వంశీ వ్యూ పాయింట్ - గీత గోవిందం

వంశీ వ్యూ పాయింట్ - గీత గోవిందం 
**************************************
            ఇటీవలే 'శ్రీనివాస కళ్యాణం' చిత్రంపై వంశీ వ్యూ పాయింట్ రాస్తూ ఒక మాట ప్రస్తావించాను. ఒక కథ రాసుకునేపుడు ముందుగా ప్రతినాయక పాత్రను లేదా పాత్రల మధ్య సంఘర్షణకు కారణమయ్యే అంశాన్ని బలంగా రాసుకోవడం ముఖ్యం అని. 'గీత గోవిందం' చిత్రం చూశాక మరోసారి అది గుర్తొచ్చింది. 'శ్రీనివాస కళ్యాణం' అయినా 'గీత గోవిందం' అయినా కథలు కొత్తవేమీ కాదు. కానీ, అవి రూపు దిద్దినదర్శకుడి ప్రతిభ/సామర్త్యాన్ని బట్టి అవి రూపొందే విధం ఉంటుంది. దర్శకుడు పరశురాం 'గీత గోవిందం' చిత్రాన్ని రూపొందించిన విధానం చాలా చక్కగా ఉంది. ఒకటీ, రెండు సన్నివేశాలు మినహాయించి మిగతా అంతా చూసేవారిని చక్కగా అలరిస్తుంది. 
            'గీత గోవిందం' చిత్రం కథగా చెప్పాలంటే ఒక మంచి అబ్బాయి, ఒక మంచి అమ్మాయి, అనుకోకుండా జరిగిన ఒక చిన్న ఘటన, తెలియకుండా వారి మధ్య బంధుత్వం, అపోహలు తొలగే క్రమంలో చిన్న చిన్న మలుపులు, చివరకు సుఖాంతం - అంతే. కామెడీ కూడా ఏదో జనాల్ని నవ్వించటానికి ప్రత్యేకమైన కామెడీ ట్రాక్ ను ఏమీ ఇరికించినట్టు ఉండదు. మరీ ముఖ్యంగా ప్రధాన పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలే కామెడీకి కూడా ఆయువుపట్టుగా నిలిచి సినిమాను హాయిగా ఆనందించేలా చేస్తాయి. మెలోడ్రామా పెట్టి, ఓవర్ సెంటిమెంట్ సన్నివేశాలు (చెల్లి పెళ్ళికి లింక్ పెట్టి) ఇరికించే అవకాశం ఉన్నప్పటికీ అటువంటి వాటి జోలికి వెళ్లకుండా ఆహ్లాదకరంగా తీసాడు పరశురామ్. ముందే చెప్పుకున్నట్టు కథ పరంగా తేలికైన అంశం కావడంతో ఎంత చక్కగా, ఆకట్టుకునేలా చెప్పగలదనే విషయంలో పరశురామ్ లోని కథకుడికి అవకాశం దొరికింది. కథనం చక్కగా కుదరింది. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ బాంగ్ అదిరిపోయింది - సినిమా చూస్తే అదేంటో అర్థమవుతుంది. 
            నటీనటుల విషయానికి వస్తే - విజయ్ దేవరకొండ నటన గురించి చెప్పేముందు ఒక చిన్న విషయం. విజయ్ దేవరకొండ చిత్రాల వరుస గమనిస్తే నటన విషయంలో ప్రతిభ మాత్రమే కాదు కథల ఎంపికలో కూడా చక్కటి అభిరుచి ఉందనిపిస్తుంది. ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం - ఇలా తనలోని వైవిధ్యాన్ని చూపే అవకాశం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకోవడంలోనే అతడి విజయం దాగి ఉంది. విజయ్ గోవింద్ పాత్రలో ఒదిగిపోయాడు. ఇంకా అర్జున్ రెడ్డి పాత్ర మేనియాలో ఉన్నవారిని ఈ పాత్ర ద్వారా అబ్బురపరుస్తాడు. అర్జున్ రెడ్డి హైపర్ అయితే గోవింద్ సబ్మిస్సివ్ పాత్ర. అమాయకత్వం, భయం, నిస్సహాయత, ప్రేమ, బాధ ఇలా పలు భావాలను చక్కగా పలికించి నటుడిగా మరో మెట్టు ఎదిగాడు. ఒక్క విషయంలో మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తుంది - ఇతర ప్రాంతాల యాస పలికించేలా మాట్లాడటంలో కాస్త తడబాటు ఉంది. ఇక రష్మిక మందన్న - ఛలో సినిమా ద్వారా తెలుగు సినిమాకు పరిచయమైన రష్మిక గీత పాత్ర ద్వారా ఆకట్టుకుంటుంది. విజయ్ తో పోటాపోటీగా మాత్రమే కాదు, కొన్ని సన్నివేశాల్లో దాటిపోయేలా నటించింది. రెగ్యులర్ హీరోయిన్ తరహా పాత్ర కాకుండా ఇటువంటి పాత్ర దొరకడం తన అదృష్టమేనేమో. ప్రతి భావాన్ని చక్కగా పలికించి అద్భుతంగా ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రల గురించి పెద్దగా చెప్పుకోవడానికేమీ లేదు - కథాగమనానికి పనికొచ్చే పాత్రలే తప్పించి కథను పక్కదారి పట్టించే పాత్రలు ఉండకుండా చూసుకోవడంలో పరశురామ్ ప్రతిభ కనిపిస్తుంది. 
            సాంకేతిక వర్గం విషయానికి వస్తే - 'సినిమాకు దర్శకుడు కెప్టెన్' అనే మాటకు ఈ సినిమా నిదర్శనం. పరశురామ్ తన గురువు పూరి జగన్నాథ్ నుండి కథనాన్ని పరుగులు పెట్టించగలిగే ప్రతిభను అందిపుచ్చుకున్నట్టున్నాడు. అడుగడుగునా పరశురామ్ ప్రతిభ కనబడుతుంది. కథ, కథనం, మాటలు, దర్శకత్వం నెరపిన పరశురామ్ ప్రతి విభాగంలోనూ అద్భుతంగా రాణించాడు. మరీ ముఖ్యంగా సంభాషణలు నాకు విపరీతంగా నచ్చాయి. ఎక్కడా కృతకంగా అనిపించవు. ఈ మధ్యన ప్రాస కోసం, పంచ్ కోసం పాకులాడే తరహా ఇందులో కనిపించదు. పరశురామ్ తరువాత సినిమాకు గోపి సుందర్ తన సంగీతంతో ప్రాణం పోశాడు. మిగతా అన్ని విభాగాలు కూడా సినిమాను బాగా నిలబెట్టాయి. 
            'గీత గోవిందం' సినిమా ఒక చక్కటి రొమాంటిక్ చిత్రం. హాయిగా చూసి, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆనందించగలిగే చిత్రం. సందేశాన్నో, సంచలనాన్నో ఆశించి వెళ్ళకండి. గీత గోవిందం సినిమా ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. ఎంజాయ్ ... 

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన