ఇంతకీ నేను సెప్పోచ్చేది ఏంటంటే - 'సరైనోడు' సినిమా గురించి

ఇంతకీ నేను సెప్పోచ్చేది ఏంటంటే - 'సరైనోడు' సినిమా గురించి
***********************************************************
       "ఆత్మ నాశనం లేనట్టిది. ఆయుధములతోనో, మరే విధమైన రీతులలోనో ఎవరూ ఆత్మను నాశనమొందింపజాలరు." అని ఆ భగవంతుడు ఏనాడో మహాభారత యుద్ధకాలంలోనే చెప్పాడు. పాపం మన చిత్రాలలోని ప్రతినాయకులు ఈ సత్యమును తెలుసుకోనలేక అనవసరంగా నాయకుడిపై యుద్ధం చేస్తుంటారు, ఆయుధాలు ప్రయోగిస్తుంటారు. ఎన్నో వందల, వేల చిత్రాలలో ఇప్పటికే నిరూపితమైనప్పటికీ మళ్ళీ ఈ సరైనోడు సినిమాలో కూడా ఆది పినిశెట్టి తెలివిలేకుండా మళ్ళీ అదే పని చేశాడు. ఎవరన్నా పూనుకుని మన ప్రతినాయకులని ఎడ్యుకేట్ చెయ్యండయ్యా. ఇక 'సరైనోడు' సినిమా గురించి. రెండు వేర్వేరు తరహా ఇమేజ్ లు ఉన్న అల్లు అర్జున్, బోయపాటి శ్రీనులు కలిసి పని చేస్తున్న సినిమా అయినప్పటికీ రూపకర్తలు ముందే జనాలకు క్లారిటీ ఇచ్చారు 'ఇది ఊర మాస్' సినిమా అని. కానీ, అటు బోయపాటి తరహాలోనూ కాక, ఇటు అల్లు అర్జున్ తరహాలోనూ కాక ఇంకోలా తయారయ్యింది సినిమా. కథ పరంగా చెప్పుకోవడానికేమీ పెద్దగా లేదు, ఆశించకూడదు కూడా. ఇక బోయపాటి శ్రీను బహుశా భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్ముడు చెప్పిన 'ఆత్మ' సిద్ధాంతాన్ని బాగా వంటబట్టించుకున్నాడు లాగుంది. అందుకే మన నాయకుడిని ఆయుధాలు, అపర బలవంతులు కూడా ఏమీ చేయలేకపోతూ చేష్టలుడిగి ఉంటారు. 
       ఆల్లు అర్జున్ 'గణ' పాత్ర గురించి చెప్పాలంటే - చాలా సందర్భాలలో 'బాబు' చేసిందే ఓకే అయినట్టుంది, రీ టేక్ అడిగే దమ్ము ఎవరికీ లేకపోయినట్టుంది కాబోలు. మంచి నటుడు కూడా అయిన అర్జున్ ఈ సినిమా విషయంలో కేవలం 'మాస్ ఇమేజ్' గురించి మాత్రమే పట్టించుకుని మిగతావాటినన్నీ గాలికొదిలేసినట్టున్నాడు. ప్రత్యేకించి ఎల్బీ శ్రీరాం దంపతులు చనిపోయినపుడు, కేథరీన్ పాత్రతో ఉన్న సన్నివేశాలు ఇందుకు ఉదాహరణలు. అలాగే చాలా సన్నివేశాలలో సంభాషణలు ఏదో అలా చెప్పెసినట్టు ఉంటాయి కానీ సాన్నివేశపు గాఢతకు తగ్గట్టుగా పలికినట్టు లేవు. డాన్సుల విషయానికి వస్తే గత సినిమాలతో పోలిస్తే ఇందులో కాస్త తక్కువే బహుశా అది సంగీతం ప్రభావం కావొచ్చు. అక్కడికీ సంగీతం సహకరించకపోయినా కొంత చెయ్యాలని ప్రయత్నించాడు (ఉదా: అతిలోకసుందరి పాత)). అలాగే చాలా సన్నివేశాలలో తనకు తెలిసిన తరహా మాస్ పాత్రల తీరులో (దెసముదురు, జులాయి, రేసు గుర్రం లాంటివి) చెయ్యాలో లేక బోయపాటి అడిగిన (తులసి, సింహా, లెజెండ్ లాంటివి) పెద్ద తరహా మాస్ పాత్రల తీరులో చెయ్యాలో అర్థం కానట్టు కన్ఫ్యూ స్డ్ గా కనిపించాడు. బన్నీకి ఉత్సాహభరితమైన మాస్ పాత్రలు చెయ్యటం మంచినీళ్ళు తాగినంత సులువు. కానీ, ఈ సినిమాలో పెద్ద తరహా అత్యంత శక్తివంతమైన మాస్ పాత్ర చెయ్యటానికి ప్రయత్నించాడు. పర్లేదు కానీ ... అవసరమా?
       ఇక ఆది పినిశెట్టి గురించి - డాన్సులు, హీరోయిన్ లను వదిలేస్తే బన్నీ ఎటువంటి ఇబ్బందులు పడ్డాడో ఆదికి కూడా అలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయి. బన్నీ పాత్ర ఎదురైనప్పుడు తన పాత్ర శక్తివంతమైనదా లేక  భయపడాలా అని అర్థం కాని అయోమయపు పరిస్థితిలో పడ్డాడు పాపం. ఇక రకుల్ ప్రీత్ మరియు కేథరీన్ థ్రెస్సాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వారిద్దరి నటనా కౌశలానికి మన దిమ్మ తిరిగిపోవాల్సిందే. 'ప్రైవేట్ పార్టీ' పాటలో కేథరీన్, 'సరైనోడు' పాటలో రకుల్ తమకు తెలిసినదేదో చెయ్యటానికి ప్రయత్నించారు. ఇక జాలిగొలిపేది అంటే శ్రీకాంత్ ని చూసి. ఎటువంటి ఉపయోగమూ లేని ఒకానొక అనవసరపు పాత్ అది, దానిని శ్రీకాంత్ చెయ్యటం శ్రీకాంత్ అవసరమా లేక పాత్ర అవసరమా అని ప్రతిసారి అనిపిస్తుంది. శ్రీకాంత్ చేశాడు కాబట్టి బాబాయ్ పాత్రగా చూపారు కానీ లేకపోతే ఏ వెన్నెల కిషోర్ నో, ఆలీనో, శ్రీనివాస రెడ్డినో, సత్యం రాజేష్ నో చెయ్యాల్సిన పాత్ర అది. వారు చేసి ఉంటె బన్నీకి కూడా కాస్త సౌకర్యంగా ఉండి కాసింత కామెడీ పండేదేమో. ఇక మిగిలిన పాత్రల గురించి చెప్పుకోవడం శుద్ధదండగ. ఇక తమన్ సంగీతం గురించి చెప్పాలంటే అబ్బో ... పాటలే కాదు నేపథ్య సంగీతపు తీరు కూడా అంతే. అంతకు మించి చెప్పడం దండగ. ఫోటోగ్రఫీ మాత్రం చాలా బావుంది. సన్నివేశానికి తగిన మూడ్ తీసుకురావటంలో 'డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫీ' బాగా పని చేశాడు. 

ఏదేమైనా కానీ, 'సరైనోడు' సినిమా కొన్ని విషయాలను స్పష్టం చేస్తుంది.
1)
ఈ తరంలో సరియైన కమర్షియల్ లేదా మాస్ సినిమా చెయ్యాలంటే అది ఒక్క రాజమౌళి వల్ల మాత్రమే సాధ్యం అని ఈ సినిమా చూశాక మరోసారి అర్థం అయ్యింది. కొందరు కొన్ని కారణాల వల్ల కొన్ని విజయాలు సాధించి ఉండవచ్చు, కానీ సరియైన కమర్షియల్ సినిమా తియ్యటం అనేది మాత్రం ఒక్క రాజమౌళి మాత్రమే చేశాడు, చేస్తున్నాడు. ప్రతినాయకుడి పాత్ర ఎంత బలంగా ఉంటే సినిమాకు అంత బలం, అంతే కాదు అంతటి బలమైన ప్రతినాయకుడి మీద గెలుపొందితేనే నాయకుడికి బలం, హీరోకి ఇమేజ్ అనేది మర్చిపోయి అసలు హీరో చేతిలో తన్నులు తినటానికి తప్ప మరింకేందుకూ కాదన్నట్టు తయారు చేస్తున్నారు ప్రతినాయక పాత్రలను. ఒక్కసారి రాజమౌళి సినిమాలను చూడండి - సై, విక్రమార్కుడు, మగధీర, ఈగ, బాహుబలి ... ప్రతి సినిమాలో హీరో కంటే విలన్ పాత్రధారి చూడటానికి కాని, పాత్ర తీరులో కాని అత్యంత బలవంతుడిగా ఉంటాడు. అటువంటి అత్యంత బలవంతుడైన శత్రువు మీద విజయం సాధించిన నాయకుడు ఒక మహాత్ముడి స్థాయికి ఎదుగుతాడు. కానీ, మిగతావారు తీసే సినిమాలు చూస్తే విలన్ పని పట్టేలోపు హీరో వేసుకున్న షర్టు కూడా నలగదు, అంత నీరసంగా ఉంటాయి విలన్ పాత్రలు. అందుకు సరైనోడు సినిమా మినహాయింపేమీ కాదు.
2)
బన్నీ కూడా 'బాబు' హీరో అయ్యాడేమో అనిపిస్తోంది ఈ సినిమా చూస్తోంటే.
3) కథలో ఏముంది? కథనం ఎలా ఉంది? అనేటటువంటివి పట్టించుకోకుండా కోట్లు కుమ్మరించి సినిమాలు తీసే నిర్మాతలు పెరిగిపోతున్నారు. నాకూ అలాంటి ఒక నిర్మాత దొరికితే బాగుండు. :)
4) విలన్ పాత్రలు అంటే హీరోని ఇబ్బంది పెట్టటానికో లేక ఎదుర్కోవటానికో కాదు; తన చుట్టూ వందల వేల మంది సైన్యం ఉన్నా, అత్యంత అధునాతన ఆయుధాలు ఉన్నా కూడా ఏమీ చేయలేక హీరో చేతిలో తన్నులు తినటానికే. చివరకేలాగూ గెలిచేది హీరోనే అని తెలిసినా కూడా అందులో మజా లేకుండా చేస్తున్నారు.
5) చివరగా, పాపం శ్రీకాంత్.


Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన