ఇపుడు కరోనా గురించే వార్తలన్నీ, కరోనా లేని వార్తలు లేవు. కాబట్టి కాస్త కరోనా గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. అసలే శ్రీశ్రీ గారు చెప్పిన 'అగ్గిపుల్లా, సబ్బుబిళ్ళా ... కాదేదీ కవితకనర్హం' అన్న మాటలను ఆదర్శంగా తీసుకుంటాం మనమంతా. అలాంటిది నాలుగు మాటలు చెప్పుకోవడానికి కరోనా లాంటి టాపిక్ ను వదలడమెందుకు? కమాన్ గుస గుస ...
            కరోనాకు మందు లేదు అని చెబుతున్నది అబద్ద్ధం అని నా అభిప్రాయం. ఎందుకంటే కరోనా వచ్చిన వారందరూ మరణించటం లేదు. కాకపొతే కరోనా వైరస్ సోకినా తరువాత ప్రారంభ దశలో కాకుండా తీవ్రమైన దశలో కనుగొంటే కోలుకోవడం అన్నది ప్రధానంగా ఆ వ్యక్తి యొక్క అంతర్గత రోగనిరోధక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. అదే ప్రారంభ దశలో కనుగొనగలిగితే కొన్ని మందులతో, బలవర్ధక ఆహారం, మరికొన్ని వైద్యులు సూచించిన విషయాలు పాటించడం వంటి వాటిద్వారా కోలుకునేలా చేయవచ్చు అన్నది ఇప్పటిదాకా జరుగుతోంది అని నా అభిప్రాయం. ముదిరిపోయాక ఏ మందులూ ఏమీ చేయలేవు. కరోనా రాకుండా రోగనిరోధకశక్తిని పెంపొందించే వాక్సిన్, కరోనా ను త్వరితగతిన్న తగ్గేలా చేసే మందు రావలసి ఉంది. లేదా కొన్నాళ్ళకు కరోనా స్వతహాగానే బలహీనపడి, జలుబులా మారవచ్చు కూడా. (ఇది కూడా అభిప్రాయమే అని గమనించగలరు)
            కరోనా వాస్తవపరిస్థితి కంటే, మీడియాలో వార్తల ద్వారా వ్యాపిస్తున్న అపహలవల్ల భయాందోళనలు అధికమవుతున్నాయి. పెరుగుతున్న కేసుల సంఖ్య చెబుతున్న మీడియా, దానికంటే ఆక్టివ్ కేసెస్ సంఖ్యా చెప్పడం మంచిది. దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ రోజూ పెరిగే కేసెస్ సంఖ్యకు కాస్త అటూఇటుగా కోలుకుంటున్న (డిశ్చార్జ్ అవుతున్న) వారి సంఖ్య ఉంటోంది. ఈ వివరాలు ప్రింట్ మీడియాలో వస్తున్నాయి కానీ విసువల్ మీడియాలో వాటికంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు.
            కరోనా కట్టడిలో ప్రభుత్వాల తీరు పరవాలేదు. ఒకటీరెండు రాష్ట్రాల తీరు వదిలేస్తే మిగతా రాష్ట్రాలు తమ పరిమితుల మేరకు సమర్థంగానే పని చేస్తున్నాయని నా అభిప్రాయం. కానీ, అన్ని ప్రభుత్వాలూ (కేంద్రప్రభుత్వంతోసహా) ప్రజలలో అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నాయని నా అభిప్రాయం. కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పడం మాత్రమే కాదు అవగాహన కల్పించడం అంటే. కరోనా సోకి, కోలుకున్నవారి అనుభవాలు వీడియో బైట్స్ లాంటివి చేయడం ద్వారా ధైర్యం కలిగించినట్టు కాగలదు. అదే సమయంలో కరోనా టెస్ట్స్ చేసే లాబ్స్ వివరాలు సరిగా తెలీవు. ప్రతి జిల్లాలో కరోనా టెస్టింగ్ చేయడానికి అనుమతి పొందిన లాబ్స్ ఏవి అన్న వివరాలు ప్రజలకు చేరేలా చూడాలి. అలానే టెస్ట్ చేసే ప్రక్రియ, పాజిటివ్ గా వచ్చిన తరువాత ఏం చెయ్యాలి అన్నది ప్రజలకు తెలిసేలా చెయ్యాలి. కొన్ని చోట్ల అనుమతి లేని ప్రైవేట్ లాబ్స్/హాస్పిటల్స్ టెస్ట్ రిజల్ట్స్ పాజిటివ్ అని చెప్పి, ట్రీట్మెంట్ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నాయని వార్తలు వస్తున్నాయి.
            చివరగా ... కరోనా అన్నది ట్రీట్మెంట్ లేని జబ్బు కాదు అని నేను అనుకుంటున్నాను. ముందుగానే చెప్పినట్టు, అలా ట్రీట్మెంట్ అవకాశం లేకపోతే ఇప్పటికే కోట్లమంది చనిపోయారని వార్తలు చూడవలసి వచ్చేది. అత్యాధునిక ట్రీట్మెంట్ సౌకర్యాలు ఉన్న జబ్బులు కూడా, ముదిరిపోయిన దశలో కనుగొంటే, వైద్యులు చేతులెత్తేయడం మినహా ఏమీ చేయలేరు. కాబట్టి, లక్షణాలు కనబడినపుడు స్వచ్చందంగా టెస్ట్ చేయించుకోవడానికి ముందుకు వస్తే మంచిది. కరోనా విషయంలో వైద్యనిపుణులకు కూడా ఇంకా పూర్తి అవగాహన లేదు అన్నది నిజం. ఈ వ్యాధి ఎలా సోకుతుంది, సోకిన తరువాత ఎన్నాళ్ళకు బయటపడవచ్చు, ఎన్నిరోజుల్లో తగ్గవచ్చు వంటివన్నీ పరిశోధనల దశలోనే ఉన్నాయి. మరొక విషయం ఇవాళ టెస్ట్ లో నెగటివ్ వస్తే ఇక కరోనా రాదని కాదు; కొన్నిరోజుల తరువాత టెస్ట్ చేస్తే పాజిటివ్ రావచ్చు - దానికి అనేక కారణాలు ఉండవచ్చు. ముఖ్యంగా మనం అందరం గుర్తుంచుకోవలసింది వ్యక్తిగత శుభ్రత పాటించడం; బయటకు వెళ్ళినపుడు మాస్క్ ధరించడం, కనీస భౌతిక దూరం పాటించడం; వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటించడం; అంతర్గత రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటివి పాటించడం మంచిది. గుర్తుంచుకోండి 'మనం పోరాడాల్సింది వ్యాధితో, రోగితో కాదు'

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన