... జింక మీద జాలి కాదు

వంశీ కలుగోట్ల // ... జింక మీద జాలి కాదు //
**************************************
            పంజాగుట్ట స్మశానవాటికలో కరోనా మృతుల శవాలను కుక్కలు పీక్కుతింటున్నాయి అన్న వార్త చూసినపుడు చాలా బాధగా అనిపించింది. అందులో నిజానికి మీడియా అతి కూడా ఉందేమో. అక్కడ గుట్టలుగా శవాలు పడేసి, ఎవరూ పట్టించుకోకుండా వదిలేసి, కుక్కలపాలు కావడం జరగలేదు. బహుశా అది కేవలం ఒక ఘటన మాత్రమే కావచ్చు. ఆ పోస్ట్ చూడగానే మొదట చాలా బాధ కలిగింది, ఇంతటి నిర్వహణా లోపమా అని కోపమూ వచ్చింది. అదే సమయంలో నిద్రాణంగా ఉండిన బాధపడిన ఘటన గుర్తొచ్చింది - అదే తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు 'హైదరాబాద్ ను కర్నూలు, గుంటూరుల లాగా కానివ్వం' అని వెటకారంగా మాట్లాడిన మాటలు. ఆయన ఆ మాట అన్న సమయంలో, అక్కడున్న ఎవరూ ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన తీసుకురాలేదు - ఆయన అన్న ఆ మాటలు అసందర్భమే కాక, బాధించాయి. అందుకే '...తలకాయ యాడ బెట్టుకోవాల్నో అర్థమవుతోందా రాజేంద్రా' అన్న వైఎస్ గారి వ్యాఖ్యలను ఉటంకించాను. ఈ పోస్ట్ ద్వారా కామెంట్స్ లోనూ, ఆఫ్ లైన్ లోనూ నాకు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ముందుగా ఆ పోస్ట్ లో పెట్టిన పిక్ మరియు విషయం పానిక్ కు కారణం కాగలదు. అందుకే ఇక మీదట రాజేందర్ గారి ఆ వ్యాఖ్యల పట్ల మరెటువంటి పోస్ట్స్ వద్దని అనుకుంటున్నాను. 
            ముందుగా ఒక మాట - ఇది తెలంగాణాలో ప్రస్తుతం నెలకొన్న భయానక పరిస్థితికి కేవలం ఈటెల రాజేందర్ గారిని మాత్రమే బాధ్యుడిని చేసే ప్రయత్నం కాదు. అత్యంత బాధ్యతాయుత పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండి కర్నూలు, గుంటూరుల లాగా కానివ్వం అంటూ వెటకారంగా మాట్లాడటం చాలా బాధించింది. అందుకే ఆ పోస్ట్ లోని వ్యాఖ్య కూడా డైరెక్ట్ గా ఆయనకే అడ్రెస్ చేస్తూ పెట్టాను. ఒక సామాన్యుడిగా ఇంతకంటే వేరేగా ఆయనకు ఎలా సమాధానం చెప్పగలను (ఇది ఆయనకు చేరదని తెలిసినా)? నిజానికి అప్పట్లో చాలామంది కెసిఆర్ ప్రెస్ మీట్స్ లో అద్భుతంగా మాట్లాడింది విని - మోదీ కంటే కెసిఆర్ ఏ నయం, ప్రధానిగా కెసిఆర్ ఉండుంటే, ఆంధ్రకు కెసిఆర్ లాంటి వాడు సీఎం లేకపోవడం దురదృష్టం లాంటి వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలోనే ఒక పోస్ట్ పెట్టాను కెసిఆర్ గారి కంటే కేరళ, ఒడిశా, ఆంధ్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాల సీఎం లు బాగా పని చేస్తున్నారు. కానీ వారెవరూ కెసిఆర్ లాగా మాటకారితనం ఉన్నవారు కారు' అని. ఇపుడు అప్పటి నా మాటను ఔనని అంటున్నారు.
            అందరికంటే ముందుగా కరోనాను పారాసెటమాల్ కు తగ్గే వ్యాధిగా తేలికగా తీసుకున్నది కెసిఆర్, మరికొందరు మొదట అలానే అనుకున్నా అగ్రరాజ్యం అమెరికా పరిస్థితి చూశాక మేలుకున్నారు (ఉదా. ఆంధ్ర,  కర్ణాటక). కానీ తెలంగాణ ప్రభుత్వం కెసిఆర్ ప్రెస్ మీట్స్ ద్వారా వస్తున్న పాజిటివ్ ఇమేజ్ ను, ప్రచారాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండిపోయిందేమో. కేంద్ర ప్రభుత్వం, హై కోర్ట్ వంటివి తగినన్ని టెస్ట్స్ ఎందుకు చేయడం లేదు అంటూ ప్రశ్నిస్తున్నా 'ఎన్ని చేయాలో మాకు తెలుసు' అన్నారు కానీ టెస్ట్స్ సంఖ్య పెంచలేదు. అదే సమయంలో రాజేందర్ గారు లాంటి వారు వెటకారంగా మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ టెస్ట్స్ చేయడంలోనూ, వైద్య సదుపాయాల కల్పన వంటివాటిలోనూ తగు రీతిలో స్పందించడం అందరి దృష్టిని ఆకర్శించి, ప్రశంసలందుకుంది. పది లక్షలకు పైగా టెస్ట్స్ జరిపిన ఆంధ్రప్రదేశ్ లో 20 వేలకు చేరువలో పాజిటివ్ కేసులు నమోదైతే, లక్షలోపు టెస్ట్స్ చేసిన తెలంగాణాలో 22000+ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పాటు 18.92% పాజిటివ్ రేట్ తో దేశంలోనే ప్రధమ స్థానంలో (పాజిటివ్ రేట్ నమోదులో) నిలిచింది. అదే సమయంలో వైద్య సదుపాయాల కల్పనలో లోపం కూడా కొట్టొచ్చినట్టు కనబడుతోంది. గాంధీ హాస్పిటల్ మినహా మరొక హాస్పిటల్ లేకపోవడం, నిర్వహణ సరిగా లేకపోవడం, నిర్లక్ష్యం వంటివి ఇవాళ్టి పరిస్థితికి కారణం.
            ఆంధ్రప్రదేశ్ లేదా ఇతర రాష్ట్రాలలో కరోనా కంట్రోల్ అయిందని నేను భావించడం లేదు. కాకపోతే అక్కడి ముఖ్యమంత్రులు, అధికారులు, వైద్యబృందాలు జాగరూకతతో ఉండటం కరోనా వ్యాప్తి స్థాయిని కొంచం అదుపులో ఉంచగలుగుతుంది అని చెప్పవచ్చు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థ అన్నది కరోనా వ్యాప్తి అదుపుకు బాగా సహకరిస్తోంది. విజయమైనా, వైఫల్యమైనా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారితో పాటు అధికారిక వ్యవస్థ కూడా బాధ్యులే అవుతారు కానీ నేటి రాజకీయాలలో అది ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న పార్టీ అధినేతలకు చెందుతోంది. అది మంచా, చెడా అని విశ్లేషించే స్థాయి దాటిపోయింది. ప్రత్యేకించి మీడియాను ఎలా వాడుకోవాలో కొందరు చూపిన తరువాత ఈ ప్రచారం చేసుకోవడం అనేది తప్పనిసరి అయింది. కరోనా అదుపు అన్నది మీడియా మానేజ్మెంట్ స్థాయికి దిగజారిపోకూడదు. పూర్తిస్థాయి మెడిసిన్ లేదా వాక్సిన్ వచ్చేవరకూ సూచించబడిన జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండటం అన్నది ప్రజల బాధ్యత.
            ఒక మాట - కెసిఆర్ అంటే భయపడాల్సిన అవసరం కానీ, అగత్యం కానీ నాకు లేవు. కెసిఆర్ అనే కాదు ఎవరికైనా భయపడాల్సిన అవసరం లేదు, అలాగే ఎవరి మీద ప్రత్యేకమైన ప్రేమా లేదు. హైదరాబాద్ నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం. నా సోదరిలు, ప్రాణ మిత్రుడితో పాటు, అనేకమంది నాకు అత్యంత ఇష్టులు అక్కడ ఉన్నారు. ఇంతా చెప్పానా, ఇపుడు పూరి జగన్నాథ్ గుర్తొచ్చాడు - అంటే ఏం లేదు 'మనది జింక మీద జాలి కాదు, సింహం మీద కోపం' అని పూరి చెప్పినట్టు, నాది 'తెలంగాణాలో పరిస్థితి పట్ల ఆందోళన కాదేమో, రాజేందర్ మీద కోపమేమో' అని అనిపించింది. అంతేనంటారా? ఏదైతేనేం - సాధ్యమైనంత త్వరగా కరోనాకు మందు/వాక్సిన్ కనుగొనబడాలి.మనమంతా మళ్ళీ జింకల్లా స్వేచ్ఛగా తిరగాలి.

Comments

  1. మీరు చెప్పినది కరెక్ట్.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన