... ముందుగా మీరు మారండి
వంశీ కలుగోట్ల // ... ముందుగా మీరు మారండి //
*************************************************
సమాజంలోని అనేకానేక సమస్యల గురించి విచ్చలవిడిగా మాట్లాడి, పోరాడే అభ్యుదయవాదులందరూ గమనించవలసింది ఏమిటంటే - ప్రస్తుతం వారు పోరాడే సమస్యల కంటే అతి ముఖ్యమైనవి వేరే ఉన్నాయి, ముఖ్యంగా పర్యావరణ సంబంధిత సమస్యలు. విషవాయువులు వాతావరణాన్ని, తద్వారా ఆరోగ్యాన్ని ఎంతగా కలుషితం చేస్తున్నాయో తెలియనిది కాదు. విషయవాయువులు అనగానే మనమంతా కనుబొమలెగరేసి పరిశ్రమల వైపు చూస్తాం. కానీ, పరిశ్రమలకంటే ఎక్కువగా వాహనాలు, ధూమపానం వల్ల వాతావరణం ఎక్కువగా కలుషితం అవుతోంది. కానీ, ఈ అభ్యుదయపోరాటవాదులలో అత్యధికులు వాహనాలను సౌకర్యం కోసం, సిగరెట్ ను స్టైల్ కోసమో లేక వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటం కోసమో, అలవాటు మానుకోలేకనో తాగుతున్నామని చెప్పుకుంటారు.
వీరంతా గమనించటానికి, తెలిసినా ఒప్పుకోవటానికి ఇష్టపడనిది లేదా ఆచరించకుండా ఏవేవో వంకలు చెప్పేది అయినా ధూమపానం అనబడే సిగరెట్/బీడీ వంటివి తాగటం వల్ల మీరొక్కరే నాశనమైతే పర్లేదు, కానీ మీకంటే ఎక్కువగా ఇతరులు నష్టపోతున్నారు. ఏం మీ అభ్యుదయవాదం, సమాజానికి మంచి చేయడం లాంటివి సిగరెట్ దగ్గర గుర్తుకు రావా? అయిదేళ్లపాటు మాత్రమే ఉండి, మార్చుకోగలిగే అవకాశం ఉన్న రాజకీయ పార్టీల పాలన గురించి నానా అవాకులూ, చవాకులూ పేలుతూ విమర్శించే అభ్యుదయ మేధావి వర్గాల వారు జీవితాలను నాశనం చేస్తున్న సిగరెట్ గురించి మాట్లాడరు ఎందుకు? మద్యపానం వంటి అలవాట్లు తాగేవాడిని, మహా అయితే వాడి కుటుంబాన్ని మాత్రమే నష్టపరుస్థాయి; కానీ ధూమపానం పొగ తాగేవాడితో పాటు, వాతావరణం కలుషితం చేస్తూ అనేకమందిని బ్రాంఖైటిస్ వంటి ఊపిరితిత్తుల వ్యాధులకు గురయ్యేలా చేస్తున్నాయి - అనేకమంది చిన్నారులు కూడా వీటి బాధితులే. మరీ ముఖ్యంగా బ్రాంఖైటిస్ వంటి వ్యాధులకు గురవుతున్న అనేకమంది చిన్నారులను చూస్తే, ఎటువంటి పాపం ఎరుగని వారు, కనీసం ఇంకా మంచి చెడు వంటివి తెలియని వారు - వారికి ఎందుకిలా అని బాధ.
ఏ, నేనొక్కడినే తాగుతున్నానా లేకపోతే నేనొక్కడినీ మానేస్తే మారిపోతుందా? అయినా ఏదో రోజుకు ఒక నాలుగైదు సిగరెట్లు తాగే నా వల్ల ఏం నష్టం చెప్పు? ప్రేమలో విఫలమైతే లేదా మరో వైఫల్యం ఎదురైతే ఎలా ఉంటుందో నీకు తెలుసా - ఆ బాధనుండి బయటపడేసేదే ఈ అలవాటు - అంటూ సొల్లుకబుర్లు చెప్పే తొక్కనా డాష్ మేధావి అభ్యుదయవాదులల్లారా - తోలి అడుగు ఎపుడూ ఒంటరే అన్నది కానీ ఎవరికోసమో ఎదురుచూడటమెందుకు మనమే మొదలెడతాం వంటివి ధూమపానం విషయంలో గుర్తుకురావా? లేదా గురువిందగింజ తరహావాదులా మీరు? ధూమపానం ఆ అలవాటు ఉన్నవారికంటే ఎక్కువగా ఇతరులను బాధిస్తోంది, దెబ్బతీస్తోంది. మీ వైఫల్యాలకు చచ్చే ధైర్యం లేక ఇలాంటి అలవాట్లు చేసుకున్నామనే పలాయనవాదుల్లారా, మీ ఒక్కరిచావు ఆపుకుని అనేకమంది అనారోగ్యాలకు కారణమవుతున్నారు, ఇది సమర్థనీయమా? వేరేవారి మీదో పోరాటం చేయబోయే ముందు, మీతో మీరు పోరాటం చెయ్యండి. ఇతరులకు నష్టం చేసే మీ అలవాట్లను ఆపెయ్యండి - సమాజాన్ని మార్చాలని బయల్దేరే ముందుగా మీరు మారండి ...
ఆ ఒఖ్ఖటీ అడక్కు :)
ReplyDelete