ప్రపంచస్థాయి అదీ ప్రపంచస్థాయి ఇదీ ...

ప్రపంచస్థాయి అదీ ప్రపంచస్థాయి ఇదీ ... 

****************************************
       ఒకనాటి సమైక్య తెలుగు రాష్ట్రం పాలనాపరంగా, సాంకేతికంగా, సామాజికంగా, భౌగొళికంగా విడిపోయిమూడు సంవత్సరాలు కావస్తోంది. ఒకటిగా ఉన్న 'తెలుగు' ప్రజలు రాజకీయ కారణాల వల్లనో మరే ఇతర కారణాల వల్లనో రెండు రాష్ట్రాలుగా విడిపోయారు. ఇప్పుడు విభజనకు కారణాలు గట్రా వెతకటం అనవసరం. కానీ, ఎవరి దారి వారు చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి, కష్టమో నష్టమో తప్పదు. కొన్ని మరిచిపోవాలి. నేటి తెలంగాణా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు ఆంధ్ర/రాయలసీమ ప్రాంతం వారి వల్ల అభివృద్ది చెంది వుండవచ్చు అలాగే మరి కొన్ని ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురై తీవ్రంగా నష్టపోయివుండవచ్చు. కానీ, ఆ గతమంతా మరిచిపోయి వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తు వైపు ప్రయాణించాల్సిన తరుణం ఇది. తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కానీ, ఇతర తెలంగాణా నాయకులు కానీ చేస్తున్నది అదే. తెలంగాణా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే బహిరంగ [ప్రయత్నాల వెనుక తమ పార్టీని తిరుగులేని శక్తిగా మలచుకోవాలనే అంతర్గత ప్రయత్నాలు, తన/తమ వారసులకు ఎదురు లేకుండా చేసుకోవాలనే ప్రయత్నాలు ఉండొచ్చు ఉండి తీరతాయి కూడా. కాకపొతే, ఆ అంతర్గత ప్రయత్నాలకు ఊతమిచ్చే విధంగానే వారి పథకాలు ఉన్నాయి. అంటే కాదు, జరిగే పని కూడా కేవలం బాకా ఊదే మీడియాకు మాత్రమే కాక మామూలు కళ్ళకు కూడా కనబడుతోంది. ప్రచార పటాటోపం కంటే పనితీరు ఎక్కువగా కనబడుతోంది. బహుశా నేను చూసిన అతి కొద్ది ప్రాంతాలను; కలిసిన/అభిప్రాయం తెలుసుకున్న అతి కొద్ది మంది వ్యక్తుల ద్వారా ఆ నిర్ణయానికి రావటం ఒప్పు కాదేమో కానీ నాకు తెలియని దాని గురించి మాట్లాడటం మంచిది కాదు కాబట్టి తెలిసిన/తెలుసుకున్న దాని గురించే చెప్పాను. 
       ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికే వస్తే ఇప్పటికిమూడు సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా హైదరాబాద్ లోని రంగుల జీవితం మరచిపోలేదు. ఏ విషయం గురించి మాట్లాడినా 'హైదరాబాద్ ని మించిన స్థాయిలో, ప్రపంచ స్థాయిలో ...' అనే మాటలే వస్తున్నాయి. హైదరాబాద్ మనకు (ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి) ప్రామాణికం కాదు, కాకూడదు. ప్రపంచ స్థాయి అంటే ఏమిటో ఎవరికైనా అవగాహన ఉందా? ప్రపంచస్థాయి అంటే ఖర్చులోనా, భద్రతలోనా, చూడటానికా లేక మరింకే విధంగా? ఒక్క నిర్మాణమూ జరగకపోయినా ఖర్చు మాత్రం అంచనాలకు మించి అయి'పోయింది'. శాంతి భద్రతలు, వ్యవసాయ రంగం, రవాణా రంగం, పారిశ్రామిక రంగం, నిర్మాణ రంగం, పర్యాటక రంగం, శాస్త్ర సాంకేతిక రంగం - ఏ విభాగాన్నైనా తీసుకోండి అధికార పార్టీ వారు 'ప్రపంచ స్థాయి, ప్రపంచ స్థాయి' అంటూ ఊదరగొడుతున్నారు తప్ప జరుగుతున్న పనేమీ లేదు. అంతేకాక విపరీతంగా విదేశీపర్యటనలు చెయ్యటం, పోయిన ప్రతిచోటా చంద్రబాబు గారు 'హైదరాబాద్ కి ఆ స్థాయి కల్పించింది నేనే, హైదరాబాద్ నిర్మాతను నేనే, హైదరాబాద్ ఘనతంతా నాదే' అని గొప్పలు చెప్పుకోవటమే తప్ప ఈమూడు సంవత్సరాలలో నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమి ఉద్ధరించారో తెలియదు. అంతా ప్రచార పటాటోపమే తప్ప ఏమీ జరగటం లేదు. కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే కొద్దిపాటి పనులను తమ ఖాతాలో వేసుకుని చంకలు గుద్దుకోవటం బహుశా వారి దృష్టిలో 'ప్రపంచ స్థాయి' కాబోలు. వీటన్నిటికంటే అధికంగా ఇబ్బంది పెట్టేది ఏమిటంటే తెలంగాణా వారితో 'మీ ఆంధ్రోళ్ళకి ఇంకా ఇక్కడేం పని? మీది మీరు చూసుకోండి' అనిపించేలా తెలంగాణా రాజకీయాలలో వేళ్ళూ, కాళ్ళూ పెట్టి కెలకటం. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇలా ఉన్న ఈ తరుణంలో తెలంగాణాలో రాజకీయంగా పట్టు సాధించుకోవడానికి వెంపర్లాడి సాధించేదేముంది? ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చే అవకాశం కూడా లేదాయే. తెలంగాణాలో పట్టు సాధించాలని వెచ్చిస్తున్న సమయంలో/అర్థంలో(డబ్బు) సగం ఇక్కడ వెచ్చించినా ఏంతో కొంత పని జరిగే అవకాశం ఉంది.
       వీటన్నిటికంటే ఎక్కువగా 'ప్రపంచ స్థాయి' పైత్యం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పాలకవర్గాన్ని పట్టి పీడిస్తోంది. మాదీఫలరసాయనం లాంటి చిన్నా చితకా మందులకు తగ్గేలాగా కనబడట్లేదు ఈ ప్రపంచస్థాయి పైత్యం. ఈ పైత్యం వదలాలంటే ఏదో ఒక ప్రపంచస్థాయి మందు వాడాల్సినట్టు ఉంది. ప్రపంచస్థాయి రాజధాని, ప్రపంచస్థాయి విమానాశ్రయాలు, ప్రపంచస్థాయి రోడ్లు, ప్రపంచస్థాయి హై కోర్ట్, ప్రపంచస్థాయి నిర్మాణాలు, ప్రపంచస్థాయి సచివాలయం, ప్రపంచస్థాయి అతిధి గృహాలు, ప్రపంచస్థాయి అదీ ప్రపంచస్థాయి ఇదీ - ఏది మాట్లాడినా ప్రపంచస్థాయి అనే పదం చేర్చి మాట్లాడటం పరిపాటి అయిపోయింది. ప్రపంచస్థాయి ముఖ్యమంత్రి, ప్రపంచస్థాయి మంత్రివర్గం అయిపోయారు వీరంతా. వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పాలకవర్గమో లేక ప్రపంచస్థాయి (???) ఏదో ఒకదానికి పాలకవర్గమో అర్థం కావటం లేదు. అందుకే జరిగుతున్న అవినీతిని కూడా ప్రపంచ స్థాయి అవినీతి అనాలేమో. అన్నీ ప్రపంచస్థాయి అంటున్నారు కానీ వీరి ప్రవర్తనలో మాత్రం ప్రపంచస్థాయి కాదు కదా కనీసం మన దగ్గర నీచ తక్కువ స్థాయి అని చెప్పుకునేలా కూడా లేదు. ముందు దృష్టిని ప్రపంచస్థాయి నుండి సొంతింటి దాకా తీసుకు వస్తే వాస్తవ పరిస్థితి అర్థం అయ్యి ఏమైనా కాస్త పని చేస్తారేమో కానీ అవకాశం ఎక్కడ? అయినదానికీ కానిదానికీ కోట్లు ఖర్చు పెట్టటం, ప్రైవేటు విమానాలలో తిరగటం చేస్తుంటే 'ప్రపంచస్థాయి' కనబడుతుందే కానీ సామాన్యజనాల పరిస్థితి ఏమి కనబడుతుంది. ఈ ప్రపంచ స్థాయి పైత్యం ఎప్పటికి తగ్గుతుందో ... బహుశా 2018 రెండో అర్ధభాగానికి ఏమైనా కుదుటపడవచ్చునేమో, ఆ తరువాతి 2019 వ సంవత్సరంలో ఎన్నికలుంటాయి కాబట్టి.

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన