విభజన తరువాత తిరోగమిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ...

విభజన తరువాత తిరోగమిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ... 
******************************************************
       ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాలు జరుగుతున్న తీరు రాష్ట్రం ఎటువైపు పయనిస్తోందో సూచిస్తున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం బీహార్ రాష్ట్రంలో ఎలాంటి అరాచక పరిస్థితులు ఉండేవో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు అదే విధంగా తమిళనాడులో రాజకీయాలు ఎలా ఉంటాయో కూడా విశదీకరించనక్కరలేదు. దీని అర్థం గతంలో ఏదో అత్యద్భుత పరిస్థితులు ఉండేవి అని కాదు, కానీ విభజన జరిగిన నాటినుండి ప్రతి విషయంలోనూ అధికార పక్ష నేతలతో పాటు స్వయంగా అత్యంత అనుభవశాలి, స్వయంప్రకటిత నిప్పు అయినటువంటి చంద్రబాబు గారు వ్యవహరిస్తున్న తీరు రాష్ట్రం అతివేగంగా తిరోగమన దిశగా పయనిస్తున్న తీరు తెలుపుతోంది. ప్రతిపక్షాల మాటలు పక్కనబెడదాం, మిత్ర పక్షం భా.జ.పా కు చెందిన శాసన సభ్యుడు విష్ణుకుమార్ రాజు 'పచ్చ చొక్కా వేసుకోచ్చాను, మాట్లాడటానికి అవకాశం వస్తుందని' అని అనవలసి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అడుగడుగనా విలువలకు తూట్లే. సభేతర విషయాలను పక్కన బెడితే తీరు, లేవనెత్తే అంశాలు, వాటిని సాధికారికంగా విశదీకరించడంలో, భాష విషయంలో ప్రతిపక్షనేత జగన్ ను మాత్రం అభినందించితీరాలి. అదే విధంగా అధికార పక్ష సభ్యులు ఆటను లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పలేక తనపై ఉన్న అవినీతి ఆరోపణలు, కేసులను ప్రస్తావించి ఎంతగా రేచ్చాగోట్టాలని ప్రయత్నించినా చెప్పదలచుకున్న అంశానికి కట్టుబడి ఉండటం కూడా. కానీ, ఈ సహనం, సంయమనం ఎన్ని రోజులు కాపాడుకోగలరో కూడా చూడాలి 
       స్వయంగా తానూ రాయలసీమకు చెందినవాడే అయినప్పటికీ రాయలసీమను భాషలోనూ, సంస్కృతిలోనూ అవమానించిన చంద్రబాబు గారికి సభలో రాయలసీమ సభ్యులు, రాయలసీమేతర సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు చూపితే - ఆ అయినా చూపితే ఆయన 'ఆవేశంలో అలా మాట్లాడారు కానీ, ఆ ప్రాంతం వారు నెమ్మదస్తులు, మర్యాదస్తులు. తప్పంతా ప్రతిపక్షనేత జగన్'దే అనగలరు. ప్రతిపక్షానికి చెందిన సభ్యురాలు రోజాను సస్పెండ్ చేయడంలో చూపిన అత్యుత్సాహం కానీ, సభకు హాజరు కాని సభ్యులను కూడా సస్పెండ్ చేయగలిగిన విచక్షణాధికారంలో ఆవగింజంత కూడా స్పీకర్ గారు అధికార పక్ష నేతల పట్ల చూపటంలేదు. 'పాతెస్తా నా కొడకా, మగతనముంటే' గట్రా పదాలు బహుశా వీనులవిందుగా వినిపించి ఉంటాయేమో. అంతే కాకుండా స్పీకర్ గా ఉండి పార్టీ కార్యకలాపాలలో పాల్గొనడంకూడా. ఇప్పటి రాజకీయాలలో విలువలను ఆశించడం తప్పే అయినప్పటికీ మరీ ఇంతగా దిగాజారడమనేది మన తెలుగు రాష్ట్రాలలో కొత్త ఒరవడి. స్వయంగా ముఖ్యమంత్రి 'ఎలాగైనా ప్రతిపక్ష సభ్యులను మన పార్టీలోనికి చేర్చుకోండి' అని బహిరంగంగా అనడం అందులో 'ఎలాగైనా' అన్న పదం వాడకం ఎటువంటి 'నిప్పు మనిషి' విలువలో మరి ఆయనే స్వయంగా వివరించగలిగితే బావుంటుంది. ఇక రాజధాని నిర్మాణానికి సంబంధించి పోతున్న పోకడల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. గతంలో తాను జగన్ పై కానీ, మరెవరిపై కానీ ఆరోపణలు చేసినపుడు వ్యవరించిన తీరు గుర్తు లేదేమో ఎవరన్నా వీడియోలు చూపితే బాగుంటుంది. అప్పుడు పదే పదే సి.బి.ఐ విచారణ చెయ్యాలి అని కోరుతూ ఢిల్లీ గడపలు తొక్కిన విషయం గుర్తు లేదేమో. ఇప్పుడు సి.బి.ఐ విచారణ అంటే ఠాట్, కుదరనే కుదరదు అంటున్నారు. అదే విధంగా నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డితో వ్యవహరించిన తీరులో కూడా. ఆయనమీద ఉన్న కేసులు ఇప్పుడేమవుతాయో చూడాలి. ఆయనను తమ పార్టీలోకి చేర్చుకోవడానికి అవలబించిన పద్ధతులు ఏ విలువలో మరి. ఇక అదే విధంగా విలేఖరులతో వ్యవహరించే తీరు - స్వయంగా తానే వందలమార్లు వల్లించిన మాటలకు వివరణ అడిగితే 'ఏ నీ కల్లోకి వచ్చి చెప్పానా?' అని అడగటం అంతటి అనుభవాజ్నుడికి తగదు. గతంలోనంటే ఏమో కాని ఇప్పుడు వీడియో సాక్ష్యాలు ఉంటున్నాయి మహానుభావా. ప్రచారసభల్లో నోటికొచ్చినదంతా మాట్లాడేసి, ఇప్పుడు 'తూచ్' అంటే తమ పచ్చ మీడియాలో కూడా ప్రసారం చేసిన వీడియోలు అంతర్జాలంలో లెక్కకు మిక్కిలి దొరకగలవు. అయినా ఇక్కడ వాగ్దాన భంగం గురించి కంటే ఎక్కువగా ప్రవర్తించే తీరు గురించి. 
      ఇక అధికారపక్షనేతలు ప్రభుత్వ అధికారులతో వ్యవహరిస్తున్న తీరు. ప్రభుత్వ అధికారులలో చాలా మంది సాధారణంగా తమాకు ఇష్టం ఉన్నా లేకున్నా అధికారంలో ఉన్నవారికి అనుగుణంగా నడుచుకోక తప్పదు. అది ఈ ప్రభుత్వమైనా, గత ప్రభుత్వమైనా, అంతకు ముందరి ప్రభుత్వాలైనా. కానీ, ఇప్పుడు అధికారపక్ష నేతలు మరీ బరితెగించిపోయారు. ఎమ్మార్వో స్థాయిలో ఉన్న అధికారిని అందునా మహిళను కొడితే చర్యలు ఉండకపోగా ఆ అధికారి అడ్డుకున్నది అక్రమ ఇసుక రవాణా అయినా ఆమె పరిధి కాదు కాబట్టి తప్పు ఆమెదే అని తేల్చి చివాట్లు పెట్టటం గట్రా చర్యలు కాంగ్రెస్ పెద్దలు నేర్పిన అరాచకత్వానికే పాఠాలు నేర్పగాలిగేలా; గతంలో బిహార్ రాష్ట్ర పరిస్థితులతో సమానంగా ఉన్నాయి. మాటికోసారి, మాటకోసారి విలువలు అంటూ పలవరించే చంద్రబాబు గారు ముందుగా ఆ విలువలను తానూ కాస్తైనా పాటించగలిగితే బావుంటుంది. ప్రతిపక్షాలు లేవనెత్తిన ఏ ఒక్క అంశానికి స్వయంగా తానూ కూడా సరియైన సమాధానం ఇవ్వకుండా 'లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన నీవా నాకు చెప్పేది ...' అంటూ ఎదురుదాడికి దిగడం ఎంతవరకు సమంజసం. మరి తను కూడా ఆ 'లక్ష కోట్ల అవినీతి' కి ఆధారాలు చూపాలి కదా, ఆధారాలు లేకుండా లక్షకోట్ల అవినీతి అనడం ఏం బావుంది, ఒకవేళ ఆధారాలు ఉంటే తగిన చర్యలు కూడా తీసుకోవచ్చు కదా. కొండంతా తవ్వి సి.బి.ఐ న్యాయస్థానాల ముందు తేల్చిన లెక్క ఈయన ఆరోపించే లక్ష కొట్లలో పావలా వంతు కూడా లేదు, మరి పదే పదే 'లక్ష కోట్లు' అనడం ముఖ్యమంత్రిగా, అత్యంత అనుభవజ్నుడిగా ఎంతమాత్రం ప్రశంసనీయం కాదు. రాష్ట్రం విడిపోయిన ఈ తరుణంలో ప్రజలు తనకు అధికారం ఇచ్చింది అనుభవాన్ని నమ్మి. అనవసర ఆడంబరాలు మాని, నేలకు దిగకపోతే 'అధికారం శాశ్వతం కాదు' అని ఆ అనుభవం కూడా గడించిన చంద్రబాబు గారికి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. లేకపోతే రాష్ట్రం సర్వతోముఖ తిరోగమనానికి బాధ్యులుగా భావితరాల వారు గుర్తుంచుకునే స్థాయికి ఎదుగుతారు. 
       విభజన జరిగిన నాడు అందరూ అనుకున్నది తెలంగాణా రాష్ట్రం అతివేగంగా తిరోగమించి ఒకప్పటి బిహార్ రాష్ట్రంలా అరాచకానికి ఆలవాలమై ఉంటుంది అని. కానీ, ఇవ్వాళ తెలంగాణా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ది దిశగా దూసుకుపోతోంది. తీరులో, భాషలో కూడా ఒకప్పుడు అందరి విమర్శలు పొందిన అధికార తెరాస పక్ష నేతలు నేడు ప్రశంసలందుకొంటున్నారు. ఇక్కడ మన ఆర్ధిక మంత్రిగారు ఆంగ్లంలో బడ్జెట్ చదవి విమర్శలపాలవగా, తెలంగాణా రాష్ట్రంలో ఆర్ధిక మంత్రి తెలుగులో చదివి ప్రశంసలందుకొన్నారు. ఇక అత్యంత ప్రతిష్టాత్మకంగా, తెలుగు/ఆంధ్ర రాష్ట్రానికి గర్వకారణం కాగలదని ఊదరగొడుతున్న అమరావతి శంఖుస్థాపన శిలాఫలకం కూడా ఆంగ్లంలోనే ఏర్పాటు చేయడంతోనే అర్థం కాగా, ఇక తెలుగు భాష అమలులో చిత్తశుద్ధి ఏపాటిదో బడ్జెట్ ప్రసంగం తెలియజెప్పింది.
       ఒక్క తెలుగు భాష అమలు విషయం అనే కాదు, ప్రతి విషయంలోనూ ఆయా అంశాలకు సంబంధించి నిబంధనల ఉల్లంఘన జరుగుతూనే ఉంది. అది నిపుణులే కాదు, సామాన్యులు కూడా చెప్పగలిగెంతటి డొల్లతనం. ఇలా ప్రస్తావిస్తున్నానంటే గత ప్రభుత్వాలు అద్భుతంగా నిబంధనలకు లోబడి, జనరంజకంగా పాలించాయి; ఆయా పాలనా కాలంలో తప్పులు జరిగాయి. అధికార పక్షం గమనించాల్సిన విషయం ఏంటంటే గత ప్రభుత్వాలు అదుపు తప్పి ప్రవర్తించాయి అని జనాలు భావించారు కాబట్టే ఇప్పటి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. ఆ విషయం గుర్తెరిగి అనవసర ఆడంబరాలకు పోకుండా, సభ్యులు నోరు/చర్యలు కాస్త జనాల ముందైనా అదుపులో పెట్టుకునేలా, కనీసం జనాలకు కనిపించే చర్యల విషయంలోనైనా కాస్త జాగరూకత పాటించగలిగితే బావుంటుంది. ప్రధానమంత్రి, ఆర్థికంగా మిగులుబాటులో ఉన్న పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి ప్రైవేటు/చార్టర్డ్ విమానాలు వంటి విలాసాల జోలికి పోకుండా ఉంటే; ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం అని స్వయంగా ప్రకటించుకున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రిగారేమో కోట్లకు కోట్లు ఖర్చు చేసి ప్రైవేటు విమానాలలో తిరుగుతారు. అంతే కాక తాత్కాలిక సచివాలయానికి 200+ కోట్లు పెట్టి నిర్మించటానికి పూనుకోవటం వంటివి మానుకుంటే కాస్తైనా ఖర్చులు కలిసివస్తాయి అలాగే మిగతా వారికి ప్రత్యేకించి కేంద్రానికి పరిస్థితులు కూడా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే 'ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే దుబారా ఖర్చులెందుకు?' అనే ప్రశ్నకు సమాధానముండదు.
       ఇక శాంతిభద్రతలు గురించి - ప్రభుత్వ కార్యాలయంలో హత్యలు, అధికారులపై దౌర్జన్యాలు (కొట్టడంతో సహా), బెదిరింపులు, కాల్ మనీ సెక్స్ రాకెట్ స్కాంలో దోషి ఎమ్మెల్యేతో పాటు దర్జాగా విదేశీ ప్రయాణం, ఎవరిపైనైతే తమ ప్రభుత్వం పలు కేసులు బనాయించిందో ఆ వ్యక్తినే పార్టీలోకి చేర్చుకుని ఘనకార్యంలాగా పునీతుడని చెప్పుకోవడం, అంగన్వాడీ మహిళపై లాఠీ ఛార్జీ, ఋషితేశ్వరి కేసులో నిందితులపై తగిన చర్యలు లేకపోవటం, ఎక్కడైనా అధికార పార్టీ వారిపై ఆరోపణలు వచ్చాయంటే అక్కడి అధికారి బదిలీ - ఇలా ఎన్నని లెక్క పెట్టుకుంటూ పోయేది? అధికారులను ప్రజలముందు నిందించడం, పార్టీ వారిని ప్రోత్సహించటం గతంలో చంద్రబాబు గారు అవలంబించిన పద్ధతే, అదే దెబ్బ కూడా తీసింది. ఇప్పుడూ మళ్ళీ అదే పద్ధతిని మరిన్ని మెరుగులద్ది (అంటే అధికారులు తమ పార్టీ వారి చేతిలో దెబ్బలు తిన్నా వారికే అక్షింతలు వెయ్యటం లాంటివి) అమలు చేస్తున్నారు. ప్రత్యేకించి కొన్ని ప్రాంతాలలో ఈ ధోరణి మరీ ఎక్కువగా ఉంది. అంతే కాక ఏదైనా ఘటన జరిగినపుడు అధికారంలో ఉన్నవారు స్పందించే తీరు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి. కానీ, ఇప్పటి అధికార పక్షంలో ఏమి జరిగినా సరే ప్రతిపక్షంపై రుద్దాలన్న ఆత్రుత తప్ప బాధ్యతాయుతంగా ప్రవర్తించే లక్షణం కొరవడింది. ఉదాహరణకు చిత్తూరు మేయర్ హత్యకు గురైతే వెంటనే ముఖ్యమంత్రి కూడా దాన్ని ప్రతిపక్షాల చర్యగా అభివర్ణించే ప్రయత్నం చేశారు, కానీ జరిగినది కుటుంబ కలహాల కారణంగా అందునా అధికార పార్టీ సభ్యుల చేతనే. అదోక్కటీ అనే కాదు అసలు రాష్ట్రంలో ఏదేనా మూలాన ఒక ఊరకుక్క గట్టిగా మొరిగినా దానికి కారణం కూడా ప్రతిపక్షాలు అనే తరహా విమర్శలు అందునా అధికార పక్షం వారు చెయ్యటం శోచనీయం. ప్రతిపక్ష పాత్రపై ఆధారాలు ఉంటే చర్య తీసుకునే స్థాయిలో ఉన్నారు కదా, మరి ఇంకా ఆరోపణలెందుకు.
       తెలుగుదేశం పార్టీని మాత్రమే విమర్శిస్తున్నావే అంటే నువ్వు వైసిపీ వాడివా అంటూ కనుబొమలెగరేసే పచ్చచొక్కాల వారికి - అధికారంలో ఉన్నారు కాబట్టి, బాధ్యత వహించవలసిన వారు కాబట్టి ఎవరైనా వారినే అంటారు. జరిగిపోయిన ప్రతి తప్పుకు గత పాలకులనే (ఆ గతంలోంచి అతి తెలివిగా తమ పాలనలోని తప్పులను మాత్రం మినహాయించి) ఏ విధంగా తప్పుబడుతున్నారో అదే విధంగా జరుగుతున్న ప్రతి తప్పుకు సమాధానం చెప్పుకోవలసిన బాధ్యత; తప్పు జరగలేదని నిరూపించవలసిన బాధ్యత అధికార పక్షం మీదే ఉంది. ఆ నిరూపించుకోవడం అన్నది ప్రతిపక్షం మీద ఎదురు దాడితో, నిబంధలకు విరుద్ధంగా సభ నుండి పంపో కాదు. విచారణకు సిద్ధపడి, విచారణ జరిపించి అప్పుడు చెప్పుకోండి కడిగిన ముత్యాలం, నిప్పులం అని. అప్పుడు తమను పట్టుకొన్నళ్ళకు కాలిపోగలదేమో చూద్దాం. రాష్ట్ర విభజన జరిగినపుడు తెలంగాణా రాష్ట్రం తిరోగమిస్తుంది అని అందరూ అనుకున్నారు. అందునా ఎన్నికలు అయ్యాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు పగ్గాలు చేపట్టటంతో ఇక అంతా అద్భుతమే అని ఊకదంపుడు ప్రచారం మొదలు. ఇక ఆంధ్ర అభివృద్ది కేవలం చిటికేల్లో పని, తెలంగాణా వారు విడిపోయినందుకు బాధపడేలా చేస్తాడు చంద్రబాబు అనుకున్నారు. కానీ, ఇవ్వాళ సరిగ్గా దానికి వ్యతిరేకదిశలో జరుగుతోంది. రాబోవు రోజుల్లో ఏమవుతుందో చూడాలి ...

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన