వంశీ వ్యూ పాయింట్ - 'టాక్సీవాలా'
వంశీ వ్యూ పాయింట్ - 'టాక్సీవాలా'
************************************
విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'టాక్సీవాలా' - అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సంచలనాలు; నోటా వంటి పరాజయం తక్కువకాలంలోనే చవిచూసిన విజయ్ తాజా చిత్రమైన 'టాక్సీవాలా' పై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి ఏకైక ఆకర్షక అంశం 'విజయ్ దేవరకొండ' ఇమేజ్. కొత్త దర్శకుడు, కొత్త హీరోయిన్. లో బడ్జెట్ ... ఈ చిత్రం మీద అనుమానాలు కలిగించాయి. అంచనాలను అందుకుందా లేక అనుమానాలను నిజం చేసిందా - చూద్దాం.
కథ పరంగా చెప్పాలంటే హారర్ కామెడీ కి కాస్త సైన్స్ టచ్ ఇచ్చారు 'ఆస్ట్రల్ ప్రొజెక్షన్' పేరున. కాకపొతే, ఎక్కువగా దాని మీద దృష్టి పెట్టకుండా దానికి కాసింత కామెడీ, రివెంజ్ డ్రామా కలిపారు. ఆస్ట్రల్ ప్రొజెక్షన్ పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ, దాన్ని సరిగా ప్రాజెక్ట్ చేయలేదు, దానిమీద పెద్దగా దృష్టి పెట్టలేదు కూడా. అలాగని అదేమీ ఇబ్బంది పెట్టే అంశం కాలేదు కూడా. కుటుంబానికి భారం కాకూడదని, ఎదో పని చేసుకోవాలని నగరం వచ్చే సగటు మధ్యతరగతి అబ్బాయిగా విజయ్, మెడికోగా కొత్తమ్మాయి ప్రియాంక, ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ద్వారా ఆత్మగా మారిన మాళవిక, కార్ - ముఖ్యంగా ఇవే ప్రధాన పాత్రలు. కథకు కీలకమైన పాత్రలో యమున కూడా ఉంటుంది. కథ ఎలా ఉన్నా కథనంతో కొత్త దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ఆకట్టుకుంటాడు ఎక్కడా తడబాటు లేదు, తానుఅనుకున్నదాన్ని తడబడకుండా స్పష్టంగా తెరకెక్కించినట్టే అనిపించింది. పాటలు ఇరికించటానికి అవకాశం ఉన్నప్పటికీ, పక్కదారి పట్టలేదు. కామెడీ కూడా ఇరికించినట్టు కాకుండా సరదాగా సాగుతుంది. ఇకఆస్ట్రల్ ప్రొజెక్షన్ తదితర అంశాల విషయంలో సినిమాటిక్ లిబర్టీ తప్పదు, అవి కూడా ఇబ్బంది పెట్టలేదు. సినిమా మొదలైన నాటికి, ఇప్పటికీ విజయ్ ఇమేజ్ లో వచ్చిన మార్పు/స్థాయి సినిమాకు బలహీనత కాకుండా చూసుకోవడంలో దర్శకుడు రాహుల్ విజయం సాధించాడు.
నటీనటుల విషయానికి వస్తే - ముందే చెప్పుకున్నట్టు ఈ సినిమాకు ప్రధాన బలం విజయ్ దేవరకొండ. మరోసారి తాను కథలో భాగమై, పాత్ర మాత్రమే కనబడేలా చేశాడు. అర్జున్ రెడ్డి, గీతగోవిందం ఇమేజ్ ఎక్కడా కనబడదు. ఒకటి రెండు తప్పులు దొర్లవచ్చు - కానీ, విజయ్ కథల ఎంపిక బావుంది. ఇదే తరహాలో అతడు కొనసాగితే స్టార్ గానే కాక నటుడుగా కూడా గుర్తుండిపోతాడు. హీరోయిన్ గా కొత్తమ్మాయి ప్రియాంక ఆకట్టుకున్నప్పటికీ, తన పాత్రకు పెద్ద స్కోప్ లేకపోవడంతో పాసివ్ గా మిగిలిపోయింది. రవివర్మ, యమున, షిజు (విలన్), రవి ప్రకాష్, కళ్యాణి, మధునందన్ (బాబాయ్ పాత్ర) తదితరులు తమవంతు సమర్థవంతంగా పోషించారు. హాలీవుడ్ గా కామెడీ పాత్రలో విష్ణు ఆకట్టుకుంటాడు. కీలకమైన పాత్రలో (ఎక్కువగా కారులో ఉండే ఆత్మగా, కొద్దిసేపు శిశిరగా) మాళవిక నాయర్ బావుంది. టెక్నికల్ టీం విషయానికి వస్తే క్లైర్ మథన్ సినిమాటోగ్రఫీ బావుంది. జేక్స్ బిజోయ్ సంగీతం బావున్నప్పటికీ ఇటువంటి సినిమాలకు మణిశర్మ/దేవిశ్రీ/థమన్ వంటివారి నేపథ్య సంగీతం గుర్తొచ్చి, వారైతే బావుండేదేమో అనిపిస్తుంది - ప్రధానంగా నేపథ్య సంగీతం. అందరినుండి తనకు కావలసిన స్థాయి మేరకు రాబట్టుకోవడంలో రాహుల్ విజయం సాధించాడు. మొత్తానికి 'టాక్సీవాలా' విజయ్ కు 'నోటా' దెబ్బ నుండి ఉపశమనం ఇస్తుంది.
Comments
Post a Comment