పోరాటం దారెటు?
పోరాటం దారెటు?
********************
ఆదిమ కాలం నుండీ ఏదో ఒక దానికోసం 'పోరాటం' అనేది జరుగుతూనే ఉంది. ఆహారం కోసం, ఆవాసం కోసం, అవసరాల కోసం, అస్థిత్వం కోసం ... అలా మనిషి ఎదుగుదలతో పాటు పోరాటం కూడా రూపాంతరం చెందుతూ వచ్చింది. కాకపోతే మనిషి ఏ విధంగా అయితే ఈ ఎదుగుదలతో ఇబ్బందులను ఎదుర్కుంటున్నాడో, పోరాటం కూడా అదే విధంగా అర్థం కోల్పోయి అవగాహన లేని నాయకుల చేతిలో అపసవ్యదిశగా పయనిస్తోంది. మేధావులుగా గుర్తింపబడినవారు, మేధావి వర్గంగా చెప్పుకునేవారు, వివిధ పోరాటాలకు నాయకత్వం వహిస్తున్నవారు, నాయకత్వం వహించాలని ఉవ్విళ్ళూరుతున్నవారు - వీరందరిలో కూడా తమ పోరాటం వాదానికి వ్యతిరేకంగానా లేక వ్యక్తికి/వ్యక్తులకు వ్యతిరేకంగానా అన్న విషయంలో అవగాహన లోపించింది. ********************
ఏ వాదమైనా అవి ఆచరణలో తప్పుదారి పట్టటానికి, తప్పుడు అభిప్రాయాలకు ఆస్కారమివ్వటానికి కారణం వ్యక్తులే. అదే విధంగా పోరాటాల వైఫల్యానికి కూడా కారణం వ్యక్తుల అసమర్థతే. పోరాటం తప్పు కాదు. కానీ, పోరాటం ఎవరి మీదో, దేని మీదో అర్థం కాకుండా, అవగాహన లేకుండా చెయ్యటం ఎటువంటి ఫలితాలను ఇవ్వగలదు? వ్యక్తుల అసమర్థత కారణంగా ఉత్పన్నమయిన సామాజిక దురవస్థకు వాదాలను తప్పు పట్టటం వల్ల పరిష్కారం లభ్యమవ్వదు. ఏ వాదమైనా అది పుట్టినప్పటి/రూపొందించబడినప్ పటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రూపొందించబడుతుంది. ఆ తరువాత కాలానుగుణంగా అవసరమైన మార్పులు, చేర్పులు సంతరించుకుంటుంది. ఉదాహరణకు మన రాజ్యాంగం విషయమే తీసుకుంటే అది అమలులోకి వచ్చినప్పటినుండీ ఎన్ని సవరణలు పొందిందో మనకు తెలుసు. ఏ వాదమైనా, విధానమైనా, సిద్ధాంతమైనా అంతే. ఉదాహరణలు ఈ పోరాటాలకు నాయకత్వం వహించే వారిలో చాలామంది అమెరికాను, అక్కడి వ్యవస్థను విమర్శించినవారే, అది కూడా మామూలుగా కాదు. అవకాశమే దక్కితే అమెరికా వ్యవస్థను కూకటివేళ్ళతో సహా పెకలించివెయ్యాలని సంకల్పించినవారే. అలాంటివారిలో చాలామంది నేడు అదే అమెరికా దేశంలో వసిస్తున్నారు - వారి పిల్లల కారణంగానో లేక మరి ఏ ఇతర కారణాలవల్లనైతేనేమి. ఇప్పుడు వారి దగ్గర ఆ విషయాలను కదిపి చూడండి. 'తప్పు అమెరికా వ్యవస్థలో కాదేమో, అక్కడి వ్యక్తులలో ఉన్నట్టుంది. అయినా మేము ఉన్న ప్రాంతంలోనైతే పర్వాలేదు' ... ఇంకా ఏవో గట్రా గట్రాలు చాలానే చెబుతారు. ఇష్టపూర్వకంగా, అతి తెలివితో వారు విస్మరిస్తున్నదేమిటంటే వారు అంతకు మునుపు పోరాడిన వాదం తీరు కూడా అంతే, వ్యక్తులే చెడ్డవారు.
మీరుండే ఊరిలో ఎవడో ఒక దొంగ ఉన్నాడు అనుకుందాం. అంతమాత్రాన మీ ఊరిని 'దొంగల ఊరు' అంటే ఒప్పుకుంటారా? ఎవడో ఒక వెధవను చూపి మా ఊరిని మొత్తాన్ని అదే గాటన కట్టేస్తారా అంటారు. ఊరి దాకా ఎందుకు ఒకే కుటుంబమైనా సరే అదే మాట సమాధానం వస్తుంది. మరి అలాంటప్పుడు ఆచరణలో తప్పుడు పోకడలు పోయిన కొంతమంది వ్యక్తులను చూపి వాదాలను తప్పుపడితే ఎలా అని అడిగితే మాత్రం ఆవేశం తన్నుకొస్తుంది - వెంటనే 'ఓహో నువ్వు ఆ వర్గం వాడివా' అనే మాట వస్తుంది, లేదా వెంటనే ఆ ముద్ర వేసేయ్యడం జరుగుతుంది. ఇప్పుడు ఏమి జరుగుతోందో మీరే చూస్తున్నారు - ఒక వ్యక్తి చేసిన ఉన్మాద చర్యలకు శిక్ష పడాలి అంటే వెంటనే అతడి కులాన్నో, మతాన్నో తెరమీదకు తెచ్చి వితండవాదం మొదలెడతారు, నీతులు చెబుతారు, పాఠాలు బోధిస్తారు. కానీ, ఒకవేళ ఇటువైపు వర్గం వారు ఏదైనా ఒక మాట అన్నా సరే మీద పడిపోతారు, మనోభావాలు దెబ్బతినడం మొదలవుతాయి, ఉద్యమాలు ఊపిరి పోసుకోవడం ప్రారంభమవుతుంది. తప్పు అన్నది కులానికి, మతానికి, వర్గానికి సంబంధించిన విషయం కాదు అలాగే శిక్ష అన్నది కూడా అంతే. శిక్ష విధించే న్యాయమూర్తి స్థానంలో ఉన్న కొంతమంది వ్యక్తులు కొన్ని సందర్భాలలో నిష్పక్షపాతంగా వ్యవహరించి ఉండకపోవచ్చు. ముందే చెప్పినట్టు కొంతమంది వ్యక్తులు చేసిన తప్పులు చూపి ఒక వర్గాన్ని తప్పు పట్టటం సమంజసం కాదు.
తమ పోరాటం వ్యవస్థకు/వాదానికి వ్యతిరేకమా లేక వ్యక్తులకు వ్యతిరేకమా అన్న అవగాహన, విచక్షణ లేకుండా ఒక దశా, దిశా లేకుండా సాగుతోంది కాబట్టే పోరాటం కూడా వారు వ్యతిరేకించే వాదం దిశలోనే నడుస్తోంది. ఉదాహరణకు గత సార్వత్రిక ఎన్నికలు గమనిస్తే ప్రతిపక్షాలన్నీ కేవలం 'నరేంద్ర మోడీ' అన్న ఒక వ్యక్తి మీదే దృష్టి కేంద్రీకరించి పోరాటం చేశాయి తద్వారా అతనెవరో తెలీని, పట్టించుకోని జనాలకు అతనెవరో తెలిసేలా చేసి సహాయం చేశారు. కానీ ఒక్కరు కూడా భాజపా లేదా ఎన్డీయే సిద్ధాంతాలు ఏమిటి, హామీలు ఏమిటి, అవి ఏ విధంగా తాము చెప్పే వాటికంటే తక్కువ అనే విషయాలు ప్రస్తావించలేదు. ఈ ఒక్క గత ఎన్నికలని కాదు అంతకుముందరి ఎన్నికలు, రాబోయే ఎన్నికలూ ఇలానే ఉంటాయి. పోరాటం దశ, దిశ మారనంతవరకు 'మార్పు' సాధ్యం కాదు.
Comments
Post a Comment