... 'సాహో' గురించి

వంశీ వ్యూ పాయింట్ // ... 'సాహో' గురించి //
*****************************************
            సాహో సినిమా గురించి మాట్లాడుకుందాం. శౌర్యం సినిమాలో అనుకుంటా అలీ కాలేజీలో ఫీజికల్ ఇన్స్ట్రక్టర్ కం స్పోర్ట్స్ ట్రైనర్ గా పని చేస్తూ ఉంటాడు. ఎప్పుడు చూసినా సిక్స్ ప్యాక్ బాడీ, టోన్డ్ మసిల్స్ తో కనబడుతుంటాడు. నిజమేంటంటే అతనికి అటువంటి బాడీ ఏమీ ఉండదు. బెలూన్స్ ని బాడీ కి చుట్టుకుని అలా కనబడుతుంటాడు. ఆ రహస్యం తెలుసుకున్న హీరో గోపీచంద్ అతడితో ఓ ఆటాడుకుంటాడు. ఆ ఇంతకీ మనం ఏం మాట్లాడుకుంటున్నాం సాహో సినిమా గురించి కదూ. సాహో సినిమా గురించి చెపుదామనుకుంటే, ఆ ఆలీ క్యారెక్టర్ మ్యాటర్ గుర్తొచ్చింది అంతే. అంటే ఏం లేదు ఒక మామూలు కథను పట్టుకుని, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటూ కథలో ఏమీ లేకపోయినా, జస్ట్ టెక్నికల్ స్టాండర్డ్స్ పెట్టి - అదే హాలీవుడ్ స్టాండర్డ్స్ అనుకోమన్నారు. అదన్నమాట విషయం. 
             సాహో చిత్రాన్ని ఒక ఆక్షన్ ఎంటర్టైనర్ గా ప్రచారం చేశారు, అఫ్ కోర్స్ అదే నిజమనుకోండి. బహుశా దర్శకుడు మరియు కథకుడు అయిన సుజీత్ ఈ కథ రాసుకున్నపుడు అతడు తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రాసుకుని ఉంటాడు. అంటే అతడి ఉద్దేశం ఒక తెలుగు సినిమా తియ్యాలని. అతడి దురదృష్టం ఏంటంటే, ఈ సినిమా ఒప్పుకున్నాక ప్రభాస్ కు బాహుబలి లాంటి సినిమా పడింది. దాంతో ప్రభాస్ ఇమేజ్ నేషనల్, కొండకచో ఇంటర్నేషనల్ లెవెల్ కు వెళ్ళిందని ప్రభాస్ స్నేహితులైన నిర్మాతలు, దర్శకుడు అనుకున్నట్టున్నారు. దాంతో అతగాడు రాసుకున్న  సినిమాకథకు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పేరుతో ఏవేవో హంగులు చేర్చాలని అనుకున్నారు. అక్కడినుండి తడబాటు, తప్పటడుగులు మొదలైనట్టున్నాయి. ఒకసారి ఆ తప్పటడుగులు మొదలయ్యాక వారు ఇక వెనుతిరిగి చూసుకున్నట్టు లేరు. అడుగడుగునా అది, సినిమా మొత్తం కనబడుతుంది. హాలీవుడ్ ప్రేక్షకులను, బాలీవుడ్ ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకోవాలని సినిమా తియ్యటం అంటే కేవలం టెక్నికల్ స్టాండర్డ్స్ మాత్రమే కాదు. మామూలు సినిమాలను మించి ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. బాహుబలి సక్సెస్ కు కారణం అదే - ఒక మామూలు కథకు, రాజులు - రాజ్యాలు - యుద్ధాలు బ్యాక్ డ్రాప్ ఒక కొత్తదనాన్ని, ప్రత్యేకతను తీసుకువచ్చింది. అంతే తప్ప, కేవలం భారీ బడ్జెట్ అన్నదే ప్రత్యేకత కాదు. అలాంటి ప్రత్యేకత అన్నది సాహో సినిమాకు లోపించింది. బాలీవుడ్ ఇలాంటి రివెంజ్ ఆక్షన్ డ్రామాలు, ఇంతకంటే బావున్నాయనిపించే టెక్నికల్ స్టాండర్డ్స్ తో చాలా వచ్చాయి. ఉదాహరణకు ధూమ్ 3 (ధూమ్ సిరీస్ మూవీస్). ఇక హాలీవుడ్ సినిమాల గురించి ప్రత్యేకించి చెప్పాలా. అసలు మూలకథ, అనేక సన్నివేశాలు ఎత్తేసిందే హాలీవుడ్ సినిమాల నుండి. ఇది ప్రభాస్ కు, తెలుగు సినిమా రంగానికి (అంటే రూపకర్తలు) కొత్త ఏమో కానీ, ప్రేక్షకులకు కాదు. 
              ఒక పక్కా కమర్షియల్ ఆక్షన్ ఎంటెర్టైనర్ సినిమాకు ఉండవలసిన ప్రధాన లక్షణం రేసీ స్క్రీన్ ప్లే. ప్రేక్షకులను ఆలోచించనివ్వకూడదు. సినిమా పరిగెత్తాలి. లాజిక్స్, గ్రాఫిక్స్ కంటే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చెయ్యాల్సింది స్క్రీన్ ప్లే మీద. మన ప్రేక్షకుల దరిద్రం ఏంటంటే కథ మీద కాన్సన్ట్రేట్ చేసేటోడు స్క్రీన్ ప్లే మీద కాన్సన్ట్రేట్ చెయ్యడు, స్క్రీన్ ప్లే మీద కాన్సన్ట్రేట్ చేసేటోడు కథ మీద కాన్సన్ట్రేట్ చెయ్యడు, టెక్నికల్ స్టాండర్డ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసేటోడు మిగతా రెండింటి మీద కాన్సన్ట్రేట్ చెయ్యడు. అందుకే ప్రతి ఇండివిడ్యుయల్ ప్రయత్నాన్ని మెచ్చుకుందామని ఎదురు  చూసి, ఉస్సూరుమని నిట్టూర్చుకుని ఊరుకోవడమే. అయిదు పైసల కథ, వంద తొంభై తొమ్మిది రూపాయల తొంభై అయిదు పైసల టెక్నికల్ ఎఫెక్ట్స్ ఉన్న సాహో లాంటి సినిమాకు రేసీ స్రీన్ ప్లే తోడయ్యుంటే బావుండేది. ఈ సినిమా చూశాక, ఈ సినిమాకు పూరి జగన్నాథ్ స్క్రీన్ ప్లే కనుక తోడయ్యుంటే బావుండేది అనిపించేది. పూరి జగన్నాథ్ సినిమాల్లో కథ లేకపోయినా. అసలేమీ లేకపోయినా స్క్రీన్ ప్లే ఎవరో తరుముతున్నట్టు వేగంగా పరిగెడుతుంది. సినిమా చూసేటప్పుడు, ప్రేక్షకుడిని అస్సలు ఆలోచించనివ్వడు. అతడిలో నాకు నచ్చే ప్రధాన లక్షణం అదే. 
               ఇంత చెప్పినా సాహో సినిమా కథ ఏంటో చెప్పలేదేంటని చూస్తున్నారా? అజ్ఞాతవాసి చూశారా? అదే కథ, అదే ఫ్రెంచ్ సినిమా లార్గో వించ్ నుండి కాపీ కొట్టేసిన పాయింట్. టెక్నికల్ ఎఫెక్ట్స్ కథకు అదనపు హంగుగా మారక, సినిమాకు అదనపు భారంగా మారాయి; కానీ బావున్నాయి. ఫోటోగ్రఫీ బావుంది. పాటలు హిందీలో వింటేనే బావున్నాయి, అసలే సినిమా బాలేదేంటా అనుకుంటుంటే టక్కున వచ్చి ఇబ్బంది పెడతాయి. గుర్తు పెట్టుకునే స్థాయి సంభాషణలు ఒక్కటీ లేవు. 'ఎవెరీ నైట్ హాస్ ఇట్స్ డే' అంటూ ఏవో తికమక డైలాగ్స్ కొన్ని ట్రై చేశారు కూడానూ. ఇక నటీనటుల విషయానికి వస్తే శ్రద్ధా కపూర్ తన పాత్రలో ధైర్యం, ప్రేమ, కోపం, బాధ ఇలా ఏది చూపాలో అర్థం కానీ అయోమయపు ఎక్స్ప్రెషన్ ఒకటి పెట్టుకుని కనబడింది ఫాఫమ్. ఇక పాటల్లో తన ప్రెజన్స్ ఫీలయ్యేలా వీలైనంత ప్రయత్నించింది. ఉన్నది ఒక్క పాటలోనే ఆయినా, తనకేం తెలుసో అది పూర్తిగా చేసేసింది జాక్వెలిన్. చుంకీ పాండే, నీల్ నితిన్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, టిను ఆనంద్ (ఫాఫమ్), మహేష్ మంజ్రేకర్ (మళ్ళీ ఫాఫమ్), మురళి శర్మ, వెన్నెల కిషోర్ - ఇలా చానామంది ఉన్నారు అంటే ఉన్నారు. ఎవరినో మర్చిపోయాం కదా - అరెరే అసలు ప్రభాస్ గురించి చెప్పలేదే. హా ప్రభాస్ కూడా ఈ సినిమాలో ఉన్నాడబ్బా. అంటే అదే ఇది ప్రభాస్ సినిమానే కదా. ప్రభాస్ ఉన్నాడు అంటే ఉన్నాడు అబ్బా. డల్ గా కనిపిస్తాడు, స్లోగా మూవ్ అవుతాడు (ఫైట్స్ లో కూడా), ఎమోషన్ ఏమీ లేకుండా డైలాగ్స్ చెప్తాడు. ఏదో అన్యమస్కంగా కనిపించాడు. నచ్చలేదో లేక బలవంతంగా చెయ్యాల్సొచ్చిందో తెలీదు కానీ అతడు సినిమాకు కనెక్ట్ అయినట్టు లేడు. మొత్తానికి ఏదో ఉన్నాడంటే, ఉన్నాడనిపించాడు. 'బాహుబలి' స్టార్ ప్రభాస్ ను, 'రన్ రాజా రన్' దర్శకుడు సుజీత్ సెకండ్ టేక్ అనే సాహసం చెయ్యలేకపోయినట్టున్నాడు. అవును ఇంతకీ దర్శకుడు గురించి చెప్పుకోలేదు కదూ ... ఫాఫమ్ సుజీత్ అనిపిస్తుంది. అతడు బాగానే కష్టపడ్డాడు, ఏదో ఒకసగటు తెలుగు కమర్షియల్ ఫిలింకు కావలసిన ముడి సరుకుకు కాస్త ట్రికీ స్క్రీన్ ప్లే రాసుకుని వస్తే, అందరూ కలిసి ఏదేదో చేసి అతగాడిని చెడగొట్టారు. బెటర్ లక్ నెక్స్ట్ టైం సుజీత్. ఇంకో మంచి ప్రాజెక్ట్ మీకు త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను. 
               ఇక ముగించేముందు ఈ సినిమాలోని ఒక అత్యద్భుత సన్నివేశం గురించి చెప్పాలి. అది ఎలాంటి సన్నివేశం అంటే బాలకృష్ణ, రజని కాంత్, సన్నీ డియోల్ లాంటి వీరోలు తామెందుకు చెయ్యలేకపోయామా అని సిగ్గుపడేలాంటి సన్నివేశం. జెట్ ఫైటర్ ఎక్విప్మెంట్ కట్టుకుని, హెలికాప్టర్ నుండి పడిపోతున్న శ్రద్ధ కపూర్ ను రక్షించటానికి గాల్లో ఎగురుతూ పోతుంటాడు. ఇంతలో ఆ జెట్ ఫైటర్ కి బాటరీ అయిపోతుంది. దాంతో ప్రభాస్ దాన్ని వదిలేస్తాడు. జనరల్ గా ఏమవుతుంది? అక్కడినుండి ప్రభాస్ కూడా కిందకు పడిపోవాలి, కానీ అలా జరిగితే అది సాహో ఎందుకవుతుంది? ప్రభాస్ ఎంచక్కా గాల్లో ప్రయాణించి, అవును సరిగానే చదివారు గాల్లో ప్రయాణించి, శ్రద్ధానూ రక్షిస్తాడు. ఇలాంటివి ఇంకా ఉంటాయి, సినిమా చూడండి. మన దరిద్రం ఏంటంటే ఏవ్ హాలీవుడ్ స్టాండర్డ్స్ అని వాళ్ళు నమ్మి, మనల్ని నమ్మించాలని అనుకున్నట్టున్నారు. కాదని ఎవరైనా వాళ్లకు సెప్పండ్రా బాబూ. సినిమా ఎలా చూడాలో మాకు చెప్తున్నారు కదా అందరూ, అయ్యా అలానే ఆ తీసేటోళ్ళకు కూడా ఎలా తియ్యాలో చెప్పి చావండి. సినిమా నచ్చితే చూడు, లేదంటే మానెయ్ అంటారా, నా వ్యూ గురించి కూడా అదే మాట - నచ్చితే చదవండి లేకపోతే మింగెయ్యండి అని నేను అనను. నా అభిప్రాయం నాదబ్బా అంతే.   

Comments

  1. Good take on the ludicrous movie. In my opinion, prabhas' dialogue delivery was poor in bahubali also.

    కుంజరయూధంబు దోమ కుత్తుక జొచ్చెన్ అన్నట్టు అయింది సుజీత్ పరిస్థితి. దుంప ముక్కలు మసాలా ఎక్కువై పేడ బిరియాని తయారయింది.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన