జబర్దస్త్ గురించి
వంశీ కలుగోట్ల // ... జబర్దస్త్ //
******************************
పురాణాలలో కొన్ని కథలు విని ఉంటాం. అందులో ఎలా ఉంటుందంటే దేవుడిని విపరీతంగా పూజించే భక్తుడికంటే, దేవుడిని దూషించే వాడికే దేవుడు ప్రత్యక్షమవుతాడు లేదా దర్శనమిస్తాడు. దాన్ని ప్రశ్నించిన భక్తుడికి దేవుడు చెబుతాడు - 'నువ్వు అవసరం ఉన్నప్పుడో లేకపోతే నిర్దిష్ట సమయాల్లోనో నన్ను తలచుకుంటున్నావు కానీ వాడు అలా కాదు నిరంతరం నన్నే తలచుకుంటున్నాడు అందుకే వాడు మరణానంతరం నా లోకంలో నా సమక్షంలో సకల సుఖాలనుభవిస్తాడు' అని వివరిస్తాడు. ఈ జబర్దస్త్ గోలలో నాకొకటి అనిపిస్తోంది... ఈ జబర్దస్త్ ను ఎవరైతే అధికంగా విమర్శిస్తున్నారో వారే మళ్ళీ మళ్ళీచూస్తూ, షేర్ చేస్తూ ఆ టి.ఆర్.పి రేటింగ్ లు ఏవైతే ఉన్నాయో వాటికి కారణమవుతున్నారు. ఈ జబర్దస్త్ బాగా ప్రాచుర్యం పొందాక హేవిటో అది అనుకుని కొన్ని ఎపిసోడ్స్ చూశాను (అది కూడా చాలాకాలం క్రితం). అందులోని వెకిలితనం, బూతు, అశ్లీలత, వెటకారం తదితరాలు నాకు నచ్చలేదు. అప్పటినుండి ఇప్పటివరకూ మళ్ళీ చూడలేదు కూడా. అంతే కాదు, సాధ్యమైనంతవరకూ నా చుట్టూ ఉన్నవారికి దాన్ని చూడొద్దని చెప్పటానికే ప్రయత్నించాను. నాకు బూతు/అశ్లీలత/వెకిలితనం అనిపిం చింది వారికి అనిపించలేదట. నేను ఎవరినీ నిర్బంధించలేను, వివరించగలను తప్పించి. కాబట్టి, వారు చూడటాన్ని ఆపలేను. ఇపుడు వివాదం అవుతున్న ప్రతి విషయం, ఇలా ఉందట కదా అని వారిని అడిగితే 'అవునా, ఆ డైలాగ్ ఎక్కడ ఉందబ్బా, ఎపుడు వచ్చిందో అంతగా మేము గమనించలేదు' అన్నారు. నాకేమనిపించిందంటే, అందులో ఉన్న చెడును (మనకు అనిపించింది) వెతికి మరీ చూపుతూ, పంచుతున్నారేమో, తద్వారా అటువంటి వెకిలితనాన్ని ఇష్టపడే వారికి దాన్ని దగ్గర చేస్తూ ఆ కార్యక్రమ నిర్వాహకులకు ఇతోధికంగా సహాయం చేస్తున్నట్టున్నారు. అందుకే వారు ప్రేక్షకులకు కావలసినవాటికంటే ఎక్కువగా వివాదం చెయ్యటానికి ఎదురుచూసే వారికి కావలసిన అంశాలు జొప్పిస్తున్నారు. ఇంతకుముందు ఇలానే కొన్ని వివాదాలు, కొంతమందిపై దాడి గట్రాలు జరిగినపుడు ఈ కార్యక్రమం మరింత ప్రాచుర్యం పొందింది. అందుకే ముందుగా అందులో చెడు వుంది అంటూ ఊదరగొట్టే ముందు, వాటికి ప్రాచుర్యం కల్పించడం లేదా షేర్ చెయ్యటం మానండి. దాన్ని ఆపెయ్యడం లేదా తీరులో మార్పు తీసుకురావడం అన్నది రెండు వర్గాల అధీనంలో ఉంది - ఒకటి నిర్వాహకులు, రెండు ప్రభుత్వం. ఇపుడు కూడా కేవలం ఈ హైపర్ ఆది అన్న ఒక్క వ్యక్తి చుట్టూ కేంద్రీకృతమై వివాదం ఎందుకు రేగుతోంది అంటే - ఈ హైపర్ ఆది అనే వ్యక్తికత్తి మహేష్ అనే వ్యక్తితో రాజేసుకున్న వివాదం కారణంగా. ఇదే కార్యక్రమంలో మహిళలను, నలుపుగా ఉండేవారిని, పొట్టివారిని, బక్కవారిని, బట్టతల ఉన్నవారిని ... అబ్బో ఒకటేమిటి సకల వర్గాలను కవర్ చేస్తూ వెకిలితనం పండించే స్కిట్స్ ఇతరులు ఇంకా ఎక్కువగా చేస్తుంటారు. (ఇది నేను చూసిన అతి కొద్దీ కార్యక్రమాల ద్వారా మాత్రమే కలిగిన జ్ఞానం సుమీ, ఇక అన్నీ చూస్తే నా జ్ఞానం ఏ స్థాయిలో వృద్ధినొందుతుందో అని భయమేసి చూడటం మానేశా.) వారందరిని, కార్యక్రమాన్ని వదిలేసి కేవలం ఒక్క వ్యక్తి కేంద్రీకృతంగా వివాదం రాజేయడం అన్నది వైఫల్యానికి మొదటి అడుగుగా మారబోతోంది అని అనిపిస్తోంది. ఎందుకంటే వివాదం కారణంగా బహుశా హైపర్ ఆదిని కొంతకాలం పాటు కార్యక్రమం నుండి తప్పించవచ్చునేమో లేదా కొన్నాళ్ళు కార్యక్రమం తీరులో కాస్త అదుపు పాటించవచ్చు అంతకుమించి ఏమీ జరగదు. దాన్నే ఒక అద్భుత విజయంగా, పరిష్కారంగా భావించే ఉన్నత వర్గాలు అనగా ఈ బూతు తదితరాలను ఇష్టపడని సాంప్రదాయవాదులు సంబరాలు చేసుకుంటారు. అవునూ ... నాకొకటి అర్థం కాలేదు. ఎవరో రాసిన విధివిధానాలను అనగా సాంప్రదాయాలను చీల్చి చెండాడే మనం, ఇపుడు అవి కాదని మనం కొత్త సంప్రదాయాలు లిఖిస్తున్నామంటారా? బహుశా మనం తిట్టే ఆ సంప్రదాయాలు కూడా అప్పటి కాలంలో ఇలాటి పరిస్థితుల ప్రాబల్యం వల్ల ఉద్భవించాయేమో. ఏముందిలే ఎన్ని అనుకున్నా వాళ్ళు వాళ్ళు ఒకటి ...వీళ్ళు మేధావులు, వాళ్ళు సెలెబ్రిటీలు. వీళ్ళు రాసుకుంటారు, వాళ్ళు తీసుకుంటారు ... మనదేముందిలే శకుంతలాకియా సదువుకుంటాం, సూస్తాం - అలా ముందుకు సాగిపోతాం అంతే కదా. అవునూ ... ఫ్రీడమ్ అఫ్ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడేవారికి ఫ్రీడమ్ అఫ్ వ్యూయింగ్ గురించి అవిడియా లేదంటావా? అంటే అదేనే, నచ్చితే చూడు నచ్చకపోతే మానేయ్ అని. ఆళ్ళు సెప్పేది అదే కదా ... నాకనిపించింది రాస్తా, నచ్చితే సదువుకో లేకపోతే మానేయ్ అని. అంతా సదివినంక నేను జబర్దస్త్ ని సపోర్ట్ సేస్తన్నా అని అన్నావంటే ... హ్మ్, అర్థమైనోళ్ళకి అర్థమైనంత అంతే.
Comments
Post a Comment