... పల్లెటూరోళ్ళు

వంశీ కలుగోట్ల // ... పల్లెటూరోళ్ళు //
*******************************
            నేను పుట్టి, పెరిగింది అంతా ఒక మారుమూల పల్లెటూరు. ఇపుడు బెంగళూరులో ఉంటున్నాను. కొన్ని రోజుల క్రితం అమ్మను హాస్పిటల్ లో చేర్చినపుడు ఒక రోజు అక్కడే ఉండాల్సి వచ్చింది. జనరల్ గా చాలా హాస్పిటల్స్ లో కొన్ని సెక్షన్స్ లో పేషెంట్స్ ఉండే ప్రదేశానికి వెళ్ళేప్పుడు అంటే వార్డ్స్ లోకి వెళ్ళేప్పుడు చెప్పులు తీసి వెళ్ళమని చెపుతుంటారు, చెప్పులతో లోపలకు పంపడం ఉండదు. అక్కడ ఆ సెక్షన్స్ లోకి కూడా చెప్పులతో పంపడం లేదు. నేను ఫస్ట్ టైం వెళ్ళినపుడు సెక్యూరిటీ గార్డ్ చెప్పాడు, నేను పాటించాను. కాసేపయ్యాక ఇంకో పేషెంట్ ఎవరినో తీసుకువచ్చారు. పేషెంట్ ను లోపలకు తీసుకెళ్ళిన కాసేపటికి ఆ పేషెంట్ సంబంధీకులు ఇద్దరు మగవారు వచ్చారు, ఇద్దరూ దాదాపు 40 + వయసువారే. వారు సెక్యూరిటీ గార్డ్ తో గొడవ పెట్టుకున్నారు - కారణం ఏంటంటే సెక్యూరిటీ గార్డ్ చెప్పులు వేసుకుని వెళ్ళటానికి వాళ్ళను అనుమతించటం లేదు, వాళ్ళేమో చల్లగా ఉంది చెప్పుల్లేకుండా ఎలా వెళతాం అంటున్నారు. అక్కడికి నేను కూడా చెప్పాను, 'అయ్యా అక్కడ పేషెంట్స్ కు ఇబ్బంది అవుతుంది, ఇన్ఫెక్షన్స్ వస్తాయని పంపరు' అని. మాకు తెలుసు, కానీ బాగా చల్లగా ఉంది కదా అన్నారు. వాళ్ళ గొడవ కంటిన్యూ అవుతోంది, సెక్యూటిరీ గార్డ్స్ తో 'ఏం మేమేమన్నా పల్లెటూరి బైతులమనుకున్నావా లేక చదువు రాదనుకున్నావా? మేము చెప్పులతోనే వెళతాం లోపలకి' అంటున్నారు; సెక్యూరిటీ గార్డ్ ఏమో 'అంత చదువు వచ్చినోళ్ళయితే అక్కడే రాసి ఉంది కదా సార్, చెప్పులు బయట విడవండి' అని అంటున్నాడు. 
            ఈ గొడవ ఇలా జరుగుతుండగా, అంతలో ఒక డాక్టర్ వచ్చాడు, విషయం విని వాళ్ళను చెప్పులు వదిలేసి వెళ్తే వెళ్ళండి లేదా బయటకు వెళ్ళండి అని చెప్పాడు. వాళ్ళు అన్నీ మూసుకుని చెప్పులు వదిలేసి వెళ్ళారు. అనేకమంది పట్నం వాసుల్లో పల్లెటూరి వారంటే ఏమీ తెలియని వారు, అర్థం చేసుకోరు, మాట వినరు అనే అభిప్రాయం ఉంటుందేమో అనిపించింది వారిని చూసిన తరువాత. ఎందుకంటే ఆ తరువాత కూడా వాళ్ళు నాతో 'లేకపోతే ఏంటండీ, వాడు ఆ సెక్యూరిటీ గార్డ్ పల్లెటూరి వాళ్ళకు చెప్పినట్టు చెప్తాడు మాకు' అన్నారు. నాలో నేను నవ్వుకున్నాను - ఎందుకంటే సెక్యూరిటీ గార్డ్ మొదటిసారి చెప్పినప్పుడే అర్థం చేసుకున్న నాది పల్లెటూరు; సెక్యూరిటీ గార్డ్ చెప్పినది వినకుండా, డాక్టర్ తో '... లేదంటే బయటకు వెళ్ళండి' అని చెప్పించుకున్నవారిది పట్నం. ఏమోనబ్బా మా పల్లెటూరి వాళ్ళం అంతే కాస్త మర్యాద పాటిస్తాం, ఎదుటివారు చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం - పట్నమోళ్ళలా కాదు. 

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన