శ్వేతపత్రాలు ఏమయ్యాయి?

వంశీ కలుగోట్ల // శ్వేతపత్రాలు ఏమయ్యాయి? //
*****************************************
ఎక్కువొద్దురా నాయనా సామీ, ఆ ఇచ్చేదేదో హోదానే ఇవ్వు అని 2014 నుండీ మొత్తుకుంటుంటే ఇపుడు మళ్ళీ తాజాగా ఎప్పటినుండో పాడిన పాతపాటనే పాడతారేంటి అమిత్ షాజీ!? మీరిచ్చిన డబ్బులు కావాలంటే ఎనక్కి తీసుకోండి, హోదా ఇవ్వండి చాలు. అవునూ, అమిత్ షా గారేం ఒక లక్షా డెబ్బై అయిదువేల కోట్లు ఇచ్చామని అంటున్నారు కదా, మరి అయితే క్రింది ప్రశ్నలకు వివరణ ఇస్తూ బాబుగారేమన్నా తెల్లకాయితం అదేనండీ శ్వేతపత్రం ఏమైనా విడుదల చేస్తారా లేక చెయ్యగలరా?

-> అమిత్ షా గారు పేర్కొంటున్నట్టు అంతటి భారీస్థాయిలో నిధులు/డబ్బులు నిజంగానే ఇచ్చారా?
-> ఒకవేళ అంతటి భారీ స్థాయిలో నిధులు ఇచ్చి ఉంటే, వేటికి ఉపయోగించారు?
-> అమిత్ షా గారు పేర్కొన్న నిధులు గత సంవత్సర కాలంలో ఇచ్చినవా లేక గత మూడు సంవత్సరాల కాలంలో ఇచ్చినవా లేకపోతే 2019 వరకూ ఇవ్వాలని అనుకుంటున్నా వాటితో కలిపి చెప్పిన లెక్కనా?
-> ఆ నిధుల ఉపయోగించిన వివరాలేమిటి అంటే ఏయే పథకాలు లేదా కార్యక్రమాలకు వినియోగించారు?
-> ఇచ్చిన డబ్బులు హోదా, ప్రత్యేక ప్యాకేజీ తదితరాలకు సంబంధం లేకుండా మిగతా రాష్ట్రాలలానే కేంద్ర కోటాలో ఇచ్చిన నిధులా లేక ప్రత్యేకంగా ఆంధ్రకేమైనా ఇచ్చారా?
-> ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కేంద్రానికి కట్టిన పన్నులు - కేంద్ర తిరిగి ఇచ్చిన (ఇవ్వాల్సిన కోటాలోనే) నిధులు వివరాలేమిటి?
-> రాజధాని నిర్మాణానికి, పోలవరం వంటి జాతీయ ప్రాజెక్ట్ లకు ఇచ్చిన నిధులు కూడా ఈ కోటాలో కలిపేశారా? కలిపేసి ఉంటే అది సమంజసమేనా?
-> విభజన చట్టం ప్రకారం హోదా ఇవ్వకపోయినా ప్రత్యేక ప్యాకెజీ ఇస్తామని అంటున్నారు. రాజ్యసభలో నాటి ప్రధాని ఇచ్చిన 'ప్రత్యేక హోదా' హామీకే చట్టబద్ధత లేదని అంటే పత్రికా సమావేశంలో ఆర్థిక మంత్రి ప్రకటించిన ప్యాకేజీ చట్టబద్ధత ఏపాటి?
తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ గారితో పోలిక పక్కనబెడదాం, కానీ రాష్ట్రానికొచ్చిన భాజపా చిన్నాపెద్దా తలకాయలన్నీ ఈ లెక్కలే చెబుతుంటే అవి సరియైనదో కాదో అన్న వివరాలతో శ్వేతపత్రం విడుదల చెయ్యాల్సిన నైతిక బాధ్యత ఉన్న చంద్రబాబు గారు ఎందుకు అలా చెయ్యట్లేదు? ప్రతిపక్షం విషయం పక్కనబెడదాం; మాటికోసారి ప్రజల వద్దకు పాలన, పారదర్శక పాలన అంటూ వాక్రుచ్చే బాబుగారు ఇప్పుడైనా ఆ వివరాలతో శ్వేతపత్రం విడుదల చెయ్యగలిగితే బావుంటుంది. దానితో ప్రజలకే కాదు, ప్రశ్నించే ట్విట్టర్ పిట్టలతో పాటు ప్రతిపక్షాలకూ అధికారిక సమాచారంతో అవగాహన అంటూ ఒకటి వచ్చి చస్తుంది కదా. బాబుగారే కాదు, కేంద్రం కూడా తత్సంబంధిత వివరాలతో శ్వేతపత్రం విడుదల చేస్తే సమాధానంగా ఉంటుంది. తెల్లకాయితాలు అయిపోయినాయేటి?

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన