... ఎవరిగోల వారిది
వంశీ కలుగోట్ల // ... ఎవరిగోల వారిది //
*********************************
వ్యాపారం చేయాలనుకునేవారికి ఉచిత సలహా ఒకటి ఇస్తాను - ఇది ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే అవిడియా, నాకు ఫీస్ ఏమీ వద్దు. మీరు తక్కువ ఖర్చుతో ఎక్కువ మరియు నిరంతర ఆదాయం పొందాలనుకుంటే - రెండు వ్యాపారాలు ఉన్నాయి.
ఒకటి
సారా వ్యాపారం. దీనికి మొదట్లో ఖర్చు కాస్త ఎక్కువే అవ్వొచ్చు. ఆ తరువాత మాత్రం అంతా ఆదాయమే. బాధతోనో. దిగులుతోనో, సంతోషంతోనో, కోపంతోనో, ఆవేదనతోనో, మనసు బాలేదనో, ఇంట్లో గొడవ పడ్డారనో ... ఇలా కారణమేదైతేనేం తాగడానికి. అంతేకాదండోయ్ మీరు గమనించారో లేదో - మనదేశంలో నేరాలు చేసినవారిలో దాదాపు 70% దాకా నేరస్థులు మద్యం మత్తులో ఉండగా నేరం చేశారు లేదా నేరం చేయటానికి మద్యంతాగి ఉంటారు. (70% అన్నది కాస్త అటూ ఇటూగా ఉండవచ్చు) ఈ విషయం తెలిసినప్పటికీ ప్రభుత్వాలు మద్యనిషేధం లేదా మద్యం అమ్మకాలపై నియంత్రణ వంటి చర్యలు చేపట్టే ఆలోచన మాత్రంచేయడం కష్టం ఎందుకంటే దానిద్వారా వచ్చే ఆదాయం ఒకానొక ప్రధాన ఆదాయవనరు కాబట్టి. మద్యం అమ్మకాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా మంచి లాభసాటి అయిన మరియు నిరంతర ఆదాయం ఇచ్చే వ్యాపార మార్గం.
రెండు
కొవ్వొత్తులు మరియు పోస్టర్స్ ప్రింటింగ్ వ్యాపారం. పైన చెప్పుకున్నాం కదా నేరాలకు ప్రధాన కారణం మద్యం కావచ్చునని. నిరంతరం అలాంటి నేరాలు, ముఖ్యంగా ఆడవారిపై జరుగుతూనే ఉంటాయి. వెహికల్ చెడిపోయి/పంచర్ అయి రోడ్డు పక్కన ఉన్న మహిళ అయితేనేం; కన్నకూతురైనా, నెలల పాసిపాపైనా, పండు ముదుసలి అయినా; బలహీన వర్గాల మహిళో, ప్రతిఘటించలేని అబలో - ఆడవారిమీద ఎక్కడో ఒకచోట నిత్యం ఆకృత్యాలు జరుగుతూనే ఉంటాయి. జరిగిన ప్రతిసారీ కొవ్వొత్తులతో నిరసన, పోస్టర్స్ తో ఉద్యమం చేయడం పరిపాటి. అలాగే నేరస్థులను ఉరి తీసినా, మరో రకంగా చంపినా కూడా మరో వర్గం వారు మళ్ళీ కొవ్వొత్తులు, పోస్టర్స్ తో తయారు. కాబట్టి ఇది కూడా మంచి లాభసాటి వ్యాపారమే.
గమనిక: ఇది కేవలం వ్యాపారం చేయాలనుకునే ఔత్సాహికవర్గాలవారి హితమై జారీ చేయబడిన, ఎటువంటి లాభాపేక్షలేని ప్రకటన. ఎవరినీ కించపరచాలనో లేక అవమానించాలనో ఎటువంటి దురుద్దేశాలు లేని ప్రకటన - ఒకవేళ ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే అది కేవలం యాధృచ్చికమైనటువంటి కాకతాళీయమే తప్ప ఉద్దేశపూర్వకం కాదని సవినయంగా మనవి చేసుకుంటూ, ఇందులోని సెటైర్ అర్థం కానీ వారికి మరియు అర్థం చేసుకోలేని వారికి కూడా - బేషరతుగా ముందస్తు క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను.
It is in poor taste. This isn't a matter for jesting.
ReplyDeleteపర్లేదండీ, స్పందనకు ధన్యవాదాలు. నేను రాసే ప్రతిది మామూలుగా ఉన్నదనిపిస్తే చేయాలనుకునే అల్పసంతోషిని. అందరికీ నచ్చాలనేం లేదు, ఇది ఒక సెటైర్ ... కొందరి వ్యవహారసరళిపై.
Delete