వంశీ వ్యూ పాయింట్ - 'భరత్ అనే నేను'
వంశీ వ్యూ పాయింట్ - 'భరత్ అనే నేను'
**************************************
మొదటిసారి రాజకీయకోణంలో కథతో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించిన 'భరత్ అనే నేను' చిత్రం వచ్చింది. మహేష్ బాబు స్థాయి ఉన్న నటుడు ముఖ్యమంత్రి పాత్రతో అంటే, అంచనాలు ఊహకందని స్థాయిలో ఉంటాయి. అంతటి భారీ అంచనాలతో వచ్చిన 'భరత్ అనే నేను' అంచనాలు అందుకునే స్థాయిలో ఉందా లేదా ... చూద్దాం.
ముందుగా కథ - తెలుగులోనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 2010 లో వచ్చిన 'లీడర్' చిత్రానికి ఈ చిత్రానికి అతి ఎక్కువస్థాయిలో సారూప్యతలున్నాయి అని మొదలైన కొన్ని నిముషాల్లోనే అర్థమవుతుంది. ఇక అక్కడనుండి అడుగడుగునా అవే పోలికలు కనబడతాయి - మధ్యలో 'ఒకే ఒక్కడు'తో చిన్న చిన్న పోలికలు అదనపు సౌలభ్యం. కాకపొతే లీడర్ చిత్రంలో రానా పాత్ర ఉన్నంత బలంగా ఇందులో భరత్ పాత్ర ఉందని అనిపించదు. తండ్రి చనిపోవడంతో, గత్యంతరం లేని పరిస్థితుల్లో భరత్ ను ముఖ్యమంత్రిగా చేయవలసి వస్తుంది. రాజకీయానుభవం లేదు కాబట్టి, తమ చేతిలో కీలుబొమ్మగా పెట్టుకుని ఆడించవచ్చులే అనుకున్న భరత్, ప్రమాణ స్వీకారం మొదటిరోజే వారికి ఝలక్ ఇవ్వడంతో భరత్ ప్రస్థానం మొదలవుతుంది. కుటుంబకారణాల వలన చిన్నప్పటినుండి లండన్ లో పెరిగి, తండ్రి మరణంతో రాష్ట్రానికి వచ్చిన భరత్ లండన్ లోని పరిస్థితులతో పోల్చి చూసుకుంటూ - ఇక్కడ కూడా అక్కడలా మార్చాలని అనుకుంటాడు. జనాలలో బాధ్యత, జవాబుదారీతనం పెంచాలని ప్రయత్నం చేస్తాడు. అందులో అతడు ఎదుర్కొన్న సమస్యలు, అతడి పయనం - ఇదే 'భరత్ అనే నేను' చిత్రం.
కథ అనుకున్నపుడే ఖచ్చితంగా కొరటాల శివకు తెలుసు - దీనికి 'లీడర్' చిత్రానికి ఉన్న పోలికలు. అందుకే, సన్నివేశాల చిత్రీకరణలో, కథ చెప్పే విధానంలో, పాత్ర చిత్రణ విషయంలో తేడా చూపే ప్రయత్నం చేశాడు. కాకపొతే ఇందులో భరత్ పోరాటం ఒక స్థాయికి వెళ్ళాక వ్యక్తిగతంగా మారుతుంది. ఒక అతి పెద్ద మార్పు కోసం పోరాటం మొదలుపెట్టిన భరత్, ఒక అనూహ్య కారణం వలన - అందునా తగిన వివరణ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ, పారిపోయిన రీతిలో పదవి నుండి తప్పుకుంటాడు. భరత్ పాత్ర చిత్రణలో తగిన సామర్థ్యం లోపించింది. మహేష్ స్థాయి కోసమని, మాస్ జనాలకోసమని కొన్ని పోరాట సన్నివేశాలు ఇమిడ్చారు. పరిపాలన పరంగా మార్పులు/సంస్కరణలు చెయ్యాలనే ప్రయత్నంలో ఎదురయ్యే సమస్యలను బలంగా రాసుకోవడంలో విఫలమయ్యారు. ఎన్నో సినిమాల్లో చూపిన సమస్యలే మళ్ళీ చూపాల్సి రావడంతో రూపకర్తలకు చేతులు కట్టేసినట్టయింది. అయినా ఎక్కడా ఇబ్బంది పెట్టేలా లేకుండా, బోర్ కొట్టించకుండా, ఆకట్టుకునే రీతిలో తెరకెక్కించడం ఖచ్చితంగా కొరటాల శివ విజయం. ముఖ్యంగా కథనం - మాస్ జనాలకు పెద్దగా ఎక్కకపోవచ్చు కానీ, దీన్నొక పాఠంలా, డాక్యుమెంటరీలా తీశాడు.
నటీనటుల విషయానికి వస్తే - మహేష్ బాబు ఈ సినిమాను అన్నీ తానై మోశాడు. అతడి పాత్ర తప్పించి మిగతా పాత్రలకు అంతటి ప్రాధాన్యత కూడా లేకపోవడంతో ఎవరి గురించీ పెద్దగా చెప్పుకునే పని కూడా లేదు. మహేష్ బాబు పాత్ర పరిధి మేరకు అద్భుతంగా నటించాడు. ఆ పాత్రను మరింత బలంగా మలిచేందుకు తగిన సమస్యలను సృష్టించలేకపోవడంతో, పాత్రకంటే ఎక్కువగా మహేష్ బాబు స్టార్డమ్ మాత్రమే చిత్రాన్ని మోయాల్సి వచ్చింది. ఇక కథానాయిక కియారా అద్వానీ - పరిధి మేరకు చక్కగా పాత్రలో అమరింది. కథను మలుపు తిప్పే ఒక సన్నివేశం కోసం తన పాత్ర ఉంది, ఆ సన్నివేశానికి అవసరమైంది కాబట్టి - ముందే తన మీద భరత్ దృష్టి పడేలా చేసుకున్నారు. పాత్ర మేరకు నటించగలిగింది. ఇక ఎంతో బలంగా ఉండాల్సిన ప్రకాష్ రాజ్ పాత్ర, చేష్టలుడిగి, అవకాశం కోసం ఎదురు చూడాల్సి రావడంతో ఆ పాత్ర కాగితంపులిగా మాత్రమే మారింది. మిగతా పాత్రలేవీ అంతగా చెప్పుకోవాల్సిన స్థాయిలో లేవు, చెప్పుకోవాల్సిన అవసరమూ లేదు.
ఇక సాంకేతిక వర్గం విషయానికి వస్తే - తెర మీద మహేష్ బాబు ఈ సినిమాను మోస్తే, తెరవెనుక దేవిశ్రీ ప్రసాద్ తన నేపథ్య సంగీతం (బాక్గ్రౌండ్ మ్యూజిక్) తో మోశాడు. పాటల విషయంలో అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ, నేపథ్య సంగీతం మాత్రం అద్భుతం. రంగస్థలం చిత్రానికి 80 ల వాతావరణానికి తగినట్టు నేపథ్య సంగీతాన్ని అత్యద్భుతంగా అందించిన దేవిశ్రీ, ఇపుడు ఈ కాలపు కథకు తగినట్టు ఆకట్టుకునేలా సంగీతం అందించి - తనలోని వైవిధ్యాన్ని చూపాడు. పేలవమైన సన్నివేశాలను కూడా తన సంగీతంతో నిలబెట్టాడు. ఇక రవి కె చంద్రన్, తిరు ల ఛాయాగ్రహణం కూడా చక్కగా కుదిరింది. కూర్పు విషయంలో (ఎడిటింగ్) శ్రీకర ప్రసాద్ గారు కాస్త దృష్టి పెట్టాల్సిందేమో - ఒక పది, పదిహేను నిముషాలు తగ్గించగలిగి ఉండవచ్చు. మిగతా సాంకేతిక వర్గాలు సినిమాను ఇబ్బంది పెట్టకుండా, బలంగా నిలిచాయి.
మహేష్ అభిమానులకు, మహేష్ బాబును ముఖ్యమంత్రిగా చూసుకోవడం నచ్చవచ్చు, ఎప్పటిలానే అతడు ఈ సినిమాలో కూడా నటన విషయంలో, లుక్స్ విషయంలో ఆకట్టుకుంటాడు. సినిమా బావుంది, ఇబ్బంది పెట్టదు. అందునా రెండు డిజాస్టర్ ప్లాప్స్ తరువాత మహేష్ బాబుకు, అతడి అభిమానులకు సంబరాలు చేసుకునే విజయం అందించగలిగే విజయం అందించగలదు. ఈ సినిమా విజయం ఏ స్థాయిదైనప్పటికీ - అందులో మహేష్ బాబు కంటే, కొరటాల శివ మరియు దేవిశ్రీ ప్రసాద్ లకే ఎక్కువ క్రెడిట్ దక్కుతుందన్నది నా అభిప్రాయం. 'భరత్ అనే నేను' చూడక తప్పని చిత్రం (వీరిద్దరి గత చిత్రం శ్రీమంతుడులా) అని చెప్పే స్థాయి కాకపోయినప్పటికీ, చూసేందుకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, చూసిన తరువాత కూడా. ఇది కొరటాల శివ కోణంలో 'లీడర్' కథ.
Comments
Post a Comment