... తొందరపడి

వంశీ కలుగోట్ల // ... తొందరపడి //
*****************************
ప్రతిపక్ష నేత జగన్, ప్రధాని మోడీతో సమావేశం గురించి రాష్ట్ర తెదేపా చేస్తున్న వ్యాఖ్యలు అత్యంత హాస్యాస్పదంగా ఉన్నాయి.
-> మొదటి ఆరోపణ 'ఈ సమావేశం గురించి ముందుగా చెప్పలేదు'. ఎందుకు చెప్పాలి, ఎవరికీ చెప్పాలి? ఆయన చేసే ప్రతిదీ తెదేపాకు చెప్పి చెయ్యాలా!? మరి పెదబాబు, చినబాబు అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ పర్యటనల (అధికారిక/అనధికారిక) గురించి ప్రతిపక్షానికి ముందుగా సమాచారం ఇస్తారా?
-> రెండవ ఆరోపణ, 'కేసులనుండి తప్పించుకోవడానికి మోడీని కలిసారు'. ఒకవేళ వీరన్నట్టు కేసుల విషయంగానే కలిశాడు అనుకుందాం, అయితే ఏమిటట? కేంద్రంలో అనగా మోడీగారి దగ్గర చక్రం తిప్పగల తమ నాయకుడు బాబు ఉండగా జగన్ మోడీ గారిని కలిసి ఉద్ధరించేది ఇంకేముంటుంది? అయినా ప్రతిపక్షనేత ఢీల్లీ వెళ్ళిన ప్రతిసారీ ఇంకే కారణాలూ ఉండవా లేక మోడీగారి దగ్గర బాబు గారి ప్రాభవం ఏమన్నా తగ్గుతోందని అనుమానమా? అనవసర ఉలికిపాటు ఎందుకు?
-> మూడవ ఆరోపణ - 'ఈ సమావేశం గురించి చివరికి చాలామంది వైకాపా ఎమ్మెల్యేలకు కూడా సమాచారం లేదు'. వారికి సమాచారం ఉందో లేదో అది తమరికెందుకు? అది వారి పార్టీ అంతర్గత విషయం. అయినా బాబు గారి ప్రతి అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ పర్యటన గురించి పార్టీలో తలకాయ ఉన్న ప్రతి నాయకుడికీ సమాచారం ఇస్తారా?
*                     *
                     *
మోడీ గారితో సమావేశం తరువాత పత్రికా సమావేశంలో ప్రతిపక్ష నేత జగన్ గారిలో కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనబడింది. పత్రికా సమావేశంలో కాస్త తొందరపాటు పడినట్టనిపించింది.
-> రాష్ట్రపతి ఎన్నికల గురించి భాజపాకు మద్దతు ప్రకటించటంతో అంత తొందరపాటు ఎందుకు? సమావేశంలో చర్చకు వచ్చిన వివిధ కారణాలవల్లమద్దతు ఇవ్వటానికి అంగీకరించి ఉండవచ్చు. కానీ, వెంటనే ప్రకటించటం కాస్త తొందరపాటే. ముందుగా వారు అభ్యర్థిని ప్రకటించేవరకూ ఆగి, ఆ తరువాత 'వారు మద్దతు కోరారు, అభ్యర్థి మంచివ్యక్తి ...' గట్రా కారణాలు చెబుతూ కేవలం రాష్ట్రపతి ఎన్నికలలో మద్దతు ఇస్తున్నాం అంటూ ప్రకటించి ఉండవచ్చు, అది కూడా తను కాకుండా వేరే వారిచేత - అప్పుడు పార్టీ పరంగా కాస్త హుందాగా ఉండేది.
-> ఎన్డీఎకు అంశాలవారీ మద్దతు గురించి ప్రకటన కూడా అతి తొందరపాటే. ఇప్పుడు వారు అడుగలేదు, వారికి ఆ అవసరమూ లేదు. అటువంటప్పుడు అంత తొందరపాటుగా వారికి అంశాలవారీ మద్దతు ఇస్తున్నాం అని ప్రకటించటం అపోహలకు తావిస్తుంది. ఇటువంటి వాటిలో కాస్త గుంభనం పాటిస్తే బావుంటుంది. అంశాలవారీ మద్దతు లేదా పోరాటం అన్నది ఆయా అంశాలు తెరపైకి వచ్చినపుడు ప్రకటిస్తే బావుంటుంది తప్పించి వారికి ముందుగా చెప్పటం ప్రతిపక్షంగా ఉన్నపుడు తగదు.  
*                     *                     *
ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం తొందరపాటు చర్యలు నగుబాటుకు గురయ్యేలా ఉన్నాయి తప్పించి లాభసాటిగా ఉండట్లేదు. తెదేపాను ఎలాగైనా భాజపాకు దూరం చెయ్యాలన్న వైకాపా తాపత్రయం, వైకాపా ఎక్కడ భాజపాకు దగ్గరవుతుందో అన్న తెదేపా వారి భయం ప్రస్ఫూటంగా కనిపిస్తున్నాయి. ఇరుపక్షాలవారూ ప్రజాసమస్యలపై, ప్రజలను కలుపుకునిపోయే పోరాటతీరులపై దృష్టి పెట్టగలిగితే బావుంటుంది.

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన