... గురువిందగింజలు 

వంశీ కాలుగొట్ల // ... గురువిందగింజలు //
************************************
            వరదలొచ్చాయి, భూకంపం వచ్చింది ... అవీ కాకపొతే ఇంకోటి. ప్రతిసారీ ఒక బ్యాచ్ ఉంటుంది సినిమావాళ్ళ మీదవిమర్శలు చేయటానికి. "సినిమా వాళ్ళెంత ఇచ్చారు? ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వలేదు కదా - ఇక వారి సినిమాలు చూడటం మానెయ్యండి" ... ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సాధారణం అయిపోయింది. సినిమా వాళ్ళు మన మెడ మీద కత్తి పెట్టిదోపిడీలు చెయ్యట్లేదు; ప్రజల బాగు కోసం, సమాజ అభివృద్ధి కోసం కేటాయించిన పథకాల డబ్బును దోచుకోవట్లేదు; ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకుంటూ కూడా, చేయాల్సిన పని కోసం లంచం అడిగి సంపాదించట్లేదు ... వాళ్ళ నటన, ఆట, పాట నచ్చి మనం చూసి హిట్ చేసిన సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్ తో సంపాదించుకున్నారు. ఛండాలంగా ఉన్నాయని, బాలేవని మనం తిప్పికొట్టిన సినిమాల ద్వారా నష్టాలు కూడా పొందారు.
            మీకు దమ్ముంటే మీ ఏరియా ఎమ్మెల్యేని, అప్పోజిషన్ ఎమ్మెల్యే కాండిడేట్ ని, వ్యాపారులని, ఉద్యోగుల్ని ... లాంటి వాళ్ళందరిని ఎంత ఇచ్చారో అడగండి, ఎందుకు ఇవ్వలేదో (ఇవ్వకపోయుంటే) నిలదీయండి. సినిమా వాళ్ళు విరాళాలివ్వకపోతే వాళ్ళ సినిమాలు చూడం అంటున్నారు కదా - రాజకీయ నాయకులు విరాళమివ్వకపోతే వారికి వోట్ వేయమని ప్రకటించండి, రాబోయే ఎన్నికల్లో వారికి టికెట్ ఇవ్వొద్దని వారి పార్టీకి మీ ఏరియా తరఫున తీర్మానం చేసి పంపండి, విరాళమివ్వని వ్యాపారి కొట్టు (షాప్) లో ఏమీ కొనకుండా బహిష్కరించండి - ఏం? కుదరదు కదూ, దమ్ము లేదు కదూ. సినిమా వాళ్ళంటే ఉద్దరకొచ్చారా? అయినా సినిమా వాళ్ళను అభిమానిస్తే అది సినిమాల వరకే ఉంచండి - ప్రతి దాంట్లోకి వాళ్ళను లాగకండి.
            అయినా నేనైతే సినిమా నచ్చితే చూస్తాను, అంతేకానీ సినిమా బాలేకపోతే ఆ నటుడు సమాజసేవ చేస్తాడు కదాని రెండున్నర గంటల తలనొప్పిని భరించను. సమాజ సేవకు, సినిమాలకు సంబంధం లేదు. ఒక్క ప్రశ్న, ఒక్కటంటే ఒక్క ప్రశ్న - ఇపుడు సమాజసేవ చేసే ప్రేముఖులు ఎవరైనా సినిమా హీరోగా/హీరోయిన్ గా చేస్తే ఆ సినిమాను హిట్ చేస్తారా? అయితే నన్ను హీరోగా పెట్టి సినిమాలు తీయండి, నేను నాకొచ్చే రెమ్యూనరేషన్ మాత్రమే కాక, అదనంగా దానికి మరికొంత కలిపి సమాజసేవ చేస్తాను ... రెడీయా? అంతకంటే ముందుగా మీరు ఒకసారి మీరేం చేశారో ప్రశ్నించుకోండి ... మీరెంత విరాళమిచ్చారు? మీరెంతమందికి సహాయం చేశారు? సమాధానాలున్నాయా ఈ ప్రశ్నలకు? గురువిందగింజలు అంటే చెట్లకు కాసేరోజులు పోయాయి, మనుషుల మనస్తత్వాల్లోకి వాటి విత్తులు నాటుకుపోయాయి

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన