వంశీ వ్యూ పాయింట్ - రంగస్థలం
వంశీ కలుగోట్ల // వంశీ వ్యూ పాయింట్ - రంగస్థలం //
*****************************************************
రంగస్థలం సినిమా గురించి రాసేముందు ఒక ముందుమాట లాంటిది. మనం సాధారణంగా గొప్ప నటులు, స్టార్స్ అంటూ సినీ నటులను రెండు వర్గాలుగా విభజిస్తుంటాం. స్టార్స్ నటించలేరని దాని భావం కాదు. స్టార్స్ గా ఎదిగిన వారిలో కథానుగుణంగా పాత్రలో ఇమిడిపోదామనే తపన కంటే పాత్రను ఓన్ చేసుకొని, తమ ప్రత్యేకతను చూపుకోవాలనే కోరిక అధికంగా ఉంటుంది - ఆ కోరిక వారిలోని నటుడిని డామినేట్ చేసి, కొన్నిసార్లు పాత్రను కథకంటే పెద్దదిగా చేస్తుంది. ఒకసారి అలాంటి చట్రంలో పడిపోయాక ముందుగా పాత్రను అనుకుని, దాని చుట్టూ కథ అల్లడం మొదలవుతుంది. ఇక పాత్రలోకి ఇమిడిపోవాలనే తపన ఉన్నవారు, కథలో భాగంగా ఉంటారు - గొప్ప నటులుగా ఎదుగుతారు. కమల్ హాసన్ మొదటినుండి కథలో భాగంగా కథానుగుణంగా పాత్రలోకి ఇమిడిపోయే తరహా చిత్రాలే అత్యధికంగా చేయడానికి ప్రాధాన్యతనివ్వడంతో గొప్ప నటుడుగా గుర్తింపు పొందాడు. అదే సమయంలో రజని కాంత్, చిరంజీవి వంటివారు పాత్రను తమశైలిలోకి మలచుకుని, కథను/సినిమాను తమ చుట్టూ తిప్పుకుంటూ గొప్ప స్టార్స్ గా, సినీ వ్యాపారాన్ని ప్రభావితం చెయ్యగలిగే అత్యంత శక్తిశాలురుగా ఎదిగారు. మన తెలుగులో చిరంజీవి తదనంతర తరం హీరోలలో మహేష్, ఎన్టీఆర్ జూనియర్ గొప్ప నటులుగా పేరు పొందినప్పటికీ వారు స్టార్స్ గా ఉండటానికే ప్రాధాన్యమిచ్చారు, ఇస్తున్నారు. ఇన్నాళ్ళకు గొప్ప స్టార్డం ఉన్నవారిలో పాత్రను ఓన్ చేసుకోకుండా, పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన ఒక నటుడిగా రంగస్థలం చిత్రంలో రామ్ చరణ్ అలరిస్తాడు. రామ్ చరణ్ లో ఈ పాత్రను తను ఓన్ చేసుకోవాలనే కోరికకంటే పాత్రలో తాను ఇమిడిపోవాలనే తపనే ఎక్కువగా కనిపించింది. ఇక్కడ నా ఉద్దేశం రామ్ చరణ్ ను గొప్ప నటులతో పోల్చడం కాదు, కానీ ఇటువంటి తరహా (కథలు కాదు, పాత్రలోకి తాను లీనమైపోయి పరకాయ ప్రవేశం చేసే తీరు కొనసాగిస్తే తను అత్యంత గొప్ప నటుడుగా దిగ్గజాల సరసన నిలబడే అవకాశాలు అధికం)
రంగస్థలం చిత్రంలో కథగా చెప్పుకోవడానికంటూ పెద్దగా ఏమీ లేదు. 80లలో పల్లెటూరి రాజకీయాలను ఆవిష్కరించారు. (ఇందులో చాలా సన్నివేశాలు నేను స్యయంగా చూసినవి, అందుకే ఒకసారి అలా గతంలోకి వెళ్ళొచ్చినట్టనిపించింది) 30 సంవత్సరాలుగా ప్రెసిడెంట్ గా ఏకచ్ఛత్రాధిపత్యం సాగిస్తున్న ఫణింద్ర భూపతి, తనకు ఎదురు తిరిగిన వారందరిని మట్టు పెట్టిస్తుంటాడు. చిట్టిబాబు లాంటి మొండి ఘటం చేతిలో అతను అంతమవడం, వర్ణ వివక్షతో కూతురిని ప్రేమించిన చిట్టిబాబు అన్నను చంపించిన దక్షిణామూర్తిని చంపి పగ తీర్చుకోవడంతో కథ ముగుస్తుంది. ఇందులో 80ల నాటి పల్లెటూరి రాజకీయాలు, వర్ణ వివక్ష, కుటుంబ సంబంధాలు, వ్యవసాయ ఇబ్బందులు, సొసైటీ లోన్స్ పేరిట సాగిన అరాచకాలు ఇలా ఒకటనేమిటి 80ల నాటి వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు అత్యంత సహజంగా తెరకెక్కించారు. ఆ నాస్టాల్జిక్ ఫీల్ సినిమా నిడివిని మర్చిపోయేలా చేసింది. దాదాపు మూడు గంటల సినిమా అయినప్పటికీ ఎక్కడా బోర్ కొట్టకుండా, లీనమైపోయి చూసేలా తెరకెక్కించిన సుకుమార్ గారికి ధన్యవాదాలు. ప్రతి ఒక్క పాత్రను తీర్చి దిద్దిన తీరు, ఆయా నటులు పాత్ర పోషించిన తీరు, అప్పటి ఎన్విరాన్మెంట్ ను రి క్రియేట్ చేసిన తీరు అద్భుతం. స్క్రీన్ ప్లే చక్కగా కుదిరింది, కామెడీ పేరిట అనవసర సన్నివేశాలను జొప్పించడమూ లేదు. ఒక్క జిగేల్ రాణి పాట తప్పించి, కథను పక్కదారి పట్టించే సన్నివేశాలు/పాటలు లేవు. రాజీ పడకుండా తెరకెక్కించడానికి సహకరించిన ప్రతి ఒక్కరూ ప్రశంసనీయులే.
నటీనటుల విషయానికి వస్తే ఇది రామ్ చరణ్ సినిమా. అంటే మిగతా పాత్రలు తక్కువ స్థాయిలో తీర్చి దిద్దబడ్డాయని కాదు. జగపతి బాబు, ఆది పాత్రలు కూడా రామ్ చరణ్ పాత్రతో సమానంగా ఉంటాయి. కానీ, రామ్ చరణ్ నటన అద్భుతం. చిట్టిబాబు పాత్రను అతడు ఎంతగా ప్రేమించాడో కానీ మననూ అంతలా ప్రేమించేలా చేస్తాడు. అమాయకత్వం, మొండితనం, ప్రేమ, కోపం, నిస్సహాయత, పగ, సహనం, ద్వేషం, అభిమానం - ఒకటనేమిటి ప్రతి భావాన్ని అద్భుతంగా పోషించాడు. అసలు ఇన్నాళ్ళూ 'ఇతడేం నటించగలడు' అన్న నోళ్ళతో (అందులో నేనూ ఒకడినినే) 'అద్భుతమైన నటుడు' అని పొగిడించుకునేలా చిట్టిబాబు పాత్రను పోషించాడు. చిట్టిబాబు గురించి చెప్పాలంటే మరో ప్రత్యేక వ్యాసం అవసరమేమో. ఇక సమంత రామలక్షి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. కథను ఇబ్బంది పెట్టించి, పక్కదారి పట్టించకపోయినా తనది కథకు పెద్దగా అవసరమైన పాత్ర కూడా కాదు. కానీ, సమంత అభినయం ఆకట్టుకుంటుంది. జగపతి బాబు, ఆది తమ పాత్రల్లో ఇద్దరూ పోటీ పడి నటించారు. జబర్దస్త్ మహేష్ ఇంత మంచి నటుడా అనిపిస్తాడు. ప్రకాష్ రాజ్ కు ఇది అలవాటైన పాత్రే. రంగమ్మత్తగా అనసూయ తన పాత్రలో చక్కగా ఇమిడిపోయింది. యాస పలకడంలో కొన్నిసార్లు తన ఇబ్బంది కనబడినా, పాత్రను చెడగొట్టలేదు. మిగతా నటీనటులందరూ పాత్ర పరిధుల మేరకు చక్కగా నటించారు. ఇంతమందినుండి ఇంత గొప్ప నటన రాబట్టుకున్న సుకుమార్ దర్శకత్వ ప్రతిభ అద్భుతం. ఇంతకాలం మామూలు జనాలకు అర్థం కానీ అతి తెలివి చిత్రాలు తీస్తాడని పేరుగాంచిన సుకుమార్ కు ఈ చిత్రం ఖచ్చితంగా గొప్ప పేరు తెచ్చింది. ఇంటెలిజెంట్ చిత్రాలు తీసుకురాని మరింత గొప్ప పేరు, వాణిజ్య విజయపు స్థాయి సుకుమార్ కు 'రంగస్థలం' అందించింది. 80 ల నాటి పల్లెటూరి రాజకీయాల ఇతివృత్తాన్ని నేపథ్యంగా తీసుకున్న సుకుమార్, పాత్రలను తీర్చి దిద్దిన తీరు ఆకట్టుకుంటుంది అదే ఈ చిత్రానికి బలం కూడానూ.
ఇక రంగస్థలం సాంకేతిక వర్గం విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ మరియు రత్నవేలు వీళ్ళిద్దరూ హీరోలు. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం అద్భుతం. ఇక రత్నవేలు ఫోటోగ్రఫీ కూడా. రంగస్థలం తెరపైన రామ్ చరణ్ అద్భుతంగా ఆకట్టుకుంటే, తెరవెనుక సాంకేతిక వర్గంలో దేవిశ్రీ, రత్నవేలు పనితీరు అద్భుతం అనిపిస్తుంది. ఇక సెట్టింగ్స్, ఎడిటింగ్ వంటి ఇతర సాంకేతిక వర్గాల పనితీరు కూడా సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి. మైత్రి మూవీస్ వారి నిర్మాణ విలువలు, దర్శకుడిని నమ్మి వెచ్చించిన ఖర్చు సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్ళాయి. క్రికెట్ లో బౌలింగ్ కు సంబంధిని తరచూ ఒక వాక్యం ప్రస్తావిస్తుంటారు 'బేసిక్ లైన్ అండ్ లెంగ్త్' తప్పకూడదు అని. సినిమా రూప కల్పనలో అటువంటి బేసిక్ లైన్ అండ్ లెంగ్త్ కు కట్టుబడిన సినిమా రంగస్థలం. ఈ సినిమాకు సంబంధించినంతవరకూ ప్రతి ఒక్కరూ ప్రశంసనీయులే, అభినందలకు అర్హులే. ఇక అవార్డులు వంటివి అంటారా, వాటి పందేరం ఎలా జరుగుతుందో మొన్ననే చూశాం కాబట్టి, అటువంటి వాటి మీద ఆశ పెట్టుకుని నిరాశకు లోను కాకుండా ఇటువంటి చిత్రాలు మరిన్ని వస్తే బావుంటుంది.
ఈ మధ్య కాలంలో విపరీతంగా నచ్చిన చిత్రాలు ఉన్నప్పటికీ, వాటికీ రంగస్థలం చిత్రానికి తేడా ఉంది. నోస్టాల్జిక్ ఫీలింగ్ ని కలిగించిన చిత్రం ఇది. చాలా సన్నివేశాలు స్వయంగా చూసినవి (అనుభవించినవి కాదు), చూసిన/అనుభవించిన వారిని తెలిసినవాడిని. చిన్నతనంలోకి అలా విహంగ వీక్షణం చేసుకునే అవకాశం కల్పించిన సుకుమార్ కి ధన్యవాదాలు. తనను తను ఆవిష్కరించుకున్న రామ్ చరణ్ కు అభినందనలు. వీలుంటే, వీలైనన్ని సార్లు మళ్ళీ మళ్ళీ చూడాలనుంది ఈ సినిమాను. ఇంకా రామ్ చరణ్ నటన కళ్ళముందు కనబడుతున్నట్టే, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం చెవులకు వినబడుతున్నట్టే ఉంది. చాలా రోజుల తరువాత సినిమా గురించి ఇంతలా ఫీల్ అయ్యే సినిమా అందించినందుకు సుకుమార్ కు మరోసారి ధన్యవాదాలు.
Comments
Post a Comment