...స్పందించకపోతే

వంశీ కలుగోట్ల // ...స్పందించకపోతే //
**************************************
          అవును మన తెలుగు సినీ నటులెవ్వరూ హోదా విషయంలో పోరాటానికి ముందుకు రావటం లేదు, ఇపుడే కాదు గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా బహిరంగంగా మద్దతుగానో, వ్యతిరేకంగానో బయటపడినవారు అతి తక్కువ. ఇటువంటి ఘటన జరిగిన ప్రతిసారీ తమిళ నటులతో పోలిక వస్తుంటుంది. తమిళ నటీనటులు జల్లికట్టు విషయంలో కానీ, కావేరి జలవివాదం విషయంలో కానీ తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడిన తీరు నిజంగా ఆదర్శనీయమే అందులో ఎటువంటి సందేహమూ లేదు. కానీ, తెలుగు సినీ రంగానికి వస్తే అత్యంత కీలకమైన అంశమైన ప్రత్యేక హోదా విషయంలో కూడా ఎవరూ స్పందించడం లేదు. మొన్న మొన్నటివరకూ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న చిరంజీవి; రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా ఉన్న బాలకృష్ణ; ఇంకా చట్ట సభల్లో సభ్యులుగా ఉన్న మురళీమోహన్, శివప్రసాద్; విపరీతమైన ప్రజాదరణ ఉన్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ వంటివారు; శర్వానంద్, నాని, రామ్, సందీప్ కిషన్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి యువనటులు; ఇంకా తెలుగమ్మాయిలు, తెలుగు సినిమా ద్వారా పేరొందిన ఇతర అమ్మాయిలు ఎవరూ కూడా మొత్తం సినీ పరిశ్రమ తరఫున కలిసికట్టుగా పోరాడటం లేదు, పోరాటానికి ముందుకు రావటం లేదు. కొందరు మాత్రం ఏదో తమ పార్టీ జెండాల కింద కాసేపు గొంతు సవరించుకుని లేదా శివ ప్రసాద్ వంటివారు రోజుకో వేషం వేసి 'మమ' అనిపిస్తున్నారు. 
          ఇక్కడ మనం మన సినీ పరిశ్రమ వారినినిందించటంలో తప్పేమీ ఉన్నట్టు కనిపించదు, కాకపొతే ఒక వేలు మాత్రమే వారివైపు చూపుతోందనే నిజాన్ని మనం గుర్తించటానికి ఇష్టపడటం లేదు లేదా గుర్తించటం లేదు. గుర్తించటానికి ఇష్టపడని ఆ నిజమేమిటంటే తమిళనాడులో మన ప్రశంసలందుకుంటున్న ఈ సినీ నటీనటవర్గం అందరూ పోరాటంలో పాల్గొనక తప్పని పరిస్థితి సృష్టించబడింది. సృష్టించినదెవరో కాదు, తమిళనాడు ప్రజలు. అవును, రజనీ కాంత్ నుండి నిన్న మొన్న వచ్చిన జూనియర్ నటుడు/నటి వరకూ ఎవరైనా సరే స్పందించక తప్పటం లేదంటే అది వారిలో సామాజిక బాధ్యత వెళ్లి విరిసిందని కాదు, 'స్పందించకపోతే' అన్న భయాన్ని వారిలో కలిగించిన తమిళ జనాలదే ఆ గొప్పతనం. తమిళనాడులో రాజకీయాలు - సినిమా రంగం ఎపుడో పెనవేసుకుపోయాయి. అయినా ఒక్క సినిమా రంగం వారే కాదు - రాజకీయ నాయకులు కూడా ఒక్క తాటిపైకి వచ్చేలా చేసిన ఘనత తమిళ ప్రజలది (జల్లుకట్టు ఉద్యమం, కావేరి జల వివాద ఉద్యమం కొన్ని ఉదాహరణలు). మరి అదే సమయంలో మన తెలుగు ప్రజల తీరును గమనిస్తే - ప్రాంతాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా చీలికలు పేలికలయ్యారు. తమిళనాడులో ఇటువంటి విభేదాలు లేవా అంటే ఉన్నాయి - కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయంగా ఇతర రాష్ట్రాలతోనో లేదా కేంద్రంతోనో పోరాడవలసిన పరిస్థితి వస్తే ఇటువంటి విభేదాలన్నీ ఒక మెట్టు కిందకి దిగుతాయి. మన దగ్గర పరిస్థితి చూస్తూనే ఉన్నాం - ప్రతిపక్షాలు,మేధావి మరియు సంఘాలు అందరూ కలిసికట్టుగా ప్రత్యేకహోదా కోసం ఉద్యమబాట పెట్టినపుడు 'హోదాతో ఏమొస్తుంది, హోదా కంటే మిన్న అయిన ప్యాకేజీ సాధించాం' అంటూ బీరాలు పోయిన ముఖ్యమంత్రి పోలీస్ బలగాల సాయంతో హోదా ఉద్యమాన్ని అణచివేశాడు. ఇపుడు కూతలు పెడుతున్న ట్విట్టర్ పిట్ట పవన్ కళ్యాణ్ అపుడు కూడా ఒక ట్వీట్ చేసి, నిశ్శబ్దంగా గూట్లో ముడుచుకుని ఉండిపోయాడు. 
          ప్రజలూ అంతే - ప్రతిపక్షాలు, మేధావి మరియు విద్యార్థి సంఘాలు హోదా ఆవశ్యకతను ఎంతగా చెప్పినప్పటికీ దాన్ని రాజకీయ కోణంలో చూశారు తప్పించి రాష్ట్ర ప్రయోజనాల కోసం అధికార పక్షం మెడలు వంచలేకపోయారు - ఇక్కడ పచ్చ మీడియా బాధ్యతే అధికం. ఇక ఇపుడు నాలుగేళ్ళ సావాసం తరువాత ఎన్నికలు గుర్తొచ్చి పోరాటం పేరుతో ఆటలాడుతున్న చంద్రబాబుకు మద్దతుగా అంటూ 'ఐ యాం విత్ ...' అంటూ బోర్డులేసుకుని ఫోటోలు పెడుతున్న వాళ్ళంతా నాలుగేళ్ళు ఏమయ్యారు? వీళ్ళకు బుర్రలున్నాయా ... చంద్రబాబు ప్యాకేజీ అంటే హోదా అన్నవారిని తిడతారు, చంద్రబాబు హోదా అంటే అదేదో ఆయనే మొదలెట్టినట్టు బోర్డులేసుకుని ఎగబడతారు. ప్రజలు విడిపోయారు కులాల లెక్కన. వారి కులం ఆధిపత్యంలో ఉన్న పార్టీలు చేసినదే పోరాటంగా పరిగణిస్తున్నారు. అలాకాదు, తమిళనాడులో లాగా ప్రజలు ఒక్కతాటిపై ఉంది రాజకీయ పక్షాలు, సినీ నటీనటులు, ఇతరేతరులు అందరూ తమతో కలిసిరాక తప్పని పరిస్థితి కల్పించగలిగిన నాడే హోదా అయినా మరేదైనా సాధ్యమయ్యేది. బహుశా, తెలంగాణ ఉద్యమంతోనే అటువంటి ఐక్యత తెలుగు నేలపై ముగిసిపోయిందేమో. 
          ఇంత నలుపు తమ కింద పెట్టుకుని, ఏదో సినీ నటీనటులు మాత్రమే వెధవలన్నట్టు ఈ మహానుభావుల నీతులు చూస్తోంటే నవ్వొస్తోంది. తమిళ నటీనటులనే కాదబ్బా ... తమిళజనాలనూ చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. తమిళనాడులో జనాల వల్లే నటీనటుల్లో స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడింది ... ఇక్కడ కూడా అంతే, 'స్పందించకపోతే' అన్న భయాన్ని వారిలో కలిగించాలి. 

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన