మనలో ఒకరు (5): ఒక మంచి మనిషి ... నీరజ

వంశీ కలుగోట్ల // మనలో ఒకరు (5): ఒక మంచి మనిషి ... నీరజ //
****************************************************
            చిరంజీవి నటించిన 'స్టాలిన్' చిత్రంలో కథ అంతా ఒక సందేశం చుట్టూ అల్లబడి ఉంటుంది. ఆ సందేశం ఏంటంటే 'మీరు ముగ్గురుకి సహాయం చెయ్యండి, ఆ ముగ్గురిని ఒక్కొక్కరు మరో ముగ్గురికి సహాయం చేయమనండి.' అలా ఒక గొలుసుకట్టులాగా సహాయం అన్న ప్రక్రియ సాగాలి, మనిషికి మనిషి సహాయం చేసుకోవాలి అన్నది అంతర్లీనంగా సందేశం. అది ఎదో హాలీవుడ్ లేదా కొరియన్ సినిమా నుండి తీసుకున్నది, ఆ సినిమా పేరు గుర్తు లేదు. అయినా నేను ఇపుడు ఈ వ్యాసం ముఖ్యోద్దేశం ఆ సినిమా గురించి చర్చించటం కాదు కాబట్టి ఆ విషయం అప్రస్తుతం. నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన గురించి చెప్పాలనుకుంటున్నాను, దానికి ఇది ప్రవేశిక లాంటిది.
            2000 సంవత్సరం, అప్పుడే డిగ్రీ పూర్తయ్యింది. రెండో అక్క గాయత్రి/నాగలతకు పెళ్లి కుదిరింది. అప్పటికింకా ఏమి చెయ్యలో, ఎటు వెళ్ళాలో డిసైడ్ చేసుకోలేదు కాబట్టి డిగ్రీ అయి కొన్ని నెలలు అయినా బేవార్సుగానే ఉన్నా. ఆగస్టులో పెళ్ళి. జులై లో పెళ్లి పత్రికలు పంచటం అనే ప్రక్రియ మొదలైంది. బంధువులు, మిత్రులకు అందరికీ చుట్టుపక్కల ఊళ్ళు తిరుగుతూ పత్రికలు పంచుతున్నా. నంద్యాలలో నేనూ, మా మామ కొడుకు హరి కలిసి పత్రికలు పంచుతున్నాం. నాకు బైక్ నడపటం రాదు, హరికి వచ్చినా బైక్ లేదు. ఇద్దరం పదకొండో నెంబర్ బస్ (కాలి నడక) కి తిరుగుతూ పత్రికలు పంచుతున్నాం. ఒక చాలా దగ్గరి బంధువు ఇంటికి పత్రిక ఇవ్వటానికి వెళ్ళాం. వాళ్ళు మేడ మీద అద్దెకు ఉంటారు. క్రింద పార్కింగ్ ప్లేస్ లో ఆయన బైక్ ఉంది. హమ్మయ్యా, బైక్ అడిగి తీసుకుని బైక్ మీద తిరిగి పత్రికలు పంచవచ్చులే అనుకున్నాం. సరే ఇంట్లోకి వెళ్ళి పత్రిక ఇచ్చి, బైక్ అడిగాం. ఆ బైక్ నడిపే ఆయన ఇంట్లో లేడు. ఆమె మాత్రం సింపుల్ గా బైక్ ఇంట్లో లేదురా ఉంటే బావుండేది మీకు కొంచం హేల్ప్ఫుల్ గా ఉండేది అనింది. ఏమంటాం, అప్పుడైనా ఇప్పుడైనా ఏమీ అనలేం. మళ్ళీ పదకొండో నెంబర్ బస్.
            అలాగే పత్రిక ఇవ్వటానికి మా డిగ్రీ క్లాస్ మేట్ శ్రీధర్ కూరాకుల వాళ్ళింటికి వెళ్ళాం. అప్పటికే శ్రీధర్ తనేం చెయ్యాలో నిర్ణయించుకుని హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కోర్స్ చేస్తున్నాడు. వాళ్ళింట్లో అందరూ కూడా బాగా పరిచయం. అందుకే పత్రిక ఇవ్వటానికి వెళ్ళాం. ఇంట్లో ఎవరూ లేరు, శ్రీధర్ వాళ్ళ అక్క నీరజ మాత్రమే ఉంది. పత్రిక ఇచ్చి బయటకు వస్తుంటే 'సుందరం, ఎలా వెళ్తున్నారు పత్రికలు ఇవ్వటానికి?' (నా పూర్తి పేరు వంశీ వినోద్ సుందరం ☺) అని అడిగింది నీరజ అక్క. నడుస్తూ తిరుగుతున్నాం అని చెప్పాం. ఒక్క నిమిషం అంటూ ఇంటి లోపలకు వెళ్ళి, బైక్ కీస్ తెచ్చి నా చేతిలో పెట్టింది. 'నిన్ననే షో రూమ్ నుండి బైక్ తెచ్చుకున్నారు ఆయన. పెట్రోల్ కూడా ఫుల్ గా ఉంది. మీ పని అయ్యాక తెచ్చి ఇవ్వండి' అంది. నాకైతే మైండ్ బ్లాంక్ అయిపోయింది. అసలు నాకు బైక్ వస్తుందా, రాదా అన్నది కూడా తెలీదు. (రాదు అనుకోండి ☺) బ్రాండ్ న్యూ బైక్ మీద తిరుగుతూ నంద్యాల, నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ రోజు రాత్రికంతా పత్రికలు ఇవ్వటం పూర్తి చెయ్యగలిగాం. (హరి లేకుంటే మనకు బైక్ రాదు కాబట్టి, ఇందులో హరి పాత్ర కూడా ఉంది, కాబట్టి హరికి కూడా థాంక్స్ ☺) మళ్ళీ, బైక్ లో పెట్రోల్ కొట్టించి ఇంట్లో ఇచ్చి నీరజ అక్కకి థాంక్స్ చెప్పి వెళ్లిపోయాం. 
            బహుశా, చాలామందికి ఇది సిల్లీగా, చిన్న సంఘటనగా అనిపించవచ్చు. కానీ, ఆ సంఘటన నా మీద వేసిన ముద్ర మాత్రం చిన్నది కాదు. ఆ సంఘటన జరిగిన చాలారోజులవరకూ నాకు గొప్పగా ఉండేది, గొప్పగా చెప్పుకునేవాడిని కూడా - 'నా మీద నమ్మకంతో, నాకు డ్రైవింగ్ వస్తుందో రాదో కూడా అడగకుండా కొత్త బైక్ అని కూడా చూడకుండా ఇవ్వగలిగే మనుషులను సంపాదించుకున్నాను' అని. అసలు విషయం అర్థం కావటానికి ఎక్కువ టైం పట్టలేదనుకోండి, ఆ గొప్పతనం నాది కాదు అంతటి గొప్పమనసు ఉన్న నీరజ అక్కది అని. అత్యంత దగ్గరి బంధుత్వం ఉన్నవాళ్ళే, నాతోపాటు ఉన్న హరికి బైక్ డ్రైవింగ్ తెలుసు అని తెలిసినా కూడా, ఇంట్లో బైక్ ఉంచుకుని మరీ లేదని చెప్పి బైక్ ఇవ్వలేదు. వారిని తప్పు పట్టట్లేదు, ఎందుకంటే బహుశా వారి గత అనుభవాలు ఎలాంటివో కదా, ఆ గతానుభవాలో లేక మరేవో అందుకు కారణమై ఉండొచ్చేమో. కానీ, నీరజ అక్క చేసిన సహాయం నా మీద అత్యంత ప్రభావం చూపింది. ఎపుడైనా నన్ను ఎవరైనా సహాయం అడిగితే వారి స్థాయి/నైపుణ్యత చూడాలి అన్న భావన కలిగితే వెంటనే వెనక్కెళ్ళి ఆ ఘటనను గుర్తు తెచ్చుకుంటాను అంతే - ఆ స్థాయి గట్రాలన్నీ దూదిపింజల్లా ఎగిరిపోతాయి, నా స్థాయికి మించనంతవరకూ.
            నేను గొప్పపనులేవో చేస్తున్నానని చెప్పుకోవటానికి ఈ ఘటన గురించి ప్రస్తావించట్లేదు. నేను చూసిన, నాకు పరిచయం ఉన్న ఒక గొప్ప మనసున్న వ్యక్తిని పరిచయం చెయ్యటానికి ప్రస్తావించాను. నా వరకూ నాకు స్టాలిన్ చిత్రంలో చెప్పిన సందేశానికి ఉదాహరణలా అనిపిస్తుంది నీరజ అక్క. అలాగని, మనల్ను కూడా ఇంకొకరికి సహాయం చెయ్యమని చెప్పదు. తాను చేస్తుంది అంతే. దయచేసి, ఈ వ్యాసంలో రచనా శైలి, పదాల వాడుక వంటివి చూడకండి. ఎన్నో రోజులనుండి రాయాలనుకుంటున్న ఈ వ్యాసం ఇప్పటికి రాయగలిగాను. మనం ఒకరికి సహాయం చేసినపుడు, వారిని మనం తిరిగి మరొకరికి సహాయం చెయ్యమని చెప్పక్కర్లేదు. అవతలి వ్యక్తిలో యే కాస్త మనిషిత్వం మిగిలున్నా చేస్తాడు, చెయ్యకపోతే వారికీ ప్రాణం లేని వస్తువులకూ తేడా లేదని అర్థం. అదృష్టమో, మరోటో అటువంటి వ్యక్తులు మంచి సంఖ్యలోనే తారసపడ్డారు, వ్యక్తిగత పరిచయాలూ ఉన్నాయి అటువంటి వారితో. వారిలో కొందరి గురించి ఇప్పటికే 'మనలో ఒకడు శీర్షికన కొన్ని వ్యాసాలూ రాశాను. వీలు చిక్కినపుడు మరో 'మనలో ఒకరు'తో మళ్ళీ కలుస్తా.

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన