వంశీ వ్యూ పాయింట్ // '... ఎన్టీఆర్: కథానాయకుడు' చిత్రం //

వంశీ వ్యూ పాయింట్ // ... ఎన్టీఆర్: కథానాయకుడు చిత్రం //
*************************************************************
            ఎన్టీఆర్ - పరిచయం అక్కరలేని పేరు. తెలుగు సినిమా మరియు రాజకీయ రంగంపై ఒక చెరగని ముద్ర వేసిన ఒక లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ పేరు ఎన్టీఆర్. సినిమా రంగంలో ఉన్నపుడు ఎన్టీఆర్ నిబద్ధత గురించి చెప్పినా; రాజకీయ రంగంలో ఉన్నపుడు ఎన్టీఆర్ ఎవరినీ లెక్కచేయని, దేనికి వెనుకాడని ధైర్యం గురించి చెప్పినా ఒకరకమైన ఉత్తేజం కలుగుతుంది. ఎన్టీఆర్ అనే వ్యక్తి 'నభూతో న భవిష్యత్' అనేలా ఎదిగిన వ్యక్తి ఎన్టీఆర్. అటువంటి వ్యక్తి జీవితాన్ని తెరకెక్కుతుందంటే, అందునా స్వయానా అతడి కొడుకే తానే ఆ పాత్ర పోషిస్తూ తెరకెక్కిస్తున్నాడంటే అంచనాలు ఎవరికీ అందని స్థాయిలో ఉంటాయి. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ సినీ జీవితంలో తెరపై పోషించిన పాత్రలలో మరొకరిని ఊహించుకోవడం అసాధ్యం. ఎస్వీఆర్ లాంటి మహానటుడు పోషించిన పాత్రలలో కూడా తననే గుర్తుపెట్టుకునేలా చేసిన నటుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ పోషించిన పాత్రలను టచ్ చేయకపోవడమే మంచిది అనే భావన మరింత బలంగా కలగటానికి ఈ చిత్రం మరోమారు ఆస్కారమిచ్చింది.  
            సినిమాగా తీసిన ఎన్టీఆర్ జీవితం విషయానికి వస్తే - ఇదేమీ కథ కాదు, దాదాపుగా అందరికీ తెలిసినదే. ఎన్టీఆర్ నరాజకీయాల్లోకి వచ్చిన తరుణంలో, మరణించిన సమయంలో ఆయన గురించి అనేకానేక పత్రికలలో వచ్చిన విషయాలే తప్పించి కొత్తగా ఏమీ లేవు అనిపిస్తుంది. ఎన్టీఆర్ ను తోలి సన్నివేశం నుండి ఒక దైవాంశ సంభూతుడిగా చూపాలనుకోవడం రాంగ్. ఎన్టీఆర్ సినీ రంగంలోనే కాదు, జీవితంలోనూ అందరిలానే అనేకానేక సమస్యలెదుర్కొన్నాడు. కానీ, వాటితో పోరాడి నిలిచాడు. ఇందులో పోరాటం చూపలేదు, చిన్న చిన్న సమస్యల్లాంటివి చూపినా అవి కూడా ఎన్టీఆర్ ను కీర్తించేలా ఉన్నాయి తప్పించి పోరాటమెక్కడా లేదు. అసలు తోలి సన్నివేశంలో రెవెన్యూ కార్యాలయంలో ఎన్టీఆర్ తన సహోద్యోగులతో పాటు, పై అధికారిపై ఆజమాయిషీ చేయడం ఎబ్బెట్టుగా ఉంది. అక్కడి పని తీరు నచ్చకపోయి ఉండవచ్చు, అవినీతి ఇబ్బంది పెట్టి ఉండవచ్చు, కానీ ఆ ఆజమాయిషీ చేయడం అన్నది నప్పలేదు. ప్రతి సన్నివేశంలో అందరిపై ఎన్టీఆర్ పైచేయిగానే ఉంటాడు, ఎన్టీఆర్ ఖచ్చితంగా ఉంటాడు, ఎన్టీఆర్ నిజాయితీగా ఉంటాడు, ఎన్టీఆర్ గొప్పగా ఉంటాడు - ఎన్టీఆర్ వైఫల్యాలు ఎన్టీఆర్ వల్ల కాదు, ఇతరుల నిర్లక్ష్యం లాంటివాటి వల్లనే అన్నట్టుగా చూపారు. అనేక సన్నివేశాల్లో ఎన్టీఆర్ ను గొప్పగా చూపటానికి, ఇతరులను తక్కువగా చూపినట్టు అనిపిస్తుంది. (ఏఎన్నార్ తో సహా). మరొకటి - ఈ చిత్రాన్ని బసవతారకం కోణంలో చూపాలని అనుకోవడం. ఖచ్చితంగా భార్యకు తన భర్త గొప్పవాడిలానే ఉంటాడు, అందునా ఎన్టీఆర్ లాంటి వ్యక్తి భార్యకు. అక్కడే తొలి తప్పటడుగు పడిందేమో అనిపించింది. 
            ఇక అందరికీ తెలిసిన ఒక వ్యక్తి జీవితాన్ని, సినిమాగా తీస్తూ దానికి కథకుడిగా తనపేరు వేసుకోవడంతో క్రిష్ ఆంతర్యమేమిటో అర్థం కాలేదు. కథనం, దర్శకత్వం వరకూ పేరు వేసుకోవడం ఓకే - కానీ ఇందులో కథేముందండీ, అందరికీ తెలిసిన జీవితమేగా. అది పక్కనబెడితే, దర్శకత్వం, కథనం వంటి విషయాలను చూస్తే 'క్రిష్ కు ఏమైంది?' అనిపిస్తుంది. ఎక్కడా క్రిష్ మార్క్ లేదు. క్రిష్ సినిమా అంటే మామూలుగా భావోద్వేగాలతో నిండి ఉంటాయి, అవి ప్రేక్షకుడితో కనెక్ట్ అయ్యేలా తీస్తాడు. కానీ, గౌపుశాక చిత్రానికి తడబడిన క్రిష్, ఈ చిత్రంలో పూర్తిగా దారి తప్పాడు. ఇది చూస్తే, బహుశా కంగనా 'మణికర్ణిక' విషయంలో దర్శకత్వంలో వేలు పెట్టి మంచిపనే చేసిందేమో అనిపిస్తుంది. ఇక రెండవ అతి ముఖ్యమైన అంశం - కెమెరా వర్క్. పీరియాడిక్ లుక్ తీసుకురావడంలో విఫలమయ్యారు. ఇక నేపథ్య సంగీతం - కీరవాణి ఒక్క రాజమౌళితో తప్ప మిగతావారితో చేసే చిత్రాలకు సరైన సంగీతం ఇవ్వలేకపోవడం అతడి తప్పా లేక అతడి నుండి రాబట్టుకోవడం రాజమౌళి గొప్పతనమా అర్థం కాదు. గొప్పగా ఉంది అని చెప్పడానికి ఎక్కడా అవకాశం లేదు. మామూలు కమర్షియల్ సినిమాల్లో హీరో ఎలేవేషన్ కు ఉపయోగించే మ్యూజిక్ అక్కడక్కడా ఉంది. ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ కావడంలో సంగీతం కూడా ప్రధానపాత్ర పోషించింది. మిగతా ఎవ్వరి గురించి చెప్పుకోవడానికేమీ లేదు. సంభాషణలు కూడా పేలవంగా ఉన్నాయి. ఒక్క ఎన్టీఆర్ పాత్ర మీద మాత్రమే దృష్టి పెట్టి, మిగతా అన్నింటినీ లైట్ తీసుకున్నట్టున్నారు. ఎన్టీఆర్ తెర మీద కనబడితే చాలు అన్నది ఎన్టీఆర్ సినిమాల విషయాలలోనే తప్పింది, అందునా ఇక్కడ ఎన్టీఆర్ కూడా కాదు అన్నది ముందుగానే గుర్తెరగాల్సింది.
            నటీనటుల విషయానికి వస్తే - బసవతారకంగా విద్యాబాలన్ అలవోకగా నటించేసింది, సహజంగా కూడా ఉంది. ఇక ఎన్టీఆర్ పాత్ర పోషించిన బాలకృష్ణ - ముందుగా చెప్పుకున్నట్టు ఎన్టీఆర్ పాత్రలు పోషించినపుడు ఎన్టీఆర్ తో పోలిక వస్తుంది. అందునా ఇందులో జరిగిన అతి పెద్ద తప్పు ఏంటంటే - ఎన్టీఆర్ పోషించిన అనేకానేక గుర్తుండిపోయే పాత్రలను బాలకృష్ణ చేయడం. కొన్ని పాత్రలకైతే మేక్ అప్ వెగటు పుట్టించేలా ఉంది. (ఉదా: బృహన్నల పాత్ర) కొన్ని సన్నివేశాల్లో ఒరిజినల్ ఎన్టీఆర్ వాయిస్ అలానే ఉంచి, బాలకృష్ణ నటించడం కూడా అతకలేదు. ఎన్టీఆర్ తో పోలిక అన్నది పక్కనబెడితే, అనేక సన్నివేశాల్లో బాలకృష్ణ తేలిపోయాడు. బహుశా, హడావుడిగా తీయడం వల్లనేమో రి టేక్స్ తీసుకున్నట్టు లేరు. కొన్నివేశాల్లో మాత్రం బావుంది - రావణబ్రహ్మ పాత్రలో; మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ పెద్దయ్యాక, పంచె కట్టులో ఉన్న సన్నివేశాల్లో, పోలీస్ అధికారితో వాగ్వివాదం సన్నివేశంలో ఆకట్టుకున్నాడు. ఏఎన్నార్ గా సుమంత్ పర్వాలేదనిపిస్తాడు, మిగతా వారందరూ సన్నివేశ అవసరార్థం వచ్చి, వెళుతుంటారు తప్పించిపెద్దగా చెప్పుకోవడానికేమీ లేదు. 
            హిందీలో షోలే రీమేక్ గా ఆర్జీవీ తెరకెక్కించిన 'వర్మ కి ఆగ్' చిత్రం విడులయ్యాక, చారిత్రాత్మక డిసాస్టర్ గా డిక్లేర్ అయ్యాక, వర్మను ఎవరో 'ఇంత చెత్తగా ఎలా తీశారు సినిమాని' అని ఏదో ఇంటర్వ్యూలో అడిగారు. దానికి సమాధానంగా వర్మ 'గబ్బర్ సింగ్ పాత్రలో అమితాబ్ ను చూస్తూ నన్ను నేను మైమరిచిపోయా, ఇక మిగతాదేమీ అర్థం కాలేరు అని తలతిక్క సమాధానం ఇచ్చాడు. బహుశా, క్రిష్ కు అలాంటి సమాధానం ఇచ్చే ధైర్యం, తెగింపు లేవేమో. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం కేవలం కమర్షియల్ వైఫల్యం మాత్రమే కాదు. ఈ చిత్రాన్ని రూపకర్తలు ఎంత తేలికగా తీసుకున్నారో చిత్రం చూస్తే అర్థమవుతుంది. సావిత్రికి ఏమీ కానివారు కూడా, సావిత్రి జీవితాన్ని ఏంతో హృద్యంగా తెరకెక్కిస్తే; ఎన్టీఆర్ కు స్వయానా కొడుకు అయి ఉండీ బాలకృష్ణ ఈ చిత్రాన్ని ఇంత తేలికగా ఎలా తీసుకున్నాడు అని ఒక బాధ వెంటాడుతూనే ఉంటుంది సినిమా చూశాక. 

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన