... ఆర్జీవీ

వంశీ కలుగోట్ల // ... ఆర్జీవీ //
*************************
Don't walk like you rule the world, walk like you don't care who rule the world.

రాం గోపాల్ వర్మ - పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పట్లో అయితే కేవలం సినీ ప్రేక్షకులకు మాత్రమే పరిచయం. కానీ ఎప్పుడైతే ఆర్జీవీ సామాజిక మాధ్యమపు గోడలెక్కడం మొదలెట్టాడో, అప్పటినుండి అందరికీ తెలిసిపోయాడు. తెలిసిపోవడమే కాదు ఒక ఇజమై కూచున్నాడు. నిజాయితీగా మాట్లాడతాడు అని కొందరు, నోటికొచ్చింది మాట్లాడతాడు అని కొందరు - ఇలా ఆర్జీవీని ఇష్టపడేవారు, ఇష్టపడనివారుగా ఏర్పడ్డారు. నిన్న 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే విత్ ఆర్జీవీ' ప్రోగ్రాం కాసింత చూశాను. గతంలోనూ కొన్ని ఆర్జీవీ ఇంటర్వ్యూలు చూశాను. వాటికీ, వీటికీ తేడా ఉందనిపించింది. విషయం గురించి కాదు, వర్మ గురించి. 'నేను అందరిలా కాదు' అనుకోవడం వేరు, 'నేను అందరికంటే వేరు' అనుకోవడం వేరు. నేను అందరిలా కాదు అనుకునేవాడు తనపని తానూ చేసుకుపోతాడు, నేను అందరికంటే వేరు అనుకునేవాడు అందరినీ కెలుకుతుంటాడు. నేను అందరిలా కాదు అనుకునే దశనుండి నేను అందరికంటే వేరు అనుకునే దశకు ఆర్జీవీ వచ్చాడనిపించింది. ఆర్జీవీ ఇజం అనుసరించేవారికి గమనిక - ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాబట్టి తమరు చొక్కాలు చించుకున్నా మరేమి చేసినా, వర్మ స్టైల్ లో 'ఏం హీక్కుంటారో హీక్కోండి' అనేస్తున్నాను కాబట్టి మీ ఇష్టం. ఒక దర్శకుడిగా ఆర్జీవీ లేదా దర్శకుడు ఆర్జీవీ అంటే నాకు విపరీతమైన అభిమానం. ఆర్జీవీ ఒక ఆదర్శం మాత్రమే కాదు, జాడ్యం కూడా. ఇదే ఇంటర్వ్యూలో ఆర్కే గారు ఒక ప్రశ్న అడిగారు 'మీ అమ్మగారు ఒక సందర్భంలో 'వాడు ఇది కాదు, నటిస్తున్నాడు' అన్నారు. దానికి మీరేమంటారు' అని అడిగాడు. ఇక్కడ ఆర్జీవీ సమాధానం అప్రస్తుతం, ఎందుకంటే ఆ అమ్మ అభిప్రాయం నిజంలాగా ఈ ఇంటర్వ్యూలో కనిపించింది. (నా అభిప్రాయం మాత్రమే సుమీ) ఎవరైనా మనస్తత్వ విశ్లేషకులను అభిప్రాయం అడిగితే (సైన్స్ పరంగా మాట్లాడుతున్నాను సుమండీ) సాంకేతిక పదాలతో మరింత బాగా వివరించగలరని నా నమ్మకం. ఆర్జీవీ తనని అదిమి పెట్టుకుంటున్నాడు లేదా అణిచేసుకుంటున్నాడు. బొమ్మరిల్లు సినిమాలో 'మిమ్మల్ని గెలిపించడానికి ఇరవై మూడేళ్ళుగా నేను ఓడిపోతూనే ఉన్నాను' అంటాడు సిద్ధార్థ. (23 లేదా 25) అలా ఆర్జీవీ అనబడే సెలబ్రిటీ అంటే ఇలా ఉంటాడు అనే అభిప్రాయాన్ని గెలిపించటానికి రాం గోపాల్ వర్మ అనబడే మనిషి ఓడిపోతూన్నట్టుగా అనిపిస్తోంది. 'ప్రపంచం నా గురించి ఏమనుకున్నా సంబంధం లేదు' అనుకుంటూ, చివరకు తాను అలా కాకుండా భిన్నంగా ఉంటే ప్రపంచం తనను అలా అనుకోదేమో అనుకుంటూ ప్రపంచాన్ని పట్టించుకుంటున్న సందిగ్ధం కనిపించింది అతడిలో. 'జనాలు తన గురించి ఏమనుకుంటారో' అనే భయమే అతడిని మారకుండా ఉంచేస్తోంది లేదా అతడిలో మార్పు కనబడకుండా దాచేస్తోంది. ప్రపంచాన్ని పట్టించుకోకపోవడం అనేది భావన కాదు, అది ఒక ఆచరణ. ఆర్జీవీ పరవాలేదయ్యా ఆ భావనలోంచి బయటకురా ... నిన్ను నువ్వు పునరావిష్కరించుకో. ఇలా అనుకుంటారేమో, అలా భావిస్తారేమో అని అపోహలొద్దు.

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన