ఇంతకీ నేను సెప్పొచ్చేదేంటంటే ... 'బాహుబలి 2' గురించి
************************************************
మొదటగా, తనమీద నమ్మకంతో వందలకోట్లు ఖర్చు పెట్టగలిగే నిర్మాతలను
సంపాదించుకోగలిగిన రాజమౌళికి ; రాజమౌళి మీద నమ్మకంతో దాదాపు అయిదు
సంవత్సరాలు బాహుబలికే అంకితమైపోయిన ప్రభాస్ నిబద్ధతకు ప్రశంసలు.
ప్రశంసించినా సరే లేక విమర్శించాలనుకున్నా సరే సినిమా గురించి తెలిసిన
వారిలో అధికశాతం మంది చూడాలనుకున్న, చూడబోతున్న సినిమా 'బాహుబలి 2'. సినిమా
ఎలా ఉంది అన్న విషయం అటుంచి మొత్తం భారత దేశ సినిమా ప్రేక్షకులలో, కొంత
స్థాయిలో అంతర్జాతీయ సినిమా ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించిన సినిమా
గతంలో లేదు. అందునా చిన్న చూపుకు గురయ్యే దక్షిణాది సినిమా రంగం నుండి; అదీ
కాక దక్షిణాది సినిమా అంటే 'తమిళ సినిమా' మాత్రమే అనుకునే బుర్రతక్కువ
వాళ్లకు 'ఇది తెలుగు సినెమా, తెలుగోడు తీసిన సినిమా' అని చెప్పుకుంటూ
దక్షిణాది సినిమా రంగం అంటే కేవలం తమిళ సినిమా కాదు అని చూపించిన రాజమౌళి
ప్రశంసనీయుడు. ఎన్నో దశాబ్దాల నుండి భారతదేశ సినిమా రంగంలో దాదాపు ప్రతి
సంవత్సరం అత్యధిక చిత్రాలు నిర్మించే చలన చిత్ర రంగంగా పేరుకెక్కినా, 90వ
దశకంలోనే ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన నాటి బాలీవుడ్ నెంబర్ వన్ హీరో
అమితాబ్ ను మించి పారితోషికం తీసుకునే హీరో ఉన్న తెలుగు సినీ రంగం ఆ
స్థాయిలో ఉన్నత ప్రమాణాలతో సినిమాలను నిర్మించడంలో మాత్రం వెనుకబడింది.
నాసిరకం కథనాల మీదే ఆధారపడుతూ వ్యంగ్యానికి గురయ్యింది. అప్పుడప్పుడు
కొన్ని మెరుపులు మెరిసినా దేశీయ స్థాయి గుర్తింపును పొందే మెరుపులు
లోపించాయి. ఇప్పుడు 'బాహూబలి' ఆ లోటును తీర్చింది.
'బాహుబలి 2' అత్యంత భారీ అంచనాల నడుమ విడుదల అయింది. 'బాహుబలి 1' చూసిన
ప్రేక్షకులకు 'అంతకుమించి' అందివ్వాలని తపించిన దర్శకధీరుడు రాజమౌళితో పాటు
వందలాది మంది కొన్ని సంవత్సరాలు శ్రమించిన ఫలితం 'బాహుబలి 2'. నిర్మాతల
ధైర్యానికి, దర్శకుడిపై వారికున్న నమ్మకానికి జోహార్లు. సినిమా మొదటి
సన్నివేశం నుండి చివరి సన్నివేశం వరకు భారీతనం, సాంకేతిక విలువలు,
(కొంతమంది) నటన కట్టిపడేస్తుంది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతం.
ఇప్పటివరకూ భారతీయ సినిమా ఊహించుకోవడానికి కూడా వెనుకాడిన స్థాయిలో ఉన్నాయి
సాంకేతిక విలువలు. మంచికైనా, చెడుకైనా ఇప్పుడు భారతీయ సినిమా నిర్మాణ
విలువలు బాహుబలికి ముందు, బాహుబలికి తరువాత అని పరిగణింపబడతాయి. సినిమా
చూస్తున్నంతసేపు నిర్మాతల ధైర్యానికి జోహార్లు అనిపిస్తూనేవుంటుంది.
రాజమౌళి తన అందమైన ఊహలను అంతే అందంగా తెరిమీదికి తీసుకురాగలిగాడు. అలాగే
తనదైన తీరులో భావగాఢత నిండిన సన్నివేశాలను తెరకెక్కించాడు కూడా. తడబాట్లు
(తరువాత పేరాలలో వివరిస్తాను) ఉన్నప్పటికీ, ఒక నిలిచిపోయే, అందరూ
చెప్పుకునే సినిమాను అందించడంలో విజయం సాధించాడు. ఈ సినిమా గురించి ఇప్పుడే
కాదు, మరెప్పుడు చెప్పుకోవాలన్నా అత్యంత ముఖ్యమైనది 'విజువల్ ఎఫెక్ట్స్'. అవి లేకపోతే ఈ సినిమానే లేదు. వాటితో పాటు నేపథ్య సంగీతం, ప్రతి సన్నివేశానికి విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు నేపథ్య సంగీతం కూడా ఆయువుపట్టుగా నిలిచాయి.
సరే, ఇక సంకలు గుద్దుకోవడం పూర్తయ్యింది కాబట్టి ఇక పొగడ్తలతో
ఆకాశానికెత్తేయబడిన బాహుబలిని నేలమీదే ఉన్నాడన్న విషయాన్ని గుర్తుచేసే
అంశాలేమిటో చూద్దాం. ముందే చెప్పినట్టు విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతాః, కానీ
వాటిలో చాలావరకు 'మేమూ తియ్యగలం' అని చూపుకోవాలన్న తపనే తప్పించి అవసరం
అనిపించేలా లేవు. వాటిని ఇరికించడం కోసం నిడివి పెంచేసినట్టు అనిపిస్తుంది.
ముఖ్యంగా దేవసేనకు చెందిన కుంతల రాజ్యంలో బాహుబలి గడిపే సన్నివేశాలు,
కుమార వర్మ ఉండే దృశ్యాలు, బాహుబలి దేవసేనను మాహిష్మతి రాజ్యానికి
తీసుకొచ్చే సన్నివేశాలు, బాహుబలి దేశాటన పేరున వచ్చే పాట/సన్నివేశాలు,
బాహుబలిని కట్టప్ప చంపబోయేప్పుడు కాలకేయులతో చిన్నపాటి యుద్ధం గట్రా కొన్ని
ఉదాహరణలు. సన్నివేశాలను తెరకెక్కించిన విధానం అవును అద్భుతమే కానీ అవి
అనవసరంగా సినిమా నిడివి పెంచాయి అనిపించేలా ఉన్నాయి. ఇక, ఉన్న ఇతర గొప్ప
సన్నివేశాలు కూడా అవసరానికి మించి సాగదీశారు (విజువల్ ఎఫెక్ట్స్ గొప్పగా
చూపామనిపించడం కోసం కావచ్చు) అనిపించేలా ఉన్నాయి. కథ కోసం గ్రాఫిక్స్
కాకుండా గ్రాఫిక్స్ ఇలా చెయ్యాలి అనుకున్నాక సన్నివేశాలు తయారు
చేసుకున్నట్టు ఉంది. ఇదంతా విజువల్ ఎఫెక్ట్స్ గురించి.
ఇక పాత్రల చిత్రణ గురించి. కథకు, సినిమాకు ఆయువు పట్టు లాంటి 'సొగమి పాత్ర
గురించి. అసలు రమ్యకృష్ణ, శివగామి పాత్ర లేకపోతే ఈ సినిమానే లేదేమో అనేలా
ఉంది. రమ్యకృష్ణ నటన అద్భుతః. మొదటి భాగంలో కనిపించిన కొద్దిసేపు
ఉర్రూతలూగించిన శివగామి పాత్రలో రమ్యకృష్ణ మరోసారి విజృంభించింది. కానీ, ఆ
పాత్ర ఔచిత్యాన్ని మాత్రం సరిగా తీర్చి దిద్దలేకపోయారు. మొదటి భాగంలో ఎంతో
శక్తిమంతంగా, ఉదాత్తంగా, ధీరోదాత్తంగా తీర్చిదిద్దిన శివగామి పాత్రను
పాతాళానికి తొక్కేశారు. ఎవరిది చెప్పినా విని నమ్మేసే డమ్మీ పాత్ర స్థాయికి
దిగజార్చినా రమ్యకృష్ణ నటనాప్రతిభతో నెట్టుకొచ్చేసింది. సరిగా
రూపుదిద్దుకోబడిన అత్యంత ముఖ్యమైన పాత్ర నాజర్ పోషించిన బిజ్జలదేవ పాత్ర.
మాహిష్మతి రాజ్య సింహాసనం తనకు దక్కలేదన్న అక్కసు ఒకవైపు, తన కొడుక్కు కూడా
దక్కనివ్వలేదన్న ఆవేదనతో కూడిన ఆగ్రహం ఒకవైపు, శివగామిని ఏమీ చెయ్యలేని
నిస్సహాయత ఇలా పలు భావాలను అత్యంత సమర్థవంతంగా రక్తి కట్టించాడు. ఇక
సినిమాలో అత్యంత ప్రధానమైన రెండు పాత్రలు పోషించిన ప్రభాస్ మరియు రానా
గురించి చెప్పుకోవాలి. పాత్రలకు తగిన శరీరాలతో విగ్రహపుష్టిలాగా బాగా
నిండుగా కనిపించారు ఇద్దరూ. నటన పరంగా ప్రభాస్ ఎందుకో ఈ రెండో భాగంలో కాస్త
తడబడినట్టు అనిపించింది. అంతేకాదు, వాచకం మీద దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత
ఉంది. ఇన్ని సంవత్సరాలపాటు వేరే చిత్రాలు చెయ్యకుండా కేవలం ఈ పాత్ర మీదే
దృష్టి పెట్టిన నిబద్ధత ప్రశంసనీయమే అయినా ఇంకా మెరుగుపడాల్సింది ఉంది
ప్రత్యేకించి వాచకం, కొన్నిసార్లు ఆహార్యం. మొదటి భాగంలో శివుడు పాత్రలో
కావలసినంత అల్లరి, అమాయకత్వం చూపగలిగినా రెండవభాగానికి వచ్చేసరికి,
ప్రధానంగా అమరేంద్ర బాహుబలి పాత్రపోషణలో కాస్త తడబడ్డాడు. ఇక భళ్ళాలదేవ
పాత్ర పోషించిన రానా, మొదటి భాగానికి రెండవభాగానికి పెద్దగా తేడా కనబడలేదు.
పాత్రచిత్రణ అదే కాబట్టి రానా పని మరింత సులువయ్యింది. ప్రత్యేకించి రానా
వాచకం చక్కగా, స్పష్టంగా ఉంది. ప్రభాస్, రానా నటనలో పెద్దగా లోపాలు
చెప్పాల్సిన పని లేకపోయినా మెరుగుపడాలి అని చెప్పవచ్చు. ఇక అనుష్క -
చాలాసార్లు తన పాత్ర శక్తిమంతమైనదా కాదా అన్న అయోమయం కనిపించింది. పరిచయ
సన్నివేశాలలో మాత్రం మురిపించింది, అలాగే శివగామితో వాదన సన్నివేశాలలో
కూడా. అత్యంత శక్తిమంతమైన యువతిగా పరిచయం చేసిన దేవసేన పాత్రను, అదే ఊపులో
కొనసాగించలేకపోయారు. అంతేకాక, ఒకసారి నాజూగ్గా మరోమారు లావుగా ఇలా
రకరకాలుగా కనబడుతుంది. కుమార వర్మగా కనిపించిన సుబ్బరాజు, ఎదో హాస్యం కోసం ఆ
పాత్రను ఇరికించారు తప్పించి అవసరమే లేదు, అలాగని హాస్యమూ పండలేదు. ఇక
సంచలన పాత్రగా నిలిచిన కట్టప్ప గురించి. దాదాపు ప్రతి సన్నివేశంలో (పాటలు
మినహాయించి) కనబడుతూనే ఉంటాడు. బాహుబలితో దేశాటనకు వెళ్లిన సన్నివేశాలు
మినహాయించి మిగతా సన్నివేశాలలో సత్యరాజ్ ఆకట్టుకుని, సినిమాకు బలంగా
నిలబడతాడు. మిగతా చెప్పుకోదగ్గ పాత్రలేమీ లేవు, ఎదో అలా వచ్చి, తెర నిండుగా
కనిపించడానికి సహాయపడుతుంటారు. ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు.
అసలు అమరేంద్ర బాహుబలి, భళ్ళాలదేవ
పాత్రల మధ్య సంఘర్షణ లేకపోవడమే ఉత్సుకతను తగ్గించేసింది. కేవలం రాజు
కావడం, ఆ తరువాత అడ్డు అవుతాడేమో అని తొలగించుకోవాలని భళ్ళాలదేవుడి
ప్రయత్నాలు తప్పించి బాహుబలి వైపు నుండి అసలు ఎటువంటి ప్రతిస్పందన ఉండదు. ఆ
పాత్రల మధ్య సంఘర్షణ ఉండి ఉంటే బావుండేది. అలాగే, బాహుబలికి దక్కకుండా
చెయ్యడం కోసం తప్పించి దేవసేన కోసం భళ్ళాలదేవుడు తపించినట్టు ఎక్కడా
అనిపించదు కూడా. దాంతో అంతకాలం దేవసేనను బంధించి ఉంచడం, మళ్ళీ ముసలి దేవసేన కోసం యుద్ధానికి సన్నద్ధమవడం కృతకంగా అనిపిస్తాయి. గ్రాఫిక్స్ మీద పెట్టిన దృష్టి కాస్త పాత్రచిత్రణల మీద పెట్టి ఉంటే బావుండేది.
ఇతర విభాగాలలో ముందు వరుస విజువల్ ఎఫెక్ట్స్ అందించిన సాంకేతిక నిపుణులు. ఈ సినిమాకు అసలు హీరోలు వాళ్ళే. రేపటి రోజున బాహుబలి గురించి చెప్పుకోవాలంటే మిగిలేది కేవలం విజువల్ ఎఫెక్ట్స్ మాత్రమే. మిగతా శాఖలది ధైర్యం, ఊహ మాత్రమే కానీ వీరిది పనితనం. అంతర్జాతీయ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఉన్నాయి విజువల్
ఎఫెక్ట్స్. సంగీతంలో గుర్తుండిపోయేది కానీ, కూచోబెట్టేది కానీ ఒక్క పాట
కూడా లేదు. నేపథ్య సంగీతం మాత్రం చక్కగా, సన్నివేశాలకు తగినట్టు ఇచ్చారు.
కూర్పు/ఎడిటింగ్ లో తడబడ్డారు. విజువల్స్ చాలా బాగా వచ్చాయి కాబట్టి
ఉంచేద్దాం అన్న ధోరణిలో చేసినట్టు అనిపిస్తుంది, దానివల్ల నిడివి బాగా
పెరిగిపోయింది. ఫోటోగ్రఫీ బావుంది. యుద్ధ/పోరాట సన్నివేశాలలో మాత్రం మొదటి
భాగంలో ఉన్నటువంటి నాణ్యత, స్థాయి చూపలేకపోయారు. శివుడు/మహేంద్ర బాహుబలి
తదితరులు కోటగోడలమీదికి ప్రవేశించే సన్నివేశాలు మరీ కామెడీగా ఉన్నాయి.
యుద్ధం, వ్యూహాలు వంటి విషయాలలో మొదటి భాగంలో పెట్టినంత దృష్టి ఇందులో
పెట్టలేదేమో.
మొత్తానికి జనాల దృష్టిని ఆకట్టుకోవటంలోనూ; తెలుగు సినిమాను వాణిజ్య పరంగా
తరువాతి స్థాయికి తీసుకెళ్ళటంలోనూ రాజమౌళి ఘనవిజయం సాధించాడు. కానీ, గత
రెండు మూడు సినిమాలుగా విజువల్ ఎఫెక్ట్స్ మీద పెడుతున్న దృష్టి కథనం మీద
పెడుతున్నట్టు లేదు. ఏదేమైనా ముందే చెప్పినట్టు ప్రశంసించడానికైనా లేక
విమర్శించడానికైనా ఈ సినిమా చూడండి. సాంకేతికంగా మనమూ మనకున్న పరిమిత
వనరులతోనే ఈ స్థాయిలో సినిమాలు తీయగలం అని నిరూపించిన ప్రయత్నాన్ని మాత్రం
ప్రశంసించవలసిందే. ఇక కథలోని అగ్రత్వం, అహంకార ధోరణి, దొరతనపు పోకడలు గట్రా
గట్రాల గురించి ఇప్పటికే చాలామంది రాసి ఏకిపారేశారు. వాళ్ళు అనుకున్న కథను
తెరకెక్కించిన విధానం గురించి మాత్రమే నేను చెప్పాలనుకున్నాను. ఊరికే
విమర్శించడం కాదు, దమ్ముంటే తీసి చూపించు అంటారా - దమ్ముంటే డబులు
పెట్టండి, తీసి చూపిస్తా. అప్పుడు కావాలంటే నన్ను కూడా తిట్టుకోవచ్చు లేదా
నచ్చితే పొగుడుకోవచ్చు. బాలేకపోతే డబ్బులుపెట్టి సినిమా చూసిన అక్కసుతో తిట్టుకోవచ్చు కూడా. సభకి నమస్కారం ...
Comments
Post a Comment