'సారీ వరలక్ష్మి' లఘు చిత్రం సమీక్ష

వంశీ కలుగోట్ల // 'సారీ వరలక్ష్మి' లఘు చిత్రం సమీక్ష //
**********************************************
            'జీవితంలో ఏ క్షణమూ ఒకేలా ఉండదు', 'జీవితాన్ని ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం అయిదువరకు కంప్యూటర్స్ ముందు కాదు ప్రకృతి ముందు ఖర్చు పెట్టండి' అన్న రెండు సంభాషణలే మూలాధారంగా మారిన కథే శంకర్ సిద్ధం లఘు చిత్రం 'సారీ వరలక్ష్మి'. ఈ చిత్రానికి కథ, చిత్రానువాదం (స్క్రీన్ ప్లే), నిర్మాణం, దర్శకత్వం, సంభాషణలతో పాటు ప్రధాన పాత్ర కూడా పోషించిన శంకర్ అన్నింట్లోనూ రాణించాడు. ఈ చిత్రంలోని ఏ అంశంపైనైనా సమీక్ష చేస్తూ వ్యాఖ్య చేయబోయే ముందు గుర్తుంచుకోవలసింది ఇది అత్యంత పరిమిత వనరులతో తీసిన లఘు చిత్రం. కానీ, ఆ ఛాయలు ఎక్కడా కనబడకుండా మంచి నాణ్యమైన చిత్రాన్ని అందించారు అని చెప్పవచ్చు.
            ముందుగా కథ - పైన పేర్కొన్నట్టు ఆ రెండు సంభాషణలే చిత్రం కథను, కథా గమనాన్ని తెలుపుతాయి. విదేశాలలో ఉన్న ఒక యువకుడి కథ అన్నది అదనపు హంగు. ఉన్నత చదువుల కోసం లండన్ లో దిగిన అభినవ్, తాననుకున్న లండన్ వేరు చూసే లండన్ వేరు అని త్వరలోనే తెలుసుకుంటాడు. కానీ, నిరాశ పడకుండా కృషి చేసి సాఫ్ట్వేర్ రంగంలో మంచి ఉద్యోగం సంపాదించినా 'ఏదో కావ్వాలి అని తపిస్తుండే అభినవ్ జీవితంలో వరలక్ష్మి పరిచయం ఆనందాన్ని తీసుకొస్తుంది. ఈ ప్రేమ కథలో పెద్ద మలుపులు, గొడవలు ఏమీ ఉండవు. సాఫీగా సాగిపోతున్న వారి ప్రయాణం పెళ్లి దగ్గరకు వడివడిగా సాగుతున్న సమయంలో, పెళ్ళికి ముందు లాంగ్ డ్రైవ్ వెళ్ళాలన్న తన కోరిక తీర్చుకోవడానికి వెళ్ళిన అభినవ్ కు ఎదురైన అనూహ్య ఘటనలు ఏమిటి? అభినవ్ వరలక్ష్మికి సారీ ఎందుకు చెప్పాల్సొన్చింది అన్నవి చిత్రంలో చూస్తేనే బావుంటుంది. కథాపరంగా కంటే కథనం పరంగా బాగా ఆకట్టుకుంటుంది 'సారీ వరలక్ష్మి'. బిగుతైన చిత్రానువాదంతో పాటు దాన్ని తెరకెక్కించిన తీరు శంకర్ లో కేవలం సినిమా అంటే పిచ్చి మాత్రమే కాదు, అవకాశం లభిస్తే పెద్ద స్థాయిలో కూడా సినిమాను మోయగలడు అన్న భావనను కలిగిస్తాయి. ముఖ్యంగా స్క్రీన్ ప్లే/చిత్రానువాదం - చూసేవారికి తరువాత ఏమవుతుంది అన్న ఉత్కంఠను కలిగించడంలో శంకర్ సఫలీకృతుడయ్యారు.
            నటీనటుల విషయానికి వస్తే - ప్రధాన పాత్ర పోషించిన శంకర్ ఎక్కడా తడబడకుండా, సులువుగా చేశారు. టైటిల్ రోల్ అయిన వరలక్ష్మి పాత్ర పోషించిన తారక తెరపై అందంగా కనిపించింది, నటన పరంగా కూడా పర్వాలేదు అనిపించేలా ఉంది. ఉన్నంత నిడివిలో, చిన్న చిన్న రొమాంటిక్ భావాలు పలికించడంలో ఆకట్టుకుంది. మిగతా వాటిలో బాగా ఆకట్టుకునే పాత్ర అభినవ్ మిత్రుడిగా కనిపించిన చందు సిద్ధం. అభినవ్ కు సలహాలు చెప్పే పాత్రలో హాస్యం పండిస్తూ, తన నటనతో/సంభాషణలతో చందు అలరించాడు, అలరించాడు అనేకంటే తానున్నపుడు మిగతావారిపై నుండి తనమీదకి దృష్టిని లాగేసుకుంటాడు అని చెప్పవచ్చు. ఇక కనిపించేది కొద్దిసేపే అయినా, విభిన్నమైన పాత్రలో పరి ఆకట్టుకుంటుంది. నిడివి పరంగా తొలి పదిహేను/ఇరవై నిమిషాలలో కొంత తగ్గించి ఉండొచ్చేమో అనిపించింది. చిత్రగమనం తొలి ఇరవై నిమిషాల తరువాత వేగం అందుకుని, పరుగులు పెడుతుంది.
            సాంకేతిక విభాగాల విషయానికి వస్తే శంకర్ సిద్ధం బృందానికి ఉన్న పరిమితుల దృష్ట్యా చూస్తే చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా ఫోటోగ్రఫీ శాఖను అభినందించాలి. లఘు చిత్రం అన్న ఛాయలు కనబడకుండా డ్రోన్ కెమెరాల వాడకం, కెమెరా యాంగిల్స్, క్వాలిటీ వంటివి లఘు చిత్రం స్థాయితో పోలిస్తే ఉన్నతంగా ఉన్నాయి. కేశవ కిరణ్ అందించిన సంగీతం కూడా 'సారీ వరలక్ష్మి' కి బలంగా నిలిచింది. ఎడిటింగ్ లో కాస్త తడబాటు (మొదటి ఇరవై నిమిషాలలో) ఉన్నప్పటికీ, మరీ ఇబ్బంది పెట్టేస్తాయిలో ఉండకుండా పర్వాలేదు అనిపించేలా ఉంది. పరిమిత వనరులతో తీసిన 'సారీ వరలక్ష్మి' లఘు చిత్రమే అయినప్పటికీ; నాణ్యతలో ఆ ఛాయలు కనబడకుండా, ఖచ్చితంగా శంకర్ సిద్ధంకు మంచి పేరు తెచ్చేదిగా నిలబడుతుంది.

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన