పుస్తకాలను కొనండి ...


పుస్తకాలను కొనండి ...
************************
"చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో"
       కవిత్వం, విలువలు ఉన్న సాహిత్యానికి పాఠకులు తగ్గుతున్నారు అనేది ప్రబలమవుతున్న భావన. కానీ, అదే సమయంలో కవిత్వం లేదా ఇతర సాహిత్యం రాసే వారి సంఖ్య; రాయటం పట్ల ఆసక్తి చూపుతున్న వారి సంఖ్యా పెరుగుతోంది. మరి సమస్య ఎక్కడుంది అంటే ... 'సాహిత్యాన్ని కొనటం' దగ్గర. ప్రధానంగా కవిత్వ ప్రధాన పుస్తకాలను ఉచితంగా ఇచ్చినా చదవటమే ఎక్కువ అనే భావన చాలా మందిలో ఉంది. కవిత్వానికి పాఠకులులేరా అంటే ఉన్నారు కానీ వారికి కవిత్వం ఉచితంగా కావాలి. ఈ పాఠకులు ఏమైనా పేదవారా అంటే కాదు, వీరిలో చాలామంది ఆర్థికంగా చాలా ఉన్నత స్థితిలో ఉన్నవారే. అయినా కూడా వీరికి కవిత్వ పుస్తకాలు ఉచితంగా కావాలి.
       ఈ పుస్తకాల ధర ఏమైనా ఎక్కువగా ఉంటుందా అంటే కాదు. ఇక్కడ నేను ఆ పుస్తకాల ధరను సినిమా టికెట్ ధరతోనో, బీర్ ధరతోనో గట్రా వాటితో పోల్చాలనుకోవటం లేదు. కానీ చాలావరకు అందుబాటులో ఉండే ధరలలోనే ఉంటున్నాయి. కవిత్వ పుస్తకాలను ప్రచురించటానికి ముందుకు వచ్చేవారిలో చాలామంది కవిత్వాన్ని నిలబెట్టాలన్న తపనతోనే కానీ డబ్బు వెనకేసుకోవాలనే తాపత్రయంతో ఉన్నవారు కాదు. అలాంటి వారికి , పుస్తకాలను కొనటం ద్వారా ప్రోత్సాహం అందించాలన్న ఆలోచన కూడా చెయ్యట్లేదు. పైరసీకి గురైన సినిమా గురించి వారి అభిమాన హీరో రోడ్దేక్కితే, పనిలేని పంఖాగాళ్ళు అందరూ వెనక నిలబడి మద్దతు పలుకుతారు. అందులే తప్పేమీ లేదు, ఎందుకంటే సినిమా తీసినవాడికి నష్టం వస్తే కష్టం కాబట్టి. అదే విధంగా పుస్తకాన్ని కూడా పరిగణించండి. ఒక మంచి పుస్తకం, ఎల్లకాలం తోడుండే మంచి మిత్రుడు లాంటిది. అలాంటి పుస్తకాన్ని రాసే వారికి, ప్రచురించే వారికి ప్రోత్సాహం అందించండి. విలాసాల మీద చేసే ఖర్చులో అణువంత కూడా కాని పుస్తకాన్ని కొనటానికి వెనుకాడవద్దు. క్షణంలో కరిగిపోయే విలాసాల వంటిది కాదది, కలకాలం వెంట వుండే విలువలను అందించే మంచి మిత్రుడు పుస్తకం.

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన