... ప్రశ్నించండి
వంశీ కలుగోట్ల // ... ప్రశ్నించండి //
*****************************
సంక్షేమపథకాలు అమలు చేయడంలో, సరికొత్త సంక్షేమ పథకాలు తీసుకురావడంలో బహుశా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రస్తుతం ఎవరూ బీట్ చేయలేరేమో. గతంలోనూ సంక్షేమ పథకాల ప్రకటన ఇబ్బడిముబ్బడిగా జరిగేది కాకపొతే అధికశాతం ప్రకటనలతోనే సరిపోయేది, వాటి అమలు అనేది ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు మాత్రమే గుర్తుకు వచ్చేది. ఇపుడు అలా కాదు అమలు కూడా, అది కూడా యుద్ధప్రాతిపదికన అన్నట్టుగా జరుగుతున్నాయి. జనాలు మెచ్చుకుంటున్నారు, పల్లకీల్లో ముఖ్యమంత్రి ఫోటో పెట్టు మోస్తున్నారు. నచ్చనివాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు.
నాకు తెలిసి, ఎవరూ చేయనిపని ఏంటంటే 'ప్రశ్నించడం'. ఇన్ని సంక్షేమ పథకాల అమలుకు నిధులు ఎక్కడినుండి వస్తున్నాయి? ఇపుడు సంక్షేమపథకాలు పేరిట అందినకాడికి తీసుకుంటున్నాం కదా సంబరపడితే, రేపటిరోజున మనమో, మన పిల్లలో ప్రత్యక్ష లేదా పరోక్ష పన్నుల రూపంలో కట్టుకోవలసినదే ఈ బాకీ అంతా. పథకాల అమలుకు మెచ్చుకుని, మోస్తున్నవారు కానీ శాపనార్థాలు పెడుతూ తిడుతున్నవారు కానీ రాష్ట్రం ఉత్పాదకత గురించి మాత్రం ప్రశ్నించడం లేదు.
కొన్ని ప్రశ్నలు
- ఎన్ని పరిశ్రమలు కొత్తగా ఇక్కడ ఏర్పాటు కావడానికి ఒప్పందాలు జరిగాయి?
- ఇంతకుముందు ఏర్పాటు చేయడానికి ఒప్పందం చేసుకున్న పరిశ్రమల ఏర్పాటు ఎంతదాకా వచ్చింది?
- ఇప్పటికే ఉత్పాదకత మొదలుపెట్టిన పరిశ్రమల వల్ల ఎన్ని ఉద్యోగాలు, ఆదాయం లభించాయి?
- సంక్షేమపథకాలు అమలుకు నిధులు ఎలా వస్తున్నాయి?
- కేంద్రప్రభుత్వం నుండి వస్తున్నా నిధులు ఎన్ని? తెస్తున్న అప్పులు ఎన్ని?
- అప్పులు ఏ ప్రాతిపదికన తెస్తున్నారు? (ఎందుకంటే అప్పులిచ్చేవాళ్ళు సంక్షేమపథకాలు అమలు చేస్తారని ఇవ్వరు,వాళ్ళకు తిరిగి ఇస్తారన్న హామీతో పాటు తనఖా ఏదైనా ఉంటేనే ఇస్తారు కదా)
- ఆదాయానికి సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఏమిటి?
... మరికొన్ని ఉండవచ్చు, నాకు ప్రస్తుతానికి తోచినవి ఇవి.
ప్రజలకు మంచి చేయడం ప్రభుత్వాల బాధ్యత. ఆ బాధ్యత మర్చిపోయిన ప్రభుత్వాలు అరాచకం చేసిన చోట, కాస్త మెరుగ్గా కనబడగానే పొంగిపోవడం సహజమే. వాళ్ళు చేసే మంచిని పొగుడుదాం. ముఖ్యంగా విద్యారంగం పట్ల ప్రస్తుత ప్రభుత్వ పనితీరు చాలా చాలా బావుంది. నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి, వాటి నిర్వహణ కూడా బాగుండాలని ఆశిద్దాం. అలాగే వైద్యం, సంక్షేమం ప్రకటనల్లో మరియు అమల్లో కూడా బాగా జరుగుతున్నాయి. నీటుపారుదల ప్రాజెక్ట్స్ కు సంబంధించి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవడం, సత్వరంగా పనులు మొదలయ్యేలా, త్వరగా పనులు పూర్తయ్యేలా చూడటం బాగుంది. ఈ ప్రాజెక్ట్స్ ఏర్పాటు ఇపుడు ఖర్చు అయినా, భవిష్యత్ లో వ్యవసాయరంగానికి అండగా నిలిచి, వ్యవసాయ ఉత్పత్తులు పెరిగేలా తద్వారా ఆదాయం లభించేలా కాగలదు. అలానే విద్యారంగం కూడా.
చివరగా ఒక విషయం ... పాలకులను పూజించకండి, ప్రశ్నించండి.
అప్పులు అపరిమితంగా తెస్తున్నారు, తద్వారా ఖజానా వట్టి పోతుందన్న విమర్శలు అహేతుకం. FRBM చట్టం ప్రకారం ద్రవ్య లోటు (fiscal deficit) 3% X GSDP దాటదు.
ReplyDeleteకావచ్చు, అందుకే నేను ఆ విషయంగా విమర్శించలేదు. కానీ గత ప్రభుత్వం వెళుతూ వెళుతూ, జీతాలు కూడా ఇవ్వలేనటుంటి దారుణ ఆర్థిక పరిస్థితిలో రాష్ట్రాన్ని అప్పగించి వెళ్ళింది. ఇపుడు ఇవన్నీ ఎలా మేనేజ్ చెయ్యగలుతున్నారు అన్నది సామాన్యులనుండి వస్తున్నా ప్రశ్న. పారదర్శకత, జవాబుదారీతనం విషయంలో గత ప్రభుత్వం కంటే మెరుగ్గానే ఉన్నప్పటికీ - ప్రత్యేకించి ఆర్ధిక అంశాల పరంగా శ్వేతపత్రం వంటిది విడుదల చేయడం ఒక సత్సంప్రదాయం కాగలదు అని నా అభిప్రాయం
Deleteఅప్పు తేవటం ఇవ్వాళ కొత్తగా మొదలుపెట్టింది కాదు.మహారాజశ్రీ అంబేద్కర్ గారు ఆర్ధిక మంత్రి అయ్యిందే రిజర్వ్ బ్యాంకుని ఏర్పాటు చహ్ర్సి ఋణ ఆధారిత ద్రవ్యవిధాంతో దేశాన్ని అప్పు చెయ్యనిదే రోజు గడవని ద్థితికి నెట్టెయ్యడం కోసం.
Deleteఅసలు మనం 1950ల నుంచీ ఫాలో అవుతున్నదే Debt based economy కదా!
నిండా మునిగినవాడికి చలేమిటన్నట్టు కొత్త అప్పుల గురించి భయపడటం దేనికి?
అప్పుల గురించి భయపడటం లేదా భయపడకపోవడం గురించి కాదండీ ... ఇక్కడ ఇపుడు అమలవుతున్న సంక్షేమ మరియు ఇతర పథకాలకు, అలానే ఇతరత్రా ప్రభుత్వ ఖర్చులకు ఆదాయవనరులేంటి అన్నది ప్రశ్న.
Delete