... కొన్ని జ్ఞాపకాలు: 1
వంశీ కలుగోట్ల // ... కొన్ని జ్ఞాపకాలు: 1 //
****************************************
ఒక్కోసారి అనిపిస్తుంది మనిషి అంటే ఒక కదిలే జ్ఞాపకాల దొంతర అని. కొన్ని జ్ఞాపకాలు మనల్ని నిలబెడతాయి, నడిపిస్తాయి; మరికొన్ని జ్ఞాపకాలు మనల్ని తలదించుకునేలా చేస్తాయి, సిగ్గుపడేలా చేస్తాయి. కొన్నిసార్లు జ్ఞాపకాలలో మనముండకపోవచ్చు - లేదా వేరే వారు ఆ జ్ఞాపకాలను ప్రభావితం చేసినవారు అయి ఉండవచ్చు. అలా నాకు చాలాసార్లు గుర్తొచ్చే జ్ఞాపకాలలో ఒకదాన్ని ఇక్కడ పంచుకోవాలనిపించింది. ఇది ఎటువంటి జ్ఞాపకం అనేది నేను మొదటే చెప్పాలనుకోవట్లేదు. చదవండి. నా అభిప్రాయం ప్రకారం మనుషుల్లో మంచివారు, చెడ్డవారు అంటూ ఉండరు - పరిస్థితులు, అనుభవాలు వారిని కొన్ని సమయాలలో అలా ప్రవర్తించేలా డ్రైవ్ చేస్తాయి. ఆ పరిస్థితులను తట్టుకుని నిలబడగలిగితే, మనీషి లేదా మామూలు మనిషి. ఈ అనుభవంతో ఎవరెలాంటివారో నేను జడ్జ్ చెయ్యట్లేదు. చదవండి ...
* * *
అది 2010 వ సంవత్సరం, డిసెంబర్ 18. యునైటెడ్ కింగ్డమ్ లోని మిల్టన్ కీన్స్ సిటీ. అప్పటికే నేను అక్కడికెళ్లి దాదాపు మూడు సంవత్సరాలయ్యింది. ఇంగ్లాండ్ లో శీతాకాలం ఎలా ఉంటుందో మూడోసారి అనుభవిస్తున్నాను. ఇంగ్లాండ్ లో ఒకానొక పాపులర్ సేయింగ్ మూడు డబ్ల్యూలను నమ్మకూడదు అని. వర్క్, వెథర్, వెల్త్ (కొందరు విమెన్ అని కూడా అంటారు). మిగతా రెండూ ఏమో కానీ, వెథర్ విషయంలో మాత్రం అది నిజమని స్వానుభవ పూర్వకంగా తెలుసుకున్నాను. వింటర్ లో మాత్రం కాస్త స్థిమితంగానే ఉండేది అప్పట్లో. యూకేలో వింటర్ ఎలా ఉంటుందో తెలుసనుకుంటా. అంతకుముందు సంవత్సరమే మేము -3 (లేదా -5 అనుకుంటా) డిగ్రీల చలిని చూశాం. కానీ, ఆ రోజు ఉదయం నుండి కాస్త పర్లేదు ఆనేలానే ఉంది వాతావరణం. నేను మరో మిత్రుడు (పేరు అప్రస్తుతమనుకుంటున్నా) సెంట్రల్ మిల్టన్ కీన్స్ కు వెళ్ళాం. జస్ట్ టు కిల్ ది డే అన్నమాట.
మేము అలా షాపింగ్ కాంప్లెక్స్ లోకి ఎంటర్ అయ్యామో లేదో, బయట మంచు పడటం మొదలైంది. అప్పటికి మూడు శీతాకాలాలు అలవాటైంది కాబట్టి, ఏం పర్లేదులే అనుకుని షాపింగ్ కాంప్లెక్స్ లోపల తిరగటం మొదలెట్టాం. కానీ, బయట మంచు పడటం మరింత పెరిగింది, దాదాపు రెండున్నర గంటల పాటు విపరీతమైన మంచు కురిసింది. దాదాపు అడుగున్నర (18 అంగుళాలు) మేర మంచు కురిసింది. మాతో పాటు అనేకమంది షాపింగ్ కాంప్లెక్స్ లోపలే ఉండిపోయాం, ఎక్కడికీ కదలడానికి లేదు. మొత్తం రవాణా సదుపాయాలు కొద్దిసేపు స్తంభించాయి. పునరుద్ధరించటానికి కనీసం కొన్ని గంటలు పట్టవచ్చు అని సహాయక సిబ్బంది చెప్పిన మాట. అంతా అయోమయ పరిస్థితి. స్నేహితులెవరికైనా ఫోన్ చేసినా, వచ్చి పిక్ చేసుకునే పరిస్థితి లేదు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. పోనీ నడిచి వెళదామా అంటే, అప్పటికే సాయంకాలం అయ్యింది. వచ్చేప్పుడు వాతావరణం బాగానే ఉండటంతో జాకెట్స్, గొడుగు వంటివి లేకుండా వచ్చేసాం - మళ్ళీ మంచు విపరీతంగా పడితే చాలా కష్టం. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ సాయంకాలం 7 గంటలకు మూసేస్తారు. అంత మంచు చూడటం ఒకవైపు ఎక్సయిటింగ్ గానే ఉన్నప్పటికీ, మరోవైపు రూమ్ కు ఎప్పటికి చేరగలమో అని టెన్షన్.
* * *
మేము అలాంటి అయోమయ పరిస్థితిలో ఉండగా, ఒకతను మా దగ్గరకు వచ్చాడు. అతడు అడిగిన ప్రశ్న విన్నపుడు కలిగినంత ఆనందం బహుశా అంతకు ముందు మరే ప్రశ్న విన్నపుడు, ఫస్ట్ జాబ్ వచ్చినపుడు కంపెనీ హెచ్చార్ ఫోన్ చేసి 'యు హావ్ బీన్ సెలెక్టెడ్' అన్నపుడు కూడా కలగలేదేమో. అంత ఆనందం కలిగించిన ప్రశ్న 'డు యు గైస్ నీడ్ లిఫ్ట్'. ఆయనలో దేవుడు కనబడ్డాడు మాకు. ఎస్ అని మేము చెప్పాక, పరిచయాలు అయ్యాయి. మేము వెళ్ళాల్సిన రూట్లోనే తానూ వెళ్ళాలి కాబట్టి, అతడికీ ఇబ్బంది లేదు. ఇక కార్ దగ్గరికి బయలుదేరే ముందు అతడొక ప్రశ్న అడిగాడు, అది నిజానికి మాకు లిఫ్ట్ ఇవ్వడానికి అతడికి ఉన్న పర్సనల్ కండిషన్. అది క్లియర్ అవడంతో అతడు హ్యాపీ. (అదేంటన్నది చివర్లో చెబుతాను) మొత్తానికి మరో పావుగంటకు అతడి కార్ దగ్గరకు చేరుకొని, ప్రయాణం మొదలెట్టాం.
ఇక అక్కడనుండి మరో టెన్షన్. రోడ్ మీద గ్రిప్ లేదు, విపరీతమైన మంచు. రోడ్ ఎడ్జెస్ కానీ, డివైడర్ మర్క్స్ కానీ కనబడట్లేదు; అలానే ఫస్ట్ గేర్ లోనే వెళుతున్నప్పటికీ బండి కంట్రోల్ లో ఉండట్లేదు. అప్పుడప్పుడూ ఎదురుగా వాహనాలు కనబడితే ఆక్సిడెంట్ అవుతుందేమో అని టెన్షన్. దారిలో రెండు బైక్ ఆక్సిడెంట్ జరిగినట్టున్నాయి కూడా. ఆ భయం తెలీకుండా ఉండటానికి, ఏవేవో మాట్లాడుకుంటూ ఉన్నాం. మా రూమ్ కు, సెంట్రల్ మిల్టన్ కీన్స్ ఏరియాకు దాదాపు నాలుగు మైళ్ళు దూరం. పీక్ ట్రాఫిక్ టైం లో కూడా (2010 లో) మాక్సిమం 10 నిమిషాలు ప్రయాణం కారులో. కానీ, ఆ రోజు మా రూమ్ కు దాదాపు ఒక రెండు/మూడు ఫర్లాంగుల దూరంలో అతడు డ్రాప్ చేయటానికి పట్టిన సమయం దాదాపు గంటన్నర. ఆ తరువాత దాదాపు ఒక 20 నిమిషాలకు పైగా నడవాల్సొచ్చింది రూమ్ చేరటానికి.
* * *
ఒక మంచి టీ తాగుతూ (నేనే చేశా, నేను టీ పెట్టటంలో స్పెషలిస్ట్) ఆ కొన్ని గంటలను బేరీజు వేసుకుంటే ఒకేసారి రెండు భిన్న భావాలు కలిగాయి. ఎవరో తెలియని వారికి, తనంతట తానే వచ్చి, అటువంటి పరిస్థితుల్లో లిఫ్ట్ ఇవ్వడం - బహుశా నేను కూడా చేసేవాడిని కాదేమో. అతడి మంచితనం నిజంగా ఒక స్ఫూర్తి అనిపించేదే కదా. కానీ, ఆ లిఫ్ట్ ఇవ్వడానికి ముందు అతడు అడిగిన ప్రశ్న ఇప్పటికీ వెంటాడుతోంది. అతడికి అనుభవాలతో వచ్చిందా లేక అపోహలతో వచ్చిందా అటువంటి భావన, ఏమో తెలియదు. ఆ తరువాత అతడినెప్పుడూ కలిసే అవకాశం రాలేదు, అతడూ మళ్ళీ ఎపుడూ ఆ షాపింగ్ ఏరియాలో కనబడలేదు. అతడు అడిగిన ప్రశ్న 'ఆప్ లోగ్ తో హిందూ హై, నా?' (మీరు హిందువులేనా) అని.
అతడిని నేను జడ్జ్ చెయ్యట్లేదు, తప్పు పట్టట్లేదు. అపుడు టీ తాగుతూ, నేను అనుకున్నది ఒకటే 'అతడు మరోసారి, అలాంటి సందర్భంలో అటువంటి ప్రశ్న అడిగకుండా సహాయం చేయగలగాలి' అని.
He has positive opinion on Hindus. Why do you want him to think like a pseudo secularist ?
ReplyDeleteఅయ్యా అనామకులు గారు, నేను కుహనా లౌకిక వాదిలా ఆలోచించమని అనలేదు. అసలు ఏ వాదిలా కాకుండా, ఒక మనిషిలా ఆలోచించి మరో మనిషికి సాయపడేలా ఆలోచిస్తే బావుంటుందని మాత్రమే చెప్పాను. ఆయన అన్న మరికొన్ని మాటలను నేను కావాలనే ప్రస్తావించలేదు ... నేను ఆయనను జడ్జ్ చెయ్యలేదు. అతడి మంచితనం పరిధి మరింత విస్తృతం కావాలని ఆశించాను ... అంతే
Delete