వంశీ వ్యూ పాయింట్ // ... భావోద్వేగాలతో కదిలించే చిత్రం 'యాత్ర' //

వంశీ వ్యూ పాయింట్ // ... భావోద్వేగాలతో కదిలించే చిత్రం 'యాత్ర' //
******************************************************************** 
            వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ప్రధానాంశంగా రూపొందిన 'యాత్ర' చిత్రం గురించి చెప్పుకోవాలంటే, బహుశా బయోపిక్స్ లో ఇలా ఈవెంట్ బేస్డ్ బయోపిక్ అన్నది ఒక నూతన ఒరవడి అని చెప్పాలేమో. ఇక చిత్రం విషయాల్లోకి వెళ్ళే ముందుగా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే - మన తెలుగు రాష్ట్రాలలో ఒక రాజకీయ నాయకులలో సామాన్య ప్రజల్లో ఇంతటి ఇమేజ్ సంపాదించుకున్న రాజకీయ నాయకుడు ఇంతకుముందెవరూ లేరు. ఎన్టీఆర్ ఉన్నప్పటికీ, ఎన్టీఆర్ గారు కేవలం రాజకీయాల వల్ల కాదు - ముఖ్యంగా ఆయనకు సినిమాల వాళ్ళ, సినిమాలలో కూడా పౌరాణిక పాత్రల వల్ల ప్రజలలో లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ ఇమేజ్ ఆయన రాజకీయాల్లోకి రాకముందే ఉంది. వైఎస్ విషయంలో ఆయన కేవలం ఒక రాజకీయ నాయకుడు, అందునా ప్రాంతీయ నాయకులను అంతగా ఎదగనివ్వని జాతీయ కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం కొనసాగిన నాయకుడు. సినిమావాళ్ళ లాగా రాజకీయ నాయకుల జీవితాలు సాధారణ ప్రజలకు అంత మసాలా అందించేవి కావు. అందునా ఈ చిత్రానికి మూలవస్తువుగా తీసుకున్న పాదయాత్రలో ప్రతిరోజూ ఏం జరిగిందో మీడియా (ప్రత్యేకించి ఆ రెండు పత్రికలు) భూతద్దాల్లోంచి చూపబడ్డదే. అటువంటి అంశాన్ని సినిమాగా తియ్యాలనుకోవడం ఒక సాహసం. ఒకే ఒక చిత్రం అనుభవం ఉన్న దర్శకుడు మహి వి రాఘవ్ చేసిన ఈ సాహసం ఫలించిందా ... చూద్దాం. 2004 ముందస్తు ఎన్నికలకు ముందు ఉన్న పరిస్థితుల నేపథ్యంతో సినిమా మొదలవుతుంది. అధిష్టానం మాటను ధిక్కరించి, తానిచ్చిన మాటకు కట్టుబడే మనిషిగా వైఎస్ ను చూపుడం బావుంది. ముందస్తు ఎన్నికల ప్రకటనతో అప్పటికి నైరాశ్యంలో ఉన్న తమ పార్టీని గెలిపించుకోవడం అటుంచి, కనీసం గట్టి పోటీ ఇవ్వగలమా అన్న మీమాంసలో - అసలు రాజకీయాలనుండి నిష్క్రమిద్దామని అనుకున్న వ్యక్తి - ఆ తరువాత ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేయడం, ఆ పాదయాత్ర అతడిని వ్యక్తిగా మరింతగా ఎదిగేలా చేయడంతో పాటు, అతడి శతృవులను కూడా మిత్రులుగా మలుస్తూ - ముఖ్యమంత్రిని చేయడం వరకూ సంఘటనల సమాహారమే 'యాత్ర' చిత్రం. 
            ఈ 'యాత్ర' చిత్రాన్ని రెండు కోణాల్లోంచి చూడాలి - ఒకటి ఒక సినిమాగా, రెండు రాజకీయ కోణంలోంచి. ముందుగా ఒక సినిమాగా చూస్తే దర్శకుడు మహి వి రాఘవ్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ముఖ్యంగా భావోద్వేగాలతో చూసే ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యేలా చేయగలిగాడు. ప్రధాన పాత్రతో మమేకమయ్యేలా, ఆ పాత్ర భావోద్వేగాలను ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేయడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. రాజశేఖర రెడ్డి అన్న వ్యక్తి ఒక పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు కాకుండా, ఒక కాల్పనిక పాత్ర అయ్యుంటే కనుక ఈ చిత్రం అత్యద్భుతంగా నిలబడే స్థాయిలో ఉంది. కానీ రాజకీయ, నాయకుడు అవడంతో రాజకీయ విభేదాల కారణంతో కొందరు దూరం ఉండే అవకాశం ఉంది. ఇక రాజకీయ కోణంలోంచి చూస్తే - ఈ చిత్రంలో రాజకీయంగా వివాదాస్పదం, సంచలనం చేయదగ్గ అంశాలు పుష్కలంగా చేర్చే అవకాశం ఉన్నప్పటికీ, అటువంటి వాటికి ఆస్కారం ఇవ్వలేదు. మొదట్లో బ్రీఫ్డ్ మీ లాంటి ఒకటి రెండు సెటైర్స్ వదిలేస్తే మరెక్కడా అవకాశం ఉన్నప్పటికీ రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయలేదు. ఒక వ్యక్తిగా రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వాన్ని, మనస్సును ఆవిష్కరించే ప్రయత్నంలో అల్లుకున్న సంఘటనలు ఆకట్టుకుంటాయి. మరీ ముఖ్యంగా రాజశేఖర రెడ్డి హామీల వెనుక ప్రేరణలుగా అల్లుకున్న ఘటనలు అత్యంత సహజంగా అనిపించడంతో పాటు, బాగా ఆకట్టుకుంటాయి. అప్పటి పరిస్థితులు తెలిసిన వారు, చూసినవారు, అనుభవించినవారు ఖచ్చితంగా కాదనలేని ఘటనలు అవి. ఇక వైఎస్ ను అధిష్టానంతో పోరాడే వ్యక్తిగా, ధిక్కరించే వ్యక్తిగా చూపడం ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే కోట్ల, నేదురుమల్లి, చెన్నారెడ్డి వంటి వారి హయాంలో కూడా వైఎస్ అధిష్టానం అభీష్టానికి వ్యతిరేకంగానే ఉండేవాడన్నది అప్పటి రాజకీయాలను ఎరిగినవారికి తెలిసిన సత్యం. అందుకే అప్పట్లో రాజశేఖర రెడ్డి గారిని 'నిత్య అసమ్మతి, అసంతృప్త నేత' అనేవారు. మనకు తెలిసిన కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి కాకముందు, అయ్యాక అధిష్టానంకు తలొగ్గకుండా - తన సొంత ఇమేజ్ సంపాదించుకున్న ఏకైక నాయకుడు వైఎస్. అతడి వ్యక్తిత్వ చిత్రణే ఈ 'యాత్ర'. 
            నటీనటుల గురించి చెప్పాలంటే, మమ్ముట్టిని వైఎస్ పాత్రకు ఎంచుకోవడం మరియు ఒప్పించడంతోనే దర్శకుడు సగం విజయం సాధించేశాడు. మమ్ముట్టి లేకపోతే ఈ చిత్రం లేదు అనేంతలా వైఎస్ పాత్రకు ప్రాణం పోశారాయన. ఓవర్ డ్రమాటిక్ గా లేకుండా, భావోద్వేగాలను హావభావాలతో, కళ్ళతో పలికించిన ఆయన గొప్ప నటన చిత్రాన్ని రాజకీయాలకు అతీతంగా ప్రేక్షకులను అలరించేలా నిలిపింది. చివర్లో రియల్ ఫుటేజ్ చూపేవరకూ అసలు వైఎస్ అంటే ఇతడే అనేంతగా మరిపిస్తాడు. వైఎస్ ను దగ్గరినుండి చూసినవారు, ఆయన ఆత్మీయులు, అభిమానులు మైమరచిపోయేలా చేశాడు. కేవీపీ పాత్రలో రావు రమేష్ ఒదిగిపోయాడు. ప్రతి పాత్రకూ సమర్థులైన నటులను ఎంచుకోవడంతో పాటు, వారితో సరైన స్థాయిలో నటనను రాబట్టుకున్నారు. ఇక సాంకేతిక విభాగాలలో ముందుగా చెప్పుకోవలసింది మాటలు, రాజశేఖర్ పీవీఆర్ అందించిన సంభాషణలుఅనేక సన్నివేశాల్లో కదిలిస్తాయి. సున్నితంగా, సూటిగా ఉంటూనే సహజంగా ఉంటూ ఆకట్టుకుంటాయి. ఆయనే అందించిన కథనం కూడా చాలా చక్కగా ఉంది. ఆ తరువాత చెప్పుకోవలసింది సిరివెన్నెల సాహిత్యం. ముఖ్యంగా 'పల్లెల్లో కళ ఉంది ...' పాట కదిలిస్తుంది. యాత్ర సినిమా ఒక క్లాసిక్ గా నిలిచిపోయేలా మలచిన దర్శకుడు మహి వి రాఘవ్ గురించి చెప్పుకోవాలి - రాజకీయ విమర్శలకు (ఒకటీ రెండూ ఉన్నప్పటికి) పెద్దగా తావివ్వకుండా, రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కించిన విధానం సూపర్బ్. 
            చివరగా ఒక్కమాట - మన తెలుగులో బయోపిక్స్ విషయంలో గతంలో వచ్చిన 'ఆంధ్రకేసరి' చిత్రం ఒక తార్కాణం అని చెప్పవచ్చు. కానీ, ఇటీవలి కాలంలో చెప్పుకోవాలంటే - ఎవరైనా బయోపిక్ తియ్యాలంటే ముందుగా నాగ్ అశ్విన్ (మహానటి) మరియు మహి వి రాఘవ్ ల దగ్గర నేర్చుకోవాలి అని చెప్పవచ్చు. మరొక ముఖ్య విషయం - సినిమాను ఇష్టపడేవారు చూడదగ్గ చిత్రం 'యాత్ర'. ఏ పార్టీ అభిమానులైనా ఇబ్బంది పడకుండా (ఒకటి రెండు సన్నివేశాలు - ముఖ్యంగా టెలిఫోన్ సంభాషణ, వెన్నుపోటు ప్రస్తావన మినహాయిస్తే) చూడవచ్చు. భావోద్వేగాలతో కదిలించే ఒక మంచి చిత్రం చూశామన్న భావనను నింపుకుని రావచ్చు. ఈ వాక్యం గుర్తుకుపెట్టుకుని, 'యాత్ర' చూసాక మళ్ళీ చదువుకోండి. 

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన