... కిం కర్తవ్యం?
వంశీ కలుగోట్ల // ... కిం కర్తవ్యం? //
****************************** *****
అనుకున్నంతా అయింది తెలుగుదేశం ఓడిపోయింది. అనుకున్నదానికంటే ఘోరంగా ఓడిపోయింది. తెలుగుదేశానికి ఓటమి కొత్తేమీ కాదు కదా. 1989, 2004, 2009 ఎన్నికలలో ఓడిపోయింది. అయినా ఓటమి ఎరుగని పార్టీ అంటూ ఉందా? ప్రజాస్వామ్యవ్యవస్థలో గెలుపోటములు భాగమే. కానీ, ఎందుకో గత ఓటముల సమయంలో కనబడని నైరాశ్యం ఇపుడు ఎక్కువగా కనబడుతోంది. ఓటమి ఖచ్చితంగా బాధిస్తుంది. కానీ, ఈ ఓటమి ఖచ్చితంగా తెలుగుదేశానికి ఒక కీలక మలుపు వంటిది. ఒకసారి గతం పరిశీలిస్తే తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ వయసు పైబడుతున్న సమయంలో తరువాత ఎవరు అన్న ప్రశ్న ఉదయించకముందే వెన్నుపోటు లేదా నాయకత్వ మార్పుతో చంద్రబాబు ఆ స్థానం చేజిక్కించుకోవడంతో చర్చకు ఆస్కారం లేకపోయింది. ఇంతవరకూ ఎదుర్కోని 'తరువాత ఎవరు?' అనే ప్రశ్న తెలుగుదేశపు భవిష్యత్తు ముంగిట ఉదయించేలా చేసింది ఈ ఓటమి. బహుశా, గెలిచి ఉంటే లోకేష్ రుద్దబడి ఉండేవాడేమో. కానీ, ఈ ఓటమి అతడి సామర్థ్యాన్ని ప్రశ్నర్థకం చేసింది. సభ్యుడిగా ఉండటం వేరు, పార్టీని నడిపించటం వేరు. అందునా తను ఇంతగా వ్యతిరేకించి, అవమానించిన, తనకంటే దాదాపు మూడు దశాబ్దాలు జూనియర్ అయిన జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే, ప్రతిపక్షనేత స్థానంలో కూచోటానికి చంద్రబాబు ఇష్టపడతాడా అన్నది చూడాలి. ప్రస్తుతం అనుకూల పత్రికలలో వస్తున్నా కథనాల ప్రకారం చంద్రబాబు ప్రతిపక్షనేతగా సభకు పోకపోవచ్చు అని అనిపిస్తున్నది.
2014 ఓటమి సమయంలోనూ, ఆ తరువాత సభలోనూ ప్రతిపక్ష నేతగా జగన్ హుందాగా ప్రవర్తించారు అని అనిపించుకున్నారు. కానీ, స్పీకర్ కోడెల పక్షపాత ధోరణి, ఫిరాయింపులను ప్రోత్సహించి వారికి మంత్రిపదవులివ్వడం, తెదేపా నేతలు దేనికి సమాధానం ఇవ్వకుండా లక్షకోట్లు అంటూ ఎగతాళి చేయడం మనందరికే గుర్తున్నాయంటే, జగన్ కు గుర్తుండవా? మరి ఇపుడు బదులు తీర్చుకోవాలనుకుంటే - బహుశా, అదే సంశయం వెంటాడుతున్నట్టుంది. అందునా ఓటమి చాలా ఘోరమైనది, ఇప్పుడున్నది కేవలం 23 మంది మాత్రమే. ఒకవేళ జగన్ గేట్లు తెరిస్తే, వారిలో ఎందరు మిగులుతారో అనే భయం ఒకటి ఉండనే ఉంది. సరే, ఇవన్నీ పక్కనబెడదాం. ఇపుడు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏమిటి అన్నది ముఖ్యం. మామూలుగా చెప్పాలంటే, చంద్రబాబు వెనుదిరగని తత్త్వం. ఎంత కిందకు దిగజారినా, మళ్ళీ పైకి ఎగసేవరకూ ఆగని తరహా. కానీ, అపుడు వేరు - ఇపుడు 70ల్లో ఉన్నారు. వారసుడికి పగ్గాలు అందివ్వాలన్న తాపత్రయం కనబడుతోంది, అసలు అదే సగం కొంపముంచింది కూడానూ. వారసుడి వైపు చూస్తే లోకేష్ సామర్థ్యం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అలాగని, పార్టీ మళ్ళీ నందమూరి వారి చేతుల్లోకి పోవడానికి చంద్రబాబు ఒప్పుకోడు. మధ్యేమార్గంగా నందమూరినారా బ్రాహ్మణికి అప్పగించాలన్న ప్రతిపాదనలూ వినబడుతున్నవి. మొత్తం నందమూరి మరియు నారా కుటుంబాలను జల్లెడబట్టి చూస్తే, జనామోదం పొందగల, జనాలను మళ్ళీ తమవైపు రప్పించగల సామర్థ్యం ఉన్న వ్యక్తి ఒక్కడే కనబడుతున్నాడు - అతడే జూనియర్ ఎన్టీఆర్. లోకేష్ ను అధికారంలోకి తీసుకురావటానికి వాడుకోవడానికైతే ఓకే కానీ, పార్టీని చంద్రబాబు అతడికి అప్పగించే సమస్యే లేదు. అంతేకాక ప్రస్తుతమున్న పరిస్థితుల్లో జూనియర్ సాహసించి, పార్టీని తన చేతుల్లోకి తీసుకునేంతటి పని చేయలేడు. ఎందుకంటే పట్టుమని పదిమంది కూడా తన కంట్రోల్ లో ఉండే జనాలు పార్టీలో లేరు. తన సామర్థ్యామొక్కటే సరిపోదు, కొంతమంది నమ్మకస్తులను కూడగట్టుకోవాలి. తరువాత జనాల్లో తిరిగి, వారి అభిమానాన్ని సంపాదించుకోవాలి (సినీ అభిమానం వేరు). ఇపుడు కిం కర్తవ్యం అనో తరువాతేంటి అనో మనం ఎన్ని విశ్లేషణలు చేసుకున్నా, ఎన్ని ప్రత్యామ్న్యాయాలు చూపినా చంద్రబాబు పార్టీని తన చేతుల్లోంచి జారిపోనివ్వడు, యెల్లో మీడియా సహాయంతో లోకేషుని పైకి తీసుకురావాలనే ప్రయత్నిస్తాడు. కాబట్టి తెలుగుదేశానికి తరువాతేంటి అనే ప్రశ్నకు ప్రస్తుత సమాధానం బాబు మరియు లోకేష్ లే. ఒకవేళ జూనియర్ తన సినీ కెరీర్ ను పణంగా పెట్టి, సాహసం చేయగలిగితే తప్పించి - చేయగలడా అన్నది అన్నది ప్రస్తుతానికి ఊహాజనితమైన ప్రశ్న. మరికొన్నేళ్ళపాటు మనం నారావారి తెలుగుదేశాన్నే చూస్తాం, సందేహం లేదు.
* . * . *
ఈ ఎన్నికల్లో మొదట కొందరిలో ఆశలు, మరికొందరిలో భయాలు రేకెత్తించి బొక్కబోర్లాపడినది పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన. జనసేన వైఫల్యంలో ప్రధాన పాత్ర పవన్ కళ్యాణ్ దే. జనసేనకు తరువాత ఏంటి, ఎవరు? అనే ఎక్కువగా ఇపుడు ఏంటి అన్నది ప్రధానమైన సమస్య. జనసేనలో పవన్ కళ్యాణ్ మినహా చెప్పుకోవడానికి జనాలకు పెద్దగా తెలిసిన పేరు కానీ, జనాలను మెప్పించగల, ఓట్లు రాబట్టగల నాయకులు లేరు - బేసిగ్గా అసలు పవన్ తప్ప నాయకులే లేరు. జనసేన భవిష్యత్తు గురించి ఆలోచించాలంటే, ముందుగా వర్తమానంలోకి రావాలి. గత అయిదేళ్ళకాలంలో పార్టీ నిర్మాణం పరంగా చేసింది ఏమీ లేదు, కాబట్టి ఇపుడు పార్టీ నిర్మాణం పట్ల దృష్టి సారించాలి. అదే సమయంలో విధానాల ప్రాతిపదికన ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రజల పక్షాన నిలబడగలిగితే భవిష్యత్తు ఉంటుంది. పవన్ మళ్ళీ సినిమాల్లోకి వెళితే, అది ప్రత్యర్థులకు స్వయంగా ఆయుధం ఇచ్చినట్టే. సినిమాలు చేయకూడదని కాదు, కానీ ఒక సంవత్సరం తరువాత అది కూడా ప్రజాసమస్యలపై చిత్రాలు తీయగలిగితే మంచిది. ఈలోపు చేయవలసినవి ప్రధానంగా క్షేత్ర స్థాయినుండి పార్టీ నిర్మాణం. అంతేకాక, జరిగిన నష్టాన్ని బేరీజు వేసుకుని ఇప్పటికైనా చంద్రనీడ నుండి బయటకు రావాలి. 2019 ఎన్నికల ప్రచార సమయంలో గత అయిదేళ్ల చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించేకంటే అంతకుముందటి వైఎస్ (2004 - 2009) ప్రభుత్వాన్ని, ప్రతిపక్షంలో నున్న జగన్ ను విమర్శించటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి, చంద్రబాబు పట్ల సానుకూల ధోరణి ప్రదర్శించారు. తద్వారా కోల్పోయింది ఏమిటో ఇప్పటికైనా అర్థమయ్యుంటే మేలే. గతంలో చంద్రబాబును ఎందుకు విమర్శించరు అంటే, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కొంచెం సమయం ఇద్దాం, పార్టీ/ప్రభుత్వం అస్థిరపరచకూడదని వంటి కబుర్లు చెప్పేవారు. మరి ఇపుడు 2014 కంటే క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేయబడిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న జగన్ కు కూడా సమయమిస్తారా లేక మొదటిరోజునుండీ జగన్ పై విమర్శలు మొదలెడతారా చూడాలి.
జనసేన అస్థిత్వం కొనసాగాలంటే, అది కేవలం పవన్ చేతుల్లోని/చేతల్లోని పని. అప్పుడప్పుడూ వచ్చి పోవడం కాకుండా, నిరంతరం ప్రజల్లో ఉండి - వారి సమస్యల పట్ల ప్రభుత్వంతో చర్చిస్తూ నిర్మాణాత్మకంగా వ్యవహరించగలిగితే భవిష్యత్తుపై ఆశలు పెట్టుకోవచ్చు. జనసేన గుర్తించవలసిన మరొక అతి ముఖ్యమైన అంశం ఏంటంటే - జనసేన ఎదగాలనుకుంటే రెండు బలమైన పక్షాలతో పోరాటం చెయ్యాలి - ఒకటి అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ, రెండు ప్రతిపక్ష తెదేపా. తమ పార్టీ మరియు లోకేష్ భవిష్యత్తుకు అడ్డు వస్తుందనుకునే ఏ ఒక్క అంశాన్ని చంద్రబాబు సహించరు. తన మీడియా బలంతో ముందుగా జనసేనను నొక్కేసి, తరువాత జగన్ వైపు చూస్తారు. కాబట్టి, జనసేనకు పొంచి ఉన్న ప్రమాదం ఎక్కువగా తెదేపా వైపు నుండే.
చిరంజీవి & పవన్ కళ్యాణ్ రాజకీయాలలో అట్టర్ ఫ్లాప్. బాలకృష్ణ, రోజా, విజయశాంతి & జయసుధ ఓపెనింగ్స్ కూడా అంతంతమాత్రం. కొత్తగా జూనియరుడు సాదించగలిగేదీ ఏమీ లేదు.
ReplyDeleteటీడీపీకి ఇప్పుడు కావాల్సింది కొత్త స్క్రిప్ట్ (ఆలోచనా సరళి & విధివిధానాలు). ఇది చేయకుండా ఆక్టర్లను మాత్రమే మారిస్తే కలెక్షన్లు (అనగా ఓట్లు & సీట్లు) రాలవు.