ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే - శర్వానంద్ 'రాధ' చిత్రం గురించి

ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే - శర్వానంద్ 'రాధ' చిత్రం గురించి 
*******************************************************************************
            విభిన్న తరహా చిత్రాలతో, వరుస విజయాలతో దూసుకెళుతున్న యువ కథానాయకుడు శర్వానంద్ తాజా చిత్రం 'రాధ'. ఈ చిత్రం వివరాల్లోకి వెళ్ళేముందు ఒక చిన్నమాట ... సినిమా జనాలందరికీ ఒక చిన్న 'పిచ్చ' ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో ఆ పిచ్చ ప్రతి ఒక్కరిని పట్టి పీడించి తీరుతుంది. ఆ పిచ్చ పేరే 'మార్స్ సినిమాలు. ఇప్పుడు ఆ పిచ్చ కాస్తా శర్వానంద్ కు కూడా పాకినట్టు ఉంది. కాకపొతే శర్వానంద్ కు మొహమాటంతో కూడిన సిగ్గుతో కూడిన భయంతో వచ్చిన జాగ్రత్తవల్ల మరీ పూర్తిగా ఊర మాస్ తరహాలో వెళ్ళటానికి ఇబ్బంది పడినట్టున్నారు. సీసాను కాస్త అటూ ఇటూగా మార్చి అదే మందును పోశారు. 'రన్ రాజా రణ్ కూడా అలాంటిదే అయినా సుజీత్ దర్శకత్వ, చిత్రానువాద (స్క్రీన్ ప్లే) ఆ సినిమాకు ప్రాణం పోసి ఆసక్తిగా చూసేలా చేసింది. 'రాధ' సినిమాకు వస్తే ఆ రెండు అంశాలే ప్రధాన లోపాలుగా మిగిలి నూతన దర్శకుడు చంద్రమోహన్ ప్రత్యేకించి చిత్రానువాదం మీద మరింత పట్టు సాధించాల్సిన ఆవశ్యకత తెలుపుతాయి. 

            'రాధ' చిత్రం కథ విషయానికి వస్తే ఒక మామూలు కథ, పెద్దగా చెప్పుకోవాల్సిన పస లేని కథ, ఇలాంటి కథను చంద్రమోహన్ ఎలా చెప్పి నిర్మాతలను, శర్వానంద్ ను ఒప్పించాడో మరి. భగవద్గీత, కృష్ణుడు పాత్రల చేత ప్రేరేపితుడైన రాధాకృష్ణ అనే బాలుడు ఒకానొక చిన్న ప్రమాద సమయంలో తనను ఒక పోలీస్ కాపాడడంతో కృష్ణుడే పోలీస్ గా వచ్చాడనుకును తానూ పోలీస్ కావాలనుకుంటాడు. పోలీసుల మీద ఎవరైనా దాడి చేసినా, ఏమన్నా అన్నా భరించలేడు. పోలీసులమీద దాడి చేసినవారిని తానే పట్టుకుని పట్టిస్తుంటాడు, అలా మన రాధాకృష్ణకు పోలీస్ వ్యవస్థ మీద ఉన్న గౌరవంతో కూడిన అభిమానంతో కూడిన ప్రేమ వాళ్ల వచ్చిన ప్రత్యేకాభిమానానికి పొంగిపోయిన డీజీపీ గారు ఎకాఎకీన తనకున్న ప్రత్యేకాధికారాన్నుపయోగించి ఎస్సైగా ఉద్యోగం ఇచ్చేస్తాడు. ఆ తరువాత మనోడు వరంగల్ జిల్లాలో ఒక పల్లెటూరికి వెళ్ళడం, అక్కడ కథానాయిక అని చెప్పుకోవాల్సిన లావణ్య త్రిపాఠితో ప్రేమలో పడటం సినిమాను సాగదీయటానికి తప్పించి మరెందుకూ పనికి రాలేదు. లావణ్య మామూలుగా బానే ఉన్నా, శర్వానంద్ కు మాత్రం సరిపోలేదు అనగా వారి జోడీ బాలేదు అని నా అభిప్రాయం. ఇక అక్కడ కేసులేమీ లేవని, ధూల్ పేటకు ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడు రాధాకృష్ణ. ఇక, కథను సాగదీయటానికి ఎన్నకున్న మరో లంకె రవి కిషన్ (రేస్ గుఱ్ఱం పాత్రని కాస్త తెగ్గొట్టి, ఆవేశాన్ని తగ్గించేశారు అంతే), ఆశిష్ విద్యార్థి పాత్రలు. ఈ రెండు పాత్రలు చూస్తే మస్కా సినిమాలో ముఖేష్ రిషి, ప్రదీప్ రావత్ పాత్రలు గుర్తొస్తాయి. ఇలా ప్రతిచోటా ఏదో ఒక సినిమా గుర్తొస్తూనే ఉండే చిత్రం 'రాధ'. ఇక ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలు, కథాగమనానికి ఎన్నుకున్న మూలకారణం 'పోలీస్ వ్యవస్థకు గౌరవ/[పఱువు వంటివి అయితే సింగం రిటర్న్స్ (హిందీ) చిత్రంలోంచి మక్కీకి మక్కి దించేసినట్టు ఉన్నాయి. కాబట్టి కథ గురించి చెప్పుకోవాల్సిన పనే లేదు. 
            ప్రధాన పాత్రధారి అయిన శర్వానంద్ గురించి చెప్పుకోవాలంటే బహుశా 'మాస్' దోమ కుట్టినా, భయమో లేక సిగ్గో కానీ పూర్తి మాస్ తరహాలో తియ్యలేదు. లేకపోతే విభిన్న తరహా చిత్రాలు చేసీ చేసీ బోర్ కొట్టేసిందేమో మరి. ఎందుకో కానీ తనకు పాత్ర సూటవ్వదేమో అనే సందేహంతోనే చేసినట్టు అనిపిస్తుంది. అలాగని చెడగొట్టలేదు. ఇక లావణ్య త్రిపాఠి జోడీ బాలేదు, సన్నగా అయినా అక్ష కూడా శర్వానంద్ పక్కన బాలేదు. మిగతా వారి గురించి చెప్పుకోవడానికేమీ లేదు. ఒక్క ఫోటోగ్రఫీ/కెమెరా విభాగం మినహాయించి మిగతా సాంకేతిక విభాగాలు సమిష్టిగా సినిమాను కిందికి దించాయి. రాధన్ అందించిన సంగీతంలో ఒక్కపాటా ఆకట్టుకునేలా లేదు, నేపథ్య సంగీతం కూడా అదే తీరు.
            సినిమా మొత్తం మీద హైలైట్ ఏంటంటే క్లైమాక్స్ సన్నివేశంలో శర్వానంద్ చెప్పే డైలాగ్, 'జూదం ఆడేటప్పుడూ, కురుక్షేత్రం జరిగేటప్పుడూ కృష్ణుడు ధర్మరాజు పక్కనే ఉన్నాడు. జూదం ఆడాలా వద్దా అని ముందే అడిగుంటే కురుక్షేత్రం జరిగేదే కాదు. కృష్ణుడు ఎప్పుడూ పక్కనే ఉంటాడు ...' అంటూ చెప్పే ఆ డైలాగ్ సివరాఖరున బయటకొచ్చేటప్పుడు ఒక్కసారి చప్పట్లు కొట్టేట్టు చేస్తుంది. అంతకుమించి సినిమాలో మరేమీ లేదు. అలాగని పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరమూ లేదు. చూడాల్సిన అవసరం ;లేదు, చూస్తే పెద్దగా బాధపడాల్సిన పనీ లేదు. 

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన